Altercation
-
రుణం ఇవ్వాలని అడిగిన పాపానికి..
సాక్షి, భీమిని(ఆదిలాబాద్) : తెలంగాణ గ్రామీణ బ్యాంకులో శుక్రవారం స్వయం సహాయక సంఘం మహిళలతో బ్యాంకు మేనేజర్ దిలీప్‌కుమార్ దురుసుగా ప్రవర్తించి ఒక సభ్యురాలిపై చేయి చేసుకున్న సంఘటన మంచిర్యాల జిల్లా భీమిని మండల కేంద్రంలో శుక్రవారం చోటు చేసుకుంది. మండలంలోని చెన్నాపూర్ గ్రామానికి చెందిన స్వయం సహాయక సంఘం మహిళలు గత రెండు వారాల నుంచి బ్యాంకుకు వచ్చి వెళ్తున్నారు. ఈ క్రమంలో మహిళా సంఘం సభ్యులు శుక్రవారం బ్యాంకుకు వెళ్లి రుణాలు త్వరగా మంజూరు చేయాలని బ్యాంకు మేనేజర్ దిలీప్‌కుమార్‌ను కోరారు. ప్రతి నెల క్రమం తప్పకుండా పొదుపు జమ చేస్తున్నప్పటికీ రుణాలు ఇవ్వకుండా ఎందుకు తిప్పుతున్నారని ప్రశ్నించారు. దీంతో బ్యాంకు మేనేజర్‌కు, మహిళా సంఘాల సభ్యులకు మధ్య వాగ్వాదం జరిగింది. (ఉద్యమ లక్ష్యం నెరవేరుతోంది) బ్యాంకు మేనేజర్ దిలీప్‌కుమార్ అసభ్యపదజాలం వాడుతూ మహిళా సంఘ సభ్యురాలిపై చేయి చేసుకున్నాడు. దీంతో ఆవేదనకు గురైన మహిళలు సిబ్బందిని బ్యాంకు లోపల ఉంచి తాళం వేసి రెండు గంటల పాటు ఆందోళన చేశారు. ఏఎస్సై మజారోద్దీన్ సంఘటన స్థలానికి వెళ్లి మహిళలను సముదాయించారు. సంఘ సభ్యురాళ్లు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సంఘం సభ్యులు ఏదుల సుగుణ, వీవోఏ జాడి ధర్మయ్యలపై బ్యాంకు మేనేజర్ దాడి చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేస్తామని ఎస్సై కొమురయ్య తెలిపారు. -
పిల్లల ముందు ఉపాధ్యాయుల వాగ్వాదం
సాక్షి, హైదరాబాద్ : విద్యార్థులను సన్మార్గంలో నడిపించాల్సిన ఉపాధ్యాయులు గాడి తప్పారు. బాధ్యతలను విస్మరించి విద్యార్థులు చూస్తున్నారన్న విషయాన్ని మరిచిపోయి వారి ముందే బూతులు తిట్టుకున్నారు. ఈ ఘటన గండిపేట జిల్లా పరిషత్ పాఠశాలలో సోమవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఉపాధ్యాయురాలు మనోరమ, హెడ్ మాస్టర్ రాములు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ సమయంలో పాఠశాలలో పిల్లల ఉన్నారనే విషయం కూడా పట్టించుకోకుండా బూతులు తిట్టుకున్నారు. ఆ తర్వాత ఒకరిపై ఒకరు సెల్‌ఫోన్ విసురుకున్నారు. ఆ తర్వాత మనోరమ హెడ్ మాస్టర్‌పై నార్సింగ్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్
అయిజ (అలంపూర్) : రైతుబంధు, పాస్‌పుస్తకాల పంపిణీ గురువారం మొదటిరోజు అయిజ మండలం ఉత్తనూరు, ఉప్పల గ్రామాల్లో జరిగింది. ఉత్తనూరులో ప్రశాంతంగా ముగిసినా ఉప్పలలో మాత్రం ఘర్షణ వాతావరణం నెలకొంది. 11 గంటలకు ప్రారంభించాల్సిన కార్యక్రమం 12 గంటల తర్వాత కూడా కాకపోవడంతో అక్కడకు వచ్చిన రైతులు అసహనానికి గురయ్యారు. రైతులు ఎండకు ఇబ్బంది పడుతున్నారని కార్యక్రమాన్ని ప్రారంభించాలని అలంపూర్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు రైతులతో కలిసి ప్రత్యేక అధికారి సోమిరెడ్డి, డిప్యూటి తహసీల్దార్ నరేష్, ఎంపీడీఓ నాగేంద్రలపై ఒత్తిడి పెంచారు. జెడ్పీ చైర్మన్ బండారు భాస్కర్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరవుతారని అంతవరకు వేచి ఉండాలని టీఆర్ఎస్ నాయకులు, అధికారులను కోరారు. దీంతో ఇరు పార్టీల మధ్య అధికారులు ఇబ్బంది పడ్డారు. చూస్తుండగానే కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల నాయకులకు వాగ్వాదం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ నాయకులు వేదికపై ఉన్నారుకదా కావాలంటే మీరు కార్యక్రమాన్ని ప్రారంభించండి అని కాంగ్రెస్ నాయకులు అన్నా రు. జెడ్పీ చైర్మన్ వచ్చేంతవరకు ఓపిక పట్టలేరా, ఎమ్మెల్యే ఎన్నో సార్లు కార్యక్రమాలకు ఆలస్యంగా వస్తే మేము ఓపిక పట్టామని టీఆర్ఎస్ నాయకులు చెప్పుకొచ్చారు. దానితో వాతావరణం వేడెక్కింది. పోలీసులు కలుగజేసుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కాసేపటికే జెడ్పీ చైర్మన్ రావడంతో గొడువ సద్దుమనిగింది. అనంతరం ఇద్దరు కలిసి నాయకులు వేదికపై ఒకపిపై మరొకరు విమర్శలు చేసుకున్నారు. అనంతరం ఇద్దరు కలిసి రైతులకు చెక్కులు, పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. -
టీడీపీ, వైఎస్సార్సీపీ కార్యకర్తల వాగ్వాదం
లింగాల : లింగాల మండలం పార్నపల్లె గ్రామంలో గురువారం టీడీపీ, వైఎస్సార్సీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. గ్రామానికి మంత్రులు వస్తున్న సందర్భంగా టీడీపీ కార్యకర్తలు బస్టాండు సమీపంలో బ్యానర్‌ను ఏర్పాటు చేశారు. అయితే వైఎస్సార్సీపీ గ్రామ నాయకులు ఏర్పాటు చేసిన బ్యానర్ కనిపించకుండా టీడీపీ కార్యకర్తలు వారి బ్యానర్‌ను ఏర్పాటు చేయడంపై వైఎస్సార్సీపీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఇరువర్గాలు వాగ్వాదానికి దిగాయి. ఈ సమయంలో లింగాల ఎస్ఐ మల్లికార్జునరెడ్డి చొరవ తీసుకొని ఘర్షణను నివారించారు. మంత్రులు వచ్చి వెళ్లాక బ్యానర్‌ను తొలగింపజేస్తామని ఎస్ఐ హామీ ఇవ్వడంతో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు శాంతించారు. -
చెప్పుల పంచాయతీ.. వ్యక్తి హత్య
సాక్షి, ఆత్మకూరు రూరల్: తన చెప్పులు కనబడకపోవడానికి చిన్నాన్నే కారణమని భావించిన ఓ వ్యక్తి మద్యం మత్తులో అతడిపై దాడికి దిగాడు. తనను తాను రక్షించుకునే క్రమంలో చిన్నాన్న ఆ వ్యక్తిని నరికి చంపాడు. పోలీసుల వివరాల మేరకు..ఆత్మకూరు మండలం అమలాపురం చెంచుగూడేనికి చెందిన దాసరి మూగెన్న (26) ఇటీవల కొత్త చెప్పులు కొన్నాడు. తన చిన్నాన్న అయిన మూగెన్న ఇంటివద్దకు శుక్రవారం రాత్రి ఏదోపనిపై వెళ్లి తిరిగి వచ్చిన తరువాత తన చెప్పులు లేక పోవడాన్ని గుర్తించాడు. వాటిని చిన్నాన్నే కాజేశాడన్న నిర్ణయానికి వచ్చి ఆయనతో గొడవకు దిగాడు. మద్యం మత్తులో ఉన్న అతడు ఏకంగా విల్లంబులుతో దాడి చేశాడు. ఈక్రమంలో ఓ బాణం చిన్నాన్న చేతిగుండా దూసుకుపోయింది. దీంతో అతడు ప్రాణభయంతో తన ఇంట్లోకి దూరి తలుపులు వేసుకుని గడియ పెట్టుకున్నాడు. అయినా మూగెన్న ఆగకుండా తలుపుపై గొడ్డలితో దాడి చేయడంతో తలుపు గడియ ఊడిపోయింది. దీంతో మూగెన్న గదిలో ఉన్న చిన్నాన్నపై గొడ్డలితో దాడి చేసే ప్రయత్నం చేశాడు. అది గమనించిన చిన్నాన్న కుమారుడైన మూగెన్న అడ్డువెళ్లాడు. అతడిపై దాడి చేయడంతో కడుపులో నుంచి పేగులు బయటకు రావడంతో అక్కడే పడిపోయాడు. ఇంతలో మూగెన్న నుంచి చిన్నాన్న గొడ్డలి గుంజుకుని అతడిపై విచక్షణరహితంగా దాడి చేశాడు. తీవ్రరక్తస్రావం కావడంతో దాసరి మూగెన్న అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ తర్వాత తీవ్రంగా గాయపడిన కుమారుడిని ఆత్మకూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. ఆత్మకూరు సీఐ బత్తల క్రిష్ణయ్య, ఎస్ఐ వెంకటసుబ్బయ్య తమ సిబ్బందితో ఘటనస్థలికి వెళ్లి వివరాలు సేకరించారు. డాగ్ స్క్వాడ్‌ను రప్పించి తనిఖీ నిర్వహించారు. నిందితుడు మూగెన్నను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేశారు. శనివారం డీఎస్పీ మాధవరెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. -
రూల్ పొజిషన్ తెలుసుకోండి!
సాక్షి, హైదరాబాద్: ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ తరఫున అసెంబ్లీలో నిరసన వ్యక్తం చేసే అంశంపై అధికార టీఆర్ఎస్ ఆసక్తికర విషయాన్ని లేవనెత్తింది. బుధవారం శాసనసభలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై చర్చ సందర్భంగా ప్రతిపక్షం తరఫున నిరసన తెలిపే హక్కు సభలో ఎవరికుందనే విషయంలో అధికార, విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ప్రభుత్వం ఇచ్చిన సమాధానానికి తాము సంతృప్తి చెందడం లేదంటూ, నిరసన తెలిపి వాకౌట్ చేసేందుకు కాంగ్రెస్ సన్నద్ధమయింది. ఆ సమయంలో ప్రతిపక్ష నేత జానారెడ్డి సభలో లేరు. దీంతో సీఎల్పీలో సభ్యుడు మాత్రమే అయిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నిరసన తెలిపేందుకు ఉద్యుక్తులయ్యారు. ఆ సమయంలో మంత్రి హరీశ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. సీఎల్పీ నేత లేకపోయినా ఉపనాయకుడు జీవన్‌రెడ్డి సభలోనే ఉన్నారని, నిరసన తెలిపే హక్కు ఆయనకే ఉంటుందని, రూల్స్ తెలుసుకోవాలని ఉత్తమ్‌కు హితవు పలికారు. కానీ, ఉపనాయకుడు ఉన్నా నిరసన తెలిపే హక్కు తమకు కూడా ఉంటుందని ఉత్తమ్ వాదించబోయారు. దీన్ని అడ్డుకున్న మంత్రి హరీశ్... అలా నిరసన తెలిపే హక్కు ఏ రూల్ పొజిషన్లో ఉందో చూపించాలని డిమాండ్ చేశారు. స్పీకర్‌పై ఆగ్రహం ఈ సమయంలో స్పీకర్ స్థానంలో ఉన్న డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి ఏదో చెప్పబోగా ఉత్తమ్ ఆమెపై ఒకింత ఆగ్రహం వ్యక్తంచేశారు. దీంతో చైర్‌ను ఎలా ప్రశ్నిస్తారని ఆమె ఉత్తమ్‌నుద్దేశించి వ్యాఖ్యానించారు. అప్పుడు మరింత ఆగ్రహంతో ఉత్తమ్ ‘ఎస్.. ప్రశ్నిస్తాం!’అంటూ ఎదురుదాడి చేసే యత్నం చేశారు. ‘కాంగ్రెస్ సభ్యులకు సభా సంప్రదాయాల మీద గౌరవం లేదా? లేక నాయకుడు, ఉప నాయకుడిపై విశ్వాసం లేదా?’అని హరీశ్ మండిపడ్డారు. శాసనసభా వ్యవహారాల మంత్రికి అవగాహన లేదనడం ఉత్తమ్ విజ్ఞతకే వదిలేస్తున్నానని హరీశ్ పేర్కొన్నారు. మూడు బిల్లులకు మండలి ఆమోదం సాక్షి, హైదరాబాద్: విలువ ఆధారిత పన్ను (వ్యాట్) చట్టానికి సంబంధించిన రెండు సవరణల బిల్లులతో పాటు రాష్ట్ర ఎక్సైజ్ చట్టానికి సంబంధించిన మరో సవరణ బిల్లును బుధవారం శాసనమండలి ఏకగ్రీవంగా ఆమోదించింది. ఎక్సైజ్ శాఖ జిల్లా అధికారిగా వ్యవహరించే ‘ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్’పోస్టు పేరును రాష్ట్ర ఎక్సైజ్ చట్టంలో ‘డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ అండ్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్’గా మార్చడంతో పాటు చట్టంలో ఫీజు/ఫీజులుగా ఉన్న పదాలను పన్ను/పన్నులుగా మార్చేందుకు చట్ట సవరణ బిల్లును మంత్రి పద్మారావు ప్రతిపా దించగా సభ ఆమోదం తెలిపింది. ఇతర స్థాయి అధికారులను సైతం జిల్లా ఎక్సైజ్ అధికారులుగా నియమించేందుకు ప్రభుత్వం సవరణ జరిపింది. అదేవిధంగా మైక్రో బ్రేవరీలు విక్రయించే డ్రాట్ బీరుపై 70శాతం వ్యాట్ విధించేందుకు మంత్రి ఈటల ప్రతిపాదించిన వ్యాట్ చట్ట సవరణ బిల్లును ఆమో దించింది. సారా, పెట్రోలియం ఉత్పత్తులపై వ్యాట్ ఆడిట్ కాలపరిమితిని 4 ఏళ్ల నుంచి 6 ఏళ్లకు పెంచేందుకు మరో చట్ట సవరణ బిల్లు ను సైతం మండలి ఆమోదం తెలిపింది. -
నువ్వెవరంటే.. నువ్వెవరు?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ టీడీపీలో తాజా సంచలనానికి కారణమైన వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి లక్ష్యంగా పార్టీ నేతలు ఎదురుదాడికి దిగారు. రేవంత్ చేసిన వ్యాఖ్యలపై ఆయన్ను నిలదీశారు. శుక్రవారం ఎన్టీఆర్ ట్రస్టు భవన్లో జరిగిన టీ టీడీపీ పొలిట్‌బ్యూరో, కేంద్ర కమిటీ సమావేశం వాడివేడిగా సాగింది. పార్టీ వర్గాల సమాచారం మేరకు టీ టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు, రేవంత్‌రెడ్డి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అలాగే పార్టీ జాతీయ అధికార ప్రతినిధి అరవింద్ కుమార్‌గౌడ్ సైతం రేవంత్‌ను నిలదీశారు. అయితే తాను తెలంగాణ టీడీపీకి వర్కింగ్ ప్రెసిడెంట్‌ను అని, తానెవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని, ఏ విషయమైనా అధినేత చంద్రబాబు నాయుడుకే చెబుతానని రేవంత్ తేల్చి చెప్పారు. అసలేం జరిగింది...? ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని ఢిల్లీలో రేవంత్‌రెడ్డి కలిసినట్టు మీడియాలో జరుగుతు న్న ప్రచారంపై మోత్కుపల్లి, అరవింద్ కుమార్‌గౌడ్‌లు రేవంత్‌ను ప్రశ్నించారు. అధినేతకు సమాచారం ఇవ్వకుండా రాహుల్ గాంధీని ఎలా కలుస్తారంటూ నిలదీశారు. అయితే తన ప్రమేయం ఏమాత్రం లేకుండా జరుగుతున్న ప్రచారంపై ఎలా స్పందిస్తానని రేవంత్ బదులిచ్చారు. యనమల రామ కృష్ణుడు, పరిటాల కుటుంబంపై ఎందుకు విమర్శలు చేశావని ప్రశ్నించగా దీనిపై సమాధానం చెప్పడానికి తాను సిద్ధంగా లేనని, ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను చంద్ర బాబు నాయుడుకు వివరిస్తానని రేవంత్ సమా ధానమిచ్చారు. ఎవరిని అడిగి టీఆర్ఎస్తో పొత్తుపెట్టుకుంటామని ప్రకటించారో చెప్పాలని మోత్కుపల్లిని రేవంత్‌రెడ్డి కూడా నిలదీశా రని సమాచారం. దీంతో కినుక వహించిన మోత్కుపల్లి, అరవింద్ కుమార్‌గౌడ్‌లు ఈ వ్యవహారాన్ని చంద్రబాబు వద్దే తేల్చుకుం టామని సమావేశం నుంచి బయటకు వచ్చేశారు. దీంతో మిగిలిన పార్టీ నేతలు కూడా పొలిట్‌బ్యూరో సమావేశాన్ని అర్ధంతరంగా ముగించారు. రేవంత్ సమావేశం నుంచి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడకుం డానే వెళ్లిపోయారు. కాగా, ఈ నెల 26న ఎన్టీఆర్ ట్రస్టు భవన్లో టీడీఎల్పీ సమావేశం ఉంటుందని పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి ఆ తర్వాత మీడియాకు తెలిపారు. రేవంత్ వ్యవహారంపై ఈ సమావేశంలో చర్చ జరగలేదన్నారు. అసెంబ్లీ సమావేశాలకు ముందు పార్టీ నేతలు భేటీ కావడం ఆనవాయితీ అని, అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకే సమావేశమైనట్లు చెప్పారు. రేవంత్‌కు వ్యక్తిగత ప్రయోజనాలే ముఖ్యం: మోత్కుపల్లి రేవంత్‌రెడ్డికి పార్టీ ప్రయోజనాల కంటే వ్యక్తిగత ప్రయోజనాలే ముఖ్యమని పొలిట్‌బ్యూరో సభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు విమర్శించారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడానికి అన్ని విధాలుగా సిద్ధమయ్యారని, అందుకే పార్టీ నేతలపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. 15 మంది ఎమ్మెల్యేలలో 12 మంది ఆయన వైఖరి నచ్చకే వెళ్లిపోయారని ఆరోపించారు. రేవంత్ సరైన సమాధానం చెప్పకపోవడంతో తాను, అరవింద్ కుమార్‌గౌడ్ సమావేశాన్ని బహిష్కరించి బయటకు వచ్చేసినట్లు మీడియాకు తెలిపారు. -
వాగ్యుద్ధం
♦ స్పీకర్‌తో స్టాలిన్ ఢీ ♦ సమాధానం కరువుతో వాకౌట్ ♦ అన్ని నగరాల్లో రూ.1,362 కోట్లతో స్మార్ట్ సిటీలు ♦ దరఖాస్తులు అన్నీ ఆన్లైన్లో నమోదు ♦ అసెంబ్లీలో మంత్రి ఎస్పీ వేలుమణి ప్రకటన ఎమ్మెల్యేలకు ముడుపుల వ్యవహారంపై స్పీకర్ ధనపాల్, ప్రధాన ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్ మధ్య బుధవారం అసెంబ్లీ వేదికగా తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటుచేసుకుంది. తన ప్రశ్నలతో స్పీకర్‌ను ఉక్కిరిబిక్కిరి చేసినా, సమాధానాలు మాత్రం రాబట్టలేదు. దీంతో స్పీకర్ తీరును నిరసిస్తూ సభనుంచి డీఎంకే సభ్యులు వాకౌట్ చేశారు. ఇక, నగరాభివృద్ధి, గ్రామీణాభివృద్ధి శాఖల్లో అభివృద్ధిపరంగా నిధుల కేటాయింపు చర్చలో ఆ శాఖ మంత్రి ఎస్పీ వేలుమణి పలు కొత్త ప్రకటనలు చేశారు. సాక్షి, చెన్నై : అసెంబ్లీలో బుధవారం ప్రశ్నోత్తరాల అనంతరం సభ వేడెక్కింది. ప్రశ్నోత్తరాల సమయంలో పలువురు సభ్యులు సంధించిన అనేక ప్రశ్నలకు ఆయా శాఖల మంత్రులు సమాధానాలు ఇచ్చారు. చెన్నైలో మరో 100 మినీ బస్సు సేవలు సాగనున్నట్టు రవాణాశాఖ మంత్రి విజయభాస్కర్, అడవి పందుల కాల్చివేతకు ఉత్తర్వులు ఇచ్చినట్టు అటవీశాఖ మంత్రి దిండుగల్ శ్రీనివాసన్ సభ్యుల ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ప్రధాన ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్ తన ప్రసంగంలో బలపరీక్ష సమయంలో ఎమ్మెల్యేలకు ముడుపుల వ్యవహారాన్ని అస్త్రంగా చేసుకుని గళం విప్పారు. ఇందుకు స్పీకర్ ధనపాల్ తీవ్ర ఆక్షేపణ వ్యక్తంచేశారు. దీంతో తాము ఇచ్చిన ఫిర్యాదు మేరకు చర్యలు తీసుకోవాలని ఇన్చార్జి గవర్నర్ విద్యాసాగర్‌రావు జారీచేసిన ఉత్తర్వుల గురించి ప్రసంగాన్ని అందుకున్నారు. ఎలాంటి చర్యలు తీసుకున్నారో, గవర్నర్‌కు ఎలాంటి వివరణ ఇచ్చారో స్పష్టంచేయాలని డిమాండ్‌చేశారు. ఇందుకు స్పీకర్ నిరాకరించడంతో ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటుచేసుకుంది. ఇరువురూ మాటల తూటాల్ని పేల్చుకున్నారు. గవర్నర్ తమను ప్రశ్నించారని, అందుకుతగ్గ వివరణ ఇచ్చుకున్నామని, అది బహిర్గతం చేయాల్సిన అవసరం లేదంటూ స్పీకర్ తేల్చి చెప్పారు. గవర్నర్‌కు పంపే లేఖలు రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఉందని, సమాధానం ఇచ్చే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు. దీంతో స్పీకర్ తీరును నిరసిస్తూ డీఎంకే సభ్యులు సభనుంచి వాకౌట్ చేశారు. ఈ సందర్భంగా స్టాలిన్ మీడియాతో మాట్లాడుతూ, స్పీకర్ అంతా రహస్య వ్యవహారాలు సాగిస్తుండడం శోచనీయమని విమర్శించారు. ముడుపుల వ్యవహారం కప్పిపుచ్చే యత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇక, సభలో తీవ్రస్థాయిలో వాగ్వాదం సాగుతున్నా, ముడుపుల వ్యవహారంలో మాజీ సీఎం పన్నీరు సెల్వం నేతృత్వంలోని ఎమ్మెల్యేలు మౌనంగా ప్రేక్షక పాత్ర పోషించడం గమనార్హం. గత కొద్ది రోజులుగా ఆ ఎమ్మెల్యేలు మౌనంగానే ముందుకు సాగుతున్నారు. స్మార్ట్ సిటీలు డీఎంకే వాకౌట్ తదుపరి సభలో నగర, గ్రామీణాభివృద్ధి శాఖకు నిధుల కేటాయింపులపై మంత్రి ఎస్పీ వేలుమణి కొత్త ప్రకటనలు చేశారు. ఇందులో 66 అంశాలున్నాయి. ప్రధానంగా రూ.250 కోట్లతో గ్రామీణ ప్రాంతాల్లో నీటి పరివాహక ప్రదేశాల్లో రెండు లక్షల చెక్ డ్యామ్‌ల నిర్మాణం, రూ.300 కోట్లతో చెరువులు, కొలనుల్లో పూడికత తీత, రూ.200 కోట్లతో గ్రామాల్లో ఎల్ఈడీ బల్బుల ఏర్పాట్లు ఉన్నాయి. అలాగే, చెన్నై కార్పొరేషన్ పరిధిలోని భవనాల మీద సౌర విద్యుత్ ఉత్పత్తికి రూ.39 కోట్లు కేటాయించారు. చెన్నై, కోయంబత్తూరు, మదురై, తిరుచ్చి తదితర పన్నెండు కార్పొరేషన్లలో రూ.1,326 కోట్లతో స్మార్ట్ సిటీల నిర్మాణం చేపట్టి, 2020 నాటికి ముగించేందుకు నిర్ణయించారు. ఇంటి నిర్మాణాలు, ఆస్తి విలువ తదితర అనుమతులు, వివరాల కోసం దరఖాస్తులను ఆన్లైన్పరం చేశారు. ఈషా కేంద్రంతో ఔట్రీచ్ విషయంగా ఒప్పందం కుదుర్చుకోనున్నట్టు ప్రకటించారు. -
ఎంత పనిచేశావు నాన్నా..
⇒చిన్నారిని బలితీసున్న దారి వివాదం ⇒తొమ్మిది నెలల కుమార్తెనుగొంతు నులిమి చంపిన తండ్రి ⇒తాను కూడా ఆత్మహత్యాయత్నం ⇒విషాదంలో మాధవరం తండ్రి తనను బైక్ మీద ఎక్కించుకొంటుంటే ఎప్పటి లాగే షికారుకు తీసుకెళ్తున్నాడని సంబర పడిపోయింది ఆ చిన్నారి. బజారుకు తీసుకెళ్లి ఏ చాక్లెట్లో.. బిస్కెట్లో కొనిస్తాడనుకొని ఆశ పడింది. బోసి నవ్వులు నవ్వుకుంది. పాపం.. అభం శుభం తెలియని ఆ పాలబుగ్గల పసిపాపకేం తెలుసు రోజూ తనను గారం చేసే కన్న తం్రడ్రే తన గొంతు నులిమి చంపేస్తాడని..? దాయాదుల మధ్య తలెత్తిన దారి వివాదంతో మనస్తాపం చెందిన ఓ అభాగ్యుడు తల్లిని హత్తుకొని పడుకొన్న తొమ్మిది నెలల చిన్నారిని పొలానికి తీసుకెళ్లి ప్రాణాలు తీశాడు. తాను కూడా ఆత్మహత్యాయత్నం చేశాడు. ముక్కుపచ్చలారని బిడ్డను చంపేందుకు ఆ తండ్రికి చేతులెలా వచ్చాయో.. అని స్థానికులు విస్మయం వ్యక్తం చేయగా.. తన చిట్టిచెల్లి ఇక లేదని తెలియని మూడేళ్ల బాలుడు నిర్జీవంగా పడి ఉన్న చిన్నారిని తడుముతూ మురిపెంగా ముద్దాడుతుంటే.. అతడి అమాయకత్వాన్ని చూసి కన్నీటిని ఆపుకోవడం అక్కడున్న ఎవరి తరమూ కాలేదు. గుండెల్ని పిండేసే ఈ విషాద ఘటన దర్శి మండలం మాధవరం గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. తాళ్లూరు: మండలంలోని మాధవరం గ్రామానికి చెందిన ఇడమకంటి నాగిరెడ్డి, స్వాతి దంపతులకు మూడేళ్ల కుమారుడు అజయ్‌కుమార్ (సాయి), తొమ్మిది నెలల వయసు కుమార్తె నందిని ఉన్నారు. కాస్త అమాయకంగా ఉండే నాగిరెడ్డి వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంటాడు. నాగిరెడ్డికి తనకు బాబాయి వరసయ్యే దాయాదులైన ఇడమకంటి గురువారెడ్డి, పిచ్చిరెడ్డిలతో చాలా రోజులుగా పొలం వద్ద దారి వివాదం నలుగుతోంది. దీనిపై పెద్ద మనుఘల వద్ద పంచాయితీలు జరిగాయి. స్టేషన్లో ఫిర్యాదుల వరకు వెళ్లాయి. రెండు రోజుల క్రితం పొలం వద్ద దారి విషయంలోనే వీరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో దారి విషయం తెలేవరకు తమ ఇంటి ముందుగా ఉన్న దారిలో నడవటానికి వీల్లేదంటూ గురువారెడ్డి, పిచ్చిరెడ్డిలు నాగిరెడ్డి నివాసం చుట్టూ చిల్ల కంపవేసి దారి మూసి వేశారు. దీంతో గ్రామంలో తమకు న్యాయం చేసే వారు లేరంటూ సోమవారం రాత్రి నాగిరెడ్డి తన తల్లిదండ్రులు, భార్య పిల్లలతో కలిసి, గ్రామానికి ఐదు కిలోమీటర్ల దూరంలోని గుంటి గంట సత్రానికి వెళ్లారు. విషయం తెలిసిన గ్రామ పెద్దలు, బంధువులు వారి వద్దకు వెళ్లి నచ్చచెప్పి ఇంటికి తీసుకొచ్చారు. ఇంటి చుట్టూ వేసిన కంప తీసివేశారు. మంగళవారం ఉదయం దాయాదులు మళ్లీ దారి మూసివేయడంతో సమస్య మళ్లీ మొదటికొచ్చినది. దీంతో నాగిరెడ్డి తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. నిద్రిస్తున్న బిడ్డను ఎత్తుకొని.. ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం మంచంపై తల్లి పక్కన పడుకొని నిద్రిస్తున్న కుమార్తె నందినిని ఎత్తుకొని బైక్ మీద ఎక్కించుకొని తీసుకెళ్లాడు. పొలానికి వెళ్తున్నానని భార్యకు చెప్పాడు. పాపను రోజూ నాగిరెడ్డి ఇలాగే కాసేపు బజారుకు, పొలానికి బైక్‌పై తీసుకువెళ్తూ ఉంటాడు కదా.. అని తల్లి అభ్యంతరం చెప్పలేదు. ఎంతకీ బిడ్డను తీసుకురాక పోవటంతో స్వాతి తన భర్తకు ఫోన్ చేసింది. స్పందన రాలేదు. తర్వాత మరోకరి సెల్ నుంచి ప్రయత్నించింది. తాను పాపను చంపేశానని.. తాను కూడా చనిపోతానని భార్యతో చెప్పినట్లు సమాచారం. దీంతో షాక్‌కు గురయిన స్వాతి బంధువులకు విషయం చెప్పింది. హుటాహుటిన బంధువులు పొలం వద్దకు వెళ్లేసరికి అప్పటికే పాప మృతి చెందింది. నాగిరెడ్డి ఒక వైపు పడి ఉండటం చూసిన వెంటనే ఒంగోలు ప్రవేట్ వైద్యశాలకు తరలించారు. అప్పటికే మృతి చెందిన చిన్నారిని తాతయ్య, నానమ్మలు ఇంటికి తీసుకొచ్చారు. నాగిరెడ్డి పొలంలోని విద్యుత్ తీగలు పట్టుకొని ఆత్మహత్యాయత్నం చేయగా.. అంతలో కరెంటు సరఫరా నిలిచిపోవడంతో ప్రాణాపాయం నుంచి బయటపడినట్టు తెలిసింది. చిన్నారి మృతితో విషాదం.. మృతి చెందిన చిన్నారి స్వాతిని తండ్రి పొట్టన పెట్టుకోవటం పట్ల బంధువులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ముక్కుపచ్చలారని పసిపాపను ఒడిలో పెట్టుకుని స్వాతి గుండెలవిసేలా రోదించింది. అన్న అజయ్‌కుమార్ చెల్లిని ముద్దాడుతూ అటూ ఇటూ తిరగటం చూసిన బంధువుల కళ్లు చెమర్చాయి. ఘటన స్థలాన్ని ఎస్ఐ మహేష్ పరిశీలించారు. దర్శి సీఐ రాఘవేంద్ర పాప మృతదేహాన్ని పరిశీలించి తల్లి స్వాతి, బంధువుల నుంచి వివరాలు సేకరించారు. -
ఢీ..డిష్యుం..డిష్యుం..!
కుత్బుల్లాపూర్: కారు, బైక్ ఢీ కొన్నాయి.. అంతలో కారులో ఉన్న ఓ వ్యక్తి కిందకు దిగి బైక్‌పై వచ్చిన వ్యక్తిని కొట్టాడు. అంతే సదరు బైకిస్ట్‌కు చెందిన వ్యక్తులు అక్కడికి చేరుకుని కారులో ఉన్న నలుగురిని చితకబాదారు..పేట్ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం జరిగిన సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. సుచిత్ర నుంచి కుత్బుల్లాపూర్ వెళ్లే రోడ్డులో జయ రాంనగర్ వద్ద కారు, బైక్ ఢీకొనడంతో వారి మధ్య వాగ్వాదం జరిగింది. బైక్‌పై వెళ్తున్న వ్యక్తి స్థానికుడు కావడంతో అతడి స్నేహితులు అక్కడికి చేరుకుని కారులో ఉన్న వారిని బయటికి లాగి చితకబాదారు. దీంతో వాహనాల రాకపోకలు స్తంభించడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చివరకు గొడవ పోలీస్‌స్టేషన్ కు చేరింది. -
కావాల్సిన చోట స్థలాలు ఇస్తామని చెప్పి..
-
కావాల్సిన చోట ఇస్తామని చెప్పి..
గుంటూరు: రాజధాని ప్రాంతంలో రైతుల నుంచి భూములు తీసుకునేటప్పుడు వారికి కావాల్సిన చోట ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పిన అధికారులు ఇప్పుడు మాట మార్చడంతో.. రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతులకు ఇచ్చే ప్లాట్ల విషయంలో తుళ్లురు మండలం శాకమూరులో సీఆర్డీఏ అధికారుల సదస్సు సోమవారం గదరగోళంగా మారింది. సదస్సులో సీఆర్డీఏ అధికారులు, రైతులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మీకు నచ్చిన చోట ప్లాట్లు ఇస్తాం అని చెబుతూ భూములను లాక్కున్న అధికారులు ఇప్పుడు మాటమార్చడంతో సదస్సులో పాల్గొన్న రైతులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. 'మాకు నచ్చిన చోట ప్లాట్లు ఇస్తేనే తీసుకుంటాం' అని అధికారులతో రైతులు తెగేసి చెప్పారు. ఇచ్చిన చోట తీసుకోవాలంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. -
లోక్‌సభలో ఎన్నికల సవరణ బిల్లు
న్యూఢిల్లీ: బడ్జెట్ సమావేశాల తొలిరోజే పార్లమెంటులో వేడి మొదలైంది. పలు అంశాలపై అధికార, విపక్షాల మధ్య వాగ్వాదం మొదలవ్వగా కేంద్రం లోక్‌సభలో బిల్లును ప్రవేశపెట్టింది. భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు ఒప్పందం ద్వారా భారత్‌లో విలీనమైన గ్రామాల ప్రజలకు ఓటుహక్కు కలిపించే ఎన్నికల చట్టం (సవరణ) బిల్లును కేంద్ర న్యాయ మంత్రి సదానంద గౌడ బుధవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. దీంతోపాటు 294 మంది సభ్యులున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ వ్యవధి మే 29న ముగుస్తుండటంతో అక్కడ ఎన్నికలు జరిపేందుకు వీలైనంత త్వరగా ఈ బిల్లుకు కేంద్రం ఆమోదింపజేయాల్సి ఉంది. ఈ బిల్లు రెండ్రోజుల్లో ఉభయ సభల్లో ఆమోదం పొందుతుందని కేంద్రం భావిస్తోంది. కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నందున కొంతకాలంగా లెఫ్ట్ పార్టీలు ప్రత్యర్థులపై దాడులకు పాల్పడుతున్నాయని బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖి లోక్‌సభలో మండిపడ్డారు. దీంతో సభలో కాసేపు గందరగోళం నెలకొంది. దీంతో పాటు వివిధ పార్టీలు పలు అంశాలపై విపక్షాలు సంధించిన ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. లోక్‌సభలో.. భారతదేశవ్యాప్తంగా అమల్లో ఉన్న 77 మౌలిక వసతుల కల్పన (పవర్, పెట్రోలియం, రైల్వే..) ప్రాజెక్టులకు అనుకున్నదానికన్నా రూ.1.29లక్షల కోట్లు ఎక్కువ ఖర్చయిందని షెడ్యూల్, గణాంకాల మంత్రి వీకే సింగ్ పార్లమెంటుకు తెలిపారు. దేశవ్యాప్తంగా 1.55 లక్షల పోస్టాఫీసులను రూ. 5వేల కోట్ల ఖర్చుతో కంప్యూటరీకరణ చేయనున్నట్లు టెలికాం మంత్రి రవిశంకర్ వెల్లడించారు. దాదాపు వెయ్యి రైల్వే స్టేషన్లను ఆదర్శ స్టేషన్లుగా అభివృద్ధి పరిచామని మరికొన్ని స్టేషన్లను 2009-10లో ప్రారంభమైన ఈ పథకంలో భాగంగా అభివృద్ధి పరచనున్నట్లు రైల్వే మంత్రి లోక్‌సభకు తెలిపారు. రాజ్యసభలో.. అమాయక ముస్లింలెవరూ జైళ్లలో మగ్గటం లేదని హోంశాఖ సహాయ మంత్రి హరిభాయ్ చౌదరీ రాజ్యసభకు వెల్లడించారు. పఠాన్‌కోట్ ఘటన, తర్వాత విచారణలో వెల్లడైన అంశాలను కేంద్రం పార్లమెంటుకు వివరించింది. -
ఉద్రిక్తతకు దారి తీసిన బతుకమ్మ ఉత్సవం
ఏపీ ఎన్జీవోస్లో టీ, ఆంధ్రా ఉద్యోగుల వాగ్వాదం హైదరాబాద్: బతుకమ్మ ఉత్సవాలు ఉద్రిక్తతకు దారి తీశాయి. ఆంధ్రా, తెలంగాణ ఉద్యోగుల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. బుధవారం బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించుకోవడానికి తెలంగాణ ఉద్యోగులు హైదరాబాద్‌లోని ఏపీఎన్జీవోస్ కార్యాలయానికి వచ్చారు. వారిని గేట్ లోపలికి రానివ్వకుండా ఆంధ్రా ఉద్యోగులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య మాటలయుద్ధం తీవ్రస్థాయిలో జరిగింది. సమాచారం తెలుసుకున్న అబిడ్స్ పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకొని ఇరువర్గాలను శాంతింపజేశారు. కార్యాలయంలోకి అనుమతించకపోవడంతో తెలంగాణ ఉద్యోగులు గేటు బయట రోడ్డుపైనే బతుకమ్మ ఆడారు. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతోందని పోలీసులు భాగ్యనగర్ టీఎన్జీవోస్ అధ్యక్షుడు ఎం.సత్యనారాయణగౌడ్, కార్యదర్శి పి. బలరామ్, అసోసియేట్ అధ్యక్షుడు ఎస్.ప్రభాకర్, ఉపాధ్యక్షులు రాజేశ్వర్‌రావు, విద్యానంద్, రమాదేవి తదితరులను అరెస్టు చేసి పోలీసుస్టేషన్‌కు తరలించారు. సాయంత్రంవారిని సొంతపూచీకత్తుపై విడుదల చేశారు. సత్యనారాయణగౌడ్ మాట్లాడుతూ తెలంగాణలో ఇంకా ఆంధ్రా అధికారుల ఆగడాలకు అంతులేకుండా పోతోందన్నారు. తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటుచేసి కార్యాచరణ రూపొందిస్తామన్నారు. -
మళ్లీ అదే ప్రతిష్టంభన
కొనసాగిన కాంగ్రెస్ ఆందోళన.. ఉభయ సభలూ వాయిదా - లోక్‌సభలో విపక్షం లేనపుడు సుష్మా ప్రకటనపై ఖర్గే విమర్శలు - లలిత్‌మోదీకి ఆమె సాయం ఆర్థిక ప్రాతిపదికనేనంటూ ఆరోపణ - లోక్‌సభలో నేడు లలిత్‌మోదీ వివాదంపై చర్చ న్యూఢిల్లీ: పార్లమెంటు సమావేశాలు మళ్లీ అధికార, విపక్షాల మధ్య వాగ్వాదం, గందరగోళంతో ఎటువంటి కార్యక్రమాలూ లేకుండానే వాయిదాపడ్డాయి. గత వారం 25 మంది కాంగ్రెస్ సభ్యుల సస్పెన్షన్ నేపథ్యంలో లోక్‌సభను బహిష్కరించిన కాంగ్రెస్ సహా పలు విపక్షాలు సోమవారం సభకు తిరిగి వచ్చాయి. తమపై ఐదు రోజుల సస్పెన్షన్ శుక్రవారం సాయంత్రం ముగియటంతో కాంగ్రెస్ సభ్యులు 25 మంది మళ్లీ వెల్‌లోకి వెళ్లి ఆందోళన కొనసాగించారు. దీంతో సభ నాలుగు దఫాలు వాయిదా పడింది. సంబంధిత రాష్ట్రాలను సంప్రదించకుండా బిహార్, హిమాచల్‌ప్రదేశ్‌ల గవర్నర్ల నియామకంపైనా, నాగా ఒప్పందం కుదుర్చుకోవటం పైనా రాజ్యసభలో విక్షాలు నిరసనలకు దిగటంతో అధికార, విపక్షాల మధ్య వాగ్వాదంతో సభ గందరగోళంగా మారి మూడుసార్లు వాయిదా పడింది. విపక్షం లేని సమయంలో ప్రకటనా?: ఖర్గే లోక్‌సభ ఉదయం సమావేశమయ్యాక.. భూటాన్ పార్లమెంటరీ ప్రతినిధి బృందానికి స్పీకర్ సుమిత్రామహాజన్ స్వాగతం పలికారు. అనంతరం.. ప్రముఖ బెంగాలీ సినీ నటుడు జార్జ్ బేకర్‌ను నామినేటెడ్ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయించారు. సోమవారం జార్ఖండ్‌లోని దేవ్గఢ్లో ఒక ఆలయం వద్ద జరిగిన తొక్కిసలాటలో చనిపోయిన 10 మందికి సభలోని సభ్యులంతా మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. ఆ తర్వాత కాంగ్రెస్ సభాపక్ష నేత మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. గత వారంలో దాదాపు ప్రతిపక్షమంతా సభను బహిష్కరించివున్న సమయంలో విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ సభలో ప్రకటన చేయటాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. ప్రతిపక్షం సభలో లేని సమయాన్ని సుష్మ సుదీర్ఘ ప్రసంగం చేయటానికి వినియోగం లేదా దుర్వినియోగం చేశారన్నారు. ‘కానీ.. ఆమె ప్రకటనతో ఈ అంశం సమసిపోదు. ఆమె చేసిన పని (లలిత్‌మోదీకి సాయం చేయటం) దేశ ప్రయోజనాలకు విరుద్ధం. ఆమె ఒక పరారీలోని నిందుతుడికి, ఆర్థిక నేరస్తుడికి సాయం చేశారు. చిదంబరం (నాటి కేంద్రమంత్రి) ఏం చెప్పారో పత్రాలను చూడండి’ అని అన్నారు. మాజీ ఐపీఎల్ చీఫ్‌కు చేసిన సాయం మానవతా ప్రాతిపదికన చేసింది కాదని, ఆర్థిక ప్రాతిపదికన చేసిందని అభివర్ణించారు. దీనిపై బీజేపీ సభ్యులు ఆగ్రహంతో స్పందించారు. దీంతో ఈ అంశాన్ని ఇంకా ప్రస్తావించవద్దని.. ఆ తర్వాత లేవనెత్తవచ్చని ఖర్గేకు స్పీకర్ సూచించారు. అప్పటికే చాలా మంది కాంగ్రెస్ సభ్యులు నల్ల బ్యాడ్జీలు ధరించి, ప్లకార్డులు చేతపట్టుకుని వెల్‌లోకి వెళ్లి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యులు కూడా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. ప్రతిష్టంభనను తొలగించేందుకు పార్టీల నేతలతో చర్చలు జరపాలని ఎస్పీ నేత ములాయంసింగ్‌యాదవ్ సూచించగా.. స్పీకర్ సభను అరగంట వాయిదా వేశారు. సభ తిరిగి మొదలయ్యాకా కూడా ముందటి పరిస్థితులే కనిపించాయి. లలిత్ వివాదంలో సుష్మ, రాజస్తాన్ సీఎం వసుంధర రాజే, వ్యాపమ్ స్కాంలో మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్‌చౌహాన్‌ల రాజీనామాలు కోరుతూ కాంగ్రెస్ సభ్యులు నినాదాలు కొనసాగించారు. నిరసనలు కొనసాగించటంతో డిప్యూటీ స్పీకర్ సభను మధ్యాహ్నం 2 గంటల వరకూ వాయిదా వేశారు. మళ్లీ సమావేశమయ్యాక కూడా పరిస్థితిలో మార్పు లేకపోవటంతో సభను మంగళవారానికి వాయిదా వేశారు. అయితే.. ఈ గందరగోళం మధ్యలోనే ప్రభుత్వం మర్చంట్ షిప్పింగ్ (సవరణ) బిల్లు 2015ను సభలో ప్రవేశపెట్టింది. ప్రతిష్టంభన ఎలా ముగుస్తుంది?: ఆజాద్ సభా కార్యక్రమాలను రద్దుచేసి.. గవర్నర్ల నియామకంపై చర్చ కోసం తీర్మానం ప్రవేశపెట్టటానికి జేడీయూ సభ్యుడు కె.సి.త్యాగి ప్రస్తావించటంతో గందరగోళం మొదలైంది. అప్పటివరకూ లలిత్వ్రివాదం, వ్యాపమ్ స్కాంపై వెల్‌లో నిలబడి నినాదాలు చేస్తున్న కాంగ్రెస్ సభ్యులు.. త్యాగి మాట్లాడేందుకు వీలుకల్పిస్తూ తమ తమ స్థానాల్లోకి వెళ్లారు. ప్రతిపక్ష నేత గులాంన ఆజాద్ కూడా గవర్నర్ల నియామకం, నాగా ఒప్పందం అంశాన్ని లేవనెత్తారు. కేంద్ర వైఖరి సహకార సమాఖ్య విధానమని చెప్తున్న మాటలను కుప్పకూల్చిందని ధ్వజమెత్తారు. ఈ పరిస్థితుల్లో ప్రతిష్టంభన ఎలా ముగుస్తుందని ప్రశ్నించారు. నేడు ‘లలిత్‌మోదీ వివాదం’పై చర్చ లలిత్‌మోదీ వివాదంపై మంగళవారం లోక్‌సభలో చర్చించాలని సభా కార్యక్రమాల సలహా సంఘం (బీఏసీ) భేటీ నిర్ణయించింది. అయితే.. ఈ వివాదం, వ్యాపమ్‌లపై తాము చేస్తున్న డిమాండ్లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ.. కాంగ్రెస్ సభ్యుడు కె.సి.వేణుగోపాల్ సోమవారం సాయంత్రం జరిగిన ఈ భేటీ నుంచి వాకౌట్ చేశారు. కాగా, లలిత్ వివాదంపై మంత్రి సుష్మ ఇటీవల పార్లమెంటులో చేసిన ప్రకటనకే లోక్‌సభలో చర్చను పరిమితం చేయాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రణాళికకు ఏఐఏడీఎంకే, బీజేడీలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. -
టీడీపీ అభిప్రాయ సేకరణలో వాగ్వాదం
విశాఖపట్నం: జిల్లా, నగర టీడీపీ అధ్యక్ష పదవుల ఎంపికపై అభిప్రాయ సేకరణ సందర్భంగా టీడీపీ నేతల మధ్య వాగ్వాదం జరిగింది. అభిప్రాయసేకరణ విషయమై గవిరెడ్డి రామానాయుడు, జడ్పీటీసీ పోతుల రమణమ్మ వాదనకు దిగారు. పార్టీ సస్పెండ్ చేసిన రమణమ్మ నుంచి అభిప్రాయం ఎలా సేకరిస్తారంటూ రామానాయుడు వర్గం వాదనకు దిగింది. అభిప్రాయ సేకరణ ముగిసిన తరువాత జిల్లా ఇన్చార్జి మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ నగర అధ్యక్షుడిగా వాసుపల్లి గణేష్ కుమార్వైపే ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు మొగ్గు చూపుతున్నారని చెప్పారు. జిల్లా అధ్యక్షుడి ఎన్నికలో పోటీదారులతోపాటు ఆశావాహులు ఎక్కువగా ఉన్నట్లు చెప్పారు. ఎంపికైన అభ్యర్థుల పేర్లను ఈ సాయంత్రం గానీ లేదా రేపు గానీ ప్రకటిస్తామన్నారు. విశాఖ జిల్లా టీడీపీలో వర్గాలు లేవని, అభిప్రాయబేధాలు మాత్రమే ఉన్నాయని తెలిపారు. జూన్ మొదటి వారంలో జిల్లా సమీక్షా సమావేశం జరుగుతుందని మంత్రి యనమల చెప్పారు. -
కడియం, ఎర్రబెల్లి వాగ్వాదం
⇒ ఆంధ్రావాళ్ల మోచేతి నీళ్లు తాగుతున్నారన్న కడియం ⇒ నీవు ఆంధ్రా పార్టీలో పని చేయలేదా... కూర్చో అన్న ఎర్రబెల్లి రాయపర్తి: డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, టీటీడీపీ శాసనసభా పక్ష నేత ఎర్రబెల్లి దయాకర్‌రావుల మధ్య ఆది వారం వాగ్వాదం చోటు చేసుకుంది. వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని కాట్రపల్లి పెద్దచెరువు పూడికతీత పనుల సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి పనులను ప్రారంభించి మాట్లాడుతుండగా, ఎమ్మెల్యే దయాకర్‌రావు వచ్చారు. వెంటనే ఆయనను సభావేదికపైకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా దయాకర్‌రావు మాట్లాడుతూ మిషన్ కాకతీయను ఆహ్వానిస్తున్నామన్నారు. కానీ, పర్వతగిరి మండలంలోని ఏనుగల్లులో తనను దూషిస్తూ మాట్లాడడం సరికాదని కడియంను ఉద్దేశించి ఎర్రబెల్లి అన్నారు. తర్వాత దీనిపై డిప్యూటీ సీఎం కడియం మాట్లాడుతూ ‘ఏనుగల్లులో మాట్లాడింది నిజమే... అప్పుడు అదే మాట్లాడాను ఇప్పుడు అదే మాట్లాడుతున్నానన్నారు. తెలంగాణ ఏర్పాటయ్యాక ఇంకా ఆంధ్రావాళ్ల మోచేతినీళ్లు తాగుతూ ఉన్నవాళ్లు ఉన్నారని అన్నా’నని చెబుతుండగా వెంటనే ఎర్రబెల్లి లేచి ‘నీవు ఆంధ్రాపార్టీలో పని చేయలేదా.. ఏం మాట్లాడుతున్నావ్.. కూర్చో’ అన్నారు. ఈ క్రమంలో ఇద్దరూ వాగ్వాదానికి దిగారు. పక్కనే ఉన్న టీఆర్ఎస్ కార్యకర్తలు ‘జై తెలంగాణ’ అని నినాదాలు చేశారు. టీడీపీ పార్టీ కార్యకర్తలు ‘జై తెలుగుదేశం’ అని నినాదాలు చేయడంతో వాగ్వాదం నిలిచిపోయింది. -
శోభ వర్సెస్ శోభ
కరీంనగర్ జిల్లాలో ప్రజా ప్రతినిధుల మధ్య గొడవలు ముదురుతున్నాయి. చొప్పదండి ఎమ్మెల్యే బొడిగె శోభ, మల్యాల జడ్పీటీసీ సభ్యురాలు శోభ నడుమ తీవ్ర వాగ్వాదం జరిగింది. తాను ఇప్పటికే జడ్పీటీసీలు, అధికారులతో సమావేశం నిర్వహించానని ఎమ్మెల్యే శోభ చెప్పడంతో, అసలు సమావేశం పెట్టలేదని ఎమ్మెల్యే తప్పు చెబుతున్నారంటూ జడ్పీటీసీ సభ్యురాలు శోభ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే ‘ఈమె కాంగ్రెస్... పిలిస్తే మీటింగ్‌కు రాదన్నా..’ అంటూ హరీష్‌రావుకు చెప్పారు. అసలు మీటింగ్ పెట్టలేదు, నాకు చెప్పలేదంటూ జడ్పీటీసీ సభ్యురాలు శోభ వాదనకు దిగారు. ఆమెకు మద్దతుగా కాంగ్రెస్ సభ్యులు లేవడంతో సభ పక్కదారిపట్టే ప్రమాదం ఉందని భావించిన మంత్రులు హరీష్, ఈటెల రాజేందర్, చైర్పర్సన్ తుల ఉమ ఇరువురిని వారించారు. -
పోలీసులతో బాబూమోహన్ వాగ్వాదం!
హైదరాబాద్: జలవిహార్ వద్ద పోలీసులకు, మెదక్ జిల్లా ఆదోల్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాబూ మోహన్ మధ్య వాగ్వాదం జరిగింది. తన వాహనాన్ని బయటకు పంపడంతో బాబూమోహన్ పోలీసులతో గొడవకు దిగారు. తనను తక్కువ చేసి చూస్తున్నారంటూ బాబూమోహన్ అసహనం వ్యక్తం చేశారు. ** -
జన్మభూమిలో జగడం
కడప కార్పొరేషన్: కడప నగరంలో సోమవారం నిర్వహించిన ఁజన్మభూమి* కార్యక్రమం రసాభాసగా సాగింది. టీడీపీ, వైఎస్సార్సీపీ నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి... కడప నగరం 27వ డివిజన్లోని గౌస్ నగర్ మున్సిపల్ ఉర్దూ ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన ఁజన్మభూమి- మాఊరు* కార్యక్రమంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకొన్నాయి. కడప ఎమ్మెల్యే అంజద్‌బాషా మాట్లాడుతుండగా టీడీపీ నగర అధ్యక్షుడు బాలక్రిష్ణయాదవ్ మైక్ లాక్కోవడంతో గొడవ మొదలైంది. ఇరుపార్టీల నాయకుల మధ్య తీవ్ర వాగ్వివాదం, తోపులాట చోటు చేసుకుంది. టీడీపీ నాయకులు వారి పార్టీ నాయకులకు ఫోన్లు చేసి మరీ పిలుపించుకున్నారు. మరోవైపు వైఎస్ఆర్ సీపీ కార్పొరేటర్లు, నాయకులు కూడా అదే స్థాయిలో గుమికూడారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అధికారం మాది..ప్రభుత్వంపై చేసిన విమర్శలకు సమాధానం చెప్పాల్సిందేనంటూ బాలక్రిష్ణయాదవ్ పట్టుబట్టి రెండవసారి మాట్లాడారు. ఆ తర్వాత మేయర్, ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతున్నప్పుడు కూడా గొడవ చేశారు. అయినా మేయర్, ఎమ్మెల్యేలు సంయమనం పాటించారు. స్థానిక కార్పొరేటర్ షేక్ షహనాజ్, వైఎస్ఆర్సీపీ నాయకులు మాసీమ బాబు, జహీర్, ఎస్ఎండీ షఫీ, అజ్మతుల్లా, శివకేశవ, కార్పొరేటర్లు హరూన్‌బాబు, చైతన్య, చల్లా రాజశేఖర్, జమ్మిరెడ్డి, టీడీపీ నాయకులు అమీర్‌బాబు, జయకుమార్, నూర్ తదితరులు పాల్గొన్నారు. ఇది ప్రజాస్వామ్యమేనా! మనం ప్రజా స్వామ్యంలో ఉన్నామో...నియంతపాలనలో ఉన్నామో అర్థం కాలేదని ఎమ్మెల్యే ఎస్బీ అంజద్‌బాషా ఆవేదన వ్యక్తం చేశారు. బాలక్రిష్ణయాదవ్ 45 నిముషాలపాటు మాట్లాడితే తాము ఓపికగా విన్నామన్నారు. తమకు అవకాశం వచ్చాక మాట్లాడుతుంటే మైక్ లాక్కోని దౌర్జన్యం చేయడం సరికాదని చెప్పారు. తనను ప్రజలు 45వేల మెజార్టీతో ఎమ్మెల్యే గెలిపించారని, వారి సమస్యలపై ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యేగా మాట్లాడుతుంటే మైక్ లాక్కుంటారా... అని ఆగ్రహం వ్యక్తం చేశారు. గౌస్ నగర్లో గతంలో 350 పింఛన్లు ఇస్తుండగా, ప్రస్తుతం 180 మందికే ఇస్తున్నారని, వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేశారనే అక్కసుతోనే ఆ పింఛన్లన్నీ తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాలకు వేదిక కాదు రాజకీయాలకు ఇది వేదిక కాదని మేయర్ కె. సురేష్‌బాబు టీడీపీ నాయకులకు సూచించారు. ప్రభుత్వ కార్యక్రమమైనందునే జన్మభూమి- మాఊరుకు హాజరయ్యామన్నారు. పార్టీలున్నది ప్రజలకు సేవ చేయడానికే అని, అర్హులందరికీ న్యాయం చేయడానికి అందరం సమిష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా పింఛన్ కోల్పోయిన పలువురు వృద్ధులు, వితంతువులను వారు మీడియాకు చూపారు. -
క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి అరెస్ట్!
చంఢీఘడ్: మాజీ టెస్ట్ క్రికెటర్, భారత క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ సింగ్ ను సోమవారం పోలీసులు అరెస్ట్ చేశారు. చండీఘడ్ సమీపంలోని పంచకులలో గొడవ దిగిన యోగరాజ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. యోగరాజ్ తోపాటు మరో వ్యక్తిని కూడ ఈ ఘటనలో అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. పంచకులలోని సెక్టర్ 2లో ఆదివారం రాత్రి జన్మదిన వేడుకలకు యోగరాజ్ సింగ్ కుటుంబ సభ్యులు హాజరయ్యారు. వేడుకలు ముగిసిన తర్వాత తిరిగి వెళుతుండగా కారు పార్కింగ్ వద్ద ఓ రిటైర్డ్ డీఎస్పీ కుమారుడికి యోగరాజ్ సింగ్ కు గొడవ జరిగింది. ఈ గొడవలో మాజీ డీఎస్పీ కుమారుడిపై దాడి చేసినట్టు ఫిర్యాదు అందిందని పంచకుల డీసీపీ రాహుల్ శర్మ తెలిపారు. బాధితుడు చేసిన ఫిర్యాదు మేరకు యోగరాజ్ సింగ్ ను అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. -
పూల రైతులకు,కమిషన్ ఏజెంట్లకు మధ్య తీవ్ర వాగ్వాదం