
మళ్లీ అదే ప్రతిష్టంభన
కొనసాగిన కాంగ్రెస్ ఆందోళన.. ఉభయ సభలూ వాయిదా
- లోక్‌సభలో విపక్షం లేనపుడు సుష్మా ప్రకటనపై ఖర్గే విమర్శలు
- లలిత్‌మోదీకి ఆమె సాయం ఆర్థిక ప్రాతిపదికనేనంటూ ఆరోపణ
- లోక్‌సభలో నేడు లలిత్‌మోదీ వివాదంపై చర్చ
న్యూఢిల్లీ: పార్లమెంటు సమావేశాలు మళ్లీ అధికార, విపక్షాల మధ్య వాగ్వాదం, గందరగోళంతో ఎటువంటి కార్యక్రమాలూ లేకుండానే వాయిదాపడ్డాయి. గత వారం 25 మంది కాంగ్రెస్ సభ్యుల సస్పెన్షన్ నేపథ్యంలో లోక్‌సభను బహిష్కరించిన కాంగ్రెస్ సహా పలు విపక్షాలు సోమవారం సభకు తిరిగి వచ్చాయి. తమపై ఐదు రోజుల సస్పెన్షన్ శుక్రవారం సాయంత్రం ముగియటంతో కాంగ్రెస్ సభ్యులు 25 మంది మళ్లీ వెల్‌లోకి వెళ్లి ఆందోళన కొనసాగించారు. దీంతో సభ నాలుగు దఫాలు వాయిదా పడింది. సంబంధిత రాష్ట్రాలను సంప్రదించకుండా బిహార్, హిమాచల్‌ప్రదేశ్‌ల గవర్నర్ల నియామకంపైనా, నాగా ఒప్పందం కుదుర్చుకోవటం పైనా రాజ్యసభలో విక్షాలు నిరసనలకు దిగటంతో అధికార, విపక్షాల మధ్య వాగ్వాదంతో సభ గందరగోళంగా మారి మూడుసార్లు వాయిదా పడింది.
విపక్షం లేని సమయంలో ప్రకటనా?: ఖర్గే
లోక్‌సభ ఉదయం సమావేశమయ్యాక.. భూటాన్ పార్లమెంటరీ ప్రతినిధి బృందానికి స్పీకర్ సుమిత్రామహాజన్ స్వాగతం పలికారు. అనంతరం.. ప్రముఖ బెంగాలీ సినీ నటుడు జార్జ్ బేకర్‌ను నామినేటెడ్ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయించారు. సోమవారం జార్ఖండ్‌లోని దేవ్‌గఢ్‌లో ఒక ఆలయం వద్ద జరిగిన తొక్కిసలాటలో చనిపోయిన 10 మందికి సభలోని సభ్యులంతా మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. ఆ తర్వాత కాంగ్రెస్ సభాపక్ష నేత మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. గత వారంలో దాదాపు ప్రతిపక్షమంతా సభను బహిష్కరించివున్న సమయంలో విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ సభలో ప్రకటన చేయటాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. ప్రతిపక్షం సభలో లేని సమయాన్ని సుష్మ సుదీర్ఘ ప్రసంగం చేయటానికి వినియోగం లేదా దుర్వినియోగం చేశారన్నారు. ‘కానీ.. ఆమె ప్రకటనతో ఈ అంశం సమసిపోదు. ఆమె చేసిన పని (లలిత్‌మోదీకి సాయం చేయటం) దేశ ప్రయోజనాలకు విరుద్ధం.
ఆమె ఒక పరారీలోని నిందుతుడికి, ఆర్థిక నేరస్తుడికి సాయం చేశారు. చిదంబరం (నాటి కేంద్రమంత్రి) ఏం చెప్పారో పత్రాలను చూడండి’ అని అన్నారు. మాజీ ఐపీఎల్ చీఫ్‌కు చేసిన సాయం మానవతా ప్రాతిపదికన చేసింది కాదని, ఆర్థిక ప్రాతిపదికన చేసిందని అభివర్ణించారు. దీనిపై బీజేపీ సభ్యులు ఆగ్రహంతో స్పందించారు. దీంతో ఈ అంశాన్ని ఇంకా ప్రస్తావించవద్దని.. ఆ తర్వాత లేవనెత్తవచ్చని ఖర్గేకు స్పీకర్ సూచించారు. అప్పటికే చాలా మంది కాంగ్రెస్ సభ్యులు నల్ల బ్యాడ్జీలు ధరించి, ప్లకార్డులు చేతపట్టుకుని వెల్‌లోకి వెళ్లి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యులు కూడా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు.
ప్రతిష్టంభనను తొలగించేందుకు పార్టీల నేతలతో చర్చలు జరపాలని ఎస్‌పీ నేత ములాయంసింగ్‌యాదవ్ సూచించగా.. స్పీకర్ సభను అరగంట వాయిదా వేశారు. సభ తిరిగి మొదలయ్యాకా కూడా ముందటి పరిస్థితులే కనిపించాయి. లలిత్ వివాదంలో సుష్మ, రాజస్తాన్ సీఎం వసుంధర రాజే, వ్యాపమ్ స్కాంలో మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్‌చౌహాన్‌ల రాజీనామాలు కోరుతూ కాంగ్రెస్ సభ్యులు నినాదాలు కొనసాగించారు. నిరసనలు కొనసాగించటంతో డిప్యూటీ స్పీకర్ సభను మధ్యాహ్నం 2 గంటల వరకూ వాయిదా వేశారు. మళ్లీ సమావేశమయ్యాక కూడా పరిస్థితిలో మార్పు లేకపోవటంతో సభను మంగళవారానికి వాయిదా వేశారు. అయితే.. ఈ గందరగోళం మధ్యలోనే ప్రభుత్వం మర్చంట్ షిప్పింగ్ (సవరణ) బిల్లు 2015ను సభలో ప్రవేశపెట్టింది.
ప్రతిష్టంభన ఎలా ముగుస్తుంది?: ఆజాద్
సభా కార్యక్రమాలను రద్దుచేసి.. గవర్నర్ల నియామకంపై చర్చ కోసం తీర్మానం ప్రవేశపెట్టటానికి జేడీయూ సభ్యుడు కె.సి.త్యాగి ప్రస్తావించటంతో గందరగోళం మొదలైంది. అప్పటివరకూ లలిత్‌వ్రివాదం, వ్యాపమ్ స్కాంపై వెల్‌లో నిలబడి నినాదాలు చేస్తున్న కాంగ్రెస్ సభ్యులు.. త్యాగి మాట్లాడేందుకు వీలుకల్పిస్తూ తమ తమ స్థానాల్లోకి వెళ్లారు. ప్రతిపక్ష నేత గులాంన ఆజాద్ కూడా గవర్నర్ల నియామకం, నాగా ఒప్పందం అంశాన్ని లేవనెత్తారు. కేంద్ర వైఖరి సహకార సమాఖ్య విధానమని చెప్తున్న మాటలను కుప్పకూల్చిందని ధ్వజమెత్తారు. ఈ పరిస్థితుల్లో ప్రతిష్టంభన ఎలా ముగుస్తుందని ప్రశ్నించారు.
నేడు ‘లలిత్‌మోదీ వివాదం’పై చర్చ
లలిత్‌మోదీ వివాదంపై మంగళవారం లోక్‌సభలో చర్చించాలని సభా కార్యక్రమాల సలహా సంఘం (బీఏసీ) భేటీ నిర్ణయించింది. అయితే.. ఈ వివాదం, వ్యాపమ్‌లపై తాము చేస్తున్న డిమాండ్లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ.. కాంగ్రెస్ సభ్యుడు కె.సి.వేణుగోపాల్ సోమవారం సాయంత్రం జరిగిన ఈ భేటీ నుంచి వాకౌట్ చేశారు. కాగా, లలిత్ వివాదంపై మంత్రి సుష్మ ఇటీవల పార్లమెంటులో చేసిన ప్రకటనకే లోక్‌సభలో చర్చను పరిమితం చేయాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రణాళికకు ఏఐఏడీఎంకే, బీజేడీలు అభ్యంతరం వ్యక్తం చేశాయి.