Vinesh Phogat Row: రాజకీయ రగడ | vinesh phogat disqualification opposition discussion demand in lok sabha | Sakshi
Sakshi News home page

వినేశ్‌ ఫోగట్‌ ఎపిసోడ్‌: కేంద్రం ప్రకటన.. రాజకీయ రగడ

Published Wed, Aug 7 2024 3:03 PM | Last Updated on Wed, Aug 7 2024 8:50 PM

vinesh phogat disqualification opposition discussion demand in lok sabha

ఢిల్లీ: ప్యారిస్‌ ఒలింపిక్స్‌లో రెజ్లర్‌ వినేశ్‌ ఫోగట్‌ అనర్హత అంశం.. రాజకీయ రగడకు దారి తీసింది. ఈ అంశంపై లోక్‌సభలో చర్చకు విపక్షాలు పట్టుపట్టాయి. క్రీడాశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ ప్రకటన చేశారు. అయితే ఆ ప్రకటనతో సంతృప్తి చెందని విపక్షాలు అభ్యంతరం చెబుతూ సభ నుంచి వాకౌట్‌ చేశాయి.

వినేశ్‌ ఫోగట్‌ అనర్హతపై కేం‍ద్రమంత్రి మాట్లాడుతూ.. ‘అనర్హత అంశంలో తగు చర్యలు తీసుకోవాలని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్(ఐఓఏ) అధ్యక్షురాలు పీటీ ఉషాను ప్రధాని మోదీ ఆదేశించారు. ఈరోజు ఆమె బరువు 50 కిలోలు 100 గ్రాములు ఉన్నట్లు గుర్తించి అనర్హత వేటు పడింది. భారత ఒలింపిక్ సంఘం అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ తీరుపై తీవ్ర నిరసన తెలిపింది. 

ఐఓఏ ప్రెసిడెంట్‌ పీటీ ఉష పారిస్‌లో ఉన్నారు. ప్రధాని మోదీ ఆమెతో మాట్లాడి అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు’అని తెలిపారు. అదేవిధంగా ప్రభుత్వం ఆమెకు వ్యక్తిగత సిబ్బందితో సహా ప్రతి సౌకర్యాన్ని అందించిందని చెప్పారు. మరోవైపు.. క్రీడామంత్రి వివరణ ఇస్తున్న సమయంలో ఈ అంశంలో పూర్తి వివరణ ఇవ్వాలని పట్టుపట్టారు. అనంతరం నిరసనలు తెలుపుతూ విపక్షాలు లోక్‌సభ నుంచి వాకౌట్‌ చేశాయి.

మరోవైపు.. రాజ్యసభలో కూడా  వినేశ్‌ ఫోగట్‌ అనర్హత అంశంపై కేంద్ర ప్రభుత్వం వివరణ ఇవ్వాలని ప్రతిపక్ష ఇండియా కూటమి ఎంపీలు పట్టుపట్టారు.  

ఇదీ చదవండి: వినేష్‌ ఫోగట్‌ అనర్హత.. కుట్రా? కఠిన వాస్తవమా?

ఫోగట్‌కు న్యాయం చేయాలంటూ ఎంపీలు నినాదాలు చేశారు. అనంతరం రాజ్యసభ నుంచి విపక్ష ఎంపీలు వాకౌట్‌ చేశారు.  ఉభయ సభల నుంచి వాకౌట్‌ చేసిన విపక్ష ఎంపీలు పార్లమెంట్‌ ముందు రెజ్లర్ వినేశ్‌ ఫోగట్‌కు న్యాయం చేయాలని కోరుతూ నిరసన చేపట్టారు.

కోచ్‌లు, ఫిజియోథెరపిస్టులు ఏం చేశారు: పంజాబ్‌ సీఎం
వినేశ్‌ ఫోగట్ అనర్హతపై పంజాబ్‌ సీఎంభగవంత్‌ మాన్‌ సింగ్‌ స్పందించారు. ఆమె బరవును చెక్‌  చేయాల్సిన పని కోచ్‌, ఫిజియోథెరపిస్టులది. ఇప్పుడు అనర్హత పడింది. ఈ అన్యాయాన్ని  ఆపాలి. ఇంత పెద్ద స్థాయిలో ఇలాంటి పొరపాట్లు జరుగుతున్నాయి. కోచ్‌లు, ఫిజియోథెరపిస్టులకు లక్షల్లో జీతం ఇస్తున్నారు. వారేమైనా సెలవుల కోసం అక్కడికి వెళ్లారా?’ అని మండిపడ్డారు.

 

వినేశ్‌పై అనర్హత విచారకరం: రాహుల్‌ గాంధీ 
ప్రపంచ చాంపియన్ రెజ్లర్లను ఓడించి ఫైనల్స్‌కు చేరిన వినేశ్‌ భారత్‌కు గర్వకారణం. సాంకేతిక కారణాలతో అనర్హత వేటు పడటం విచారకరం. భారత ఒలింపిక్ సంఘం ఈ నిర్ణయాన్ని గట్టిగా సవాలు చేస్తుందని ఆమెకు న్యాయం చేస్తుందని ఆశిస్తున్నాం’అని రాహుల్‌ గాంధీ ఎక్స్‌లో అన్నారు. పట్టు వదలకుండా ఆమె మళ్లీ రంగంలోకి దిగుతుందనే నమ్మకం ఉంది. వినేశ్‌ దేశం గర్వించేలా చేశావు. దేశం మొత్తం మీకు మద్దతుగా నిలుస్తోంది తెలిపారు. 

కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి:  టీఎంసీ ఎంపీ శత్రుఘ్న సిన్హా
వినేశ్‌ ఫోగట్‌ చాలా అర్హత నిబద్ధత గల క్రీడాకారిణి. ఒలింపిక్స్‌లో రెజ్లింగ్ ఫైనల్స్‌కు చేరుకున్న మొదటి భారతీయ మహిళ. ఆమె ఒక ప్రపంచ ఛాంపియన్‌ను ఓడించారు. ఫైనల్స్‌లో మరొక ప్రపంచ ఛాంపియన్‌తో బరిలోకి దిగాల్సింది. ఆమె అనర్హత భారతీయులందరికీ, వినేష్ ఫోగట్ మద్దతుదారులందరికీ ఆందోళన కలిగిస్తోంది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి’అని అన్నారు.

అనర్హత వేటు నేపథ్యంలో రెజ్లర్‌ వినేశ్‌ ఫోగట్‌ పలువురు రాజకీయ నాయకులు అండగా నిలుస్తున్నారు. భారత దేశం మొత్తం గర్విస్తోందని పేర్కొంటున్నారు.

ప్యారిస్‌ ఒలింపిక్స్‌లో భారత్‌కు షాక్‌ తగిలింది. ఓవర్‌ వెయిట్‌ కారణంగా రెజ్లర్‌  వినేశ్‌ ఫొగట్‌పై అనర్హత వేటు పడింది. ఈ సమయంలో వినేశ్‌ ఫొగట్‌కు ప్రధాని మోదీ అండగా నిలిచారు. వినేశ్‌. మీరు ఛాంపియన్లకే ఛాంపియన్‌. భారత్‌కు గర్వకారణం. ప్రతీ ఒక్క భారతీయుడికి మీరే స్పూర్తి.  ఒలింపిక్స్‌లో మీ అనర్హత మమ్మల్ని ఎంతగానో బాధిస్తుంది. మీకు కలిగిన నిరాశను మాటల్లో చెప్పలేకపోతున్నాను. సవాళ్లను ఎదురొడ్డి పోరాడే స్వభావం మీది. మళ్లీ గెలుపు దిశగా ముందుకు సాగాలి‘ అంటూ మోదీ ట్వీట్‌లో పేర్కొన్నారు.

వినేశ్‌ ఫోగట్‌ అనర్హత విషయంలో ఆమెకు లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్‌ అధ్యక్షుడు మళ్లికార్జున ఖర్గేతో పాటు ఇండియా కూటమి నేతలు అండగా నిలుస్తున్నారు. ఈ విషయంపై విచారణ జరిపించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

సంబంధిత వార్త: వినేశ్‌ ఫొగట్‌పై వేటు: ప్రధాని మోదీ కీలక ఆదేశాలు


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement