కడియం, ఎర్రబెల్లి వాగ్వాదం
⇒ ఆంధ్రావాళ్ల మోచేతి నీళ్లు తాగుతున్నారన్న కడియం
⇒ నీవు ఆంధ్రా పార్టీలో పని చేయలేదా... కూర్చో అన్న ఎర్రబెల్లి
రాయపర్తి: డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, టీటీడీపీ శాసనసభా పక్ష నేత ఎర్రబెల్లి దయాకర్‌రావుల మధ్య ఆది వారం వాగ్వాదం చోటు చేసుకుంది. వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని కాట్రపల్లి పెద్దచెరువు పూడికతీత పనుల సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి పనులను ప్రారంభించి మాట్లాడుతుండగా, ఎమ్మెల్యే దయాకర్‌రావు వచ్చారు.
వెంటనే ఆయనను సభావేదికపైకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా దయాకర్‌రావు మాట్లాడుతూ మిషన్ కాకతీయను ఆహ్వానిస్తున్నామన్నారు. కానీ, పర్వతగిరి మండలంలోని ఏనుగల్లులో తనను దూషిస్తూ మాట్లాడడం సరికాదని కడియంను ఉద్దేశించి ఎర్రబెల్లి అన్నారు. తర్వాత దీనిపై డిప్యూటీ సీఎం కడియం మాట్లాడుతూ ‘ఏనుగల్లులో మాట్లాడింది నిజమే... అప్పుడు అదే మాట్లాడాను ఇప్పుడు అదే మాట్లాడుతున్నానన్నారు.
తెలంగాణ ఏర్పాటయ్యాక ఇంకా ఆంధ్రావాళ్ల మోచేతినీళ్లు తాగుతూ ఉన్నవాళ్లు ఉన్నారని అన్నా’నని చెబుతుండగా వెంటనే ఎర్రబెల్లి లేచి ‘నీవు ఆంధ్రాపార్టీలో పని చేయలేదా.. ఏం మాట్లాడుతున్నావ్.. కూర్చో’ అన్నారు. ఈ క్రమంలో ఇద్దరూ వాగ్వాదానికి దిగారు. పక్కనే ఉన్న టీఆర్‌ఎస్ కార్యకర్తలు ‘జై తెలంగాణ’ అని నినాదాలు చేశారు. టీడీపీ పార్టీ కార్యకర్తలు ‘జై తెలుగుదేశం’ అని నినాదాలు చేయడంతో వాగ్వాదం నిలిచిపోయింది.