రాయపర్తి ఎస్‌బీఐలో తస్కరణ
తమిళనాడు దొంగల ముఠా పనిగా అనుమానం
ఘటనా స్థలంలో గ్యాస్‌కట్టర్, తమిళనాడు అగ్గిపెట్టె లభ్యం
సాక్షి, వరంగల్/ రాయపర్తి: వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలోని ఎస్‌బీఐలో మంగళవారం తెల్లవారుజా మున భారీ దోపిడీ జరిగింది. భవనం కిటికీని తొలగించి లోపలికి వెళ్లిన దుండగులు బ్యాంకులోని మూడు లాకర్లలో ఒకదానిని గ్యాస్‌కట్టర్‌తో పగులగొట్టి దోపిడీకి పాల్పడ్డారు. బ్యాంకులోని అలారం సిస్టంను ధ్వంసం చేశారు. లాకర్‌లోని 19 కిలోలకుపైగా బంగారం చోరీచేసినట్లు గుర్తించారు. దీని విలువ సుమారు రూ.14.82 కోట్లు ఉంటుందని బ్యాంకు అధికారులు తెలిపారు. సీసీ కెమెరా పుటేజీకి సంబంధించిన డీవీఆర్‌ను కూడా అపహరించారు.
దోపిడీకి గురైన బ్యాంకు రాయపర్తి పోలీసు స్టేషన్‌కు 500 మీటర్ల దూరంలోనే ఉన్నా నిందితులు పక్కా ప్రణాళికతో దోపిడీకి పాల్పడ్డారు. మంగళవారం ఉదయం విధులకు హాజరైన మేనేజర్ సత్యనారాయణ బ్యాంకులో చోరీ జరిగిందని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వర్ధన్నపేట సీఐ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో రాయపర్తి, వర్ధన్నపేట ఎస్సైలు శ్రవణ్‌కుమార్, రాజు దర్యాప్తు చేపట్టారు. ఘటనా స్థలాన్ని వెస్ట్‌జోన్ డీసీపీ రాజమహేంద్రనాయక్ మంగళవారం రాత్రి సందర్శించారు. దోపిడీ జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు.
తమిళనాడు దొంగల పనే?
ఈ దోపిడీకి పాల్పడింది తమిళనాడుకు చెందిన దొంగల ముఠా అని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలంలో తమిళ భాషలో ఉన్న ‘జోకర్’ అగ్గిపెట్టె లభించడంతో ఆ దిశగా దర్యాప్తు ముమ్మరం చేశారు. బ్యాంకు లాకర్‌ను కట్ చేసిన గ్యాస్ కట్టర్‌ను కూడా దొంగలు అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. కేసు దర్యాప్తులో అది కీలకం కానుందని పోలీసులు తెలిపారు. ఈ గ్యాస్‌కట్టర్‌ను అమెజాన్ వెబ్‌సైట్‌లో కొనుగోలు చేసినట్టు గుర్తించిన పోలీసులు.. అది డెలివరీ అయిన చిరునామా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
25 రోజల క్రితం కర్ణాటకలోని దావణగెరె జిల్లా న్యామతి పట్టణంలోని ఎస్‌బీఐ బ్రాంచిలో దొంగలు రూ.12.95 కోట్ల విలువైన బంగారాన్ని దోచుకెళ్లారు. అచ్చం అదే తరహాలో ఇక్కడ కూడా దోపిడీ జరగటంతో రెండు దోపిడీలు చేసింది ఒకటే ముఠా అని అనుమానిస్తున్నారు.
బ్యాంకు అధికారుల అలసత్వంవల్లే: ఖాతాదారులు
మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన సీసీ కెమెరాలు పనిచేయటంలేదు. దీంతో దొంగలకు చోరీలు చేసి తప్పించుకోవటం తేలికైందని ఖాతాదారులు మండిపడుతున్నారు. మండల కేంద్రానికి బ్యాంకు దూరంగా ఉండటం.. గతంలో సెక్యూరిటీగార్డును నియమించినా ప్రస్తుతం తొలగించటం వల్లే దోపిడీ జరిగిందని చెప్తున్నారు. బ్యాంకులో బంగారం చోరీ అయినట్లు తెలుసుకున్న ఖాతాదారులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకొని ఆందోళనకు దిగారు.
ఎంతో నమ్మకంతో బ్యాంకులో సొమ్ము దాచుకుంటే ఇలా నిర్లక్ష్యం చేయడం ఏమిటని అధికారులను నిలదీశారు. మూడేళ్ల క్రితం ఇప్పుడు పగులకొట్టిన కిటికీ నుంచి కాకుండా మరో కిటికీని పగులగొట్టి దొంగలు బ్యాంకులోకి చొరబడ్డారు. కానీ, లాకర్‌ను ఓపెన్ చేయలేక తిరిగి వెళ్లిపోయారు. పోలీసులు రాత్రిపూట పెట్రోలింగ్ నిర్వహించకపోవటం కూడా దోపిడీలకు కారణమవుతోందని స్థానికులు అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment