
జన్మభూమిలో జగడం
కడప కార్పొరేషన్:
కడప నగరంలో సోమవారం నిర్వహించిన ఁజన్మభూమి* కార్యక్రమం రసాభాసగా సాగింది. టీడీపీ, వైఎస్సార్‌సీపీ నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి... కడప నగరం 27వ డివిజన్‌లోని గౌస్ నగర్ మున్సిపల్ ఉర్దూ ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన ఁజన్మభూమి- మాఊరు* కార్యక్రమంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకొన్నాయి.
కడప ఎమ్మెల్యే అంజద్‌బాషా మాట్లాడుతుండగా టీడీపీ నగర అధ్యక్షుడు బాలక్రిష్ణయాదవ్ మైక్ లాక్కోవడంతో గొడవ మొదలైంది. ఇరుపార్టీల నాయకుల మధ్య తీవ్ర వాగ్వివాదం, తోపులాట చోటు చేసుకుంది. టీడీపీ నాయకులు వారి పార్టీ నాయకులకు ఫోన్లు చేసి మరీ పిలుపించుకున్నారు. మరోవైపు వైఎస్‌ఆర్ సీపీ కార్పొరేటర్లు, నాయకులు కూడా అదే స్థాయిలో గుమికూడారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
అధికారం మాది..ప్రభుత్వంపై చేసిన విమర్శలకు సమాధానం చెప్పాల్సిందేనంటూ బాలక్రిష్ణయాదవ్ పట్టుబట్టి రెండవసారి మాట్లాడారు. ఆ తర్వాత మేయర్, ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతున్నప్పుడు కూడా గొడవ చేశారు. అయినా మేయర్, ఎమ్మెల్యేలు సంయమనం పాటించారు. స్థానిక కార్పొరేటర్ షేక్ షహనాజ్, వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు మాసీమ బాబు, జహీర్, ఎస్‌ఎండీ షఫీ, అజ్మతుల్లా, శివకేశవ, కార్పొరేటర్లు హరూన్‌బాబు, చైతన్య, చల్లా రాజశేఖర్, జమ్మిరెడ్డి, టీడీపీ నాయకులు అమీర్‌బాబు, జయకుమార్, నూర్ తదితరులు పాల్గొన్నారు.
ఇది ప్రజాస్వామ్యమేనా!
మనం ప్రజా స్వామ్యంలో ఉన్నామో...నియంతపాలనలో ఉన్నామో అర్థం కాలేదని ఎమ్మెల్యే ఎస్‌బీ అంజద్‌బాషా ఆవేదన వ్యక్తం చేశారు. బాలక్రిష్ణయాదవ్ 45 నిముషాలపాటు మాట్లాడితే తాము ఓపికగా విన్నామన్నారు. తమకు అవకాశం వచ్చాక మాట్లాడుతుంటే మైక్ లాక్కోని దౌర్జన్యం చేయడం సరికాదని చెప్పారు.
తనను ప్రజలు 45వేల మెజార్టీతో ఎమ్మెల్యే గెలిపించారని, వారి సమస్యలపై ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యేగా మాట్లాడుతుంటే మైక్ లాక్కుంటారా... అని ఆగ్రహం వ్యక్తం చేశారు. గౌస్ నగర్‌లో గతంలో 350 పింఛన్లు ఇస్తుండగా, ప్రస్తుతం 180 మందికే ఇస్తున్నారని, వైఎస్‌ఆర్‌సీపీకి ఓట్లు వేశారనే అక్కసుతోనే ఆ పింఛన్లన్నీ తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు.
రాజకీయాలకు వేదిక కాదు
రాజకీయాలకు ఇది వేదిక కాదని మేయర్ కె. సురేష్‌బాబు టీడీపీ నాయకులకు సూచించారు. ప్రభుత్వ కార్యక్రమమైనందునే జన్మభూమి- మాఊరుకు హాజరయ్యామన్నారు. పార్టీలున్నది ప్రజలకు సేవ చేయడానికే అని, అర్హులందరికీ న్యాయం చేయడానికి అందరం సమిష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా పింఛన్ కోల్పోయిన పలువురు వృద్ధులు, వితంతువులను వారు మీడియాకు చూపారు.