వాగ్వాదానికి దిగిన ఇరు పార్టీల నాయకులు
అయిజ (అలంపూర్) : రైతుబంధు, పాస్‌పుస్తకాల పంపిణీ గురువారం మొదటిరోజు అయిజ మండలం ఉత్తనూరు, ఉప్పల గ్రామాల్లో జరిగింది. ఉత్తనూరులో ప్రశాంతంగా ముగిసినా ఉప్పలలో మాత్రం ఘర్షణ వాతావరణం నెలకొంది. 11 గంటలకు ప్రారంభించాల్సిన కార్యక్రమం 12 గంటల తర్వాత కూడా కాకపోవడంతో అక్కడకు వచ్చిన రైతులు అసహనానికి గురయ్యారు. రైతులు ఎండకు ఇబ్బంది పడుతున్నారని కార్యక్రమాన్ని ప్రారంభించాలని అలంపూర్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు రైతులతో కలిసి ప్రత్యేక అధికారి సోమిరెడ్డి, డిప్యూటి తహసీల్దార్ నరేష్, ఎంపీడీఓ నాగేంద్రలపై ఒత్తిడి పెంచారు.
జెడ్పీ చైర్మన్ బండారు భాస్కర్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరవుతారని అంతవరకు వేచి ఉండాలని టీఆర్‌ఎస్ నాయకులు, అధికారులను కోరారు. దీంతో ఇరు పార్టీల మధ్య అధికారులు ఇబ్బంది పడ్డారు. చూస్తుండగానే కాంగ్రెస్, టీఆర్‌ఎస్ పార్టీల నాయకులకు వాగ్వాదం జరిగింది. టీఆర్‌ఎస్ పార్టీ నాయకులు వేదికపై ఉన్నారుకదా కావాలంటే మీరు కార్యక్రమాన్ని ప్రారంభించండి అని కాంగ్రెస్ నాయకులు అన్నా రు.
జెడ్పీ చైర్మన్ వచ్చేంతవరకు ఓపిక పట్టలేరా, ఎమ్మెల్యే ఎన్నో సార్లు కార్యక్రమాలకు ఆలస్యంగా వస్తే మేము ఓపిక పట్టామని టీఆర్‌ఎస్ నాయకులు చెప్పుకొచ్చారు. దానితో వాతావరణం వేడెక్కింది. పోలీసులు కలుగజేసుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కాసేపటికే జెడ్పీ చైర్మన్ రావడంతో గొడువ సద్దుమనిగింది. అనంతరం ఇద్దరు కలిసి నాయకులు వేదికపై ఒకపిపై మరొకరు విమర్శలు చేసుకున్నారు. అనంతరం ఇద్దరు కలిసి రైతులకు చెక్కులు, పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment