కరీంనగర్‌లో టార్గెట్‌ గులాబీ! | BJP Targeting Other Party Leaders In Karimnagar District | Sakshi
Sakshi News home page

కరీంనగర్‌లో టార్గెట్‌ గులాబీ!

Published Mon, Sep 23 2019 12:04 PM | Last Updated on Mon, Sep 23 2019 12:07 PM

BJP Targeting Other Party Leaders In Karimnagar District - Sakshi

కరీంనగర్‌ మాజీ మేయర్‌ డి.శంకర్‌ను బీజేపీలోకి ఆçహ్వానిస్తున్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

సాక్షి , కరీంనగర్‌: తెలంగాణ ఉద్యమానికి ఊపిరినిచ్చిన కరీంనగర్‌లో అధికార టీఆర్‌ఎస్‌ లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. పార్లమెంటు ఎన్నికల్లో అనూహ్యంగా కరీంనగర్‌ లోక్‌సభ సీటును గెలుచుకున్న కమలనాథులు ఇక్కడ లీడర్లు, క్యాడర్‌తో బలమైన శక్తిగా ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితిని దెబ్బ కొట్టాలనే ఏకైక ఎజెండాతో అడుగులు వేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో మంథని మినహా 12 నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, జిల్లా, మండల పరిషత్‌ చైర్‌పర్సన్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులతో గ్రామస్థాయి వరకు పటిష్టంగా ఉంది. అయితే పార్లమెంటు ఎన్నికల్లో గెలుపు ఇచ్చిన బలంతో ఉన్న బీజేపీ తొలుత రాబోయే మునిసిపల్‌ ఎన్నికల్లో శక్తిని చాటుకోవాలనే పట్టుదలతో ఉంది.

2023 శాసనసభ ఎన్నికలే లక్ష్యం అని చెబుతున్న కాషాయ నేతలు అందుకోసం గ్రామస్థాయి నుంచి గ్రౌండ్‌ ప్రిపేర్‌ చేసుకునే పనిలో పడ్డారు. ఇందుకోసం మూడంచెల వ్యూహాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే బీజేపీ నుంచి గెలిచిన ఎంపీ బండి సంజయ్‌కుమార్‌ ఈ మేరకు కార్యాచరణ ప్రారంభించారు. మహారాష్ట్ర గవర్నర్‌గా ఐదేళ్ల పదవీకాలం పూర్తి చేసుకొని ఇటీవలే తిరిగి బీజేపీలో చేరిన కరీంనగర్‌ మాజీ ఎంపీ సీహెచ్‌.విద్యాసాగర్‌రావును కూడా త్వరలో సీన్‌లోకి తీసుకురావాలని యోచిస్తున్నారు. భవిష్యత్తులో పార్టీ అధికారంలోకి వస్తే ‘సాగర్‌జీ’ సారథ్యంలో రాష్ట్రం ముందుకు సాగుతుందనే ప్రచారం కూడా ఓ వర్గం ప్రారంభించింది.

మూడంచెల వ్యూహంతో టీఆర్‌ఎస్‌పై దాడి.. 
పార్టీని బలోపేతం చేసుకుంటూనే, టీఆర్‌ఎస్, ఆ పార్టీ నేతలపై ప్రజల్లో ఉన్న అభిమానాన్ని ప్రణాళికాబద్ధంగా పలచన చేయడం కోసం మూడంచెల వ్యూహాన్ని కరీంనగర్‌ నుంచే అమలు చేయాలని కమలనాథులు నిర్ణయించుకున్నారు. అందులో మొదటిది అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఇతర పార్టీల్లో పేరున్న నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులను బీజేపీలో చేర్చుకోవడం. రెండోది టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, మంత్రులను టార్గెట్‌ చేస్తూ అవినీతి, అక్రమాలపై విస్తృతంగా ప్రచారం చేయడం, మూడోది బూత్‌స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీని బలోపేతం చేయడం. త్రివిధ మార్గాల్లో కరీంనగర్‌ ఉమ్మడి జిల్లాలో పార్టీని టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయ శక్తిగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు.

ఇందులో మొదటి వ్యూహంగా ఇతర పార్టీల నుంచి ముఖ్యమైన నేతలను బీజేపీలో చేర్చుకునే కార్యక్రమాన్ని ప్రారంభించారు. గత లోక్‌సభ ఎన్నికల్లో టికెట్‌ రాక అసంతృప్తితో ఉన్న పెద్దపల్లి మాజీ ఎంపీ గడ్డం వివేక్, అసెంబ్లీ ఎన్నికల్లో రామగుండం నుంచి ఓటమి పాలైన మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ కాషాయ తీర్థం పుచ్చుకోగా, మాజీ మంత్రులు ఇనుగాల పెద్దిరెడ్డి, సుద్దాల దేవయ్య కూడా ఆపార్టీలో చేరారు. తాజాగా శుక్రవారం కాంగ్రెస్‌కు చెందిన కరీంనగర్‌ మాజీ మేయర్‌ డి.శంకర్, కన్న కృష్ణ, పి.భూమయ్య, సాయికృష్ణతోపాటు పలువురు నేతలు కేంద్ర హోంశాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. కరీంనగర్‌ కార్పొరేషన్‌ పరిధిలో మరికొందరు మాజీ కార్పొరేటర్లను, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా మరికొందరు ముఖ్య నాయకులను బీజేపీలోకి తీసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు.

టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులే టార్గెట్‌గా..  
ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో ఎంపీ సంజయ్‌ మంత్రులు, శాసనసభ్యులను టార్గెట్‌ చేసుకుని విమర్శలు ఎక్కుపెడుతున్నారు. 2009లో వెలుగు చూసిన గ్రానైట్‌ సీనరేజి అంశాన్ని తిరిగి వెలుగులోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. టీఆర్‌ఎస్‌ నాయకులకు గ్రానైట్‌ వ్యాపారంతో సంబంధం ఉందని, వందల కోట్ల సీనరేజీని ప్రభుత్వానికి ఎగ్గొట్టారని విమర్శిస్తూ పలు వేదికలపై మాట్లాడుతున్నారు. ఈ మేరకు విచారణ జరిపించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులను కలిసి ఫిర్యాదు చేశారు.

గురువారం సిరిసిల్లలో నలుగురు మంత్రులకు ఈ అవినీతి, అక్రమాలతో సంబంధం ఉందని మీడియా సమక్షంలో ఆరోపించారు. అయితే ఇది పాత సమస్య కావడంతో టీఆర్‌ఎస్‌ నేతలు కూడా దీటుగానే ప్రతివిమర్శలు చేస్తున్నారు. సంజయ్‌ బ్లాక్‌మెయిల్‌ రాజకీయాలకు పాల్పడుతున్నారనే ప్రచారాన్ని టీఆర్‌ఎస్‌ మాజీ కార్పొరేటర్లు ప్రారంభించారు. స్వయంగా మంత్రి గంగుల కమలాకర్‌ సైతం సంజయ్‌ను విమర్శించడం గమనార్హం. గ్రానైట్‌ సమస్యతోపాటు స్మార్ట్‌సిటీ టెండర్ల అంశాన్ని సంజయ్‌ ఇప్పటికే లేవనెత్తగా, ఇతర ప్రాజెక్టుల్లో టీఆర్‌ఎస్‌ ప్రజా ప్రతినిధుల జోక్యం, కాంట్రాక్టర్లతో సంబంధాలు అనే కోణంలో జనంలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు.

క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతమే పెద్ద సమస్య 
పార్లమెంటు ఎన్నికల్లో ప్రధాని నరేంద్రమోదీ హవా ప్రధాన పాత్ర పోషించగా, సంజయ్‌పై ఉన్న సానుభూతి కరీంనగర్‌ పార్లమెంటు పరిధిలో పనిచేసింది. కొన్నేళ్లుగా పార్టీలో నెలకొన్న స్తబ్దతతో ఉమ్మడి జిల్లాలో 2004 వరకు ఉన్న కేడర్‌ కూడా చెల్లాచెదురైంది. మండలస్థాయిల్లో సరైన నాయకత్వం లేదు. నియోజకవర్గాలస్థాయి నాయకులుగా చలామణి అవుతున్న నాయకులకు ప్రజలతో సంబంధాలు తగ్గాయి. ఈ నేపథ్యంలో వలస నాయకులపైనే ప్రధానంగా ఆశలు పెట్టుకున్న బీజేపీ క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడం సాధ్యమేనా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. పెద్దపల్లి నియోజకవర్గంలో 1999లో ఎమ్మెల్యేగా గెలిచిన గుజ్జుల రామకృష్ణారెడ్డికి గత అసెంబ్లీ ఎన్నికల్లో డిపాజిట్‌ దక్కలేదు.

టీఆర్‌ఎస్‌ నుంచి టికెట్టు రాక బీజేపీ నుంచి పోటీ చేసిన చొప్పదండి మాజీ ఎమ్మెల్యే శోభకు పెద్ద పరాభవం ఎదురైంది. దీనికి కారణం బీజేపీకి క్షేత్రస్థాయిలో కేడర్‌ లేకపోవడమే. ఇప్పుడు పార్టీలో చేరుతున్న నాయకులు టీఆర్‌ఎస్‌కు బీజేపీ ప్రత్యామ్నాయంగా భావించి వస్తున్నవారే తప్ప బీజేపీ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేసే విధానం తెలిసిన వారు కాదు. ఈ పరిస్థితుల్లో తొలుత కరీంనగర్, రామగుండం  కార్పొరేషన్‌లతోపాటు ఇతర మునిసిపాలిటీల్లో పేరున్న నాయకులను పార్టీలో చేర్చుకుని తద్వారా పార్టీని బలోపేతం చేయాలని భావిస్తున్నారు. ఈ వ్యూహం విజయవంతమైతే నియోజకవర్గాల స్థాయిలో కూడా అమలు చేయాలనేది వ్యూహం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement