ఎన్నికల వేళ జిల్లాకు ప్రముఖులు తరలి రానున్నారు. పదిహేను రోజుల పాటు ప్రచారంతో హోరెత్తిం చనున్నారు. రాష్ట్ర నేతలతో పాటు జాతీయ నాయకులు సైతం బహిరంగ సభలు, రోడ్‌షోలు నిర్వహించనున్నారు. ఇందుకోసం అన్ని పార్టీల నేతలు ఏర్పాట్లు చేసుకుం టున్నారు. ఎన్నికల్లో తొలి ఘట్టమైన నామినేషన్ల దాఖలు గడువు సోమవారంతో ముగియనుంది. నామినేషన్ల ప్రక్రియ పూర్తవగానే అభ్యర్థులంతా ముఖ్య నేతలను రంగంలోకి దించనున్నారు.
సాక్షి, కామారెడ్డి: అభ్యర్థుల తరపున ఆయా పార్టీల ముఖ్య నేతలు, ప్రముఖులు ప్రచారం చేయడానికి జిల్లాకు వరుస కడుతున్నారు. ఇప్పటికే టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ముఖ్య నేతల పర్యటనల షెడ్యూల్ ఖరారైంది. మరికొందరు ప్రముఖుల ప్రచారానికి సంబంధించి తేదీలు ఖరారు కావాల్సి ఉంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అగ్ర నాయకులు కామారెడ్డి జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్ నియోజక వర్గాల్లో ప్రచార సభల్లో పాల్గొనడానికి వస్తారని, అయితే వారి పర్యటన తేదీలు ఇంకా ఖరారు కాలేదని ఆ పార్టీ నేతలు తెలిపారు.
20న సీఎం కేసీఆర్ రాక..
టీఆర్‌ఎస్ అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాలో తొలి ఎన్నికల ప్రచార సభ ఈ నెల 20న ఎల్లారెడ్డిలో జరుగనుంది. ఎల్లారెడ్డి టీఆర్‌ఎస్ అభ్యర్థి ఏనుగు రవీందర్‌రెడ్డి తరఫున బహిరంగ సభలో సీఎం ప్రసంగించనున్నారు. సీఎం రాక సందర్భంగా టీఆర్‌ఎస్ కార్యకర్తలను భారీగా సమీకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎల్లారెడ్డి పట్టణంలోని బాన్సువాడ రోడ్డులో సభతో పాటు హెలిప్యాడ్ కోసం ఇప్పటికే పోలీసు అధికారులు స్థలాలను పరిశీలించారు. పనులు కూడా మొదలు పెట్టారు. నియోజక వర్గంలోని ఆయా మండలాల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలను తరలించడానికి నాయకులు సన్నాహాలు చేస్తున్నారు.
విజయశాంతి రోడ్‌షో..
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరఫున ఆ పార్టీ స్టార్ క్యాంపెయినర్, సినీ నటి విజయశాంతి ఈ నెల 20న కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజక వర్గాల్లో ప్రచారం నిర్వహించనున్నారు. కాంగ్రెస్ అభ్యర్థులు షబ్బీర్‌అలీ, జాజాల సురేందర్ తరపున రెండు నియోజకవర్గాల్లో రోడ్‌షోలు నిర్వహించనున్నారు. దోమకొండ మండలంతో పాటు కామారెడ్డి పట్టణం, ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని పలు మండలాల్లో రోడ్‌షోలు ఉంటాయని కాంగ్రెస్ నేతలు తెలిపారు. విజయశాంతి పర్యటనకు మహిళలు ఎక్కువ మందిని తరలించాలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.
పరిపూర్ణానంద స్వామి రాక..
ఎల్లారెడ్డి బీజేపీ అభ్యర్థి బాణాల లక్ష్మారెడ్డి తరఫున ఈ నెల 22న ఎల్లారెడ్డి నియోజక వర్గ కేంద్రంలో జరిగే బహిరంగ సభలో పరిపూర్ణానంద స్వామి పాల్గొంటారు. బీజేపీలో చేరిన తరువాత పరిపూర్ణానంద స్వామి ఇటీవల కామారెడ్డి నియోజక వర్గ కేంద్రంలో జరిగిన బహిరంగ సభలో తొలి రాజకీయ ప్రసంగం చేశారు. ఎల్లారెడ్డిలో పార్టీ అభ్యర్థి తరపున ప్రచారం నిర్వహించేందుకు గాను ఈ నెల 22న రానున్నారు. పరిపూర్ణానంద సభకు భారీ ఎత్తున జనసమీకరణ చేయడానికి బీజేపీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు.
అమిత్‌షా, యూపీ సీఎం సైతం..
కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించడానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి వచ్చే నెల 3, 5 తేదీలలో జిల్లాలో çపర్యటించనున్నారు. 3న బీజేపీ చీఫ్ అమిత్‌షా కామారెడ్డిలో రోడ్‌షోలో పాల్గొననున్నారు. అలాగే 5న ఎల్లారెడ్డిలో నిర్వహించే బహిరంగ సభలో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ప్రసంగించనున్నారు. ముఖ్య నేతల పర్యటనలను విజయవంతం చేయడానికి ఆ పార్టీ నేతలు కసరత్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment