ఎన్నికల్లో ప్రజలే గెలవాలి | KCR Said People Shold Win In Elections | Sakshi
Sakshi News home page

ఎన్నికల్లో ప్రజలే గెలవాలి

Published Tue, Nov 27 2018 1:59 PM | Last Updated on Tue, Nov 27 2018 4:01 PM

KCR Said People Shold Win In Elections - Sakshi

ప్రసంగిస్తున్న సీఎం కేసీఆర్‌

సాక్షి, మోర్తాడ్‌/బోధన్‌: ఎన్నికల్లో అభ్యర్థులు, పార్టీలు గెలవడం ముఖ్యం కాదని, ప్రజలు గెలవడమే ముఖ్యమని టీఆర్‌ఎస్‌ అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. ప్రజలు గెలిస్తేనే ప్రజాస్వామ్యం బలపడుతుందని ఉద్ఘాటించారు. ప్రజలు గెలవడం అంటే వారికి మంచి చేసే వారు గెలవడం అని తెలిపారు. వచ్చేది టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌ సోమవారం నిజామాబాద్‌ జిల్లాలో సుడిగాలి పర్యటన చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్‌ రూరల్, బోధన్, మోర్తాడ్‌లలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. పార్టీ అభ్యర్థులు బాజిరెడ్డి గోవర్ధన్, షకీల్, ప్రశాంత్‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.

ఎన్నికల సమయంలో ఏ పార్టీ ప్రచారం చేసినా, ఎవరు మాట్లాడినా సావధానంగా వినాలని, ఇంటికి వెళ్లి తీరిగ్గా కూర్చుని ఆయా ఆంశాలపై చర్చ చేయాలని సూచించారు. తమ కోసం ఎవరు మంచి చేస్తున్నారు, ఎవరు చెడు చేస్తున్నారో గ్రహించి వారికే ఓటు వేయా లని కోరారు. 2014 ఎన్నికల్లో ప్రజలు టీఆర్‌ఎస్‌ను బలపరిచారని, ఈ ఎన్నికల్లోనూ తమ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే మరిన్ని విలువైన పనులు చేస్తామని హమీ ఇచ్చారు. కాంగ్రెస్‌ 40 ఏళ్ల పాలనలో, 17 ఏళ్ల టీడీపీ హయాంలో ఏమి ఉద్ధరించ లేదని విమర్శించారు. ఐదున్నర దశాబ్దాలుగా పరిష్కారం కాని సమస్యలను నాలుగేళ్లలో తమ ప్రభుత్వం పరిష్కరించిందన్నారు.

 ఊహించని పథకాలను తెచ్చాం.. 

తమ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఎవరూ ఊహించని సంక్షేమ పథకాలను అమలు చేశామని కేసీఆర్‌ తెలిపారు. కల్యాణలక్ష్మి, పింఛన్లు, 24 గంటల కరెంట్‌ సరఫరా తదితర అంశాల గురించి ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. 2014 ఎన్నికల సమయంలో బీడీ కార్మికులకు భృతి కింద రూ.వెయ్యి ఇస్తామని మోర్తాడ్‌ సభలోనే ప్రకటించానని, ఆ మాటను నిలబెట్టుకున్నానని తెలిపారు. మళ్లీ తాము అధికారంలోకి రాగానే ఈ మొత్తాన్ని రూ.2,016కు పెంచుతామన్నారు. బీడీ పరిశ్రమపై ఆధారపడిన కార్మికులందరికీ జీవన భృతిని అందించడానికి చర్యలు తీసుకుంటామని హమీ ఇచ్చారు. 

చంద్రబాబు, కిరణ్‌లపై ధ్వజం

 కాంగ్రెస్, టీడీపీలు గతంలో మాయా మశ్చీంద్ర కథలు చెప్పి కాలం వెళ్లదీశాయని సీఎం విమర్శించారు. టీడీపీ హయాంలో కరెంటు అడిగిన కర్షకులపై లాఠీచార్జీ చేయించడం, కాల్పులు జరిపించారని గుర్తు చేశారు. అలాగే, కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో విద్యుత్‌ సమస్యను పరిష్కరించకుండా తెలంగాణ ప్రాంతాన్ని అవహేళన చేశారని తెలిపారు. కాంగ్రెస్, టీడీపీలు దొందు దొందే అని విమర్శించారు. వారు చేయని పనిని తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత తాము చేసి చూపించామని కేసీఆర్‌ స్పష్టం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పెద్ద పెద్ద మాట లు చెబుతున్నాడు కాని తన రాష్ట్రంలో తెలంగాణ మాదిరి 24 గంటల నిరంతర విద్యుత్‌ను ఎందుకు అందించడం లేదని విమర్శించారు.

 జల సిరులు 

నిజాంసాగర్‌ ప్రాజెక్టు ఆయకట్టు కింద 2 లక్షల ఎకరాల భూములు ఎండిపోయే దశలో ఉంటే సింగూర్‌ నుంచి నిజాంసాగర్‌కు నీటిని మళ్లించి రైతులకు అండగా నిలిచామని గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్‌ వాళ్లు మాత్రం జహీరాబాద్‌లో ధర్నా చేసి కుటిల రాజకీయం చేశారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి వరద కాలువ ద్వారా రివర్స్‌ పంపింగ్‌ చేసి శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు 365 రోజుల పాటు నిండు కుండలా ఉండేలా చేస్తున్నామని సీఎం తెలిపారు. రోజుకో టీఎంసీ నీటిని తెచ్చి కాకతీయ కాలువ, వరద కాలువ, లక్ష్మి, ఇతర కాలువలను నీటితో నింపి మత్స్యకారులకు కూడా జీవనోపాధిని మెరుగుపరుస్తామని తెలిపారు.

 మళ్లీ మా ప్రభుత్వమే 

రాబోయేది టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనని కేసీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్, ఇతర పార్టీలు వ్యతిరేకించిన కాళేశ్వరం ప్రాజెక్టు జూన్‌ తర్వాత పూర్తి కాబోతుందని, ఆ ప్రాజెక్టు ప్రారంభమైతే నిజాంసాగర్‌ ప్రాజెక్టు ఎప్పుడూ ఎండిపోదని చెప్పారు. పుష్కలంగా సాగు నీరు వస్తుందని, బోధన్‌ ప్రాంతంలో రెండు పంటలు పండే అవకాశం కలుగుతుందన్నారు. ఎప్పుడో పాడుబడిన నిజాంసాగర్‌ కాలువను ఆధునికీకరించి చిట్టచివరి భూముల వరకు నీళ్లందించేందుకు మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీ కవిత, మాజీ ఎమ్మెల్యే షకీల్‌ అహ్మద్‌ కాలువల వెంబడి తిరిగి పంటలను కాపాడరన్నారు. ఎంపీ కవిత,

సీఎం ప్రసంగం చిత్రీకరణ

 సాక్షి, కామారెడ్డి టౌన్‌: ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం కామారెడ్డి జిల్లాకేంద్రంలోని సీఎస్‌ఐ మైదానంలో నిర్వహించిన సభలో సీఎం కేసీఆర్‌ ప్రసంగించారు. ఆయన ప్రసంగాన్ని జిల్లా ఎన్నికల పరిశీలకులు వీడియో చిత్రీకరించారు.

సీఎం ప్రసంగాన్ని చిత్రీకరిస్తున్న ఎన్నికల పరిశీలకఎన్నికల్లో ప్రజలే గెలవాలి


 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement