నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ సభలో మాట్లాడుతున్న సీఎం కేసీఆర్, ప్రజలకు అభివాదం చేస్తున్న టీఆర్‌ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్,
సాక్షి, నిజామాబాద్: కాకతీయ కాలువ లీకేజీ నీటి ఆధారంగా సాగు చేసుకుంటున్న భూములతో పాటు, రానున్న ఎండా కాలంలో కూడా మెట్‌పల్లి వరకు ఉన్న ఆయకట్టుకు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి సాగు నీటిని అందిస్తామని టీఆర్‌ఎస్ అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు హామీనిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఆయన జిల్లాలో సుడిగాలి పర్యటన చేశారు. డిచ్‌పల్లి (నిజామాబాద్ రూరల్), బోధన్, మోర్తాడ్ (బాలొండ) బహిరంగసభల్లో పాల్గొని ప్రసంగించారు. స్థానిక అంశాలను ప్రస్తావిస్తూనే..
అధికారంలోకి వచ్చిన వెంటనే చేపట్టనున్న అభివృద్ధి పనులను ప్రజలకు వివరించారు. మోర్తాడ్‌లో కేసీఆర్ మాట్లాడుతూ.. ఎస్సారెస్పీ పునర్జీన పథకం పనులు పూర్తయితే ఎస్సారెస్పీ నిండుకుండలా మారుతుందని అన్నారు. ఆయకట్టు భూములకు నీరు అందించే బాధ్యతను తానే తీసుకుంటున్నానని భరోసా ఇచ్చారు. భీమ్‌గల్‌లో వంద పడకల ఆసుపత్రి నిర్మిస్తామని, బాల్కొండకు డిగ్రీ కళాశాలను మంజూరు చేస్తామని హామీలు గుప్పించారు. భీమ్‌గల్ బస్సుడిపో ఏర్పాటు అంశాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు.
జక్రాన్‌పల్లిలో ఎయిర్‌స్ట్రిప్..
జక్రాన్‌పల్లిలో ఎయిర్‌స్ట్రిప్‌ను ఏర్పాటు చేస్తామని కేసీఆర్ హామీనిచ్చారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం పరిధిలోని డిచ్‌పల్లి వద్ద జరిగిన బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ జిల్లాకు వచ్చేసారి విమానంలోనే దిగుతానని పేర్కొన్నారు. వచ్చే ఏడాది నాటికి నియోజకవర్గంలో 1.10 లక్షల ఎకరాలకు సాగునీటిని అందిస్తామన్నారు. నియోజకవర్గంలో 65 వేల మంది ఆసరా పింఛను లబ్ధిదారులు ఉన్నారన్న కేసీఆర్ టీఆర్‌ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ గెలుపు ఖాయమ ని అన్నారు. ఒక్క రూరల్ నియోజకవర్గంలోనే 50 గిరిజన తండాలను గ్రామపంచాయతీలుగా చేశామని, గిరిజనులంతా సర్పంచ్‌లుగా ఎన్నికై స్వయంగా పాలన చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించిందని పేర్కొన్నారు. రైతుబంధు చెక్కులు, పట్టాదారు పాసుపుస్తకాలు రాని రైతులందరికీ ఆరు నెలల్లో పంపిణీ చేస్తామన్నారు. తనతో పాటు, ప్రభుత్వ ముఖ్యకార్యదర్శితో జిల్లాకు స్వయంగా వచ్చి అందజేస్తామని అన్నారు.
బోధన్ ప్రాంతానికి రెండు పంటలకు సాగునీరు..
కాళేశ్వరం ప్రాజెక్టు పనులు వచ్చే జూన్ నాటికి పూర్తి చేస్తామని కేసీఆర్ పేర్కొన్నారు. బోధన్‌లో జరిగిన బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు పనులు పూర్తయితే నిజాంసాగర్ నిండుకుండలా మారుతుందని, బోధన్ ప్రాంతంలో రెండు పంటలకు సాగునీరందుతుందని ధీమా వ్యక్తం చేశారు. నిజాంసాగర్ ప్రధాన కాలువను ఆధునీకరించామని ఆయకట్టు చివరి భూములకు సాగునీరందిస్తున్నామన్నారు.
సుడిగాలి పర్యటన విజయవంతం..
టీఆర్‌ఎస్ అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు జిల్లాలో సుడిగాలి పర్యటన విజయవంతం కావడం ఆ పార్టీ అభ్యర్థులు, శ్రేణుల్లో నూతన ఉత్సాహం నింపింది. ఎన్నికల ప్రచారంలోభాగంగా ఒకే రోజు జిల్లాలో డిచ్‌పల్లి (నిజామాబాద్ రూరల్), బోధన్, మోర్తాడ్ (బాల్కొండ) నియోజకవర్గాల్లో జరిగిన బహిరంగసభల్లో పాల్గొన్నారు. ఈ సభలకు పెద్ద ఎత్తున శ్రేణులు, ఆయా నియోజకవర్గాల వాసులు తరలివచ్చారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో బహిరంగసభను ముగించుకుని హెలికాప్టర్‌లో మధ్యాహ్నం 1.20 గంటలకు డిచ్‌పల్లి బహిరంగసభకు చేరుకున్నారు. ఈ సభకు వేలాదిగా తరలివచ్చిన జనాలనుద్దేశించి సుమారు 20 నిమిషాల పాటు ప్రసంగించారు.
ఇక్కడి నుంచి మ ధ్యాహ్నం 2 గంటలకు బోధన్‌కు చేరుకున్నారు. అక్కడి బహిరంగసభలో పాల్గొన్న అనంతరం మోర్తాడ్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగసభకు చేరుకున్నారు. అక్కడి నుంచి కరీంనగర్ జిల్లాకు వెళ్లారు. ఈ సభలో నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత, ఎంపీ కేశవరావు, మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి, టీఆర్‌ఎస్ అభ్యర్థులు వేముల ప్రశాంత్‌రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ ఆమేర్, ఎమ్మెల్సీలు రాజేశ్వర్‌రావు, వీజీ గౌడ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment