బాన్సువాడ సభలో పాల్గొన్న మహిళలు
సాక్షి, బాన్సువాడ: ఎన్నికల ప్రచారంలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం బాన్సువాడలో నిర్వహించిన ఆశీర్వాద సభ విజయవంతమైంది. ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తల్లో హర్షం వ్యక్తమవుతోంది. సభలో బాన్సువాడకు సీఎం వరాల జల్లులు కురిపించారు. సీఎం పర్యటన కోసం గత వారం రోజులుగా మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తనయులు పోచారం భాస్కర్‌రెడ్డి, పోచారం సురేందర్‌రెడ్డి రేయింబవళ్లు కష్టపడి ఏర్పాట్లు చేయించారు. సుమారు 40 వేల మంది వరకు జనం రాగా, సభా స్థలి నిండిపోయి, చాలా మంది బయటే ఉండిపోయారు. అంచనాలకు మించి జనం రావడంతో సభా ప్రాంగణం సరిపోక, భవనాల పైకి ఎక్కి సీఎం ప్రసంగాన్ని ఆలకించారు. ఉదయం 11 గంటలకు రావాల్సిన సీఎం 12.25 గంటలకు బాన్సువాడకు చేరుకున్నారు.
భారీ బందోబస్తు
సీఎం పర్యటన సందర్భంగా మూడు రోజులుగా పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. కేసీఆర్ ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పర్యటించడంతో పోలీసులు వారం రోజుల నుంచి బిజీగా ఉన్నారు. ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తూ, బందోబస్తు నిర్వహించారు. బాన్సువాడ డీఎస్పీ యాదగిరి పర్యవేక్షణలో సుమారు 2 వేల మంది పోలీసులు భద్రతా ఏర్పాట్లలో పాలు పంచుకున్నారు. సభ సజావుగా ముగియడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.
అద్భుత పాలనను అందిస్తున్నాం..
ప్రపంచంలో అద్భుతమైన సుపరిపాలన అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం జరిగిన ఆశీర్వాద సభలో ఆయన ప్రసంగించారు. తన 41 ఏళ్ల రాజకీయ జీవింతో బాన్సువాడ నియోజకవర్గ పరిధిలో ఎన్నో సభలను చూశాను కానీ ఈ సభకు హాజరైన ప్రజానీకాన్ని ఎప్పుడూ చూడలేదన్నారు. ప్రజల నుంచి వస్తున్న స్పందనను చూసి తన జీవితం ధన్యమైందన్నారు. సీఎం కేసీఆర్ పాలనను చూసి దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. ఏ ప్రభుత్వం కూడా ప్రజల కోసం ఇన్ని సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టలేదన్నారు. ముఖ్యమంత్రి ఎప్పుడూ ప్రజల గురించే ఆలోచిస్తారని, రైతులకు అన్ని విధాలుగా మేలు చేశారని తెలిపారు.
టీఆర్‌ఎస్‌లో చేరిన సాయిరెడ్డి
వర్ని మార్కెట్ కమిటీ చైర్మన్ కె.సాయిరెడ్డి సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ప్రభుత్వ పనితీరుకు ఆకర్షితుడినై పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా కేసీఆర్ ఆయనకు టీఆర్‌ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అలాగే తన్‌జీముల్ మసాజిద్, మాజీ కార్యదర్శి అబ్దుల్ వహాబ్ సైతం టిఆర్‌ఎస్‌లో చేరారు.
Comments
Please login to add a commentAdd a comment