సాక్షి, కామారెడ్డి: జహీరాబాద్ పార్లమెంట్ సీటు ప్రధాన రాజకీయ పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. ప్రధాన పార్టీల అభ్యర్థులు విజయం కోసం సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. ఎన్నికలకు సమయం కూడా తక్కువగా ఉండడంతో ఆయా పార్టీల నేతలు విస్తృతంగా గ్రామాలలో పర్యటిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటిన టీఆర్‌ఎస్ పార్టీ తన ఆధిపత్యాన్ని చాటుకునేందుకు ఆరాటపడుతోంది. జహీరాబాద్ పార్లమెంట్ స్థానం పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాలు ఉండగా ఆరు చోట్ల టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలే ఎన్నికయ్యారు. ఒక్క ఎల్లారెడ్డిలో మాత్రమే కాంగ్రెస్ అభ్యర్థి గెలవగా.. ఆయన కూడా గులాబీ గూటికి చేరారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఊపులో ఉన్న టీఆర్‌ఎస్.. ఎంపీ స్థానాన్ని భారీ మెజారిటీతో గెలుచుకునేందుకు పావులు కదుపుతోంది.
టీఆర్‌ఎస్ పార్టీ సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్‌నే మరోసారి బరిలోకి దింపింది. ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే నిజాంసాగర్ మండలంలోని మాగి వద్ద పార్టీ జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సన్నాహక సభ నిర్వహించింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ సభలో పాల్గొని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. బుధవారం సంగారెడ్డి జిల్లా అల్లాదుర్గంలో నిర్వహించిన సీఎం సభ.. ఆ పార్టీ నేతల్లో నూతనోత్సాహాన్ని నింపింది. అభ్యర్థి బీబీపాటిల్‌తోపాలు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు జోరుగా ప్రచారం చేస్తున్నారు.
నియోజకవర్గాల పునర్విభజన ద్వారా 2009లో కొత్తగా ఏర్పాటైన జహీరాబాద్ ఎంపీ సీటును తొలిసారే కైవసం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ.. ఈ స్థానాన్ని తిరిగి తమ ‘చేతి’లోకి తీసుకోవాలని ఆరాటపడుతోంది. పార్టీ అభ్యర్థి మదన్‌మోహన్‌రావు విజయం కోసం శ్రమిస్తున్నారు. జహీరాబాద్ పార్లమెంట్ నియోజక వర్గం పరిధిలో కాంగ్రెస్ పార్టీకి బలైమన నాయకత్వం ఉంది. మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మాజీ మంత్రులు గీతారెడ్డి, షబ్బీర్‌అలీ తదితరులు ఉన్నారు. దీంతో జహీరాబాద్ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు ఆ పార్టీ నేతలు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీ శ్రేణుల్లో జోష్ తీసుకురావడానికి సోమవారం జహీరాబాద్‌లో రాహుల్ గాంధీ సభ నిర్వహించారు. గులాం నబీ ఆజాద్‌తో సభ నిర్వహించడానికి ప్రయత్నిస్తున్నారు.
బీజేపీ కూడా జహీరాబాద్ సీటుపై ఆశలుపెట్టుకుంది. పార్టీ అభ్యర్థి బాణాల లక్ష్మారెడ్డితోపాటు నాయకులు విస్తృతంగా నియోజకవర్గంలో పర్యటిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 7వ తేదీన ఎల్లారెడ్డిలో నిర్వహించే ప్రచార సభలో యోగి ఆదిత్యనాథ్ పాల్గొననున్నారు. యూపీ సీఎం పర్యటన మేలు చేస్తుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.
విస్తృతంగా ప్రచారం
జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో విజయం సాధించడం కోసం ఆయా పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి బీబీ పాటిల్‌కు 5,08,661 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి సురేశ్ షెట్కార్‌కు 3,64,030 ఓట్లు వచ్చాయి. బీబీపాటిల్‌కు 1,44,631 ఓట్ల మెజారిటీ దక్కింది. అప్పుడు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన మదన్‌మోహన్‌రావుకు 1,57,497 ఓట్లు వచ్చాయి. ఈసారి ఎన్నికల్లో మెజారిటీని పెంచుకోవడమే లక్ష్యంగా టీఆర్‌ఎస్ ప్రయత్నిస్తోంది. పోలయ్యే ఓట్లలో టీఆర్‌ఎస్‌కు 65 శాతానికిపైగా ఓట్లు వచ్చేలా కృషి చేయాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు టార్గెట్ ఇచ్చారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఏడు నియోజకవర్గాల్లో కలిపి టీఆర్‌ఎస్‌కు 5,76,433 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థులకు 4,43,468 ఓట్లు వచ్చాయి. బీజేపీకి 98,552 ఓట్లు వచ్చాయి.
కాంగ్రెస్ పార్టీ కన్నా టీఆర్‌ఎస్‌కు 1,32,965 ఓట్లు ఎక్కువగా వచ్చాయి. ఎల్లారెడ్డి నియోజక వర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జాజాల సురేందర్‌కు భారీగా ఓట్లు రావడంతో పార్లమెంట్ నియోజక వర్గం మొత్తంలో టీఆర్‌ఎస్‌కు ఓట్ల శాతం తగ్గింది. కామారెడ్డి నియోజకవర్గంలోనూ హోరాహోరీ పోరు జరిగి స్వల్ప మెజారిటీతో టీఆర్‌ఎస్ అభ్యర్థి గంప గోవర్ధన్ బయపడ్డారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్లు, ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో పోటీ హోరాహోరీగా సాగుతుందని భావిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి మొత్తంగా 98,552 ఓట్లు మాత్రమే వచ్చాయి. అయినప్పటికీ మోదీ చరిష్మాతో పార్లమెంట్ స్థానాన్ని కైవసం చేసుకుంటామని ఆ పార్టీ నేతలు ధీమాగా చెబుతున్నారు. ఓటర్లను ఆకట్టుకోవడానికి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment