ప్రతీకాత్మక చిత్రం
జోరుగా ప్రచారం చేయాల్సిన సమయం.. ఇంకా 72 గంటలు గడిస్తే మైకులు మూగబోవాల్సిందే.. ఇంతటి కీలకమైన సమయంలో అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొనగా, ప్రచారంలో మాత్రం ఆ ఉధృతి కానరావడం లేదు.. టీఆర్‌ఎస్ అభ్యర్థులు పూర్తిగా పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌తో పాటు పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్‌పై ఆధారపడగా మిగతా పార్టీల అభ్యర్థులకు కింది స్థాయి శ్రేణుల నుంచి అంతగా సహకారం అందడం లేదని తెలుస్తోంది.. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఊరువాడ మార్మోగిన ప్రచార హోరు లోక్‌సభ ఎన్నికల విషయానికొచ్చే సరికి కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది.. ఇక ప్రచారంలో స్టార్ కాంపెయినర్ల విషయానికొస్తే టీఆర్‌ఎస్ అభ్యర్థులకు మద్దతుగా కేసీఆర్, కేటీఆర్‌తో మంత్రులు, ఎమ్మెల్యేలు సహకరిస్తుండగా.. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల ప్రచారం అంతంత మాత్రంగానే సాగింది.. వీరిని పక్కన పెడితే స్వతంత్రులు పోటీలో ఉన్నా ప్రచారంలో మాత్రం ప్రభావం చూపకపోవడం గమనార్హం.
సాక్షి, వరంగల్ అర్బన్: లోక్‌సభ ఎన్నికల పోలింగ్ సమయం సమీపిస్తోంది.. పోటీలో ఉన్న అభ్యర్థులు ప్రచారం చేసుకోడానికి మరో 72 గంటలు మాత్రమే సమయం మిగిలి ఉంది. ఈనెల 9వ తేదీ సాయంత్రం 5 గంటలతో ప్రచారం ముగియనుండగా.. 11వ తేదీన పోలింగ్ జరుగుతుంది. ప్రచారానికి చివరిరోజైన మంగళవారం ప్రధాన పార్టీల అభ్యర్థులు ర్యాలీలకే పరిమితమవుతారు. ఇలా పోలింగ్ సమీపిస్తున్న వేళ వరంగల్, మహబూబాబాద్ లోక్‌సభ నియోజకవర్గాల నుంచి ప్రధాన పార్టీల తరఫున బరిలో ఉన్న అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది. అయితే, అధికార టీఆర్‌ఎస్ అభ్యర్థులు పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్‌తో పాటు ఎమ్మెల్యేలపై భారం వేయగా... ప్రచార గడువు దగ్గర పడుతుండడంతో బీజేపీ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, నేతల్లో కలవరం మొదలైంది. ఇదే అదునుగా ‘ఆహా.. మాకేంటి?’ అని ఆయా పార్టీల్లోని కిందిస్థాయి నేతలు ప్రచారానికి మొండికేస్తున్నారు. ప్రచారానికి రావాలంటే కనీస ఖర్చులైనా ఇవ్వాలని బడా నేతలను కోరుతున్నట్టు సమాచారం. కానీ అభ్యర్థుల నుంచి సరైన స్పందన లేకపోవడంతో సొంత డబ్బు ఖర్చు పెడుతూ ప్రచారం చేసేందుకు నేతలు ఇష్టపడడం లేదు. దీంతో అసెంబ్లీ ఎన్నికల సమయాన కనిపించిన ప్రచార హోరు లోక్‌సభ ఎన్నికల వేళ కనిపించడం లేదు.
కానరాని ప్రచార హోరు
ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెండు పార్లమెంట్ స్థానాల పరిధిలోని 12 అసెంబ్లీ సెగ్మెంట్లలో చాలా వరకు ప్రధాన పార్టీల ప్రచారంలో దూకు డు కనిపించడం లేదు. వరంగల్ లోక్‌సభ అభ్యర్థులు పసునూరి దయాకర్(టీఆర్‌ఎస్), దొమ్మా టి సాంబయ్య(కాంగ్రెస్), చింత సాంబమూర్తి(బీజేపీ).. మహబూబాబాద్ నుంచి మాలోతు కవిత(టీఆర్‌ఎస్), పోరిక బలరాం నాయక్(కాంగ్రెస్), హుస్సేన్ నాయక్(బీజేపీ) నడుమే ప్రధాన పోటీ ఉంది. టీఆర్‌ఎస్ పక్షాన ఈనెల 2న వరంగల్ అజంజాహి మిల్లు మైదానం, 4న మహబూబా బాద్‌లో నిర్వహించిన బహిరంగ సభల్లో ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. అంతకు ముందు, ఆ తర్వాత టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ ప్రచారసభలు, రోడ్‌షోలు నిర్వహించారు. మరో వైపు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహ రి, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆయా నియోజకవర్గాల్లో సభలు, సమావేశాలు, ప్రచారాలు నిర్వహిస్తున్నారు.
ఇక బీజేపీ అగ్రనేత అమిత్‌షా సభ వరంగల్‌లో చివరి నిమిషంలో రద్దు కాగా, రాజ్‌నాథ్ సింగ్, సదానందగౌడ్ జిల్లా కేంద్రాల్లో జరిగిన సభల్లో పాల్గొన్నారు. అలాగే, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పి.మురళీధర్‌రావు, రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ వరంగల్ సభకు హాజరయ్యారు. అయితే ఆ పార్టీ ప్రచారం పల్లె గడపకు చేరలేదు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా భూపాలపల్లి, ములుగు ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, సీతక్కకు తోడు జిల్లా పార్టీ అధ్యక్షులు ప్రచారం నిర్వహిస్తుండగా.. విజయశాంతి, శ్రీనివాస్ కృష్ణన్ తప్ప స్టార్ క్యాం పెయిన్లు ఎవరు రాలేదు. ఇదే సమయంలో ప్రధా న పక్షాలుగా ఉన్నా కాంగ్రెస్, బీజేపీతో పాటు అధికార టీఆర్‌ఎస్‌లో కూడా అభ్యర్థుల తరఫున ప్రచారానికి చోటామోటా నాయకులు కొందరు ముఖం చాటేస్తున్నారు. కొందరు ప్రజాప్రతినిధులు కూడా దూరంగానే ఉన్నట్లు తెలుస్తోంది.
పుంజుకోని హస్తం, కమలం
లోక్‌సభ ఎన్నికలకు సుమారు నెల రోజుల క్రితం షెడ్యూల్ విడుదల కాగా... ప్రచారంలో టీఆర్‌ఎస్ ముందంజలో ఉండగా, కాంగ్రెస్, బీజేపీ ఇంకా పుంజుకోలేదు. మరో 72 గంటల్లో ప్రచారానికి తెరపడనుండగా, ఆ పార్టీల ప్రచారం ఇంకా పల్లెలను తాకలేదు. వరంగల్, మహబూబాబాద్ లోక్‌సభ అభ్యర్థుల గెలుపు కోసం టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు అభ్యర్థుల గెలుపును సవాలుగా తీసుకోగా.. మరికొందరు గాలివాటం తో నటిస్తున్నారన్న నివేదికలు ఆ పార్టీ అధినేత కేసీఆర్‌కు ఉన్నాయి. కొందరైతే మొక్కుబడిగానే ప్రచారం సాగిస్తున్నారంటున్నారు. ఇక వరంగల్, మహబూబాబాద్ లోక్‌సభ స్థానాల కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులైన దొమ్మాటి సాంబయ్య, చింత సాంబమూర్తి, పోరిక బలరాం నాయక్, హుస్సేన్‌నాయక్ పరిస్థితి అందుకు భిన్నంగా ఏమీలేదు. వారు కూడా సుడిగాలి పర్యటనలకే పరిమితమయ్యారు. ఇలా ప్రధాన పార్టీలన్ని వివిధ చోట్ల సభలు నిర్వహిస్తూ కార్యకర్తలను ఉత్తేజపరుస్తున్నా.. క్షేత్రస్థాయిలో జనంలోకి వెళ్లడం లేదు.
గ్రామీణ ఓట్లను రాబట్టేందుకు ఆయా మండల, గ్రామస్థాయి నేతలకే బాధ్యతలు అప్పగించారు. కుల సంఘాలతో సమావేశాలు నిర్వహిస్తూ తాయిలాలు ప్రకటిస్తున్నా అవి క్షేత్రస్థాయిలో సద్వినియోగం కావడం లేదన్న విమర్శలు ఉన్నాయి. కాగా స్వతంత్రంగా నామినేషన్లు వేసిన నేతలు ఎక్కడ కూడా ప్రచారంలో కనపడటం లేదు. ఉమ్మడి వరంగల్‌లోని వరంగల్ పార్లమెంట్ నుంచి 15 మంది, మహబూబాబాద్ నుంచి 14 మంది అభ్యర్థులు బరిలో ఉండగా.... ప్రధాన పార్టీల అభ్యర్థులు మినహా ఇండిపెండెంట్లు ప్రచారం చేయడం లేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్‌పీ, బీఎల్‌ఎఫ్, ఆమ్ ఆద్మీ పార్టీ, కొన్నిచోట్ల స్వతంత్రులు హోరాహోరీ ప్రచారం నిర్వహించారు. ఈసారి ఎక్కడ కూడా స్వతంత్రుల అభ్యర్థుల హంగామా లేదు. దీంతో ఈ పార్లమెంట్ ఎన్నికలు టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య త్రిముఖ పోరుగా కనిపిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment