ఆత్రం సక్కు, కోవ లక్ష్మి
సాక్షి, ఆసిఫాబాద్: ఆసిఫాబాద్ టీఆర్‌ఎస్‌లో అంతర్గతంగా రెండు వర్గాలు ఏర్పడ్డాయి. నియోజకవర్గ పరిధిలో ఇన్నాళ్లూ పార్టీలో ఒకే వర్గం ఉండగా ఇటీవల జరిగిన పరిణామాలతో పార్టీలో రెండు గ్రూపులు ఏర్పడ్డాయి. బయటికి పెద్దగా కనిపించకపోయినా లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఇక్కడ టీఆర్‌ఎస్ ఎన్నికల ప్రచారం శైలిని పరిశీలిస్తే అదే విషయం అవగతమవుతోంది. ఇందులో కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెల్యే ఆత్రం సక్కు వర్గం ఒకటి కాగా, మరొకటి మాజీ ఎమ్మెల్యే కోవ లక్ష్మీ వర్గం.
టీఆర్‌ఎస్ అధిష్టానం ఎమ్మెల్యే సక్కు పార్టీ మారిన సందర్భంలో మాజీ ఎమ్మెల్యేతోపాటు ఇతర నాయకులను కలుపుకుని పార్టీ కోసం పని చేయాలని ఇరువర్గాలకు అధిష్టానం సూచించినప్పటికీ వారి వర్గాల్లో మాత్రం సఖ్యత కుదరడం లేదు. పార్టీ లోక్‌సభ ఎంపీ అభ్యర్థి గొడం నగేశ్ గెలుపు కోసం ఇరు వర్గాలు చెమటోడుస్తున్నా.. అదీ వేర్వేరుగానే! కలసికట్టుగా కాకుండా ఎవరికి పట్టున్న ప్రాంతాల్లో వారే పర్యటిస్తున్నారు.. ప్రచారం చేస్తున్నారు.
కుదరని సఖ్యత
మొన్నటి వరకు వేర్వేరు పార్టీల్లో ఉన్న ఇరువర్గాలు అసెంబ్లీ ఎన్నికల్లో తమ తమ నాయకుల్ని గెలిపించుకునే క్రమంలో ఢీ అంటే ఢీ అనుకున్నాయి. ఇదే తరహాలో కింది స్థాయి నాయకుల్లోనూ వైరం తారాస్థాయిలో ఉండేది. నాయకుల మధ్య వైరం ఉండటంతో ఓ వర్గంపై మరోవర్గంపై రాజకీయంగా పై చేయి సాధించేందుకు కనిపించని యుద్ధం నడిచేది. అయితే, ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత సక్కు గులాబీ గూటికి చేరుకోవడంతో కోవ లక్ష్మీ వర్గం కొంత ఇబ్బంది పడింది.
కానీ, అధిష్టానం ఆదేశాల అనుగుణంగా పని చేయాల్సి వస్తోంది. దీంతో ఇరువురు పార్టీలో సర్దుకుపోవల్సిందేనని ఉమ్మడి జిల్లా నాయకులు సైతం చెప్పడంతో ఇరువర్గాలు తప్పక ముందుకు వెళ్తున్నారు. ఇద్దరు నాయకులు పార్టీలో సమాన స్థాయి నేతలు కావడంతో ఎవరూ బెట్టు తగ్గేలా లేరు. ప్రస్తుతం టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా కోవ లక్ష్మీ కొనసాగుతుండగా, ఆత్రం సక్కు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇలా రెండు వర్గాల్లో పార్టీపరంగా ఒకరికి ప్రాధాన్యం ఉంటే, అ«ధికారపరంగా ఇంకొకరికి ప్రాధాన్యత ఉంది. ఈ నేపథ్యంలో ద్వితీయ శ్రేణి నాయకత్వంలోనూ ఇదే తీరు కనిపిస్తోందనే విమర్శలు వస్తున్నాయి.
ఎవరికి వారే ప్రచారం..
లోక్‌సభ ఎన్నికల్లో ఈ రెండు వర్గాల నాయకులు ఎవరికి వారే ప్రచారం చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే కోవ లక్ష్మీ తనకు పట్టున్న ప్రాంతాల్లో పర్యటిస్తూ తన అనుచరగణాన్ని, తమ వర్గాన్ని, తన వైపున్న వారిని కలుస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక ఎమ్మెల్యేగా ఆత్రం సక్కు తన వర్గం నాయకులతో నియోజకవర్గంలో చుట్టి వస్తున్నారు. ఇరువురు కలిసి ఒకే ప్రాంతంలో ప్రచారం చేయడానికి మాత్రం వెళ్లడం లేదు. అయితే, ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆదిలాబాద్ పార్లమెంట్ ఎన్నికల ఇన్‌చార్జ్ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి గొడం నగేశ్ ఇతర నాయకులు నియోజవర్గానికి వచ్చిన సందర్భంలోనే ఇద్దరూ ఒకే వేదికపై కనిపిస్తున్నారు.
అలాగే నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశాలు, ఇతర సందర్భాల్లోనూ ఒకే వేదికను పంచుకుంటున్నారు. కానీ, ఒకేచోట ప్రచారానికి వెళ్లిన సందర్భాలు లేవు. ఒకరు ఆసిఫాబాద్‌లో ప్రచారం చేస్తే మరొకరు తిర్యాణిలో ప్రచారం చేస్తున్నారు. ఇదిలా ఉంటే, రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఎవరి వర్గం పై చేయి సాధిస్తుందోననే ఆసక్తి నెలకొంది. ఎందుకంటే ఇప్పుడు ఇరువర్గాలు ఒకే అభ్యర్థి గెలుపు కోసం పని చేస్తున్నారు గానీ.. అప్పుడు ఇరువర్గాల్లోనూ అనేక మంది ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, వైస్ ఎంపీపీ తదితర పదవుల పంపకంలో ఏ వర్గానికి పదవులు వస్తాయోనని కార్యకర్తలతోపాటు పరిషత్‌లో పోటీ చేసే ఆశావహులు కూడా ఎదురుచూస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment