పేలుతున్న మాటల తూటాలు | Lok Sabha: Parties Are Crossing Their Words | Sakshi
Sakshi News home page

పేలుతున్న మాటల తూటాలు

Published Sat, Apr 6 2019 2:06 PM | Last Updated on Tue, Aug 27 2019 4:45 PM

Lok Sabha: Parties Are Crossing Their Words - Sakshi

సాక్షిప్రతినిధి, నల్లగొండ : అధికార టీఆర్‌ఎస్, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ మధ్య మాటల యుద్ధం జోరుగా కొనసాగుతోంది. ఇరు పార్టీల అభ్యర్థులు, ఇతర నేతలు ఒకటి.. రెండంటూ విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకుంటున్నారు. చివరకు రాజకీయ విమర్శలు కాస్త.. వ్యక్తిగత విమర్శలకు దారితీస్తున్నాయి. దీంతో పార్లమెంటు ఎన్నికల ప్రచారం వేడెక్కింది. కాంగ్రెస్‌ నల్లగొండ అభ్యర్థి, పీసీసీ అధ్యక్షుడు ఎన్‌.ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ అభ్యర్థిపై విమర్శల దాడిని మొదలు పెట్టారు. ఈ విమర్శలకు టీఆర్‌ఎస్‌ అభ్యర్థి వేమిరెడ్డి నర్సింహారెడ్డి తొలుత ప్రతి విమర్శకు పోకుండా ఒకింత సంయమనం పాటించారు. కాంగ్రెస్‌నుంచి వ్యక్తిగత విమర్శల దాడి పెరగడంతో వేమిరెడ్డి కూడా ప్రతివిమర్శలకు తెరలేపారు. మరోవైపు జిల్లా మంత్రి జి.జగదీశ్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీపై, ఆ పార్టీ నేతలపై, ప్రధానంగా అభ్యర్థి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డిలపై ఘాటైన విమర్శలే చేస్తున్నారు.

టీఆర్‌ఎస్‌ అభ్యర్థి వేమిరెడ్డి గెలుపే లక్ష్యంగా ఆ పార్టీ నాయకత్వం మంత్రి జగదీశ్‌రెడ్డికి బాధ్యతలు అప్పజెప్పింది. దీం తో ఆయన జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గాల వారీగా ర్యాలీలు, సమావేశాలు, రోడ్‌షోలలో పాల్గొంటూ.. కాంగ్రెస్‌పై నిప్పులు చెరుగుతున్నారు. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌ అభ్యర్థి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి నల్లగొండ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి, టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్, ప్రధాని నరేంద్ర మోదీలపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. కాగా, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ‘వేమిరెడ్డి’పై మాత్రం వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని ఆ పార్టీ నాయకత్వం మండిపడుతోంది. ‘అభ్యర్థులకు ముఖం చెల్లకే .. కేసీఆర్‌ను చూ సి ఓట్లేయమని అడుగుతున్నారు. కేసీఆర్‌ డమ్మీలకు, భూ కబ్జాదారులకు టికెట్లు ఇచ్చి తెలగాణ ప్రజ లను అవమాన పరుస్తున్నారు. రా ష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేయాల ని టీఆర్‌ఎస్‌ కుట్ర చేస్తోంది. ఇది కేసీ ఆర్‌ నిరంకుశత్వానికి నిదర్శనం..’ అని  ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తన ప్రచారంలో తీవ్రస్థాయిలోనే టీఆర్‌ఎస్‌పై విరుచుకుపడుతున్నారు.  

ఉత్తమ్‌ చేస్తున్న విమర్శలను అటు మంత్రి జగదీశ్‌ రెడ్డి, ఇటు టీఆర్‌ఎస్‌ అభ్యర్థి వేమిరెడ్డి నర్సింహారెడ్డి తిప్పికొడుతున్నారు. ‘ఉత్తమ్‌కు ఓటమి భయం పట్టుకుంది. నాపై మతి భ్రమించి మాట్లాడుతున్నాడు. నాపై చేసిన ఆరోపణలను రుజువు చేస్తే.. నేను దేనికైనా సిద్ధం.. నిరూపించలేక పోతే ఉత్తమ్‌ ముక్కు నేలకు రాస్తాడా...’ అని వేమిరెడ్డి సవాల్‌ చేశారు. మరో వైపు మంత్రి జగదీశ్‌ రెడ్డి సైతం కాంగ్రెస్‌ అభ్యర్ధిపై తనదైన శైలిలో విరుచుకు పడుతున్నారు. ‘కాంగ్రెస్‌ నాయకుల మధ్య వారికి వారికే సమన్వయం లేదు. ఉత్తమ్‌ నాయకత్వంపై ఆ పార్టీ వారికే నమ్మ కం లేదు. అందుకే ఎమ్మెల్యేలు టీఆ ర్‌ఎస్‌లో చేరుతున్నారు. ఆయన నా యకత్వంలో గాంధీభవన్‌కు తాళం పడడం ఖాయం.. ఏప్రిల్‌ 11తో కాంగ్రెస్‌ శని విరగడవుతుంది..’ అని మంత్రి జగదీశ్‌రెడ్డి విమర్శలు గుప్పించారు. మొత్తంగా పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ల మధ్య జరుగుతున్న మాటల యుద్ధం రక్తి కడుతోంది. 

‘ఎన్నికల తర్వాత ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి జైలుకు వెళ్లడం ఖాయం. మంత్రిగా చేసినప్పుడు హౌసింగ్‌లో అవినీతికి పాల్పడ్డాడు. అది త్వరలోనే రుజువు అవుతుంది. కారులో నోట్ల కట్టలు తగలబెట్టుకుంది ఆయన కాదా..? నిన్న కూడా ఆయనకు సంబంధించిన డబ్బుల కట్టలు పట్టుబడ్డాయి.’
– వేమిరెడ్డి నర్సింహారెడ్డి, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి 

‘ఉత్తమ్‌ .. ఉత్తర కుమారుడు. ఎంపీగా గెలుస్తానని నమ్మకం ఉంటే.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పోటీ చేయాలంటే పారిపోతుండు. ఉత్తమ్‌ నాయకత్వంలో గాంధీభవన్‌కు తాళం పడడం ఖాయం. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా.. ఆయన తన ఓటమిని ముందే అంగీకరించాడు.’
– జి.జగదీశ్‌రెడ్డి, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి

‘టీఆర్‌ఎస్‌ అభ్యర్థి వేమిరెడ్డి నర్సింహారెడ్డి తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేని వ్యక్తి. ఆయన డమ్మీ అభ్యర్థి. అలాంటి వ్యక్తి పార్లమెంటులో ఎలా మాట్లాడుతారు? రూ.100కోట్లు తీసుకుని టీఆర్‌ఎస్‌ ఆయనకు టికెట్‌ ఇచ్చింది..’ 
– ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, కాంగ్రెస్‌ అభ్యర్థి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement