హస్తానికి గాలం | TRS Party Offers To Congress Leaders In Vikarabad | Sakshi
Sakshi News home page

హస్తానికి గాలం

Published Sun, Jun 17 2018 1:56 PM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

TRS Party Offers To Congress Leaders In Vikarabad - Sakshi

కరన్‌కోట్‌ పంచాయతీ కార్యాలయం

పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటుకునేందుకు అధికార పార్టీ ముమ్మర యత్నాలు చేస్తోంది. దీనికోసం కాంగ్రెస్‌ పార్టీకి పట్టున్న గ్రామాలపై దృష్టి సారించింది. సదరు నేతలను టీఆర్‌ఎస్‌లో చేర్చుకునేందుకు ఆఫర్లు ఇస్తున్నారు గులాబీ నాయకులు. పదవులు.. లేదా కాంట్రాక్టులు ఇస్తామని ఆశలు చూపిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో గ్రామాల్లో రాజకీయం రంజుగా సాగుతోంది. 

తాండూరు : ఏళ్ల తరబడి హస్తం పార్టీలో కొనసాగుతున్న నేతలకు ‘గులాబీ’ నాయకులు భారీగా ఆఫర్లు ఇస్తున్నారు. ఆ పార్టీ నేతలకు గులాబీ తీర్థం ఇప్పించేందుకు తమవంతు ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు. ఎలాగైనా పంచాయతీలను ఏకగ్రీవం చేసుకోవాలని భావిస్తున్నారు. ఇది కాంగ్రెస్‌ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అయితే, కాంగ్రెస్‌ పార్టీలో ఉం డాలా..లేదా ‘కారె’క్కి స్వప్రయోజనాలను చూసుకోవాలా.. అనే డైలామాలో కాంగ్రెస్‌ నాయకులు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. ఇప్పటికే అధికార పార్టీ ఇచ్చిన ఆఫర్లకు పలువురు కాంగ్రెస్‌ నా యకులు మెత్తబడ్డారని గ్రామాల్లో ప్రచా రం సాగుతోంది. గ్రామ పంచాయతీలను ఏకగ్రీవం చేసుకోవడమే లక్ష్యంగా అధికార పార్టీ ‘ఆపరేషన్‌’ మొదలుపెట్టింది.  

మొత్తం 565 పంచాయతీలు  
జిల్లాలో గతంలో 367 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇటీవల ప్రభుత్వం గిరిజన తండాలతోపాటు అనుబంధ గ్రామాలను పంచాయతీలుగా ఏర్పాటు చేసింది. దీంతో 198 కొత్త పంచాయతీలు ఆవిర్భవించాయి. ఈనేపథ్యంలో జిల్లాలో మొత్తం 565 పంచాయతీలకు చేరుకున్నాయి. జూలైలో గ్రామ పంచాయతీల పాలకవర్గం పదవీకాలం ముగియనుంది. దీంతో పాతవాటితో పాటు కొత్త గ్రామ పంచాయతీలకు ఎన్నికలను నిర్వహించాలని ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. మరో  వారం రోజుల్లో ఎన్నికల ప్రక్రియ మొదలు కానుందని అధికారుల నుంచి స్పష్టమైన సంకేతాలు వెలువడ్డాయి.   

మంత్రి సుడిగాలి పర్యటన  
గ్రామ పంచాయతీలను ఏకగ్రీవం చేస్తే సర్కారు నుంచి ప్రోత్సాహక పారితోషికం రావడంతో అభివృద్ధిపనులు చేసుకోవచ్చని చెబుతున్నారు మంత్రి మహేందర్‌రెడ్డి. ఆయన ఇటీవల తాండూరు నియోజకవర్గంలో పర్యటనలు మొదలు పెట్టా రు. కొత్తగా ఏర్పడిన పంచాయతీల్లో సుడి గాలి పర్యటనలు చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని పంచాయతీల విషయంలో ఆయా గ్రామాల ప్రజలు ఏకగ్రీవం కోసం తీర్మానాలు చేశారు. వీలైనన్ని పంచాయతీలను ఏకగ్రీవం చేసేందుకు మంత్రి మహేందర్‌రెడ్డి తనవంతు కృషి చేస్తున్నారు.  

పంచాయతీ పీఠం ఎవరికో..  
తాండూరు నియోజకవర్గంలోని ఆయా గ్రామాల్లో కాంగ్రెస్‌ పార్టీ ప్రాబల్యం  అధికంగా ఉంది. ఎలాగైనా కాంగ్రెస్‌ పార్టీని చిత్తు చేయాలని అధికార పార్టీ నేతలు ఇప్పటికే కొత్తగా ఏర్పాటైన గిరిజన తండాలు, అనుబంధ గ్రామాల్లో పర్యటిస్తున్నారు. అయితే, కాంగ్రెస్‌పార్టీకి చెందిన నాయకులను ‘కారు’లో ఎక్కించుకునేందుకు గులాబీ నేతలు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈనేపథ్యంలో ఇప్పటికే గ్రామాలు, గిరిజన తండాల్లో పలుకుబడి ఉన్న హస్తం పార్టీ నేతలతో సంప్రదింపులు జరిపుతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా కొందరు నేతలు అధికార పార్టీ కండువా కప్పుకున్నారు.   

పోటీకి సై అంటున్న కాంగ్రెస్‌ నేతలు.. 
తాండూరు నియోజకవర్గంలో అత్యధిక గ్రామ పంచాయతీలను కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్‌ పార్టీ నేతలు వ్యూహాలు పన్నుతున్నారు. గ్రామాల్లో అధికార పార్టీ ఇస్తున్న ఆఫర్లకు తలొగ్గకుండా కాంగ్రెస్‌ పార్టీ నాయకులను, కార్యకర్తలను ఆ పార్టీ నేతలు మానసికంగా సిద్ధం చేస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ తాండూరు నియోజకవర్గ ఇన్‌చార్జి రమేష్‌ మహరాజ్‌ ఆధ్వర్యంలో గ్రామాల్లో పర్యటించి నాయకులకు భరోసా కల్పిస్తున్నారు. ఏకగ్రీవానికి తావివ్వకుండా గ్రామ పంచాయతీల్లో పోటీ చేసేందుకు గ్రామాల్లో ఎలాగైనా పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి సత్తా చాటాలని కార్యకర్తలను సమాయత్తం చేసే పనిలో బిజీబిజీగా ఉన్నారు. నియోజకవర్గంలోని కాంగ్రెస్‌ పార్టీలో వర్గపోరు కొనసాగుతున్న తరుణంలో పంచాయతీలు చేజార్చుకుంటారా..?  లేదా చేజిక్కించుకుంటారా.. అనే విషయం త్వరలో రానున్న పంచాయతీ ఎన్నికల్లో స్పష్టం కానుంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement