తాండూరులో రాజకీయ వేడి   | Local Body Elections Creating Heat In Political Parties In Rangareddy | Sakshi
Sakshi News home page

తాండూరులో రాజకీయ వేడి  

Published Fri, Jul 12 2019 11:55 AM | Last Updated on Fri, Jul 12 2019 12:07 PM

Local Body Elections Creating Heat In Political Parties In Rangareddy - Sakshi

సాక్షి, తాండూరు: పట్టణంలో పురపోరు వేడెక్కుతోంది. మున్సిపల్‌ పరిధిలోని 36 వార్డుల్లో విజయావకాశాలున్న నాయకులకే టికెట్లు దక్కేలా ఆయా పార్టీల నేతలు ప్రణాళిక సిద్ధంచేశారు. అయితే టీఆర్‌ఎస్‌ పార్టీలో మాత్రం ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి వర్గీయులు.. చైర్మన్, కౌన్సిలర్‌ స్థానాలపై ఆశలు పెట్టుకున్నారు. టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులంతా పట్నం మహేందర్‌రెడ్డి వర్గీయులుగా ఉన్నారు. ఏళ్లుగా పార్టీ కోసం పని చేస్తున్న వారు ఈ సారి ఎలాగైనా టికెట్‌ దక్కించుకుని గెలవాలని కృతనిశ్చయంతో ఉన్నారు.

అయితే నెల రోజుల క్రితం కాంగ్రెస్‌ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి తన అనుచర గణానికి అధిక ప్రాధాన్యం కల్పించి.. పార్టీ తరఫున పోటీ చేయించేలా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. చైర్మన్‌ పదవి బీసీ జనరల్‌కు వస్తే.. మాజీ కౌన్సిలర్లు సందల్‌ రాజుగౌడ్, పట్లోళ్ల నర్సింలు పోటీ పడే అవకాశం ఉంది. ఇందుకోసం ఇరువురూ లాబీయింగ్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇద్దరిలో ఒకరు పట్నం మనిషి కాగా మరొకరు పైలెట్‌ వర్గానికి చెందిన వ్యక్తి కావడం గమనార్హం. దీంతో పార్టీ నుంచి ఎవరికి అవకాశం దక్కుతుందో మరో వారం రోజుల్లో తేలిపోనుంది.   

కాంగ్రెస్‌కు కష్టకాలం.. 
తాండూరు మున్సిపాలిటీని దశాబ్దాల పాటు పాలించిన కాంగ్రెస్‌ పార్టీకి ఈ సారి ఎన్నికల్లో ప్రతికూల వాతావరణం కనిపిస్తోంది. ఈ పార్టీకి చెందిన నేతలంతా గడిచిన ఏడాది కాలంలో ఒక్కొక్కరుగా పార్టీని వీడిపోయారు. ఉన్న కొద్ది మంది కూడా వీరి బాటలో పయనించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇలాంటి తరుణంలో టీఆర్‌ఎస్‌ను తట్టుకుని కాంగ్రెస్‌ ఎన్నికల రేసులో నిలుస్తోందా..? లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. అయితే టికెట్‌ దక్కని ఆశావహులు తిరిగి సొంత పార్టీకి వచ్చే అవకాశాలు లేక పోలేవు. 

యంగ్‌ లీడర్స్‌కు అవకాశం దక్కేనా... 
తాండూరు మున్సిపల్‌ ఎన్నికల్లో సీనియర్లను కాదని యంగ్‌లీడర్లకు అవకాశం దుక్కుతుందా..? లేదా..? అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మున్సిపల్‌ పరిధిలోని యువత గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో రోహిత్‌రెడ్డిని విజయతీరాలకు చేర్చారు. మున్సిపల్‌ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ నుంచి పోటీ చేయాలని కొంత మంది యువకులు రెడీ అయ్యారు. అయితే ఇటీవల రోహిత్‌రెడ్డి కాంగ్రెస్‌ను వీడి టీఆర్‌ఎస్‌ లో చేరారు. ఫలితంగా కొత్త, పాత నాయకులతో కారు టీఆర్‌ఎస్‌ మరింత బలంగా కనిపిసోర్తంది. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి పోటి చేసే అవకాశం యంగ్‌ లీడర్స్‌కు కల్పిస్తారా లేదా పార్టీలోని సీనియర్‌ నేతలకే టికెట్లు కట్టబడుతారా అనేది ఉత్కంఠగా మారింది.   

చాపకింద నీరులా బీజేపీ, ఎంఐఎం... 
మున్సిపల్‌ ఎన్నికల కోసం బీజేపీ, ఎంఐఎం చాపకింద నీరులా ముందుకు వెళ్తున్నాయి. మున్సిపల్‌ చైర్మన్‌ జనరల్‌కు రిజర్వ్‌ అయితే  చైర్మన్‌ స్థానం కోసం నరుకుల నరేందర్‌గౌడ్‌ పోటీ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. పట్టణంలోని ఆయా వార్డుల నుంచి బరిలో దిగాలనుకుంటున్నారు ఇప్పటి నుంచే ఏర్పాట్లలో మునిగి తేలునుతున్నారు. అంతే కాకుండా టీఆర్‌ఎస్‌ పార్టీలో టికెట్‌ దక్కని నాయకులను తమ వైపుకు తిప్పుకొని పోటీలో నిలపాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఎంఐఎం పార్టీ నేత ఎంఏ హాదీ మున్సిపల్‌ పరిధిలోని 36 వార్డుల్లో ఎలాంటి పొత్తులు లేకుండా ఎన్నికలకు వెళ్లేందుకు ఎత్తులు వేస్తున్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement