గులాబీ ఫామ్‌లు ఎవరికిస్తారో! | Local Election Tickets Tension For TRS Leaders In Vikarabad | Sakshi
Sakshi News home page

గులాబీ ఫామ్‌లు ఎవరికిస్తారో!

Published Mon, Jul 15 2019 12:52 PM | Last Updated on Mon, Jul 15 2019 12:55 PM

Local Election Tickets Tension For TRS Leaders In Vikarabad - Sakshi

సాక్షి, తాండూరు: మున్సిపల్‌ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తాండూరు గులాబీలో కొత్త సమస్యలు తలెత్తుతున్నాయి. పుర పోరులో నిలిచే పార్టీ అభ్యర్థులను ఎంపిక చేసే బాధ్యత ఎవరికి దక్కు తుందోనని ఆశావహులు, కార్యకర్తలు టెన్షన్‌గా ఉన్నారు. గతంలో ఈ బాధ్యతలన్నింటినీ మాజీ మంత్రి, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి చూసుకునేవారు. దీంతో పార్టీలో ఇక్కడ ఆయన చెప్పిందే వేధంగా నడిచేది. అయితే కాంగ్రెస్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రోహిత్‌రెడ్డి టీఆర్‌ఎస్‌ గూటికి చేరడంతో అందరిలోనూ ఈ అనుమానాలు రేకెత్తుతున్నాయి.

ఇద్దరు ప్రధాన నాయకులు ఒకే పార్టీలో ఉండటంతో ఎవరి వర్గానికి న్యాయం జరుగుతుందోనని చర్చ సాగుతోంది. టీఆర్‌ఎస్‌లో ఇద్దరు నేతల మధ్య నెలకొన్న పొలిటికల్‌ వార్‌తో నాయకులు, కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు. ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే ఒకే వేదికను పంచుకుని తాము కలిసిపోయామని చెబుతున్నా.. ఇరువురి మద్దతుదారులు, వర్గీయులు మాత్రం దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇదిలా ఉండగా ఇరువురు నేతల నడుమ ప్రత్యక్ష విమర్శలు ఆగిపోయినా.. అంతర్గతంగా సైలెంట్‌ వార్‌ కొనసాగుతోందని పలువురు సీనియర్లు చెబుతున్నారు. మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో పార్టీ బీఫారాలు ఎవరి చేతికి అందుతాయనేది ప్రస్తుతం ఉత్కంఠగా మారింది.   

ఒక్కో వార్డు నుంచి పది మంది... 
తాండూరు మున్సిపాలిటీలోని 36 వార్డుల్లో పోటీ చేసేందుకు ఆశావహులు సిద్ధమవుతున్నారు. ఒక్కో వార్డులో ఐదు ఉంచి పదిమంది వరకు పోటీకి సిద్ధమవుతున్నారు. వీరిలో ఎమ్మెల్సీ మహేంద్‌రెడ్డి వర్గీయులు, పాత సీనియర్‌ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. మరో వైపు నెల రోజుల క్రితం కాంగ్రెస్‌ను వీడి అధికార పార్టీలో చేరిన తాండూరు ఎమ్మెల్యే పంజుగుల రోహిత్‌రెడ్డి తన అనుచరగణానికి టికెట్లు ఇప్పించేందుకు పోటీ పడుతున్నారు. దీంతో మున్సిపల్‌ అభ్యర్థుల ఎంపిక ఇద్దరు నేతలకు ప్రతిష్టగా మారింది.   

ప్యానల్‌లు  రెడీ.. 
మున్సిపల్‌ ఎన్నికల సందర్భంగా పట్నం మహేందర్‌రెడ్డి, పంజుగుల రోహిత్‌రెడ్డి వర్గీయులు పోటీకి రెడీ అవుతున్నారు. మహేందర్‌రెడ్డి వర్గీయులు ఇప్పటికే మున్సిపాలిటీలోని 36 వార్డుల్లో పోటీ చేయనున్న అభ్యర్థులతో ప్యానల్‌ ఏర్పాటు చేసుకున్నారు. మరో వైపు రోహిత్‌రెడ్డి వర్గీయులు సైతం చైర్మన్‌ అభ్యర్థిగా పట్లోళ్ల నర్సింలుతో పాటు కౌన్సిలర్లుగా పోటీ చేసే వారిని ఎంపిక చేసుకున్నారు. వార్డుల రిజర్వేషన్లు వచ్చిన తర్వాత దూకుడు పెంచాలని నిర్ణయించుకున్నారు. మున్సిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ సునీతాసంపత్‌ ఇటీవల టీఆర్‌ఎస్‌లో చేరారు. తమ వర్గానికి టికెట్లు కేటాయించాలని ముందస్తు ఒప్పదం కుదుర్చుకున్న తర్వాతే ఎమ్మెల్యే సమక్షంలో పార్టీ సభ్యత్వం తీసుకున్నట్లు సమాచారం. దీంతో మున్సిపల్‌ బాధ్యతలు తమకే ఉంటాయని పంజుగుల వర్గం జోరుగా ప్రచారం చేస్తోంది.   

పట్టున్న నేత పట్నమే.. 
తాండూరు మున్సిపల్‌ పరిధిలో పట్నం మహేందర్‌రెడ్డికే పట్టున్న నేతగా ప్రజల్లో గుర్తింపు ఉంది. తాండూరులో టీఆర్‌ఎస్‌ ప్రభావం లేని సమయంలోనూ ఆయన పార్టీని తిరుగులేని శక్తిగా నిలబెట్టారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్‌ గడ్డపై గులాబీ జెండా ఎగరడంలో మహేందర్‌రెడ్డి పాత్ర ఎంతో కీలకంగా నిలిచింది. రేవంత్‌రెడ్డి ఓటమిలో ప్రధానభూమిక పోషించిన మహేందర్‌రెడ్డి సీఎం కేసీఆర్‌తోపాటు పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మన్ననలు పొందారు.

స్వల్ప ఓట్ల తేడాతో తాను ఎమ్మెల్యేగా ఓడిపోయినా.. ట్రక్కుగుర్తు కారణంగానే.. తాండూరు అభివృద్ధి మందగించిందని పలుమార్లు పేర్కొన్నారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించి జిల్లాలో తనకు తిరుగులేదని నిరూపించుకున్న మహేందర్‌రెడ్డి.. ఆయన సతీమణి సునీతారెడ్డిని మూడో సారి జెడ్పీ చైర్‌పర్సన్‌గా గెలిపించుకున్నారు. తాండూరు మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ గెలవాలంటే రాజకీయ చాణక్యుడిగా పేరున్న పట్నంకే బాధ్యతలు అప్పగించాలని టీఆర్‌ఎస్‌లోని సీనియర్లు సూచిస్తున్నారు.   

తగ్గిన ఆదరణ.. 
తాండూరు ఎమ్మెల్యే పంజుగుల రోహిత్‌రెడ్డి కాంగ్రెస్‌ను వీడి టీఆర్‌ఎస్‌లో చేరడాన్ని ప్రజలు తప్పుపడుతున్నారు. ఈ కారణంగా ఆయనకు జనాధరణ రోజురోజుకూ తగ్గుతోంది. తాండూరుకు ఎంతో చేసిన మహేందర్‌రెడ్డిని కాదని ఎమ్మెల్యేగా గెలిపిస్తే.. తమ నిర్ణయానికి వ్యతిరేకంగా టీఆర్‌ఎస్‌లో చేరడాన్ని జనం ఎత్తిచూపుతున్నారు. ఈ సమయంలో రోహిత్‌కు మున్సిపల్‌ బాధ్యతలు అప్పగిస్తే పార్టీ నష్టపోయే ప్రమాదం ఉందని స్థానిక నాయకులు, రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు.

మూడో వ్యక్తికి కట్టబెడతారా?
మున్సిపల్‌ ఎన్నికల్లో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే వర్గీయుల మధ్య కొనసాగుతున్న వర్గపోరు నేపథ్యంలో టికెట్ల పంపిణీ బాధ్యతలను మూడో వ్యక్తికి కట్టబెట్టొచ్చనే ఊహాగానాలు సైతం వినిపిస్తున్నాయి. ఇటీవల నిర్వహించిన టీఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదు బాధ్యతలను సైతం ఇద్దరిలో ఎవరికీ ఇవ్వకుండా.. ఆ పార్టీ నేత గట్టు రామచందర్‌రావును నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా నియమించిన విష యం తెలిసిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement