ఇక్కడ రాజకీయాలు కూడా అంతే రిచ్‌గా..! | Joint Rangareddy Politics In Telangana Very Focused | Sakshi
Sakshi News home page

ఇక్కడ రాజకీయాలు కూడా అంతే రిచ్‌గా.. ప్రధాన పార్టీలు మరింత ఫోకస్‌!

Published Tue, Aug 30 2022 4:36 PM | Last Updated on Tue, Aug 30 2022 4:53 PM

Joint Rangareddy Politics In Telangana Very Focused - Sakshi

ఉమ్మడి రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ మహానగరం చుట్టూ వ్యాపించి ఉంది. ఈ ప్రాంతాలు గ్రేటర్ నగరం కంటే కూడా కాస్ట్‌లీగా తయారయ్యాయి. ఐటీ కారిడార్‌లోని అత్యధిక భాగం, ఫార్మా సిటీ, అంతర్జాతీయ విమానాశ్రయం, జంట జలాశయాలు వంటి ఎన్నో ప్రాంతాలు ఈ జిల్లాలోనే ఉన్నాయి. రాష్ట్రంలోనే ఖరీదైన జిల్లాగా రంగారెడ్డి పేరు తెచ్చుకుంది. ఈ జిల్లా రాజకీయాలు కూడా అంతే రిచ్‌గా తయారయ్యాయి.

2009లో ఏర్పడిన రాజేంద్రనగర్‌సెగ్మెంట్‌కు మూడుసార్లుగా ప్రకాశ్ గౌడ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. టీడీపీతో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ప్రకాశ్‌గౌడ్ ప్రస్తుతం కారు పార్టీలో కొనసాగుతున్నారు. చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి అలాగే మంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్‌రెడ్డి కూడా ఈసారి రాజేంద్రనగర్‌నుంచి పోటీకి ప్రయత్నాలు చేస్తున్నారు. గులాబీ బాస్‌ ఎవరికి టిక్కెట్ ఇస్తారో చూడాలి.

ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులను తానే డిసైడ్‌ చేస్తారని ప్రకాశ్‌గౌడ్‌కు పేరుంది. ఎదుటి పార్టీల్లో బలహీనమైన అభ్యర్థులను నిలపడం ద్వారా తనకు ఇబ్బంది లేకుండా చూసుకుంటారని చెబుతారు. ఈసారి పరిస్థితులు ఆయనకు సానుకూలంగా లేవనే మాట వినిపిస్తోంది. కాంగ్రెస్‌ నుంచి పోటీ చేయడానికి ముగ్గురు ప్రయత్నిస్తున్నారు. పీసీసీ చీఫ్ రేవంత్ అనుచ‌రుడుగా ఉన్న కోకాపేట జైపాల్‌రెడ్డి పోటీలో ఉంటానంటున్నారు. అదేవిధంగా మణికొండ మున్సిప‌ల్ ఛైర్మన్ న‌రేంద‌ర్ ముదిరాజ్ కూడా ఎమ్మెల్యే టికెట్ రేస్‌లో ఉన్నట్లు చెబుతున్నారు.

ఇక బీజేపీ ఈసారి రాజేంద్రనగర్‌ నియోజ‌క‌వ‌ర్గంపై ప‌ట్టుబిగించాల‌ని చూస్తుంది. జీహెచ్ఎంసీ ప‌రిధిలోని మూడు డివిజ‌న్లను గెలిచిన ఉత్సాహంతో నియోజకవర్గంలో గెలుపు ప్రణాళికలను రచిస్తోంది. మైలార్‌దేవ్‌ప‌ల్లి కార్పోరేట‌ర్ తోక‌ల శ్రీ‌నివాస్‌రెడ్డి ఎమ్మెల్యే బ‌రిలో నిలిచేందుకు సిద్ధమ‌వుతున్నారు. పార్టీలో చాలాకాలం నుంచి ప‌నిచేస్తున్న బొక్కా బాల్‌రెడ్డి కూడా అధిష్టానం త‌న‌కు అవ‌కాశ‌మిస్తుంద‌నే ధీమాలో ఉన్నారు. ఇక నియోజ‌క‌వ‌ర్గంలో ఎంఐఎం ప్రాబ‌ల్యం కూడా ఎక్కువ‌గానే ఉంది. జీహెచ్ఎంసీ ప‌రిధిలోని రెండు డివిజ‌న్లను గెలిచిన ఎంఐఎం..వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్రత్యర్థి పార్టీల‌ను గట్టిదెబ్బకొట్టేందుకు సిద్ధమ‌వుతోంది. రాజేంద్రనగర్‌లో ఈసారి చ‌తుర్ముఖ‌పోటీ ఉండే అవ‌కాశం స్పష్టంగా క‌నిపిస్తోంది.

గ్రేటర్ శివార్లలో కాస్ట్ లీ సెగ్మెంట్‌గా పేరు తెచ్చుకున్న మహేశ్వరంలో రెండుసార్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి విజయం సాధించారు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన తీగల కృష్ణారెడ్డి..ఇటీవల సొంత పార్టీకి చెందిన మంత్రి మీదే విమర్శలు గుప్పించి వార్తల్లోకెక్కారు. మొన్నటి ఎన్నికల్లో గెలిచిన సబిత, ఓడిన తీగల ఇద్దరూ వేరే పార్టీల నుంచి వచ్చినవారే. వచ్చే ఎన్నికల్లో మహేశ్వరం సీటుపై భారీ ఆశలు పెంచుకున్నారు తీగల కృష్ణారెడ్డి. అయితే మంత్రి సబితారెడ్డిని కాదని.. తీగలకు టికెట్ ఇస్తారా ?  అనే చర్చ గులాబీ పార్టీలో జరుగుతోంది.

సబితా ఇంద్రారెడ్డి టిఆర్ఎస్ గూటికి చేరడంతో మహేశ్వరంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇటీవల బడంగ్ పేట మేయర్ పారిజాత నర్సింహారెడ్డి టిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే టికెట్ భరోసాతోనే కండువా కప్పుకున్నట్లు చెబుతున్నారు. అయితే ఇక్కడ సీనియర్‌ని అయిన తనకే టిక్కెట్‌దక్కుతుందని దేపా భాస్కర్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు డిసిసి అధ్యక్షుడు నర్సింహారెడ్డి కూడా బరిలో దిగడానికి సిద్ధమవుతున్నారు.

తుక్కుగూడాలో అమిత్ షా సభతో జోరు మీద ఉన్నారు కాషాయ శ్రేణులు. గతంలో పోటీ చేసిన శ్రీరాములు యాదవ్‌ఈసారి కూడా బరిలోకి దిగడానికి సిద్ధమవుతున్నారు. ఇక మాజీ హోమ్ మంత్రి దేవేందర్ గౌడ్ తనయుడు వీరేందర్ గౌడ్ ఇదే నియోజకవర్గంపై ఆశలు పెంచుకున్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సొంత ఊరు తిమ్మాపూర్‌ఈ నియోజకవర్గం పరిధిలోనే ఉంది. కిషన్ రెడ్డి ఎవరి పేరు ప్రతిపాదిస్తారనేది కూడా ఆసక్తి కరంగా మారింది.

మంత్రి సబిత, మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి సొంత ఇలాకా చేవెళ్ళ. అయితే 2009 నుంచి ఎస్‌సీ రిజర్వుడు సెగ్మెంట్‌గా మారింది. ప్రస్తుత ఎమ్మెల్యే యాదయ్య, మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం మధ్య గులాబీ పార్టీలో టిక్కెట్‌పోరు సాగుతోంది. ఇద్దరు నేతల మధ్య ఉప్పు నిప్పు పరిస్థితి కొనసాగుతోంది. ఇక కాంగ్రెస్, బీజేపీలకు చేవెళ్ళలో అభ్యర్థులే కనిపించడంలేదు. గులాబీ గూటి నుంచి బయటపడే నేతల కోసం ప్రతిపక్షాలు ఎదురుచూస్తున్నాయి. శంషాబాద్ కు చెందిన సిద్దేశ్వర్ కాంగ్రెస్ టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉంటే బీఎస్పీ నేత, మాజీ ఐపిఎస్ ప్రవీణ్ కుమార్ చేవెళ్ల నుంచి పోటీకి సన్నాహాలు చేసుకుంటున్నారు.

ఎల్బీనగర్ టిఆర్ఎస్‌లో వర్గ విభేదాలు కొంత ఇబ్బంది కరంగా మారాయి. సిటింగ్‌ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, పార్టీ ఎల్బీ నగర్ ఇన్‌చార్జ్ రామ్మోహన్ గౌడ్‌లు కాంగ్రెస్‌నుంచి వచ్చినవారే. నియోజకవర్గంలో అన్నదమ్ముల్లా కలసి పని చేసినవారే. కాంగ్రెస్‌లో ఎమ్మెల్యేగా సుధీర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ గా రామ్మోహన్ గౌడ్ గతంలో పనిచేశారు. ఇద్దరి మధ్యా విబేధాలు రావడం, ఇద్దరూ అధికార పార్టీలోకి రావడంతో ఇప్పుడు వర్గ పోరు తీవ్రమైంది. కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్ నేత మల్ రెడ్డి రాంరెడ్డి పోటీ చేయాలని భావిస్తున్నారు. నియోజకవర్గంలో 11 జీహెచ్‌ఎంసీ డివిజన్ల లో గెలిచి జోష్ లో ఉన్నారు కమలనాథులు. బీజేపీ కార్పొరేటర్లు వంగా మధుసూదన్ రెడ్డి, కొప్పుల నర్సింహారెడ్డి ఎమ్మెల్యే గా ప్రమోషన్ కొట్టేయాలని ప్లాన్ వేస్తున్నారు. 

భువ‌న‌గిరి పార్లమెంట్ ప‌రిధిలోకి వ‌చ్చే ఇబ్రహీంప‌ట్నం అసెంబ్లీ స్థానంపై ప‌ట్టుకోసం అన్ని పార్టీలు ప్రయ‌త్నాలు ముమ్మరం చేశాయి. ఇబ్రహీంప‌ట్నం సెమీ అర్బన్ నియోజ‌క‌వ‌ర్గం. గత ఎన్నిక‌ల్లో 376 ఓట్లతో అసెంబ్లీలో అడుగుపెట్టిన టీఆర్ఎస్ అభ్యర్థి మంచిరెడ్డి కిష‌న్‌రెడ్డి వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న‌యుడిని బ‌రిలో దించాల‌ని ప్లాన్ చేస్తున్నారు. కిషన్‌రెడ్డి తనయుడు ప్రశాంత్‌కుమార్ గ్రేటర్‌లో ఐఎస్ స‌ద‌న్‌కార్పోరేట‌ర్‌గా ప‌నిచేశారు. 2014లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన కంచ‌ర్ల చంద్రశేఖ‌ర్‌రెడ్డి.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న‌కు అవ‌కాశ‌మివ్వాల‌ని అధిష్టానాన్ని కోరుతున్నారు. 

గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీఎస్‌పీ నుంచి పోటీ చేసి స్వల్ప ఓట్లతో ఓడిన మల్‌రెడ్డి రంగారెడ్డి ఈసారి కాంగ్రెస్‌ టిక్కెట్‌ కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారు. అయితే సొంత పార్టీలో వ‌ర్గ విబేధాలు చిచ్చురేపుతున్నాయి. భువ‌న‌గిరి ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి త‌న అనుచ‌రుడైన‌ నిరంజ‌న్‌రెడ్డికే ఇబ్రహీంప‌ట్నం టికెట్ ఇప్పిస్తాన‌ని మాట ఇచ్చార‌ట‌. ఈ ఇద్దరిలో ఎవరికి గ్రీన్‌ సిగ్నల్‌ లభిస్తుందో చూడాలి. 

గ‌త ఎన్నిక‌ల్లో ఇక్కడ కేవలం 9 శాతం ఓట్లకే ప‌రిమిత‌మైన బీజేపీ వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప‌ట్టుసాధించాల‌ని భావిస్తోంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా పోటీచేసి ఓడిపోయిన‌ అశోక్ గౌడ్‌ ఈసారి బీజేపీ వేవ్‌..బీసీ కార్డ్‌తో ఎలాగైనా గెలవాలని అనుకుంటున్నారు. గతంలో మూడు సార్లు సీపీఎం అభ్యర్థులు గెలిచిన చరిత్ర ఇబ్రహీంపట్టణానికి ఉంది. అందువల్ల లెఫ్ట్ ప్రభావం కొంతవరకు ఉంటుంది. అదేవిధంగా బీఎస్‌పీ నేత ప్రవీణ్‌కుమార్ ప్రభావం కూడా ఇక్కడ పనిచేసే అవకాశం కనిపిస్తోంది. 

శేరిలింగంపల్లి అసెంబ్లీ స్థానం ఓటర్లు గత మూడు ఎన్నికల్లో మూడు పార్టీలకు పట్టం కట్టారు. గులాబీ పార్టీకి చెందిన సిటింగ్‌ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ మరోసారి గెలిచి సత్తా చాటాలని భావిస్తున్నారు. టిఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న బండి రమేష్ కూడా పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. కాంగ్రెస్ నుంచి బీజేపీ లో చేరిన రవికుమార్ యాదవ్ తో పాటు గత ఎన్నికల్లో బిజేపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన యోగానంద్ మధ్య పార్టీలో గట్టి పోటీ నడుస్తోంది. ఈ సీటు కోసం కారు, కమలం పార్టీల మధ్య హోరాహోరీ పోరు సాగే అవకాశం ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement