ఉమ్మడి జిల్లా కేంద్రంగా ఉన్న మహబూబ్‌నగర్ నియోజకవర్గం ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత గులాబీ కోటగా మారింది. రెండు ఎన్నికల్లోనూ తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్ల సంఘాధ్యక్షుడిగా పనిచేసిన శ్రీనివాస్‌గౌడ్ విజయం సాధించారు. రెండోసారి గెలిచిన తర్వాత ఆయన్ను మంత్రి పదవి వరించింది. మూడోసారి కూడా శ్రీనివాస్‌గౌడ్ మహబూబ్ నగర్ నుంచే పోటీ చేయనున్నారు. మంత్రిగా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్న ఆయన హ్యాట్రిక్‌పై ధీమాగా ఉన్నారు. ఇతర పార్టీల్లో శ్రీనివాస గౌడ్‌ను తట్టుకుని నిలిచే నాయకులు కనిపించకపోవడం కలిసివచ్చే అంశంగా భావిస్తున్నారు.
పాలమూరు పట్టణం మీద బీజేపీ ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఈసారి ఎలాగైనా కాషాయ జెండా ఎగరేయాలని కంకణం కట్టుకున్నారు పార్టీ నేతలు. డీకే అరుణను ఇక్కడి నుంచి బరిలోకి దింపుతారని తెలుస్తోంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన డీకే అరుణకు...అసెంబ్లీలో శ్రీనివాస గౌడ్‌కు పడిన ఓట్లు కంటే ఎక్కువ పోలయ్యాయి. అయితే పార్టీలో పాత నాయకులు కొత్తవారిని ఎదగనీయడంలేదనే ఆరోపణలు ఉన్నాయి. మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర పార్టీ కోశాధికారి శాంతకుమార్‌తో పాటు మరో ఇద్దరు నేతలు కూడా పోటీ చేయడానికి రెడీ అంటున్నారు.
పాలమూరులో కాంగ్రెస్ పరిస్థితి మాత్రం అధ్వాన్నంగా తయారైంది. తమకే సీటు కావాలనే నాయకులున్నారు గాని..పార్టీని బలోపేతం చేద్దామనుకునేవారు కరువయ్యారు. మైనారిటీలు ఎక్కువగా ఉన్నప్పటికీ వారిని తమకు అనుకూలంగా మలుచుకోవడానికి కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నమేదీ లేదు. జడ్చర్ల సెగ్మెంట్‌లో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లో సీటు ఆశించేవారి సంఖ్య పెరుగుతుండటం ఆసక్తి రేపుతోంది. గత రెండు ఎన్నికల్లో డాక్టర్ లక్ష్మారెడ్డి విజయం సాధించి, ఒకసారి మంత్రి పదవి నిర్వహించారు. మూడోసారి కూడా ఆయనే అధికార పార్టీ అభ్యర్థిగా ఉంటారనే ప్రచారం సాగుతోంది. అయితే పలు సమీకరణాల నేపథ్యంలో ఈసారి లక్ష్మారెడ్డికి అవకాశం రాదని కూడా అంటున్నారు. మహబూబ్‌నగర్ ఎంపీ మన్నె శ్రీనివాసరెడ్డి అన్న కుమారుడైన మన్నె జీవన్‌రెడ్డి మహబూబ్‌నగర్ అసెంబ్లీ సీటు నుంచి పోటీ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు చెబుతున్నారు.
ఇక కాంగ్రెస్ పార్టీలో మూడు ముక్కలాట నడుస్తోంది. ఇన్‌చార్జ్‌గా ఉన్న అనిరుద్‌రెడ్డి తనకే టిక్కెట్ ఖాయమని భావిస్తున్నారు. అయితే చంద్రశేఖర్ అలియాస్ ఎర్రశేఖర్ పార్టీలో చేరడంతో ముసలం మొదలైంది. తన సన్నిహితుడు అనిరుద్‌కు అడ్డుగా ఉంటాడని భావించి...ఎర్రశేఖర్ రాకను అడ్డుకునేందుకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్రంగా ప్రయత్నించారు. బీజేపీ మాత్రం బలమైన అభ్యర్థి కోసం వెతుకుతోంది. సీటు రాని కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతలు తమ గుమ్మంలోకి రాకపోతారా అని ఎదురు చూస్తోంది.
దేవరకద్ర నియోజకవర్గంలో ఈసారి త్రిముఖ పోటీ తీవ్రంగా జరిగేట్లు కనిపిస్తోంది. టీఆర్ఎస్ తరపున రెండుసార్లుగా విజయం సాధించిన వెంకటేశ్వరరెడ్డి మూడోసారి పోటీకి సై అంటున్నారు. తన సెగ్మెంట్‌కు కేటాయించిన ఇళ్ళ నిర్మాణం పూర్తి చేయించి, లబ్దిదారులకు అందచేశారు. ప్రభుత్వం మీదున్న వ్యతిరేకత ఈసారి ఆయనకు మైనస్ అవుతుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
కాంగ్రెస్ నుంచి గత రెండు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన డోకూర్ పవన్‌కుమార్ ప్రస్తుతం కాషాయ పార్టీలో ఉన్నారు. న్యాయవాది మధుసూదనరెడ్డి, ప్రదీప్‌గౌడ్‌లు ఎవరికి వారు ఈసారి కాంగ్రెస్ సీటు తమకే అని భావిస్తున్నారు. కాంగ్రెస్‌లో చేరిన టీడీపీ నేత కొత్తకోట దయాకరరెడ్డి కూడా సీటు ఆశిస్తున్నారు. ఈ ముగ్గురి మధ్య సయోధ్య కోసం రేవంత్‌రెడ్డి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఎగ్గని నరసింహులు, సుదర్శన్ రెడ్డి, బాలకృష్ణలు బీజేపీ సీటును ఆశిస్తున్నారు. దంతో పవన్‌కుమార్‌కు కొంత ఇబ్బందిగా మారే పరిస్థితులున్నాయంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment