Local election
-
నల్లగొండలో ‘హస్తం’..నిస్తేజం!
సాక్షిప్రతినిధి, నల్లగొండ : మున్సిపల్ ఎన్నికలు ముంగిట్లో ఉన్నా.. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌లో ఏమాత్రం కార్యసన్నద్ధత కనిపించడం లేదు. రేపో, మాపో నోటిఫికేషన్ వెలువడుతుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ద్వితీయ శ్రేణిలో ఉత్తేజం నింపి నిస్తేజాన్ని పారదోలే ప్రయత్నాలు నాయకత్వం వైపునుంచి ఏమాత్రం జరగడం లేదన్న అసంతృప్తి పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. గత ఏడాది జరిగిన శాసన సభ ముందస్తు ఎన్నికల నాటి నుంచి నిన్నామొన్నటి హుజూర్నగర్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నిక దాకా ఆ పార్టీకి పెద్దగా ఏమీ కలిసిరాలేదు. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో మాత్రం ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని భువనగిరి, నల్లగొండ లోక్‌సభా స్థానాల్లో విజయంతో కొంత ఊపిరి పీల్చుకున్నట్టు కనిపించింది. అయితే, అదీ భువనగిరి లోక్‌సభ నియోజకవర్గంలో అంతో ఇంతో కార్యక్రమాలు జరుగుతున్నా, నల్లగొండ ఎంపీ పరిధిలో మాత్రం ఎలాంటి కార్యకలాపాల్లేవు. నెల రోజుల పాటు హుజూర్నగర్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉపఎన్నికతో కార్యకర్తల్లో కొంత ఊపు వచ్చినా, రెండు వారాల కిందట వెలువడిన ఫలితం కాంగ్రెస్‌కు ప్రతికూలంగా రావడం పార్టీ శ్రేణులను మరింత నైరాశ్యంలో పడేశాయి. ఈ పరిస్థితుల్లో పార్టీ ఉనికిని కాపాడుతూ, మున్సిపల్ ఎన్నికలకు తయారు చేయాల్సిన జిల్లా నాయకత్వం ఆ దిశలో పెద్దగా దృష్టి పెట్టినట్లు కనిపించడం లేదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. శాసనసభ ఎన్నికల తర్వాత మారిన సీను గత ఏడాది జరిగిన శాసనసభ ఎన్నికల తర్వాత జిల్లాలో కాంగ్రెస్ పరిస్థితి తారుమారైంది. అంతకు ముందు జిల్లాలోని పన్నెండు నియోజకవర్గాల్లో ఐదు చోట్ల ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఉండేవారు. కానీ, 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం మునుగోడు, నకిరేకల్, హుజూర్‌నగర్‌లలో విజయం సాధించింది. కొద్ది నెలలకే జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో హుజూర్నగర్ ఎమ్మెల్యేగా ఉండిన టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్లగొండ ఎంపీగా విజయం సాధించడంతో ఆ స్థానం ఖాళీ అయ్యింది. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తన సిట్టింగ్ స్థానాన్ని టీఆర్ఎస్కు వదులుకోవాల్సి వచ్చింది. ఈ మధ్యలోనే నకిరేకల్ నుంచి కాంగ్రెస్ టికెట్‌పై గెలిచిన ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య టీఆర్ఎస్లోకి వెళ్లిపోయారు. ఆలేరు నుంచి పోటీ చేసి ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ ఆ తర్వాతి రాజకీయ పరిణామాల నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికల ముందు కాంగ్రెస్‌ను వీడి టీఆర్ఎస్లో చేరారు. ఇక, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ల దాఖలు చివరి గడువు రోజు టికెట్ దక్కించుకుని మిర్యాలగూడనుంచి పోటీ చేసిన బీసీ సంఘం నేత, మాజీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య ఆ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఇటువైపు కన్నెత్తి చూడలేదు. ఇప్పుడు ఆలేరు, నకిరేకల్, మిర్యాలగూడ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి ఓ ఇన్చార్జ్ అంటూ ఎవరూ లేరు. అదే మాదిరిగా, కోదాడ, హుజూర్‌నగర్‌లలో ఉత్తమ్ దంపతులే ప్రాతినిధ్యం వహిస్తుండగా ఉప ఎన్నికల్లో ఓటమితో ఒకింత మౌనంగానే ఉ న్నారు. తిరిగి ఎప్పుడు కార్యకలాపాలు మొదలు పెడతారన్న అంశంపై శ్రేణుల్లో స్పష్టత లేదు. తుంగతుర్తి నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓడిపోయిన అద్దంకి దయాకర్, ఫలితాల తర్వాత ఈ నియోజవకర్గ పార్టీని పెద్దగా పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు. ఇక, మునుగోడు నియోజకవర్గంలో పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నా.. ఆయన ప్రస్తుతం స్వపక్షంలో విపక్షంలా వ్యవహరిస్తున్నారు. బీజేపీ నాయకత్వానికి ముఖ్యం గా ప్రధాని నరేంద్ర మోదీ గురించి గొప్పగా మాట్లాడి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వాన్ని తప్పుపట్టిన ఆయన ఒక విధంగా పార్టీకి దూరంగా ఉన్నట్లేనని భావిస్తున్నారు. ఈ పరిస్థితులన్నింటినీ కలిపి విశ్లేషిస్తే.. ఉమ్మడి జిల్లాలో మెజారిటీ నియోజకవర్గాల్లో కార్యకర్తలను పట్టించుకునే నాథుడే కనిపించడం లేదన్న అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. ముందున్న ... ‘మున్సిపల్’ పోరు మున్సిపల్ ఎన్నికల కోసం అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో కసరత్తు చేస్తోంది. కోర్టు కేసులు కొలిక్కి వస్తే వెంటనే నోటిఫికేషన్ విడుదల అవుతుందన్న అంచనాతో అన్ని ఏర్పాట్లు చేస్తోంది. దీంతో ఆయా రాజకీయ పార్టీలు కూడా తమకు పట్టున్న వార్డులు, గతంలో తమ పార్టీ కౌన్సిర్లుగా పనిచేసిన వార్డుల్లో పని చేసుకోవడం మొదలు పెట్టారు. వాస్తవానికి జిల్లాలోని ప్రధాన మున్సిపాలిటీల్లో గతంలో కాంగ్రెస్ నుంచే ఎక్కువ మంది కౌన్సిలర్లు గెలిచినా, ఇటునుంచి టీఆర్ఎస్కు మారడంతో మున్సిపాలిటీలు కాంగ్రెస్ చే జారాయి. ఈసారి కొత్తగా ఏర్పాటైన మున్సిపాలిటీలకు తోడు, పాత మున్సిపాలిటీల్లోనూ మొత్తంగా ఒక్కచోట కూడా కాంగ్రెస్‌కు అవకాశం ఇవ్వకుండా పాగా వేయాలని అధికార టీఆర్ఎస్ వ్యూహాత్మకంగా పనిచేస్తోంది. దీనికి ప్రతిగా కాంగ్రెస్ నుంచి కనీసం రాజకీయ కార్యాచరణ కూడా కనిపించడం లేదన్న అభిప్రాయం ఉంది. కాంగ్రెస్ సీనియర్ నేత, సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి ప్రాతినిధ్యం వహించిన నాగార్జున సాగర్ నియోజకవర్గంలో నందికొండ, హాలియా మున్సిపాలిటీలు ఏర్పాటయ్యాయి. మునుగోడు నియోజకవర్గలో చండూరు, నకిరేకల్ నియోజకవర్గంలో చిట్యాల, హుజూర్నగర్ నియోజకవర్గంలో నేరేడుచర్ల, హుజూర్నగర్, తుంగతుర్తి నియోజకవర్గంలో తిరుమలగిరి కొత్త మున్సిపాలిటీలు అయ్యాయి. వీటిల్లో కాంగ్రెస్ కార్యకలాపాలు పెద్దగా ఏమీ లేవని, మున్సిపల్ ఎన్నికలను ఎదుర్కొనే మానసిక స్థైర్యాన్ని నాయకత్వం అందించలేక పోతోందని ద్వితీయ శ్రేణి నాయకత్వం వాపోతోంది. దీంతో మున్సిపల్ పోరులో ఎలా ముందు పడాలో అర్థం కావడం లేదని పేర్కొంటున్నారు. మొత్తంగా అధినాయకత్వం దృష్టి సారిస్తే మినహా జిల్లాలో కాంగ్రెస్ మళ్లీ పట్టాలెక్కేలా కనిపించడం లేదని అభిప్రాయ పడుతున్నారు. -
‘స్థానిక సమరానికి సన్నాహాలు!
స్థానిక సంస్థలకు త్వరలో ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే ఓటర్ల జాబితా సవరణ, పోలింగు కేంద్రాల గుర్తింపు ప్రక్రియను పూర్తి చేశారు. సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలకు అవసరమయ్యే బ్యాలెట్ పత్రాలు సైతం జిల్లాకు చేరుకున్నాయి. దీంతో రెండు..మూడు నెలల్లో ఎన్నికలను పూర్తి చేసేందుకు అధికార యంత్రాంగం సన్నాహాలను ముమ్మరం చేసింది. మహారాణిపేట (విశాఖ దక్షిణ): స్థానిక సంస్థలకు త్వరలోనే ఎన్నికలు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఎన్నికలకు అవసరమయ్యే కసరత్తును అధికారులు ముమ్మరం చేయడం చూస్తుంటే అక్టోబర్ లేదా నవంబర్‌లో ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి. గ్రామ, మండల, జిల్లా పరిషత్ ఎన్నికలకు అవసరమైన ఓటర్ల జాబితాను సైతం అధికారులు తయారు చేశారు. ఓటర్ల జాబితాను కూడా ఇప్పటికే ప్రకటించారు. జిల్లాలోని 39 మండలాల పరిధిలో 924 గ్రామ పంచాయతీల్లో ఓటర్ల జాబితా సిద్ధమైంది. దీంతో గ్రామ పంచాయతీలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు కొద్ది రోజుల తేడాతో పూర్తి చేసేందుకు వీలుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముందుగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించే అవకాశాలున్నాయి. ఎన్నికల సంఘం ఏక్షణంలో షెడ్యుల్ ప్రకటించినా ఎన్నికల నిర్వహణకు జిల్లా అధికారులు సన్నద్ధంగా ఉన్నారు. జిల్లాలో 924 గ్రామపంచాయతీల్లో 18,2730 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 8,85,005 మంది పురుష, 9,17,654 మంది మహిళ, 71 మంది ఇతర ఓటర్లు ఉన్నారు. రిజర్వేషన్ల కోసం ఎదురు చూపులు ! పంచాయతీ రిజర్వేషన్ల కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం 60 శాతం రిజర్వేషన్లు ఉన్నాయి. అయితే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రిజర్వేషన్లు 50 శాతం మించకూడదు. దీంతో ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లను 50 శాతానికి తగ్గించవలసి ఉంది. దానికి చట్ట సవరణ చేయాలి. చట్ట సవరణ కోసం ఆర్డెన్స్‌గాని లేదా అసెంబ్లీలో సవరణ అయినా చేయవలసి ఉంది. దాని తర్వాత రిజర్వేషన్ల విధి విధానాల ప్రకటన వెలువడుతోంది. ప్రభుత్వ విధి విధానాల తరువాత రెవెన్యూ డివిజనల్ అధికారులు రిజర్వేషన్లు ఖరారు చేస్తారని పంచాయతీ అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ ప్రక్రియ కూడా కొద్ది రోజుల్లోనే పూర్తి చేసే అవకాశాలున్నాయి. జిల్లాకు చేరిన బ్యాలెట్ పత్రాలు ఎన్నికల నిర్వహణకు ప్రధానంగా అవసరమయ్యే బ్యాలెట్ పత్రాలు జిల్లాకు చేరుకున్నాయి. మొత్తం 26 టన్నుల బ్యాలెట్ పత్రాలు అవసరంగా అధికారులు గుర్తించారు. సర్పంచ్ ఓటుకు గులాబి, వార్డు సభ్యునికి తెలుపు రంగు బ్యాలెట్‌ను ఎంపిక చేసినట్టు తెలిసింది. అలాగే అదనంగా మరో పది శాతం బ్యాలెట్ పత్రాలు అందుబాటులో ఉంచనున్నారు. -
సిట్టింగులకు టికెట్ల దడ!
సాక్షి, సిరిసిల్ల : మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు వేంగంగా జరుగుతున్నాయి. వారం రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ జారీ కానుంది. పురపోరుకు తెరలేసింది. సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లో ఎన్నికల బరిలో నిలిచేందుకు అభ్యర్థులు సిద్ధమవుతున్నారు. బస్తీ ఎన్నికల్లో గెలిచే అభ్యర్థుల వేటలో అన్ని పార్టీల నేతలు తలమునకలయ్యారు. సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లో మున్సిపల్ వార్డుల సంఖ్య పెరగడంతో అన్ని పార్టీలూ కొత్త వార్డుల్లో అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో పడ్డాయి. ప్రస్తుతం సిట్టింగ్ కౌన్సిలర్లకు టికెట్ల దడపట్టుకుంది. క్షేత్రస్థాయిలో సర్వేలు నిర్వహిస్తూ.. ఎన్నికల్లో రేసుగుర్రాలను ఎంపిక చేయాలని పార్టీలు భావిస్తున్నాయి. అంగ, అర్థబలం ఉన్న అభ్యర్థులను బరిలో దింపేందుకు పార్టీలు సిద్ధమవుతున్నాయి. సిట్టింగుల్లో సగం మందికి డౌటే.. సిరిసిల్లలో 33 మంది, వేములవాడలో 20 మంది సిట్టింగు కౌన్సిలర్లు ఉండగా.. వీరిలో సగం మందికి మళ్లీ టికెట్లు దక్కే అవకాశం లేదని భావిస్తున్నారు. గతఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ టికెట్లపై పోటీచేసి గెలిచిన అభ్యర్థులు కొందరు.. పార్టీని వదిలేసి అధికార టీఆర్ఎస్లో చేరారు. కండువా మార్చిన కౌన్సిలర్లకు మళ్లీ పార్టీ టికెట్లు ఇస్తామని ఆ పార్టీ ముఖ్యనేతలు మాట ఇచ్చారు. అదేవార్డులో టీఆర్ఎస్ టికెట్‌పై పోటీచేసి ఓడిపోయిన అభ్యర్థులు క్షేత్రస్థాయిలో సానుభూతి ఓట్లపై ఆశలు పెట్టుకోగా.. పార్టీ మారిన సిట్టింగ్ కౌన్సిలర్లకు అవకాశం ఇస్తే.. మా సంగతి ఏంది..? అని అప్పట్లో ఓడిపోయిన నాయకులు బెంగపడుగున్నారు. సిట్టింగ్ కౌన్సిలర్లపై వ్యతిరేకత ఉన్న వార్డుల్లో కొత్తవారికి అవకాశం ఇవ్వాలని అధికార పార్టీ భావిస్తోంది. విలీన గ్రామాల్లోనూ పలుబడి ఉన్నవ్యక్తుల్లో ఆర్థికంగా ఉన్న వారిని ఎంపిక చేయాలని చూస్తున్నారు. క్షేత్రసాయిలో అభ్యర్థుల పని తీరు.. గెలుపు ఓటములపై అధికార పార్టీ నేతలు సర్వేలు నిర్వహిస్తున్నారు. ఆ సర్వే నివేదిక ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఏది ఏమైనా .. సిట్టింగు కౌన్సిలర్లను టికెట్ల భయం పట్టుకుంది. అధికార పార్టీ చేసిన అభివృద్ధి పనులు.. సొంత ఇమేజ్‌తో మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు సాధిస్తామని సిట్టింగుల్లో ఆశలు ఉన్నాయి. పార్టీ అధిష్టానం టికెట్లు ఇవ్వకుంటే ప్రత్యామ్నాయంపై సిట్టింగులు దృష్టిసారించారు. అసంతృప్తి నాయకులకు బీజేపీ గాలం.. అధికార పార్టీలో టికెట్లు రాని వారికి, వార్డుల్లో మంచిపేరున్న అభ్యర్థులకు టికెట్లు ఇవ్వాలని బీజేపీ భావిస్తోంది. సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లో చాలా వార్డుల్లో అధికార టీఆర్ఎస్లో టికెట్ల కోసం పోటీ అధికంగా ఉండగా.. అసంతృప్తి నాయకులకు పువ్వుగుర్తు టికెట్లు ఇచ్చేందుకు ఆ పార్టీ రెడీగా ఉంది. ఇప్పటికే కొందరు మాజీలు, సిట్టింగులు కమలం నేతలతో టచ్‌లో ఉంటున్నారు. గులాబీ టికెట్ రాకుంటే.. వెంటనే కమలం పార్టీ బీ–ఫామ్‌తో పోటీచేయాలని వ్యూహం సిద్ధం చేసుకున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లో అధికార టీఆర్ఎస్ కంటే.. బీజేపీకి ఎక్కువ ఓట్లు రావడంతో ఆ పార్టీ నేతల్లో ఆత్మవిశ్వాసం పెరిగింది. యువకులు, మహిళల ఓట్లు వస్తాయనే ఆశతో బీజేపీ నేతలు అన్ని వార్డుల్లోనూ అభ్యర్థులను నిలిపేందుకు సిద్ధమయ్యారు. వేములవాడ పట్టణంలో అధికార పార్టీతోపాటు, బీజేపీ బలంగానే ఉండడంతో బీజేపీ టికెట్ల కోసం పోటీ నెలకొంది. సిరిసిల్లలో టీఆర్ఎస్ టికెట్లకు గిరాకీ పెరిగింది. పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ ఓట్లు సాధించడంతో బీజేపీ నేతల్లో ఆశలు పెరిగాయి. మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటుకోవాలని ఆ పార్టీ అగ్రనేతలు రంగం సిద్ధం చేశారు. టికెట్లతో కాంగ్రెస్ సిద్ధం.. మున్సిపల్ ఎన్నికల్లో పట్టు సాధించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. గతంలో పార్టీ టికెట్‌పై పోటీ చేసి గెలిచిన అభ్యర్థులు పార్టీ మారగా.. ఈసారి కొత్త వారితో ఎన్నికలకు వెళ్లాలని ఆ పార్టీ నిర్ణయించింది. సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల్లో బలమైన అభ్యర్థులను బరిలో దింపేందుకు ఆ పార్టీ నేతలు వ్యూహాలు రూపొందిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ జారీకి ముందే ఏ వార్డులో ఎవరిని బరిలో దింపాలి అనే అంశాన్ని ఆ పార్టీ ముఖ్య నాయకులు చర్చించుకుంటున్నారు. సిట్టింగ్‌లకు మరో చాన్స్ ఇస్తూనే కొత్త వారితో పురపోరుకు వెళ్లాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఎన్నికలు ఖరీదు కావడంతో అన్నిపార్టీల నేతలు ఖర్చు పెట్టగలిగే అభ్యర్థులను ఎంపిక చేయాలని చూస్తున్నారు. -
తాండూరులో రాజకీయ వేడి
సాక్షి, తాండూరు: పట్టణంలో పురపోరు వేడెక్కుతోంది. మున్సిపల్ పరిధిలోని 36 వార్డుల్లో విజయావకాశాలున్న నాయకులకే టికెట్లు దక్కేలా ఆయా పార్టీల నేతలు ప్రణాళిక సిద్ధంచేశారు. అయితే టీఆర్ఎస్ పార్టీలో మాత్రం ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి వర్గీయులు.. చైర్మన్, కౌన్సిలర్ స్థానాలపై ఆశలు పెట్టుకున్నారు. టీఆర్ఎస్ సీనియర్ నాయకులంతా పట్నం మహేందర్‌రెడ్డి వర్గీయులుగా ఉన్నారు. ఏళ్లుగా పార్టీ కోసం పని చేస్తున్న వారు ఈ సారి ఎలాగైనా టికెట్ దక్కించుకుని గెలవాలని కృతనిశ్చయంతో ఉన్నారు. అయితే నెల రోజుల క్రితం కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి తన అనుచర గణానికి అధిక ప్రాధాన్యం కల్పించి.. పార్టీ తరఫున పోటీ చేయించేలా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. చైర్మన్ పదవి బీసీ జనరల్‌కు వస్తే.. మాజీ కౌన్సిలర్లు సందల్ రాజుగౌడ్, పట్లోళ్ల నర్సింలు పోటీ పడే అవకాశం ఉంది. ఇందుకోసం ఇరువురూ లాబీయింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇద్దరిలో ఒకరు పట్నం మనిషి కాగా మరొకరు పైలెట్ వర్గానికి చెందిన వ్యక్తి కావడం గమనార్హం. దీంతో పార్టీ నుంచి ఎవరికి అవకాశం దక్కుతుందో మరో వారం రోజుల్లో తేలిపోనుంది. కాంగ్రెస్‌కు కష్టకాలం.. తాండూరు మున్సిపాలిటీని దశాబ్దాల పాటు పాలించిన కాంగ్రెస్ పార్టీకి ఈ సారి ఎన్నికల్లో ప్రతికూల వాతావరణం కనిపిస్తోంది. ఈ పార్టీకి చెందిన నేతలంతా గడిచిన ఏడాది కాలంలో ఒక్కొక్కరుగా పార్టీని వీడిపోయారు. ఉన్న కొద్ది మంది కూడా వీరి బాటలో పయనించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇలాంటి తరుణంలో టీఆర్ఎస్ను తట్టుకుని కాంగ్రెస్ ఎన్నికల రేసులో నిలుస్తోందా..? లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. అయితే టికెట్ దక్కని ఆశావహులు తిరిగి సొంత పార్టీకి వచ్చే అవకాశాలు లేక పోలేవు. యంగ్ లీడర్స్‌కు అవకాశం దక్కేనా... తాండూరు మున్సిపల్ ఎన్నికల్లో సీనియర్లను కాదని యంగ్‌లీడర్లకు అవకాశం దుక్కుతుందా..? లేదా..? అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మున్సిపల్ పరిధిలోని యువత గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో రోహిత్‌రెడ్డిని విజయతీరాలకు చేర్చారు. మున్సిపల్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ నుంచి పోటీ చేయాలని కొంత మంది యువకులు రెడీ అయ్యారు. అయితే ఇటీవల రోహిత్‌రెడ్డి కాంగ్రెస్‌ను వీడి టీఆర్ఎస్ లో చేరారు. ఫలితంగా కొత్త, పాత నాయకులతో కారు టీఆర్ఎస్ మరింత బలంగా కనిపిసోర్తంది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటి చేసే అవకాశం యంగ్ లీడర్స్‌కు కల్పిస్తారా లేదా పార్టీలోని సీనియర్ నేతలకే టికెట్లు కట్టబడుతారా అనేది ఉత్కంఠగా మారింది. చాపకింద నీరులా బీజేపీ, ఎంఐఎం... మున్సిపల్ ఎన్నికల కోసం బీజేపీ, ఎంఐఎం చాపకింద నీరులా ముందుకు వెళ్తున్నాయి. మున్సిపల్ చైర్మన్ జనరల్‌కు రిజర్వ్ అయితే చైర్మన్ స్థానం కోసం నరుకుల నరేందర్‌గౌడ్ పోటీ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. పట్టణంలోని ఆయా వార్డుల నుంచి బరిలో దిగాలనుకుంటున్నారు ఇప్పటి నుంచే ఏర్పాట్లలో మునిగి తేలునుతున్నారు. అంతే కాకుండా టీఆర్ఎస్ పార్టీలో టికెట్ దక్కని నాయకులను తమ వైపుకు తిప్పుకొని పోటీలో నిలపాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఎంఐఎం పార్టీ నేత ఎంఏ హాదీ మున్సిపల్ పరిధిలోని 36 వార్డుల్లో ఎలాంటి పొత్తులు లేకుండా ఎన్నికలకు వెళ్లేందుకు ఎత్తులు వేస్తున్నారు. -
ఓటర్ల లెక్క తేలింది..!
సాక్షి, త్రిపురారం : నాగార్జునసాగర్ నియోజకవర్గంలో కొత్తగా ఏర్పడిన హాలియా మున్సిపాలిటీలో ఎన్నికలకు ఓటర్ల ముసాయిదా జాబితా సిద్ధమయ్యింది. ఇప్పటికే మున్సిపాలిటీలో ఓటర్ల ముసాయిదా జాబితాను ప్రదర్శించారు. అన్ని రాజకీయ పార్టీల నాయకులకు ఒక్కో సెట్ జాబితాను అందించారు. ఈనెల 12వ తేదీన అభ్యంతరాలను స్వీకరించి, 13న క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి పరిష్కరించనున్నారు. ఈనెల 14న తుది జాబితాను విడుదల చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీలకు వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని భావిస్తుండడంతో ఎన్నికల ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు. ఈ క్రమంలోనే కుదించిన షెడ్యూల్‌తో మరో నాలుగు రోజుల ముందే ఓటర్ల జాబితాను ప్రదర్శనకు పెట్టారు. ఈనెలలోనే ఎన్నికలు జరుగుతుండడంతో ఎన్నికల ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. పోలింగ్ కేంద్రాల గుర్తింపుతో పాటు పోలింగ్ పర్యవేక్షణకు అధికారుల నియామకం కూడా చేపట్టారు. హాలియా మున్సిపాలిటీల్లో బీసీ ఓటర్లు అధికం.. హాలియా మున్సిపాలిటీ పరిధిలో ఉన్న 12 వార్డుల్లో సిబ్బంది ఓటర్ల గణనను పూర్తి చేసి జాబితాను సిద్ధం చేశారు. హాలియా మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 12,770 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 6,388 మంది కాగా స్త్రీలు 6,382 మంది ఉన్నారు. దీనిలో బీసీ ఓటర్లు మొత్తం 8,242 మంది ఉండగా పురుషులు 4,118 మంది, స్త్రీలు 4,124 మంది ఉన్నారు. అదే విధంగా ఎస్సీ ఓటర్లు మొత్తం 1,703 మంది ఉండగా వీరిలో పురుషులు 850 మంది కాగా స్త్రీలు 853 మంది ఉన్నారు. ఎస్టీ ఓటర్లు మొత్తం 479 మంది కాగా వీరిలో పురుషులు 220 మంది, స్త్రీలు 259 మంది ఉన్నారు. ఓసీ ఓటర్లు 2,346 మంది ఉండగా పురుషులు 1,200 మంది, స్త్రీలు 1,146 మంది ఉన్నారు. హాలియా మున్సిపాలిటీ పరిధిలో బీసీ ఓటర్లు ఎక్కువగా ఉండడం గమనార్హం. మున్సిపాలిటీ పరిధిలో చేపట్టిన ఓటర్ల ఆధారంగా రిజర్వేషన్లు ఖరారు కానున్నాయి. మున్సిపాలిటీ పరి«ధిలోని ఓటర్ల జాబితాపై అభ్యంతరాలను త్వరలో స్వీకరించి వాటిని పరిష్కరిస్తారు. మున్సిపాలిటీలో విలీనమైన కాలనీలు.. హాలియా మున్సిపాలిటీల్లో విలీనమైన కాలనీలు ఇలా ఉన్నాయి. అనుముల, అనుములవారిగూడెం, ఈశ్వర్‌నగర్, సాయిప్రతాప్‌నగర్, గంగారెడ్డినగర్, వీబీనగర్, గణేష్‌నగర్, ఎస్సీ కాలనీ, సాయినగర్ కాలనీ, శాంతినగర్, వీరయ్యనగర్, అంగడి బజార్, రెడ్డికాలనీ, బీసీకాలనీ, హనుమాన్‌నగర్, కేవీ కాలనీ, ఎస్సీ, బీసీ కాలనీ, ఎస్టీ కాలనీ, ఇబ్రహీంపేట, అలీనగర్ కాలనీలను కలుపుతూ 12 వార్డులుగా విభజించారు. నందికొండ మున్సిపాలిటీలో తేలిన లెక్క నాగార్జునసాగర్ : నందికొండ మున్సిపాలిటీలో గల హిల్‌కాలనీ, పైలాన్ కాలనీల్లోని 12వార్డుల్లో సామాజిక వర్గాల వారిగా గల ఓటర్ల లెక్కను తేల్చారు. ఓటర్ల సంఖ్య 12,800మంది ఉండగా బీసీ ఓటర్లు 6,839మంది ఉన్నారు. పురుష ఓటర్లు 6,204మంది ఉండగా మహిళా ఓటర్లు 6,596 మంది ఉన్నారు. ఎస్సీ ఓటర్లు 2,941 మంది ఉండగా ఎస్టీ ఓటర్లు 716 మంది ఉన్నారు. ఓసీ ఓటర్ల సంఖ్య 2,304 మంది ఉన్నారు. -
బ్యాలెట్ పేపర్ రె‘ఢీ’
సాక్షి,ఆరసవల్లి: స్థానిక సమరానికి ముహూర్తం సమీపిస్తోంది. పంచాయతీ ఎన్నికలను సకాలంలో నిర్వహించేందుకు నడుం కట్టిన రాష్ట్ర ఎన్ని కల కమిషన్ సన్నాహాలకు అనుగుణంగానే ప్రభుత్వ అధికారులు విధుల్లో స్పీడ్ పెంచా రు. ఈ క్రమంలో కీలకమైన బ్యాలెట్ ముద్రణకు సన్నాహాలు మొదలుపెట్టారు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల ఓటరు జాబితా ఆధారంగా ఇప్పటికే గ్రామీణ ఓటర్ల జాబితా రూపకల్పన పూర్తయ్యింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కులాలవారీగా ఓటర్ల తుది జాబితాను ఈనెల 18న, అలాగే పోలింగ్ కేంద్రాల తుది జాబితాను ఈనెల 20న అధి కారికంగా ప్రకటించేందుకు జిల్లా పంచాయతీ అధికారులు సన్నద్ధమవుతుండగా, మరోవైపు బ్యాలెట్ పేపర్ల ముద్రణకు అధి కారులు అడుగులు వేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ క్షణంలో గ్రీన్ సిగ్నల్ వచ్చినా.. ఎన్నికలను నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలియజేసేందుకు ఎన్నికల సంఘం జోరు పెంచింది. తాజాగా జిల్లాలోని గ్రామ సర్పంచులకు, వార్డు మెంబర్లకు వేర్వేరుగా బ్యాలెట్ పేపర్ల ముద్రణకు మొత్తం 26 మెట్రిక్ టన్నుల పేపర్‌ను స్థానిక ప్రభుత్వ ప్రాంతీయ ముద్రణ కేంద్రానికి సరఫరా చేసింది. జిల్లా జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో కొనుగోలు కమిటీ టెండర్లను పిలిచి.. ధరలను ఖరారు చేయనుంది. ఆ వెంటనే బ్యాలె ట్ పేపర్ ముద్రణ ప్రారంభించనున్నారు. స్థానిక ఎన్నికల్లో తొలిసారి.. నోటా! త్వరలో జరుగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మొట్టమొదటిసారిగా బ్యాలెట్ పేపర్లో ‘నోటా’ గుర్తు కూడా ఉండేలా ఎన్నికల సంఘం అధికారులు చర్యలు చేపట్టారు. ఇంతవరకు సార్వత్రిక ఎన్నికల్లోనే కనిపించిన ఈ నోటా చిహ్నం ఇప్పుడు పంచాయతీలకు చేరింది. రాజకీయ పార్టీల గుర్తులకు సంబంధం లేకుండా జరుగనున్న పంచాయతీ ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన గుర్తులతో వివిధ రకాల బ్యాలెట్ పేపర్లు ముద్రించనున్నారు. ఇద్దరు అభ్యర్థులు పోటీ చేస్తే అక్కడికి సరఫరా చేసేందుకు వీలుగా రెండు గుర్తులు, ఒక నోటా గుర్తు ఉండేలా బ్యాలెట్ పేపర్ ముద్రించనున్నారు. ఏ గ్రామ పంచాయతీలో ఎంతమంది అభ్యర్థులు రంగంలో ఉంటారనే సంఖ్య తేలిన అనంతరం దాని ఆధారంగా ఆయా ప్రాంతాలకు బ్యాలెట్ పేపర్లను పంపించనున్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా, ఈ బ్యాలెట్ పేపర్లు ఉపయోగకరంగా ఉంటాయి. సర్పంచులకు పింక్, వార్డు మెంబర్లకు వైట్.. బ్యాలెట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి సర్పంచ్ ఎన్నికకు 13 మెట్రిక్ టన్నుల పింక్ (గులాబీ) కలర్ బ్యాలెట్ పేపర్లు, వార్డు సభ్యుల కోసం 13 మెట్రిక్ టన్నుల వైట్ (తెలుపు) బ్యాలెట్ పేపర్లు వేర్వేరుగా జిల్లాకు కేటాయించారని జిల్లా పంచాయతీ అధికారి బి.కోటేశ్వరరావు చెప్పారు. జిల్లా ఎన్నికల అధికారుల ఆదేశాల మేరకు టెండర్ల ప్రక్రియ జరిగిన తర్వాత ప్రింటింగ్ ప్రారంభమవుతుందన్నారు. అలాగే ఈ ప్రక్రియను జూలై మొదటి వారంలో పూర్తి చేయాలని ఆదేశాలు అందాయని, 18న కులాల వారీగా ఓటర్ల జాబితా, 20న పోలింగ్ కేంద్రాల తుది జాబితాను ప్రకటిస్తామన్నారు. -
అనుకున్నదొక్కటి.. అయినది..
తెలంగాణ రాష్ట్రం ప్రకటించిన వెంటనే ఎన్నికల నగారా మోగడంతో ఎన్నికల షెడ్యూల్ వెలువడడంతో ఆశావహులు ఆరాట పడుతున్నారు. స్థానిక పోరులో ఎవరికీ ఈ అవకాశం దక్కనుందోనని పలువురు వేచి చూస్తున్నారు. ఆశావహులకు భంగపాటు ఎన్నికలకు ముందు సందడి చేసిన నాయకులు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడ్డాక మెత్తబడ్డారు. రాజకీయంగా తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని ప్రజలతో సంబంధాలు పెంచుకుని పలు కార్యక్రమాలు చేస్తూ వచ్చిన వారు ఎన్నికల వేళ నిమ్మకుండిపోయారు. రాజ కీయంగా ఎదగడానికి దోహదపడే ప్రాదేశిక ఎన్నికలు రావడం, అదీ పార్టీ గుర్తులతో పోటీ చేయాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ నాయకుల్లో నెలకొన్న నిరుత్సాహం ఏమిటీ అని ఆరా తీస్తే మాత్రం రిజర్వేషన్లు తెచ్చిన తంటానేనని తెలుస్తోంది. ఊహించని విధంగా స్థానిక రిజర్వేషన్లు ఖ రారు కావడంతో అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి బడా నేతల వెంట పరుగులు పెడుతున్నారు. రిజర్వేషన్లతో అన్ని వర్గాల నేతలకు అవకాశం కలిసి వచ్చినా ఆశపడ్డ వారికి మాత్రం భంగపాటుకు గురి చేశాయి. ఇందులో కవ్వాల్ నుంచి విడదీసి కామన్‌పల్లికి ప్రత్యేక స్థానం కల్పించారు. అయితే కామన్పల్లిలో అత్యధికంగా బీసీ, వెల్మ కులస్తులు పోటీలో పాల్గొనేందుకు సిద్ధంగా ఉండగా అనుకోకుండా ఎస్టీకి రిజర్వ్ కావడంతో ఆశావహులు భంగపడ్డారు. అదే విధంగా అత్యధికంగా ఓసీ, బీసీలు ఉన్న దేవునిగూడ ఎంపీటీసీ స్థానం ఎస్టీ మహిళకు కేటాయించడంతో రాజకీయాలు తలకిందులయ్యాయి. అంతే కాకుండా ఎంపీపీ రిజర్వేషన్ జనరల్ మహిళకు కేటాయించడం వల్ల అన్ని రాజకీయ పార్టీలు అర్హత గల మహిళల కోసం వెదుకులాట ప్రారంభించారు. అవకాశం రాని వారు మెత్తబడిపోగా, అనుకోని విధంగా అవకాశం రావడంతో కొందరు ఎగిరి గంతేస్తున్నారు. -
టీఢీపీ సంకుల సమరం
‘ఆలు లేదు.. చూలు లేదు... కొడుకు పేరు సోమలింగం..’ అన్నట్లు ఇంకా స్థానిక ఎన్నికలు జరగలేదు.. తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలవలేదు.. అప్పుడే ఆ పార్టీలో పలువురు మేయర్ సీటుపైన కర్చీఫ్ వేసేశారు. అందులోనూ ఒకే సామాజికవర్గానికి చెందిన నేతలంతా పోటీపడుతుండడం సం‘కుల’ సమరంలా మారిందని ఆ పార్టీలోని మిగిలిన నేతలే ముక్కున వేలేసుకుంటున్నారు. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల వరకు నేతలను, కార్యకర్తల్ని ఏదోవిధంగా కలిసికట్టుగా ఉంచాలని అధిష్టానం భావిస్తుంటే అర్థంతరంగా వచ్చిన స్థానిక సంస్థల ఎన్నికలు నేతల మధ్య మొండిచెయ్యి చూపేందుకు రంగం సిద్ధమవుతోంది. ఒకవైపు చంద్రబాబు పార్టీలో మహిళలకు పెద్దపీట వేస్తామని చెబుతుంటే.. మరోవైపు మహిళా అధ్యక్షురాలికి మొండి చెయ్యి చూపడంపై విమర్శలు వస్తున్నాయి. మరో సీనియర్ నేత కోగంటి రామారావుకు టికెట్ ఇచ్చే అవకాశం లేదని చెబుతున్నారు. ఆయన సతీమణి విమలకుమారి తాజా మాజీ కార్పొరేటర్. కోగంటి చంద్రబాబు పాదయాత్ర పైలాన్ నిర్మాణానికి రూ.40 లక్షల విలువైన స్థలం ఇచ్చారు. అటువంటి వ్యక్తిని మేయర్ పోటీ నుంచి తప్పించాలని ప్రయత్నిస్తున్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. ఇతర సామాజికవర్గాల నేతల ఆగ్రహం పార్టీలో బలమైన సామాజికవర్గానికి చెందిన నేతలు పోటీపడి పోట్లాడుకోవడాన్ని మిగిలిన సామాజికవర్గాల నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. పార్టీలోని కీలక పదవులతోపాటు ఎంపీ, ఎమ్మెల్యే టికెట్లు, కార్పొరేటర్ టికెట్లను సైతం వదలకుండా పోటీ పడుతుండడంతో మిగిలిన వర్గాలు కేవలం కాడిమోయడానికే తప్ప తమకు ఏమాత్రం గుర్తింపు లేదా అనే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. టీడీపీ నుంచి మూడుసార్లు కార్పొరేటర్‌గా గెలిచి, ఒకసారి ఫ్లోర్‌లీడర్‌గా పనిచేసిన ఎరుబోతు రమణరావు(బీసీ)కి ఇప్పటి వరకు డివిజన్‌ను ఖరారు చేయకపోవడమే ఇందుకు ఉదాహరణ. పార్టీ కష్టకాలంలో రమణరావు కౌన్సిల్లో ఒంటరి పోరాటం చేశారు. అభ్యర్థుల ఎంపిక విషయంలో కనీసం ఇటువంటి వ్యక్తుల్ని సంప్రదించకపోవడం పార్టీలో ఇతర సామాజికవర్గాలకు ఎంత ప్రాధాన్యత ఉందో అర్థమవుతోంది. -
ఎన్ని‘కలలే’!
సాక్షి, కరీంనగర్ : స్థానిక సంస్థలకు అనుకున్నట్టుగా ఎన్నికలు జరిగే అవకాశం కనిపించడం లేదు. మునిసిపల్, జిల్లా, మండల పరిషత్ ఎన్నికలు జరుపుతామని ప్రకటించిన ప్రభుత్వం ఇందుకోసం కసరత్తు ప్రారంభించింది. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి డివిజన్లు, వార్డుల వారీగా రిజర్వేషన్ల ఖరారు కూడా పూర్తయింది. జిల్లా, మండల పరిషత్ ఎన్నికల నిర్వహణ కోసం మండల ప్రాదేశిక నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను ప్రారంభించారు. పునర్విభజనపై వచ్చిన అభ్యంతరాలను సోమవారం పరిష్కరించవలసి ఉంది. ఒకవైపు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నా.. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో ఎన్నికల నిర్వహణ సాధ్యం కాకపోవచ్చునని భావిస్తున్నారు. జిల్లాలో రెండు మున్సిపల్ కార్పొరేషన్లు, నాలుగు మున్సిపాలిటీలు, ఐదు నగర పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సింది. ఓటర్ల జాబితాలను సిద్ధం చేయడంతో పాటు డివిజన్, వార్డు సభ్యుల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. మేయర్, చైర్మన్ పదవులకు రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది. పోలింగ్ కేంద్రాల గుర్తింపు తదితర ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. కోర్టు ఆదేశాల ప్రకారం మున్సిపల్ ఎన్నికలు వచ్చేనెల 2లోగా పూర్తి చేయాల్సి ఉంది. ప్రభుత్వ సన్నద్ధత, ప్రస్తుత పరిస్థితుల నేపధ్యంలో ఇది సాధ్యం కాదు కాబట్టి మరికొంత సమయం కోరాలని ప్రభుత్వం భావిస్తోంది. మున్సిపల్ ఎన్నికలు పూర్తి కాగానే జిల్లా, మండల పరిషత్‌లకు ఎన్నికలు జరపాలని భావించారు. ఇందుకు సంబంధించిన కార్యాచరణ ఈ మధ్యే ప్రారంభమైంది. కొత్త జనాభా లెక్కలకనుగుణంగా ఎంపీటీసీ స్థానాల విభజన జరిగింది. ఎన్నికల నిర్వహణ కోసం ఇంకా సుదీర్ఘ కసరత్తు చేయాల్సి ఉంటుంది. ఈ నెల 28న ఎంపీటీసీ స్థానాల తుది జాబితా ప్రకటిస్తారు. ఎంపీటీసీ సభ్యులు, మండల పరిషత్ అధ్యక్షులు, జెడ్పీటీసీ, జెడ్పీ చైర్మన్ పదవుల రిజర్వేషన్లను ఖరారు చేయడం దగ్గర నుంచి అనేక చర్యలను తీసుకోవాల్సి ఉంటుంది. ఈ వ్యవహారం సజావుగా పూర్తి చేయడం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంతవరకు సాధ్యమన్న అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. ఇరు ప్రాంతాల్లో ప్రశాంత పరిస్థితి నెలకొంటేనే ఎన్నికల ప్రక్రియ ముందుకు వెళ్తుందని అధికారులు చెప్తున్నారు. అధికారికంగా ఎలాంటి సమాచారం లేకపోయినా, ఎన్నికలకు సంబంధించి ఇంతకు ముందటి హడావుడి కనిపించడంలేదు. ప్రక్రియ మందగించడాన్ని బట్టి ఎన్నికలు ఇప్పట్లో ఉండవని అధికారులు నిర్ధారణకు వచ్చారు. స్థానిక ఎన్నికల్లో సత్తా చాటుకోవాలని చాలా కాలంగా ఎదురుచూస్తున్న క్షేత్రస్థాయి నాయకులకు ఇది ఆశనిపాతంగా మారింది.