స్థానిక సంస్థలకు త్వరలో ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే ఓటర్ల జాబితా సవరణ, పోలింగు కేంద్రాల గుర్తింపు ప్రక్రియను పూర్తి చేశారు. సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలకు అవసరమయ్యే బ్యాలెట్ పత్రాలు సైతం జిల్లాకు చేరుకున్నాయి. దీంతో రెండు..మూడు నెలల్లో ఎన్నికలను పూర్తి చేసేందుకు అధికార యంత్రాంగం సన్నాహాలను ముమ్మరం చేసింది.
మహారాణిపేట (విశాఖ దక్షిణ): స్థానిక సంస్థలకు త్వరలోనే ఎన్నికలు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఎన్నికలకు అవసరమయ్యే కసరత్తును అధికారులు ముమ్మరం చేయడం చూస్తుంటే అక్టోబర్ లేదా నవంబర్‌లో ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి. గ్రామ, మండల, జిల్లా పరిషత్ ఎన్నికలకు అవసరమైన ఓటర్ల జాబితాను సైతం అధికారులు తయారు చేశారు. ఓటర్ల జాబితాను కూడా ఇప్పటికే ప్రకటించారు. జిల్లాలోని 39 మండలాల పరిధిలో 924 గ్రామ పంచాయతీల్లో ఓటర్ల జాబితా సిద్ధమైంది. దీంతో గ్రామ పంచాయతీలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు కొద్ది రోజుల తేడాతో పూర్తి చేసేందుకు వీలుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముందుగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించే అవకాశాలున్నాయి. ఎన్నికల సంఘం ఏక్షణంలో షెడ్యుల్ ప్రకటించినా ఎన్నికల నిర్వహణకు జిల్లా అధికారులు సన్నద్ధంగా ఉన్నారు. జిల్లాలో 924 గ్రామపంచాయతీల్లో 18,2730 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 8,85,005 మంది పురుష, 9,17,654 మంది మహిళ, 71 మంది ఇతర ఓటర్లు ఉన్నారు.
రిజర్వేషన్ల కోసం ఎదురు చూపులు !
పంచాయతీ రిజర్వేషన్ల కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం 60 శాతం రిజర్వేషన్లు ఉన్నాయి. అయితే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రిజర్వేషన్లు 50 శాతం మించకూడదు. దీంతో ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లను 50 శాతానికి తగ్గించవలసి ఉంది. దానికి చట్ట సవరణ చేయాలి. చట్ట సవరణ కోసం ఆర్డెన్స్‌గాని లేదా అసెంబ్లీలో సవరణ అయినా చేయవలసి ఉంది. దాని తర్వాత రిజర్వేషన్ల విధి విధానాల ప్రకటన వెలువడుతోంది. ప్రభుత్వ విధి విధానాల తరువాత రెవెన్యూ డివిజనల్ అధికారులు రిజర్వేషన్లు ఖరారు చేస్తారని పంచాయతీ అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ ప్రక్రియ కూడా కొద్ది రోజుల్లోనే పూర్తి చేసే అవకాశాలున్నాయి.
జిల్లాకు చేరిన బ్యాలెట్ పత్రాలు
ఎన్నికల నిర్వహణకు ప్రధానంగా అవసరమయ్యే బ్యాలెట్ పత్రాలు జిల్లాకు చేరుకున్నాయి. మొత్తం 26 టన్నుల బ్యాలెట్ పత్రాలు అవసరంగా అధికారులు గుర్తించారు. సర్పంచ్ ఓటుకు గులాబి, వార్డు సభ్యునికి తెలుపు రంగు బ్యాలెట్‌ను ఎంపిక చేసినట్టు తెలిసింది. అలాగే అదనంగా మరో పది శాతం బ్యాలెట్ పత్రాలు అందుబాటులో ఉంచనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment