టీఢీపీ సంకుల సమరం
‘ఆలు లేదు.. చూలు లేదు... కొడుకు పేరు సోమలింగం..’ అన్నట్లు ఇంకా స్థానిక ఎన్నికలు జరగలేదు.. తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలవలేదు.. అప్పుడే ఆ పార్టీలో పలువురు మేయర్ సీటుపైన కర్చీఫ్ వేసేశారు. అందులోనూ ఒకే సామాజికవర్గానికి చెందిన నేతలంతా పోటీపడుతుండడం సం‘కుల’ సమరంలా మారిందని ఆ పార్టీలోని మిగిలిన నేతలే ముక్కున వేలేసుకుంటున్నారు.
లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల వరకు నేతలను, కార్యకర్తల్ని ఏదోవిధంగా కలిసికట్టుగా ఉంచాలని అధిష్టానం భావిస్తుంటే అర్థంతరంగా వచ్చిన స్థానిక సంస్థల ఎన్నికలు నేతల మధ్య మొండిచెయ్యి చూపేందుకు రంగం సిద్ధమవుతోంది. ఒకవైపు చంద్రబాబు పార్టీలో మహిళలకు పెద్దపీట వేస్తామని చెబుతుంటే.. మరోవైపు మహిళా అధ్యక్షురాలికి మొండి చెయ్యి చూపడంపై విమర్శలు వస్తున్నాయి. మరో సీనియర్ నేత కోగంటి రామారావుకు టికెట్ ఇచ్చే అవకాశం లేదని చెబుతున్నారు.
ఆయన సతీమణి విమలకుమారి తాజా మాజీ కార్పొరేటర్. కోగంటి చంద్రబాబు పాదయాత్ర పైలాన్ నిర్మాణానికి రూ.40 లక్షల విలువైన స్థలం ఇచ్చారు. అటువంటి వ్యక్తిని మేయర్ పోటీ నుంచి తప్పించాలని ప్రయత్నిస్తున్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది.
ఇతర సామాజికవర్గాల నేతల ఆగ్రహం
పార్టీలో బలమైన సామాజికవర్గానికి చెందిన నేతలు పోటీపడి పోట్లాడుకోవడాన్ని మిగిలిన సామాజికవర్గాల నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. పార్టీలోని కీలక పదవులతోపాటు ఎంపీ, ఎమ్మెల్యే టికెట్లు, కార్పొరేటర్ టికెట్లను సైతం వదలకుండా పోటీ పడుతుండడంతో మిగిలిన వర్గాలు కేవలం కాడిమోయడానికే తప్ప తమకు ఏమాత్రం గుర్తింపు లేదా అనే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. టీడీపీ నుంచి మూడుసార్లు కార్పొరేటర్‌గా గెలిచి, ఒకసారి ఫ్లోర్‌లీడర్‌గా పనిచేసిన ఎరుబోతు రమణరావు(బీసీ)కి ఇప్పటి వరకు డివిజన్‌ను ఖరారు చేయకపోవడమే ఇందుకు ఉదాహరణ.
పార్టీ కష్టకాలంలో రమణరావు కౌన్సిల్‌లో ఒంటరి పోరాటం చేశారు. అభ్యర్థుల ఎంపిక విషయంలో కనీసం ఇటువంటి వ్యక్తుల్ని సంప్రదించకపోవడం పార్టీలో ఇతర సామాజికవర్గాలకు ఎంత ప్రాధాన్యత ఉందో అర్థమవుతోంది.