టీ–కాంగ్రెస్‌లో ‘టీఎస్‌ కాంగ్రెస్‌!’ | Sakshi Editorial On Telugu Desam Party Leaders In Telangana Congress Party Facing Critical Situation | Sakshi
Sakshi News home page

టీ–కాంగ్రెస్‌లో ‘టీఎస్‌ కాంగ్రెస్‌!’

Published Sun, Jan 2 2022 1:15 AM | Last Updated on Sun, Jan 2 2022 1:24 AM

Sakshi Editorial On Telugu Desam Party Leaders In Telangana Congress Party Facing Critical Situation

టీ–కాంగ్రెస్‌కూ టీఎస్‌ కాంగ్రెస్‌కు తేడా ఏముంటుంది? వడ్ల గింజలో బియ్యం గింజ. రెండూ ఒకటే. కానీ తేడా ఉందట! ఈమధ్య ఒక కాంగ్రెస్‌ నాయకుడు ‘మమ్మల్ని టీ కాంగ్రెస్‌ అనకండి ప్లీజ్‌. ఇబ్బందిగా ఉంది. కావాలంటే టీఎస్‌ కాంగ్రెస్‌ అని రాసుకోండి’ అన్నారట! అలా ఎందుకంటున్నారో చెప్ప మని అడిగితే బాగా ఆలోచించండి... మీకే అర్థమవుతుందని తప్పించుకున్నాడట!

తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీకి తెలుగుదేశం పార్టీ రక్తాన్ని బాగా ఎక్కించిన తర్వాత పాత కాంగ్రెస్‌ నాయకులు చాలామంది ఉక్కపోతకు గురవుతున్న సంగతి తెలిసిందే. వాళ్లకు టీ అనే శబ్దంలో తెలుగుదేశమే ధ్వనిస్తున్నదట. జగ్గారెడ్డి ఎపిసోడ్‌ తర్వాత రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ రెండు వర్గాలుగా చీలి ఉన్నట్టు స్పష్టంగా వెల్లడైంది. కాంగ్రెస్‌ పార్టీ అన్నాక ఓ ఇరవై ముప్ఫయ్‌ గ్రూపులుండటం ఆమోదయోగ్యమే కదా! రెండు వర్గాలుగా విడిపోతేనే కంగారెందుకు అనే అనుమానం సహజం. కానీ ఈ తాజా రెండు వర్గాలకు ప్రాతిపదిక ‘రక్తసంబంధం’. సెంటి మెంట్‌ బాగా వర్కవుట్‌ అవుతున్నట్టు కనిపిస్తున్నది. బ్లడ్‌ గ్రూప్‌ మ్యాచ్‌ కావడం లేదని పాతవాళ్ల అభియోగం.

రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తన వ్యవహార శైలిని మార్చుకోవాలనీ, లేదంటే ఆయన్నే మార్చాలని పార్టీ అధ్యక్షు రాలికి జగ్గారెడ్డి రాసిన లేఖ పెద్ద కలకలాన్నే సృష్టించింది. ఆ లేఖ మీడియాకు లీకవడం క్రమశిక్షణా రాహిత్యం కిందకే వస్తుందని క్రమశిక్షణా సంఘం అధ్యక్షుడు చిన్నారెడ్డి తేల్చారు. వివరణ కోసం జగ్గారెడ్డిని పిలుస్తామని కూడా చిన్నారెడ్డి చెప్పారు. కానీ జగ్గారెడ్డి ఏమాత్రం తగ్గలేదు. ‘కబాలి’ సినిమాలో రజనీకాంత్‌ ‘క... బా... లి... రా’ అని చెప్పినంత నిబ్బరంగా, ధీమాగా సమాధానం చెప్పారు. క్రమశిక్షణా కమిటీ ముందు హాజరు కావలసి వస్తే ముందుగా రేవంత్‌రెడ్డే హాజరు కావలసి ఉంటుందని జగ్గారెడ్డి కౌంటర్‌ ఇచ్చారు.

రాష్ట్రంలోని పాత కాంగ్రెస్‌ నాయకులందరికీ అధిష్ఠానం వైఖరి స్పష్టంగా తెలుసు. రేవంత్‌రెడ్డి నాయకత్వంలోనే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ పోరాడాలని ఢిల్లీ నేతలు భావిస్తున్నారు. కాంగ్రెస్‌ అధినాయకత్వంతో ముఖ్యంగా రాహుల్‌తో చంద్ర బాబుకు తెరచాటు అనుబంధాలు బలంగా ఉన్నాయనే సంగతి కూడా తెలిసిందే. ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పైన తప్పుడు కేసులు పెట్టే సమయంలో కుదిరిన సఖ్యత క్రమంగా గట్టిపడుతూ వచ్చింది. మొన్నటి సాధారణ ఎన్నికల్లోనూ, అంతకుముందు జరిగిన కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ పార్టీకి మాటసాయం, ‘మూట’సాయం చంద్రబాబు బాగానే చేశారని వెల్లడైంది. ఆయన ప్రభావం వల్లనైతేమీ, మరే ఇతర కారణం వల్లనైతేమీ రేవంత్‌ నాయకత్వాన్ని మార్చే ఉద్దేశం హైకమాండ్‌కు లేదని చెబుతారు. ఈ విషయాలు తెలిసిన తర్వాత కూడా జగ్గారెడ్డి ధిక్కార స్వరానికి కారణమేమిటి? ఆయనిప్పుడు పాడిన పాట ఒంటరి పాటగానే మిగులుతుందా? భవిష్యత్తులో బృందగానంగా మారుతుందా? అసలు కాంగ్రెస్‌ పార్టీలో ఏం జరుగుతున్నది?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్‌ ప్రకారం ఇంకా రెండేళ్ల కంటే కొంచెం తక్కువ సమయమే వున్నది. కానీ షెడ్యూల్‌ కంటే ముందే కేసీఆర్‌ ఎన్నికలకు వెళ్తారనే అంచనాలు రాజకీయ వర్గాల్లో ఉన్నాయి. ఈ సంవత్సరం రెండో అర్ధభాగం నుంచే ఎన్నికల మోడ్‌లోకి తెలంగాణ వెళ్లవచ్చు. దేశంలో ఉన్న రెండు ప్రధాన జాతీయ పార్టీలు తెలంగాణపై ఆశలు పెంచు కున్నాయి. కేసీఆర్‌కు ఇది రెండో ఇన్నింగ్స్‌ కనుక అంతో ఇంతో నెగెటివ్‌ ఓటు ఉండే అవకాశం ఉందనీ, దాన్ని సానుకూలంగా మార్చుకోవాలనీ అవి భావిస్తున్నాయి. క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్‌ పార్టీ పునాదులు ఇంకా పదిలంగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. దేశవ్యాప్తంగా ఉన్న నిరుత్సాహకర వాతావరణంలో తెలంగాణ గెలుపు ఆ పార్టీకి సంజీవనిగా తోడ్పడుతుంది.

భారతీయ జనతా పార్టీకి కర్ణాటక తర్వాత మరో స్థావరం దక్షిణాదిలో ఇంతవరకూ దొరకలేదు. ఏపీ, కేరళ, తమిళ నాడులతో పోలిస్తే ఆ పార్టీ పలుకుబడి తెలంగాణలోనే ఎక్కువ. ఒక సంపూర్ణ జాతీయ పార్టీగా పూర్వపు కాంగ్రెస్‌ స్థాయిని అందుకోవాలంటే తెలంగాణను గెలుచుకోవలసిన అవసరం ఉన్నది. ఈ నేపథ్యంలో రెండు పార్టీలు వాటి వ్యూహాలను రూపొందిస్తున్నాయి. రెండు నెలలకోమారు సర్వేలు చేసి ప్రజల నాడిని పసిగట్టే ప్రయత్నం చేస్తున్నాయి. రెండు పార్టీల సర్వే ల్లోనూ ఫలితాలు దాదాపుగా ఒకే మాదిరిగా వస్తున్నాయట. రాష్ట్రంలో ఏకైక పెద్దపార్టీగా టీఆర్‌ఎస్‌ సుమారు 40 శాతం ఓటు బ్యాంకుతో స్థిరంగా కొనసాగుతున్నది. జాతీయ పార్టీల అంచనా ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో కూడా టీఆర్‌ఎస్‌ ఓటు 38 శాతం కంటే తగ్గదు. 42 శాతం మించి పెరగదు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్‌ పార్టీకి 25 నుంచి 27 శాతం మంది, బీజేపీకి 13 నుంచి 15 శాతం మంది ఓట్లేస్తారని ఆ పార్టీలు ఒక నిర్ధారణకు వచ్చినట్టు కనిపిస్తున్నది. ఈ మూడు ప్రధాన పార్టీలకు ఓట్లేసేవారు మొత్తం ఓటర్లలో 80 శాతం మంది. ఇతర పార్టీలకూ, ఇండిపెండెంట్లకూ కలిపి ఐదారు శాతం ఓట్లు పడ్డా మిగిలిన పద్నాలుగు, పదిహేను శాతం మంది ఇప్పటికీ తటస్థంగానే మిగిలిపోయారు. ఈ బెంచి మార్కు నుంచిరెండు జాతీయ పార్టీలు వాటి కార్యాచరణను సిద్ధం చేసు కుంటున్నాయి.

కుమ్ములాటలు లేకుండా పార్టీ శ్రేణులను ఏకతాటిపై నడిపినట్లయితే, క్షేత్రస్థాయిలో ప్రజల పక్షాన నిలబడినట్లయితే ఎన్నికల నాటికి తమ పార్టీ పుంజుకొని మంచి ఫలితాలు సాధించగలుగుతుందని కాంగ్రెస్‌ భావిస్తున్నది. కాంగ్రెస్‌ కంటే బీజేపీ ముందున్నది ఇంకా పెద్ద టాస్క్‌. యథాతథంగా చూస్తే అధికార పీఠానికి కాంగ్రెస్‌ కంటే బీజేపీ ఇంకొంచెం ఎక్కువ దూరంలో ఉన్నది. ఈ సవాల్‌ను ఎదుర్కోవడానికీ, కాంగ్రెస్‌ను తోసిరాజని ప్రధాన పోటీదారుగా నిలవడానికీ తెరవెనుక ముమ్మర ప్రయత్నాలు బీజేపీ చేస్తున్నట్టు సమాచారం. పంజాబ్‌ మోడల్‌ను తెలంగాణలో అమలు చేసేందుకు కొన్ని ప్రయ త్నాలు జరుగుతున్నట్టు తెలుస్తున్నది. కాంగ్రెస్‌ పార్టీ బలంగా ఉన్న రాష్ట్రాల్లో పంజాబ్‌ ఒకటి. రైతుల ఆందోళన తర్వాత బీజేపీ మరింత బలహీనపడింది. కాంగ్రెస్‌ పార్టీ అంతఃకలహాలను అవకాశంగా మలుచుకొని ఒక గట్టి అలయెన్స్‌లో భాగం కాగలిగింది. కాంగ్రెస్‌ నుంచి కెప్టెన్‌ అమరీందర్‌సింగ్‌ చీలిక ఆ పార్టీకి శాపంగా మారింది. కెప్టెన్‌ నాయకత్వంలోని లోక్‌ కాంగ్రెస్‌తో కలిసి బీజేపీ పోటీలోకి దిగింది. ఈ ఫార్ములా తెలంగాణలో అమలుచేసే అవకాశాలపై ఇప్పటికే బీజేపీ కేంద్ర నాయకత్వానికి ఒక రాజకీయ వ్యవహారాల నిపుణుల బృందం ప్రాథమిక నివేదిక ఇచ్చినట్టు సమాచారం. టీ–కాంగ్రెస్‌ నాయ కత్వాన్ని మార్చేందుకు అధిష్ఠానం సుముఖంగా లేదనీ, అదే నాయకత్వంలో పనిచేయడానికి టీఎస్‌ కాంగ్రెస్‌ పాత నాయ కులు సిద్ధంగా లేరనీ, ఈ నేపథ్యంలో చీలిక తప్పక పోవచ్చుననీ ఆ నివేదికలో అభిప్రాయపడినట్టు తెలుస్తున్నది.

ఘనమైన చరిత్ర కలిగిన పార్టీని చంద్రబాబు వంటి అవకాశవాదికి పరోక్షంగా లీజుకు ఇవ్వడం కంటే, పార్టీ స్వచ్ఛతను కాపాడుకోవడానికి కొంతకాలం వేరుగా ఉండటమే మేలన్న అభిప్రాయాన్ని కొందరు కాంగ్రెస్‌ నేతలు వినిపిస్తు న్నారు. ఇందుకోసం వారు తమిళనాడులో మూపనార్‌ చేసిన ప్రయోగాన్ని ఉదాహరిస్తున్నారు. 1996 ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్‌ అధిష్ఠానం తమిళనాడులో అన్నాడిఎమ్‌కేతో పొత్తు కుదుర్చుకున్నది. జాతీయ స్థాయిలో ట్రబుల్‌ షూటర్‌గా పేరెన్నికగన్న తమిళనాడు కాంగ్రెస్‌ నాయకుడు జీకే మూపనార్‌ ఈ పొత్తును వ్యతిరేకించారు. జయలలితపై తీవ్రమైన ప్రజా వ్యతిరేకత ఉన్నదనీ, ఆమెతో పొత్తు వల్ల పార్టీ తుడిచి పెట్టుకుపోతుందనీ మూపనార్‌ వర్గం వాదించింది. అధిష్ఠానం అంగీకరించలేదు. దీనితో మూపనార్‌ నేతృత్వంలో మెజారిటీ కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు పార్టీ నుంచి చీలి ‘తమిళ మానిల కాంగ్రెస్‌’ (టీఎమ్‌సీ) పేరుతో వేరు కాపురం పెట్టారు. ఈ చీలిక కాంగ్రెస్‌తో డిఎమ్‌కే పొత్తు పెట్టుకొని 20 లోక్‌సభ సీట్ల్లను కేటాయించింది. తను 17 సీట్లలోనే పోటీ చేసింది. పోటీచేసిన అన్ని స్థానాలలోనూ ఈ కూటమి గెలిచింది. మెజా రిటీ అసెంబ్లీ సీట్లను తీసుకున్న డిఎమ్‌కే అధికారంలోకి వచ్చింది. అసెంబ్లీలో కూడా 40 సీట్లను టీఎమ్‌సీ గెలుచు కోగలిగింది. అన్నాడిఎమ్‌కేతో కలిసి పోటీచేసిన అధికార కాంగ్రెస్‌కు ఒక్క అసెంబ్లీ సీటు కానీ, పార్లమెంట్‌ సీటు కానీ దక్కలేదు. అప్పుడు కేంద్రంలో ఏర్పడిన యునైటెడ్‌ ఫ్రంట్‌ మంత్రివర్గంలో ‘తమిళ మానిల కాంగ్రెస్‌’ కీలకపాత్ర పోషిం చింది. ఆరేళ్ల తర్వాత తిరిగి ఆ పార్టీ మాతృసంస్థలో విలీన మైంది. తమిళనాడు కాంగ్రెస్‌ పార్టీని కాపాడుకున్న ఈ ఉదంతం ఇప్పుడు తెలంగాణా వ్యవహారాల్లో చర్చనీయాంశంగా మారింది.

తెలంగాణలో బీజేపీ ఆకాంక్షలకూ, టీఎస్‌ కాంగ్రెస్‌వాదుల అవసరాలకూ లంకె కుదిరితే కనుక అది కచ్చితంగా సత్ఫలితాలను సాధిస్తుందని మధ్యవర్తుల నమ్మిక. వారి అభిప్రాయం ప్రకారం బీజేపీతో చీలిక వర్గం జతకడితే మెజారిటీ కాంగ్రెస్‌ ఓట్లు వీరివైపే మొగ్గుతాయి. దాని ప్రభావంతో తటస్థుల ఓట్లను కూడా అధిక సంఖ్యలో ఆకర్షించగలుగుతారు. ఫలితంగా టీఆర్‌ఎస్‌కు గట్టి పోటీ దారుగా ఈ కూటమి నిలబడుతుంది. ఈరకమైన విశ్లేషణతో అందిన నివేదికపై బీజేపీ నాయకత్వం త్వరలోనే ఒక నిర్ణయం తీసుకోవచ్చు. ఈ వ్యవహారంలో బీజేపీ చొరవ తీసుకుంటే కాంగ్రెస్‌లో చీలిక తప్పకపోవచ్చుననే వాదన వినబడుతున్నది. ఇటువంటి ఒక రాజకీయ పొందిక ఏర్పాటు ద్వారా కేసీఆర్‌ను బలంగా ఎదుర్కోవాలని భావిస్తున్న కొందరు తటస్థ ప్రము ఖులు ఇటువైపునా అటువైపునా రాయబారులు నడుపు తున్నారు. వారు చెబుతున్న వివరాల ప్రకారం తొలిదశలో ‘ఆకర్ష్‌ బీజేపీ’ కార్యక్రమం ఉధృతంగా జరుగుతుంది. ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి జోరుగా చేరికలుంటాయి. రెండో దశలో కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు ముదిరి చీలిక ఏర్పడుతుంది.

తెలంగాణ స్టేట్‌ కాంగ్రెస్‌ (చీలికవర్గం)తో అవగాహన కుదిరిన తర్వాత వారికి కూడా ఆమోదయోగ్యమైన వ్యక్తిని ముఖ్యమంత్రిగా ప్రకటించే అవకాశం ఉంటుంది. ఈటల రాజేందర్, కిషన్‌రెడ్డి, బండి సంజయ్, డికె అరుణ, విజయ శాంతి... ఇలా అనేక ఆప్షన్లు బీజేపీ దగ్గర సిద్ధంగా ఉన్నాయి. కాంగ్రెస్‌ వర్గానికి ఎక్కువ అసెంబ్లీ సీట్లు వదిలి, పార్లమెంట్‌ సీట్లు బీజేపీ ఎక్కువ తీసుకునే అంశం కూడా చర్చకు రావచ్చు. అయితే ఈ ప్రయత్నాలన్నీ కూడా ప్రాథమిక స్థాయిలో, అంచనాల స్థాయిలోనే ఉన్నాయి. కార్యరూపం దాల్చాలంటే తెలంగాణ కాంగ్రెస్‌లో ఒక మూపనార్‌ ఉండాలి. ఎవరా మూపనార్‌?

వర్ధెల్లి మురళి 
vardhelli1959@gmail.com

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement