సర్కారు భూములకే ఎసరు
=ఓ సర్వేయర్ బాగోతం
=ఆయన ఆడిందే ఆట... పాడిందే పాట
=తప్పుడు సర్వేలతో ఖజానాకు ’2.30 కోట్ల నష్టం
తూనికలు కొలతల్లో కాంటా కొట్టినంత ఈజీగా... సర్వేయర్లు సర్కారు భూమిని కొల్లగొడుతున్నారు. గొలుసు కొలతల్లో చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఒక్కోచోట... ఒక్కో గజం మిగిలినా సరే.. అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. మిగుల్చుకుంటున్న భూములను రికార్డులకు దొరక్కుండా సొంతం చేసుకుంటున్నారు. ఇందులో ఎస్సారెస్పీ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ది అందెవేసిన చేయి. సర్కారు ఖజానాకు ఆయన నష్టం తెచ్చినట్లు నిర్ధారణ అయినా అధికారులు చోద్యం చూస్తున్నారు.
సాక్షి ప్రతినిధి, వరంగల్ : ప్రభుత్వ భూములను కాపాడాల్సిన బాధ్యత సర్వేయర్లపై ఉంది. దాన్ని విస్మరించిన కొందరు... సర్వే నంబర్ల హద్దులనే అటుదిటుగా మార్చేస్తున్నారు. రెండు రోజుల క్రితం వడ్డేపల్లి ప్రాంతంలోని ప్రశాంత్ నగర్‌లో వంద గజాల స్థలం ఓ ఎమ్మెల్యే కుటుం బీకులు, ఓ సర్వేయరు... మధ్యలో జోక్యం చేసుకున్న రియల్ గ్యాంగ్, సీఐ భార్యకు మధ్య జగడం పెట్టిం చిన విషయాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. మరింత లోతుగా ఆరా తీయడంతో ఇంటి నిర్మాణం చేపడుతున్న సర్వేయర్ దారబోయిన రవీందర్ లీలలు బయటపడ్డాయి.
ప్రస్తుతం ఎస్సారెస్పీలో డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న ఆయన గతంలో హన్మకొండ సర్వేయర్‌గా పనిచేశాడు. ఆ సమయంలో జిల్లా కేంద్రం చుట్టుపక్కల ఉన్న సర్కారు భూములను ప్రై వేట్ పట్టాదారులకు అప్పగించినట్లు ఆయనపై అభియోగాలు నమోదయ్యాయి. తప్పుడు సర్వేలతో సర్కారు భూమిని కొల్లగొట్టినందుకు రవీందర్‌పై చర్యలు తీసుకోవాలని అప్పటి జేసీ వాకాటి కరుణ స్పెషల్ చీఫ్ సెక్రటరీకి లేఖ రాశారు. గత ఏడాది జూన్ 23వ తేదీన (ఆర్‌సీ నంబర్ ఈ 4/3121) జేసీ పంపిన నివేదికలో ఉన్న వివరాల ప్రకారం...
కాజీపేట జాగీర్ గ్రామ పరిధి సర్వే నంబర్ 31, 27లోని ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైంది. అధికారులు విచారణ చేపట్టడంతో గతంలో ఆ స్థలాన్ని డీ మార్కేషన్ చేసిన సర్వేయర్ రవీందర్... 1.10 ఎకరాలకు సంబంధించి తప్పుడు రిపోర్టు ఇచ్చినట్లుగా తేలింది. సర్వే నంబర్ 31లో అప్పటికే ఇళ్లు, నిర్మాణాలు వెలిశాయి. అక్కడ ఉండాల్సిన పట్టా భూములు సైతం సర్వే నంబర్ 27లోని ప్రభుత్వ భూముల్లో ఉన్నట్లుగా తప్పుడు నివేదిక ఇచ్చినట్లుగా గుర్తించారు. దాదాపు 37 గుంటల భూమి ఆక్రమణకు గురైందని.. ఆ విషయాన్ని సర్వేయర్ ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టినట్లు ధ్రువీకరించారు.
అప్పటి మార్కెట్ రేటు ప్రకారం చదరపు గజానికి ’ 5,000 చొప్పున ’ 2.23 కోట్ల విలువైన సర్కారు భూమిని తప్పుడు సర్వేతో ఆక్రమణదారులకు దోచిపెట్టినట్లుగా లెక్కలేశారు. అదే తరహాలో హన్మకొండ మండలంలో లష్కర్ సింగారం గ్రామంలో సర్వే నంబర్ 326లో 23 గుంటల ప్రభుత్వ స్థలం, సర్వే నంబర్ 491లో ఐదు గుంటల స్థలానికి సంబంధించి హద్దులు నిర్ణయించే బాధ్యతను సర్వేయర్ రవీందర్‌కు తహసీల్దార్ అప్పగించారు. 326 సర్వే నంబర్‌లో ఉన్న 23 గుంటల స్థలాన్ని ఏకంగా పట్టాదారులకు సంబంధించిన సర్వే నంబర్25లో ఉన్నట్లుగా ఆయన నంబర్లు మార్చేసినట్లు తదుపరి విచారణలో తేలింది.
ఆ స్థలం ’ 7.26 లక్షల విలువైనదిగా అధికారులు అంచనా వేశారు. తమ దష్టికి వచ్చిన ఈ రెండు సంఘటనల్లోనూ రవీందర్ ఉద్దేశపూర్వకంగా తప్పులు చేసి సర్కారు ఖజానాకు నష్టం తెచ్చినట్లు జిల్లా యంత్రాంగం నిర్ధారించింది. కానీ.. ఫైలు ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉండడం గమనార్హం. తాజాగా ప్రశాంత్‌నగర్‌లో నిర్మాణంలో ఉన్న వివాదాస్పద స్థలం రవీందర్ భార్య పేరుతో ఉండడం గమనార్హం. మొత్తంగా సర్వేయర్ల లీలలు.. సర్కారు భూములు.. తప్పుడు కొలతలన్నీ.. యజమానుల మధ్య చిచ్చు పెడుతున్నట్లు ఈ సంఘటన రూఢీ చేసింది.