market rate
-
ఇక్కడ చికెన్ చీప్!
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోరోజువారీ ధరల ప్రకారం చికెన్ అమ్మకాలు సాగుతుంటే, కామారెడ్డి జిల్లా కేంద్రంలో మాత్రం మార్కెట్ రేట్ కన్నా కిలోకు రూ.30 తక్కువకు విక్రయిస్తుంటారు. ఎక్కడా కనిపించని పోటీ కామారెడ్డిలోనే ఉంటుంది. నాలుగైదేళ్ల కిందట మొదలైన పోటీ ఇప్పటికీ అలాగే కొనసాగుతోంది. ఇక్కడి దుకాణాల నిర్వాహకులు పేపర్ రేట్ కన్నా రూ.30 తక్కువ అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి మరీ విక్రయాల్లో పోటీ పడుతుంటారు. ఇక్కడ తక్కువ ధరకు దొరుకుతుండటంతో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చి మరీ చికెన్ కొనుగోలు చేస్తుంటారు. ముఖ్యంగా పెళ్లిళ్లు, ఫంక్షన్లకు క్వింటాళ్ల కొద్దీ చికెన్ కొనుగోలు చేస్తారు. సాధారణంగా పేపర్లో వచ్చే ధరల ప్రకారమే రాష్ట్రమంతటా చికెన్ అమ్ముతారు. అక్కడక్కడా ఐదో, పదో రూపాయలు తగ్గించి అమ్ముతారు. కానీ కామారెడ్డిలో మాత్రం అందుకు భిన్నంగా ఉంటుంది. కొందరు పేపర్ ధర కన్నా కిలోకు రూ.30 తక్కువకు అమ్ముతుండగా, ఇంకొందరు రూ.35 నుంచి రూ.40 తక్కువ కూడా విక్రయిస్తుంటారు.గురువారం పేపర్ ధర ప్రకారం స్కిన్‌తో చికెన్ ధర కిలోకు రూ.181 ఉండగా, కామారెడ్డిలో రూ.150కి అమ్మారు. అంటే కిలోకు రూ.31 తక్కువగా విక్రయించారు. అలాగే స్కిన్లెస్ చికెన్ కిలో పేపర్ ధర ప్రకారం రూ.206 ఉండగా, కామారెడ్డిలో రూ.180కి అమ్మారు. అంటే కిలోకు రూ.26 తక్కువకు అమ్మినట్లు స్పష్టమవుతోంది. లైవ్ బర్డ్ ధర కిలోకు రూ.128 ఉండగా, ఇక్కడ రూ.120కి అమ్ముతారు. మొత్తంగా ఏ దుకాణానికి వెళ్లినా మార్కెట్ ధర కన్నా తక్కువకే దొరుకుతుంది. టన్నుల కొద్దీ అమ్మకాలు.. కామారెడ్డి మార్కెట్లో నిత్యం 10 టన్నుల నుంచి 15 టన్నుల వరకు చికెన్ అమ్ముతుంటారు. ఆదివారం రోజైతే 40 టన్నుల నుంచి 50 టన్నుల వరకు అమ్ముడవుతోంది. వివిధ పౌల్ట్రీ సంస్థలు ఇక్కడ హోల్‌సేల్‌గా షాపులకు కోళ్లను సప్లై చేస్తాయి. కొందరు చికెన్ సెంటర్ల నిర్వాహకులకు సొంతంగా పౌల్ట్రీఫామ్‌లు కూడా ఉన్నాయి. ఇక్కడ కార్పొరేట్ సంస్థలకు చెందిన కోళ్ల అమ్మకాలు ఎక్కువగా జరుగుతాయని వ్యాపారులు తెలిపారు. వ్యాపారుల మధ్యన నెలకొన్న పోటీ మూలంగా కొనుగోలుదారులకు తక్కువ ధరకు చికెన్ లభిస్తోంది. రెగ్యులర్‌గా చికెన్ కొనుగోలు చేసే హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు మరింత తక్కువ ధరలకు అమ్ముతామని వ్యాపారులు చెబుతున్నారు. చుట్టుపక్కల మండలాల్లో ఎక్కువ ధరలకు.. కామారెడ్డి పట్టణానికి చుట్టుపక్కల ఉన్న మండలాలు, గ్రామాల్లో పేపర్ ధరకే చికెన్ అమ్ముతారు. కొన్ని చోట్ల పేపర్ ధర కన్నా ఎక్కువకే అమ్ముతుంటారు. కామారెడ్డి లో ధరలు తక్కువగా ఉన్నాయని, ఇక్కడ ఎక్కువ ఎందుకని ఎవరైనా వినియోగదారులు చుట్టుపక్కల మండలాల్లో వ్యాపారులను ప్రశ్నిస్తే.. అక్కడి ధర అక్కడే, ఇక్కడి ధర ఇక్కడే అని విక్రయదారులు చెబుతారు. ఈ నేపథ్యంలో కిలో, రెండు కిలోలు తీసుకునేవాళ్లు అందుబాటులో ఉన్న దుకాణాల్లో ధర ఎక్కువైనా కొనుగోలు చేస్తారు. అదే పెళ్లిళ్లు, ఫంక్షన్లు, పండుగల కోసం ఎక్కువ మొత్తంలో చికెన్ అవసరమైనపుడు మాత్రం కామారెడ్డిలో కొనుగోలు చేస్తుంటారు. ఎక్కువ మొత్తంలో కొంటే మరింత తక్కువ ధరకు ఇస్తుండడంతో గ్రామీణ ప్రాంతాల నుంచి చాలా మంది ఆటోలు, వ్యాన్లలో వచ్చి చికెన్ తీసుకుని వెళుతుంటారు. -
వెంకన్న లడ్డూకు‘అనంత’ పప్పుశనగ
అనంతపురం అగ్రికల్చర్ : తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని ప్రతిఒక్కరూ పరమపవిత్రంగా భావిస్తారు. అంతటి మహిమాన్వితమైన లడ్డూ తయారీకి అవసరమైన పదార్ధాల్లో చక్కెర, నెయ్యితో పాటు శనగపిండి కూడా ముఖ్యమైనది. ఇప్పుడా శనగపిండికి అవసరమైన పప్పుశనగను అనంతపురం జిల్లా నుంచి పంపిస్తున్నారు. అంటే లడ్డూ తయారీలో అక్కడి రైతులు పండిస్తున్న పప్పుశనగకు భాగస్వామ్యం దక్కుతోంది. పూర్తిగా ప్రకృతి సిద్ధంగా సాగుచేసిన పంటను సేకరించడానికి టీటీడీ సైతం చర్యలు చేపట్టింది. ప్రకృతి వ్యవసాయ విభాగం (జెడ్బీఎన్ఎఫ్) డీపీఎం లక్ష్మానాయక్ సహకారంతో ఈనెలాఖరున అవసరమైన పప్పుశనగను వెంకన్న సన్నిధికి చేర్చేందుకు ఏర్పాట్లుచేస్తున్నారు. 1,396 క్వింటాళ్లకు టీటీడీ ఆర్డర్ జెడ్బీఎన్ఎఫ్ విభాగం ఆధ్వర్యంలో తాడిపత్రి మండలం బొందలదిన్నె గ్రామంలో 57 మంది రైతులు సహజ పద్ధతుల్లో సాగుచేసిన 185 ఎకరాల్లోని దిగుబడి ఆధారంగా 1,396 క్వింటాళ్ల పప్పుశనగకు ఇటీవల టీటీడీ నుంచి ఆర్డర్ వచ్చినట్లు డీపీఎం లక్ష్మానాయక్ ‘సాక్షి’కి తెలిపారు. ఇక్కడి రైతులు ఎకరాకు 400 కిలోలు ఘన జీవామృతం, బీజామృతంతో విత్తనశుద్ధి, ప్రతి 20 రోజులకోసారి జీవామృతాన్ని పిచికారీ చేసి పప్పుశనగ పండిస్తున్నారని తెలిపారు. ఎక్కడా రసాయనాలు, పురుగు మందులు లేకుండా పూర్తిగా ఆవుపేడ, ఆవు మూత్రం, బెల్లం, శనగపిండి లాంటి వాటితో తయారుచేసిన ప్రకృతి సిద్ధమైన సేంద్రియ పోషకాలు వాడుతున్నారన్నారు. పప్పుశనగలో అంతర పంటలుగా సజ్జ, అనుము, అలసందతో పాటు ఆవాలు కూడా వేశారన్నారు. అందువల్లే ఎకరాకు 8 నుంచి 10 క్వింటాళ్లు నాణ్యమైన పప్పుశనగ దిగుబడులు వచ్చే పరిస్థితి ఉందన్నారు. ఈనెలాఖరున పంట తొలగించి నూర్పిడి చేసిన తర్వాత 1,396 క్వింటాళ్లు టీటీడీకి పంపించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. బహిరంగ మార్కెట్లో ఉన్న ధర కన్నా 20 శాతం అధికంగా రైతులకు ఇస్తున్నట్లు ఆయన వెల్లడించారు. క్వింటా ఎంతలేదన్నా రూ.7 వేలకు తక్కువ కాకుండా పలికే అవకాశం ఉందన్నారు. తిరుమల వెంకన్న ప్రసాదం తయారీకి తాము పండించిన పప్పుశనగ వినియోగించనుండటంతో రైతులు ఆనందం వ్యక్తంచేస్తున్నారని డీపీఎం లక్ష్మానాయక్ వెల్లడించారు. -
దయనీయ స్ధితిలో పసుపు రైతులు
-
మార్కెట్ విలువ ప్రకారం పరిహారమివ్వండి
అనంతపురం అర్బన్ : విడపనకల్లు మండలం డొనేకల్ గ్రామంలో గుత్తి–బెంగుళూరు జాతీయ రహదారి ఆనుకుని రైతుల భూములు ఉన్నాయని, వాటికి మార్కెట్ విలువ ప్రకారం పరిహారం వచ్చేలా చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ బి.లక్ష్మీకాంతం ను ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరెడ్డి కోరారు. జాయింట్ కలెక్టర్‌ను శనివారం ఆయన క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కలిసి పరిహారం అంశంపై మాట్లాడారు. ఇళ్ల స్థలాల కోసం రైతుల భూముల విలువ బేసిక్ విలువ ఎకరాకు రూ.3.50 లక్షలుగా ధర ను నిర్ధారణ చేశారని తెలిపారు. వాస్తవంగా ఇక్కడ మార్కెట్ విలువ ప్రకారం రూ.15 లక్షలు ఉందన్నారు. ప్రభుత్వం ఇక్కడి భూముల ధరలను తారతమ్యంగా నిర్ణయించిందని, దీని వల్ల రైతులు చాలా నష్టపోతారని చెప్పారు. ఎమ్మెల్యేతో పాటు జేసీని కలిసిన వారిలో గడేకల్ సర్పంచ్ పంపావతి, ఎంపీటీసీలు ప్రసాద్, ఓబిలేసు, వైఎస్సార్సీపీ నాయకులు డొనేకల్ హనుమంతు, రమేశ్, సురేష్, శివ, నారాయణస్వామి, లాయర్ గోపాల్, లేపాక్షి ఉన్నారు. -
తాండూరులో కందుల కొనుగోళ్లు ప్రారంభం
రంగారెడ్డి జిల్లా: తాండూరు వ్యవసాయ మార్కెట్ యార్డులో భారత ఆహార సంస్థ(ఎఫ్‌సీఐ) శుక్రవారం తొలిసారిగా కందుల కొనుగోళ్లను ప్రారంభించింది. కందుల కొనుగోలు కేంద్రంలో సగటు ధర రూ.11,800 చొప్పున రెండు క్వింటాళ్ల కందులను కొనుగోలు చేసింది. వందకు ఒక శాతం మార్కెట్ ఫీజుతోపాటు, ఏజెంట్‌కు కమీషన్ ఒక శాతం చొప్పున మర్పల్లికి చెందిన రైతు లక్ష్మారెడ్డి నుంచి ఎఫ్‌సీఐ కందులు కొనుగోలు చేసింది. మార్కెట్లో కందుల విక్రయంపై చెల్లించాల్సిన రెండు శాతం కమీషన్ లేకపోవడంతో ఎఫ్‌సీఐ కొనుగోలు కేంద్రంలో విక్రయించేందుకు రైతులు ఆసక్తిని చూపుతున్నారు. -
కొలతలతో కబ్జా
సర్కారు భూములకే ఎసరు =ఓ సర్వేయర్ బాగోతం =ఆయన ఆడిందే ఆట... పాడిందే పాట =తప్పుడు సర్వేలతో ఖజానాకు ’2.30 కోట్ల నష్టం తూనికలు కొలతల్లో కాంటా కొట్టినంత ఈజీగా... సర్వేయర్లు సర్కారు భూమిని కొల్లగొడుతున్నారు. గొలుసు కొలతల్లో చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఒక్కోచోట... ఒక్కో గజం మిగిలినా సరే.. అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. మిగుల్చుకుంటున్న భూములను రికార్డులకు దొరక్కుండా సొంతం చేసుకుంటున్నారు. ఇందులో ఎస్సారెస్పీ డిప్యూటీ ఇన్స్పెక్టర్ది అందెవేసిన చేయి. సర్కారు ఖజానాకు ఆయన నష్టం తెచ్చినట్లు నిర్ధారణ అయినా అధికారులు చోద్యం చూస్తున్నారు. సాక్షి ప్రతినిధి, వరంగల్ : ప్రభుత్వ భూములను కాపాడాల్సిన బాధ్యత సర్వేయర్లపై ఉంది. దాన్ని విస్మరించిన కొందరు... సర్వే నంబర్ల హద్దులనే అటుదిటుగా మార్చేస్తున్నారు. రెండు రోజుల క్రితం వడ్డేపల్లి ప్రాంతంలోని ప్రశాంత్ నగర్లో వంద గజాల స్థలం ఓ ఎమ్మెల్యే కుటుం బీకులు, ఓ సర్వేయరు... మధ్యలో జోక్యం చేసుకున్న రియల్ గ్యాంగ్, సీఐ భార్యకు మధ్య జగడం పెట్టిం చిన విషయాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. మరింత లోతుగా ఆరా తీయడంతో ఇంటి నిర్మాణం చేపడుతున్న సర్వేయర్ దారబోయిన రవీందర్ లీలలు బయటపడ్డాయి. ప్రస్తుతం ఎస్సారెస్పీలో డిప్యూటీ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న ఆయన గతంలో హన్మకొండ సర్వేయర్‌గా పనిచేశాడు. ఆ సమయంలో జిల్లా కేంద్రం చుట్టుపక్కల ఉన్న సర్కారు భూములను ప్రై వేట్ పట్టాదారులకు అప్పగించినట్లు ఆయనపై అభియోగాలు నమోదయ్యాయి. తప్పుడు సర్వేలతో సర్కారు భూమిని కొల్లగొట్టినందుకు రవీందర్‌పై చర్యలు తీసుకోవాలని అప్పటి జేసీ వాకాటి కరుణ స్పెషల్ చీఫ్ సెక్రటరీకి లేఖ రాశారు. గత ఏడాది జూన్ 23వ తేదీన (ఆర్సీ నంబర్ ఈ 4/3121) జేసీ పంపిన నివేదికలో ఉన్న వివరాల ప్రకారం... కాజీపేట జాగీర్ గ్రామ పరిధి సర్వే నంబర్ 31, 27లోని ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైంది. అధికారులు విచారణ చేపట్టడంతో గతంలో ఆ స్థలాన్ని డీ మార్కేషన్ చేసిన సర్వేయర్ రవీందర్... 1.10 ఎకరాలకు సంబంధించి తప్పుడు రిపోర్టు ఇచ్చినట్లుగా తేలింది. సర్వే నంబర్ 31లో అప్పటికే ఇళ్లు, నిర్మాణాలు వెలిశాయి. అక్కడ ఉండాల్సిన పట్టా భూములు సైతం సర్వే నంబర్ 27లోని ప్రభుత్వ భూముల్లో ఉన్నట్లుగా తప్పుడు నివేదిక ఇచ్చినట్లుగా గుర్తించారు. దాదాపు 37 గుంటల భూమి ఆక్రమణకు గురైందని.. ఆ విషయాన్ని సర్వేయర్ ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టినట్లు ధ్రువీకరించారు. అప్పటి మార్కెట్ రేటు ప్రకారం చదరపు గజానికి ’ 5,000 చొప్పున ’ 2.23 కోట్ల విలువైన సర్కారు భూమిని తప్పుడు సర్వేతో ఆక్రమణదారులకు దోచిపెట్టినట్లుగా లెక్కలేశారు. అదే తరహాలో హన్మకొండ మండలంలో లష్కర్ సింగారం గ్రామంలో సర్వే నంబర్ 326లో 23 గుంటల ప్రభుత్వ స్థలం, సర్వే నంబర్ 491లో ఐదు గుంటల స్థలానికి సంబంధించి హద్దులు నిర్ణయించే బాధ్యతను సర్వేయర్ రవీందర్‌కు తహసీల్దార్ అప్పగించారు. 326 సర్వే నంబర్లో ఉన్న 23 గుంటల స్థలాన్ని ఏకంగా పట్టాదారులకు సంబంధించిన సర్వే నంబర్25లో ఉన్నట్లుగా ఆయన నంబర్లు మార్చేసినట్లు తదుపరి విచారణలో తేలింది. ఆ స్థలం ’ 7.26 లక్షల విలువైనదిగా అధికారులు అంచనా వేశారు. తమ దష్టికి వచ్చిన ఈ రెండు సంఘటనల్లోనూ రవీందర్ ఉద్దేశపూర్వకంగా తప్పులు చేసి సర్కారు ఖజానాకు నష్టం తెచ్చినట్లు జిల్లా యంత్రాంగం నిర్ధారించింది. కానీ.. ఫైలు ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉండడం గమనార్హం. తాజాగా ప్రశాంత్‌నగర్‌లో నిర్మాణంలో ఉన్న వివాదాస్పద స్థలం రవీందర్ భార్య పేరుతో ఉండడం గమనార్హం. మొత్తంగా సర్వేయర్ల లీలలు.. సర్కారు భూములు.. తప్పుడు కొలతలన్నీ.. యజమానుల మధ్య చిచ్చు పెడుతున్నట్లు ఈ సంఘటన రూఢీ చేసింది. -
గ్యాస్‌కు నగదు బదిలీలో మాయాజాలం
సాక్షి, కాకినాడ :వంటగ్యాస్‌కు ప్రత్యక్ష నగదు బదిలీ గందరగోళంగా, వినియోగదారులకు భారంగా తయారైంది. బహిరంగ మార్కెట్లో ఉండే రేటుకు, బ్యాంకుఖాతాల్లో జమవుతున్న సబ్సిడీ మొత్తానికి పొంతన లేకుండా ఉండడంతో వినియోగదారులపై ప్రతి నెలా అదనపు భారం పడుతూనే ఉంది. మార్కెట్ రేటుకు, సబ్సిడీ మొత్తానికి మధ్య భారీ వ్యత్యాసం ఎందుకు ఉంటోందని ప్రశ్నిస్తే ఇటు డీలర్ల నుంచి కానీ, అటు అధికారుల నుంచి కానీ సమాధానం రావడం లేదు.జిల్లాలో గతేడాదివరకు 10,16, 660 గ్యాస్ కనెక్షన్లుండేవి. ఆర్నెల్లపాటు వినియోగంలో లేవనే సాకుతో వేసిన కోతల కారణంగా ప్రస్తుతం జిల్లాలో 8,79,507 కనెక్షన్లు మాత్రమే ఉన్నాయి. వీటిసంఖ్య మరింత తగ్గే అవకాశంఉంది. ఇలా తగ్గడం ఆయిల్కంపెనీల మాయాజాలంగానే పేర్కొనవచ్చు. ఇక అధికారిక లెక్కల ప్రకారం ప్రస్తుతం ఉన్న 8,79,507 కనెక్షన్లలో 7,67,099 కనెక్షన్లకు ఆధార్ సీడింగ్, 6,26,960 కనెక్షన్లకు సంబంధించి అకౌంట్ సీడింగ్ పూర్తి చేయగలిగారు. ఈ లెక్కన 87 శాతం ఆధార్, 71 శాతం అకౌంట్ సీడింగ్ పూర్తయినట్టయింది. రూపాయి పతనం సాకుతో ధర పెంపు నగదు బదిలీ అమలుకు ముందు సిలిండర్ ధర రూ.411గా ఉండేది. రవాణాఖర్చులు కలుపుకొని రూ.420కు ఇంటికి చేరేది. నగదు బదిలీ అమలు అనంతరం గతనెల వరకు బుక్ చేసుకున్న 24 గంటల్లో అకౌంట్ సీడింగ్ పూర్తయిన వినియోగదారుల ఖాతాలో అడ్వాన్స్ సబ్సిడీగా రూ.435 జమయ్యేది. నగదు బదిలీ ప్రారంభసమయంలో నాన్‌సబ్సిడీ సిలిండర్ ధర రూ.854.50 ఉండేది. సిలిండర్‌ను సబ్సిడీ మొత్తానికి రూ.443.50 కలిపి విడిపించుకోవల్సి వచ్చేది. ప్రారంభంలోనే వినియోగ దారునిపై సిలిండర్‌కు రూ.8.50 అదనపు భారం పడేది. జూన్ ఒకటి నుంచి నగదు బదిలీ అమలు లోకి వచ్చాక ఈ అదనపుభారం మోస్తూనే ఉన్నారు. నాన్‌సబ్సిడీ సిలిండర్ ధర అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ విలువను బట్టి ఆయిల్ కంపెనీలే నిర్ణయిస్తుంటాయి. రూపాయి భారీగా పతనమైందనే సాకుతో ఈ నెల ఒకటి నుంచి నాన్‌సబ్సిడీ సిలిండర్ ధరను రూ.998గా నిర్ణయించారు. ఆలెక్కన సబ్సిడీ మొత్తం రూ.587 జమ కావాలి. కానీ కేవలం రూ.534.49 మాత్రమే జమవుతోంది. అంటే సిలిండర్‌పై వినియోగదారుడు రూ.52.51ల మేర అదనపు భారం మోయాల్సి వస్తుంది. దీనికి తోడు ఇంటికి చేరవేయాలంటే సిలిండర్‌పై రూ.30 నుంచి రూ.50 వరకు గ్యాస్ డెలివరీ బాయిస్ వసూలు చేస్తున్నారు. ఈ లెక్కన వినియోగదారునిపై సుమారు రూ.100 వరకు అదనపు భారం పడుతోంది. ఇదంతా రూ.534.49ల చొప్పున సబ్సిడీ మొత్తం పడే వారికి. ఎత్తి వేసేందుకే ఈ ఎత్తుగడ..! కాగా శాఖల మధ్య సమన్వయ లోపం కారణంగా అకౌంట్ సీడింగ్ అయిన వారిలో మూడవ వంతు వినియోగదారులకు ఇంకా రూ.435 పాత సబ్సిడీ మొత్తమే జమవుతోంది. ఈలెక్కన ఇలాంటి వారిపై రవాణాఖర్చులు కాక రూ.152 అదనపు భారం పడుతుంది. పాత సబ్సిడీ మొత్తమే పడుతుందని పలువురు తమ వద్దకు వస్తున్నారని పలువురు ఏజెన్సీ నిర్వాహకులు చెబుతున్నారు. బుక్ చేసుకున్న తర్వాత రెండురోజుల వరకు సబ్సిడీ మొత్తం పడడం లేదనే ఫిర్యాదులు కూడా వస్తునాయి. ఒక వేళ జమైనా, ఒకేసారి ఏకంగా రూ.1050 (రవాణాతో కలిపి) చెల్లించి విడిపించుకోవాలంటే ఇబ్బందిగా మారిందని, ఆ సమయంలో చేతిలో డబ్బుల్లేకపోతే వడ్డీకి అప్పుసప్పో చేసి విడిపించుకోవల్సి వస్తుందని సామాన్యులు వాపోతున్నారు. ఒకవేళ పాతసబ్సిడీ మొత్తం జమైనా కంగారు పడనవసరం లేదని, ప్రస్తుత కొత్త సబ్సిడీకి మధ్య ఉన్న వ్యత్యాసం (మొత్తం) తర్వాత గ్యాస్‌బుక్ చేసుకున్నప్పుడు పడుతుందని అధికారులు చెబుతున్నారు. కానీ సబ్సిడీ మొత్తానికి, నాన్‌సబ్సిడీ సిలిండర్ ధరకు మధ్య వ్యత్యాసం కోసం అడిగితే మాత్రం తామేమీ చేయలేమని చెబుతున్నారు. భవిష్యత్‌లో ఇదే రీతిలో సబ్సిడీ పూర్తిగా ఎత్తి వేసేందుకే ప్రభుత్వం ఈ ఎత్తుగడ వేసిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
కూరలు కుతకుత!
‘దరికి రాబోను రాబోనూ రాజ’ అంటూ కూరగాయలు కూనిరాగాలు తీస్తున్నాయి! ఈ గానంతో సామాన్యుడు అదిరిపడుతున్నాడు. ఇంకొందరైతే బెదిరిపోతున్నారు. తక్కువ వేతన జీవులు బేజారవుతున్నారు. నాలుగు నెలలుగా ఈ పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. మరో నెల వరకు ఇలాగే ఉండొచ్చని వ్యాపారవర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికీ రైతులకు పెద్దగా గిట్టుబాటు కాకపోవడం.. మారు వ్యాపారుల జాదూకు నిదర్శనం. - న్యూస్‌లైన్, కరీంనగర్ కార్పొరేషన్ జిల్లాలో ప్రధానంగా మెట్ట ప్రాంతాల్లో కూరగాయల సాగు అధికం. సుమారు 5 వేల ఎకరాల్లో రైతు లు టమోట, కాకర, సొరకాయ, వంకాయ, దొండ, బెండ, బీరకాయ, మిరప, చిక్కుడు తదితరాలు సాగు చేస్తున్నారు. ఉల్లిపాయలు, క్యారట్, బంగాళా దుంప, అల్లం పక్కరాష్ట్రాల నుంచి దిగుమతి అవుతున్నాయి. గత మేలో దిగుబడి లేక ధరలు అమాంతం పెరిగాయి. నాలుగు నెలలుగా దిగిరావడం లేదు. ప్రస్తుతం వర్షా లు బాగానే ఉన్నా.. దిగుబడి ఆశాజనకంగానే ఉంటు న్నా యథాతథ స్థితే కొనసాగడం ఆందోళన కలిగిస్తోం ది. బీర, బెండకాయలు మార్కెట్‌ను ముంచెత్తుతున్నా ధరలు తగ్గకపోవడం గమనార్హం. అన్ని వంటల్లో ఉపయోగించే టమాట ధర కాస్త తగ్గడం ఒక్కటే ఊరట. మారు వ్యాపారుల జాదు.. మారు వ్యాపారులు తక్కువ రేట్లకు కొని మార్కెట్ ధరలను తగ్గకుండా విక్రయాలు చేస్తున్నారు. రైతులు కూరగాయలను జిల్లా కేంద్రానికి తెచ్చి హోల్‌సేల్ ధరలకు అమ్ముతారు. కూరగాయలను ఇక్కడి నుంచే ఎగుమతి చేస్తుంటారు. నేటికీ కరీంనగర్‌కు పెద్ద ఎత్తున కూరగాయలు వస్తున్నట్లు వ్యాపారులే చెబుతున్నారు. అయినా ధరలు తగ్గకుండా మారు వ్యాపారులు ‘జాగ్రత్త’పడుతున్నారు. రైతు బజార్లలో మాత్రం కొంత మేర ధరలు తక్కువే. ధరల నియంత్రణకు అధికారులు చొరవ చూపకపోవడంతో వ్యాపారులు ఆడింది ఆటగా సాగుతోంది. చివరకు పాలకూర, చుక్కకూర, తోటకూరలనూ కిలో రూ. 50 పైనే అమ్ముతున్నారు. రోజువారీ కూలీలు, తక్కువ వేతన జీవుల పరిస్థితి దయనీయంగా మారింది. నిత్యావసరాలకే సంపాదన ఖర్చు చేసే దుస్థితి దాపురించింది. నలుగురు కుటుంబ సభ్యులుంటే రోజుకు రూ. 100 కూరగాయలకే ఖర్చవుతోంది. ఇక రాబోయే పెళ్లిళ్ల సీజన్లో పరిస్థితి ఎలా ఉంటుందోనని సామాన్యులు హడలెత్తిపోతున్నారు.