గ్యాస్‌కు నగదు బదిలీలో మాయాజాలం
Published Mon, Sep 23 2013 12:19 AM | Last Updated on Fri, Sep 1 2017 10:57 PM
సాక్షి, కాకినాడ :వంటగ్యాస్‌కు ప్రత్యక్ష నగదు బదిలీ గందరగోళంగా, వినియోగదారులకు భారంగా తయారైంది. బహిరంగ మార్కెట్‌లో ఉండే రేటుకు, బ్యాంకుఖాతాల్లో జమవుతున్న సబ్సిడీ మొత్తానికి పొంతన లేకుండా ఉండడంతో వినియోగదారులపై ప్రతి నెలా అదనపు భారం పడుతూనే ఉంది. మార్కెట్ రేటుకు, సబ్సిడీ మొత్తానికి మధ్య భారీ వ్యత్యాసం ఎందుకు ఉంటోందని ప్రశ్నిస్తే ఇటు డీలర్ల నుంచి కానీ, అటు అధికారుల నుంచి కానీ సమాధానం రావడం లేదు.జిల్లాలో గతేడాదివరకు 10,16, 660 గ్యాస్ కనెక్షన్లుండేవి. ఆర్నెల్లపాటు వినియోగంలో లేవనే సాకుతో వేసిన కోతల కారణంగా ప్రస్తుతం జిల్లాలో 8,79,507 కనెక్షన్లు మాత్రమే ఉన్నాయి. వీటిసంఖ్య మరింత తగ్గే అవకాశంఉంది. ఇలా తగ్గడం ఆయిల్‌కంపెనీల మాయాజాలంగానే పేర్కొనవచ్చు. ఇక అధికారిక లెక్కల ప్రకారం ప్రస్తుతం ఉన్న 8,79,507 కనెక్షన్లలో 7,67,099 కనెక్షన్లకు ఆధార్ సీడింగ్, 6,26,960 కనెక్షన్లకు సంబంధించి అకౌంట్ సీడింగ్ పూర్తి చేయగలిగారు. ఈ లెక్కన 87 శాతం ఆధార్, 71 శాతం అకౌంట్ సీడింగ్ పూర్తయినట్టయింది.
రూపాయి పతనం సాకుతో ధర పెంపు
నగదు బదిలీ అమలుకు ముందు సిలిండర్ ధర రూ.411గా ఉండేది. రవాణాఖర్చులు కలుపుకొని రూ.420కు ఇంటికి చేరేది. నగదు బదిలీ అమలు అనంతరం గతనెల వరకు బుక్ చేసుకున్న 24 గంటల్లో అకౌంట్ సీడింగ్ పూర్తయిన వినియోగదారుల ఖాతాలో అడ్వాన్స్ సబ్సిడీగా రూ.435 జమయ్యేది. నగదు బదిలీ ప్రారంభసమయంలో నాన్‌సబ్సిడీ సిలిండర్ ధర రూ.854.50 ఉండేది. సిలిండర్‌ను సబ్సిడీ మొత్తానికి రూ.443.50 కలిపి విడిపించుకోవల్సి వచ్చేది. ప్రారంభంలోనే వినియోగ దారునిపై సిలిండర్‌కు రూ.8.50 అదనపు భారం పడేది.
జూన్ ఒకటి నుంచి నగదు బదిలీ అమలు లోకి వచ్చాక ఈ అదనపుభారం మోస్తూనే ఉన్నారు. నాన్‌సబ్సిడీ సిలిండర్ ధర అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్ విలువను బట్టి ఆయిల్ కంపెనీలే నిర్ణయిస్తుంటాయి. రూపాయి భారీగా పతనమైందనే సాకుతో ఈ నెల ఒకటి నుంచి నాన్‌సబ్సిడీ సిలిండర్ ధరను రూ.998గా నిర్ణయించారు. ఆలెక్కన సబ్సిడీ మొత్తం రూ.587 జమ కావాలి. కానీ కేవలం రూ.534.49 మాత్రమే జమవుతోంది. అంటే సిలిండర్‌పై వినియోగదారుడు రూ.52.51ల మేర అదనపు భారం మోయాల్సి వస్తుంది. దీనికి తోడు ఇంటికి చేరవేయాలంటే సిలిండర్‌పై రూ.30 నుంచి రూ.50 వరకు గ్యాస్ డెలివరీ బాయిస్ వసూలు చేస్తున్నారు. ఈ లెక్కన వినియోగదారునిపై సుమారు రూ.100 వరకు అదనపు భారం పడుతోంది. ఇదంతా రూ.534.49ల చొప్పున సబ్సిడీ మొత్తం పడే వారికి.
ఎత్తి వేసేందుకే ఈ ఎత్తుగడ..!
కాగా శాఖల మధ్య సమన్వయ లోపం కారణంగా అకౌంట్ సీడింగ్ అయిన వారిలో మూడవ వంతు వినియోగదారులకు ఇంకా రూ.435 పాత సబ్సిడీ మొత్తమే జమవుతోంది. ఈలెక్కన ఇలాంటి వారిపై రవాణాఖర్చులు కాక రూ.152 అదనపు భారం పడుతుంది. పాత సబ్సిడీ మొత్తమే పడుతుందని పలువురు తమ వద్దకు వస్తున్నారని పలువురు ఏజెన్సీ నిర్వాహకులు చెబుతున్నారు. బుక్ చేసుకున్న తర్వాత రెండురోజుల వరకు సబ్సిడీ మొత్తం పడడం లేదనే ఫిర్యాదులు కూడా వస్తునాయి.
ఒక వేళ జమైనా, ఒకేసారి ఏకంగా రూ.1050 (రవాణాతో కలిపి) చెల్లించి విడిపించుకోవాలంటే ఇబ్బందిగా మారిందని, ఆ సమయంలో చేతిలో డబ్బుల్లేకపోతే వడ్డీకి అప్పుసప్పో చేసి విడిపించుకోవల్సి వస్తుందని సామాన్యులు వాపోతున్నారు. ఒకవేళ పాతసబ్సిడీ మొత్తం జమైనా కంగారు పడనవసరం లేదని, ప్రస్తుత కొత్త సబ్సిడీకి మధ్య ఉన్న వ్యత్యాసం (మొత్తం) తర్వాత గ్యాస్‌బుక్ చేసుకున్నప్పుడు పడుతుందని అధికారులు చెబుతున్నారు. కానీ సబ్సిడీ మొత్తానికి, నాన్‌సబ్సిడీ సిలిండర్ ధరకు మధ్య వ్యత్యాసం కోసం అడిగితే మాత్రం తామేమీ చేయలేమని చెబుతున్నారు. భవిష్యత్‌లో ఇదే రీతిలో సబ్సిడీ పూర్తిగా ఎత్తి వేసేందుకే ప్రభుత్వం ఈ ఎత్తుగడ వేసిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Advertisement