జనవరి 1నుంచి గ్యాస్‌కు నగదు బదిలీ
* 48 శాతం మంది వినియోగదారులకే లబ్ది
* మిగిలిన 52 శాతం మందికి మూడు నెలల గడుపు
సాక్షి, విశాఖపట్నం: గ్యాస్ నగదు బదిలీ అమలుకు ముహూర్తం సమీపిస్తోంది. జనవరి1 నుంచి ఈ పథకం అమలు కానుంది. జిల్లాలో 8.12లక్షల గ్యాస్ వినియోగదారులున్నారు. ఇందులో 92 శాతం మందికి ఆధార్ సీడింగ్ అయినట్టుగా అధికారులు చెబుతున్నారు. ఆయిల్ కంపెనీల వారీగా చూస్తే హెచ్‌పీసీఎల్ పరిధిలో 95 శాతం మంది లబ్దిదారులకు ఆధార్ సీడింగ్ పూర్తికాగా, బీపీసీ ఎల్ పరిధిలో 99శాతం పూర్తికాగా, ఐఒసీఎల్ పరిధిలో మాత్రం కేవలం 83 శాతం మాత్రమే జరిగింది.
కీలకమైన అకౌంట్ సీడింగ్ మాత్రం 48 శాతానికి మించలేదు. గతేడాది అక్టోబర్ నుంచి పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించినాసీడింగ్ జరగనందున డిసెంబర్ వరకు అమలు కాలేదు. అప్పట్లో 24 శాతానికి మించి ఆధార్,అకౌంట్‌సీడింగ్ జరక్క పోవడంతో కొద్ది మందికి మాత్రమే ఈ ఏడాది జనవరిలో అకౌంట్‌లో డబ్బులు పడ్డాయి. మిగిలిన వారికి డబ్బులు పడలేదు. ఫలితంగా గందరగోళం నెలకొంది. ఆ తర్వాత కేంద్రమే ఈ పథకానికి తాత్కాలికంగా నిలిపివేసింది.
ఇప్పుడు తాజాగా అన్ని జిల్లాలకు వర్తింప చేయాలని కేంద్రం నిర్ణయించడంతో యంత్రాంగం అకౌంట్‌సీడింగ్‌పై దృష్టి పెట్టింది. మరో 20రోజులే మిగిలి ఉండడంతో అకౌంట్ నెంబర్లు సేకరించి సీడింగ్ చేయాలని జిల్లా జేసీ ప్రవీణ్‌కుమార్ ఏజెన్సీలకు ఆదేశాలు జారీ చేశారు. వినియోగదారుల నుంచి సేకరించిన అకౌంట్ నెంబర్లను బ్యాంకులవారీగా అందజేసేందుకు ప్రతీ బ్యాంకుకొక నోడల్ అధికారిని నియమించారు. సీడింగ్ కాకపోయినా భయపడాల్సిన అవసరం లేదని జేసీ ప్రవీణ్ కుమార్ చెప్పారు.
మోడిఫైడ్ డైరెక్టర్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ స్కీమ్‌లో జనవరి నుంచి మూడు నెలలలోపు ఆధార్ నెంబర్లు లేకపోయినా అకౌంట్ ఓపెన్ చేసుకుని నెంబర్లను గ్యాస్ ఏజెన్సీలకు లేదా,తమ గ్యాస్ కన్స్యూ మర్ నెంబర్లు బ్యాంకులకు అందజేసి సీడింగ్ చేయించుకుంటే సరిపోతుందని వివరించారు. అప్పటి వరకుపాతపద్దతిలోనే సబ్సిడైజ్డ్ సిలిండర్లే సరఫరా అవుతాయన్నారు.