‘లింకు’ తెగిందా లేదా..?
- ‘ఆధార్’పై గందరగోళం
- గ్యాస్‌కు నగదు బదిలీ ఉన్నట్టా లేనట్టా?
- రద్దు ఉత్తర్వులు అందలేదంటున్న అధికారులు
- వినియోగదారుల్లో అయోమయం
విశాఖ రూరల్, న్యూస్‌లైన్ : గ్యాస్‌తో ఆధార్ అనుసంధానం చేసుకోవాలా? వద్దా? నగదు బదిలీ పథకం అమలు చేస్తున్నారా? తాత్కాలికంగా నిలిపివేశారా? లేదా గడువు పొడిగించారా? ఇలా అనేక సందేహాలు ప్రస్తుతం అందరి మెదళ్లను తొలిచేస్తున్నాయి. కేంద్ర ప్రకటన తరువాత ఆధార్ వ్యవహారం మరింత గందరగోళాన్ని సృష్టిస్తోంది. నగదు బదిలీ పథకానికి వివరాలను అనుసంధానం చేసుకోవాలో? లేదో తెలియని పరిస్థితి నెలకొంది.
గ్యాస్ సబ్సిడీని వినియోగదారుల ఖాతాలోకి నేరుగా జమ చేసే విధానాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇందుకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులు మాత్రం అధికారులకు అందలేదు. చమురు సంస్థలు కూడా ఆధార్‌పై స్పష్టత ఇవ్వడం లేదు. కేవలం ఒక నెల గడువు పెంచినట్లు సూత్రపాయంగా సమాచారమొచ్చినట్లు చెప్పుకొస్తున్నాయి. దానికి కూడా ఎటువంటి ఉత్తర్వులు రాలేదని పేర్కొంటున్నాయి. అధికారులు మాత్రం నగదు బదిలీకి అనుసంధాన ప్రక్రియను కొనసాగిస్తున్నారు.
జిల్లాలో 8.3 లక్షల మంది గ్యాస్ వినియోగదారులు ఉంటే.. గ్యాస్‌తో కేవలం ఆధార్‌ను 43 శాతం మంది అనుసంధానం చేసుకోగా, గ్యాస్, ఆధార్, బ్యాంకు ఖాతాలతో 29 శాతం మంది అనుసంధానించుకున్నారు. నగదు బదిలీని నిలిపివేస్తున్నప్పటికీ ఇప్పటి వరకు అధికారికంగా ఉత్తర్వులు రాలేదని జేసీ ప్రవీణ్‌కుమార్ న్యూస్‌లైన్‌కు తెలిపారు. ఒకవేళ నగదు బదిలీ పథకం అమలులో ఉంటే ఈ నెల 1వ తేదీ నుంచి అనుసంధానం చేసుకోని వినియోగదారులు నాన్ సబ్సిడీ సిలిండర్‌ను కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.