experiential education
-
ముందస్తు ఏర్పాట్లు
ఎన్నికలకు సిద్ధమవుతున్న యంత్రాంగం రేపటి నుంచి సిబ్బందికి శిక్షణ తరగతులు కేంద్ర, రాష్ట్ర శాఖల నుంచి ఉద్యోగుల వివరాల సేకరణ విశాఖ రూరల్, న్యూస్‌లైన్: ఎన్నికల ముందస్తు ఏర్పాట్లలో జిల్లా యం త్రాంగం తలమునకలైంది. నోటిఫికేషన్‌కు ముందు ఎన్నికలు విధులు నిర్వర్తించే సిబ్బంది జాబితాను సిద్ధం చేస్తోంది. ఇప్పటికే సెక్టర్, నోడల్ ఆఫీసర్ల జాబితాను సిద్ధం చేసి అనుమతుల కోసం ఎన్నికల సంఘానికి పంపించింది. ప్రస్తుతం పీఓ, ఏపీఓల తో పాటు ఇతర ఎన్నికల సిబ్బంది నియామకంపై దృష్టి సారించారు. ఇప్పటి వరకు నియమించిన ఎన్నికల అధికారులకు, సిబ్బందికి ఈ నెల 4, 5 తేదీలలో శిక్షణ తరగతులు నిర్వహించాలని కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్ ఆదేశాలు జారీ చేశారు. ఉద్యోగుల వివరాల సేకరణ ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే అన్ని కేంద్ర, రాష్ట్ర శాఖల నుంచి ఉద్యోగుల వివరాలు సేకరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. జిల్లాలో 3506 పోలింగ్ కేంద్రాలున్నాయి. ఈ కేంద్రాల సంఖ్యకు పది శాతం అధికంగా 3857 మంది పీఓలను, 3857 మంది ఏపీఓలతో పాటు మరో ముగ్గురు సిబ్బందిని నియమించనున్నారు. ఇప్పటి వరకు 30 రాష్ట్ర ప్రభుత్వ శాఖల నుంచి 13,996 మంది ఉద్యోగుల వివరాలను అధికారులు సేకరించారు. 16 కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి 19,020 మంది వివరాలు కలెక్టరేట్‌కు చేరాయి. మరో 15 శాఖల నుంచి ఉద్యోగుల వివరాలు రావాల్సి ఉంది. రెండు, మూడు రోజుల్లో అన్ని శాఖల నుంచి ఉద్యోగుల వివరాలు వచ్చిన వెంటనే వాటిని కంప్యూటర్లో నిక్షిప్తం చేసి ర్యాండమైజ్ చేయనున్నారు. ఈ ప్రక్రియ పూర్తయితే దాదాపుగా సగం పని ముగిసినట్టేనని అధికారులు చెబుతున్నారు. -
భారీగా బదిలీలు
పాడేరు ఆర్డీఓకు స్థానచలనం మరో నలుగురు ఎస్‌డీసీలకు త్వరలో? 51 మంది తహశీల్దార్లకు బదిలీ ముగ్గురు తహశీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి విశాఖ రూరల్, న్యూస్‌లైన్: జిల్లాలో భారీగా బదిలీలు చోటు చేసుకుంటున్నాయి. డిప్యూటీ కలెక్టర్ల నుంచి తహశీల్దార్ల వరకు భారీ స్థాయిలో స్థానచలనాలు జరగనున్నాయి. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా మూడేళ్లు ఒకే చోట పనిచేసినవారు, లేదా సొంత జిల్లాకు చెందిన వారిని బదిలీ చేయాలని ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అధికారుల జాబితా సిద్ధమైంది. పాడేరు ఆర్డీఓ గణపతిరావును బదిలీ చేయగా ఆ స్థానంలో ఎవరినీ నియమించలేదు. అర్బన్ ల్యాండ్ సీలింగ్ స్పెషల్ ఆఫీసర్ సిహెచ్.నరసింగరావును పశ్చిమగోదావరి జిల్లా అదనపు సంయుక్త కలెక్టర్‌గా ప్రభుత్వం నియమించింది. వీరితో పాటు మరో నలుగురికి బదిలీ జరిగే అవకాశాలు ఉన్నాయి. జిల్లా పరిషత్ సీఈఓ డి.వి.రెడ్డి, కోనేరు రంగారావు కమిటీ ఎస్డీసీ విజయసారధి, ఏపీఐఐసీ ఎస్డీసీ నారాయణ, ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీస్ ఎస్డీసీ సీతామహాలక్ష్మిలకు బదిలీ అవుతున్నట్టు సమాచారం. వీరి బదిలీలకు సంబంధించిన ఫైలు కూడా సిద్ధమైనట్టు తెలిసింది. మరో ఒకటి, రెండు రోజుల్లో ఉత్తర్వులు వెలువడే అవకాశముంది. 51 మంది తహశీల్దార్లకు కూడా.. జిల్లాలో 65 మంది తహశీల్దార్లు ఉన్నారు. వీరిలో నలుగురు ఈ ఏడాది జూలైలో పదవీ విరమణ చేయనున్నారు. వీరిలో నలుగురు ఈ ఏడాది జూలై పదవీ విరమణ చేయనున్నారు. అయిదుగురు ఇతర జిల్లాల నుంచి ఇక్కడకు వచ్చి విధులు నిర్వర్తిస్తున్నారు. మరో ముగ్గురు తహశీల్దార్లు డిప్యుటేషన్‌పై ఇతర శాఖల్లో పనిచేస్తున్నారు. ఒకరు ఏసీబీ దాడులో చిక్కి సస్పెన్షన్‌లో ఉన్నారు. మిగిలిన 51 మంది తహశీల్దార్లు మూడేళ్లు ఒకేచోట పనిచేయడం, సొంత జిల్లాకు చెందిన వారు కావడంతో వీరికి బదిలీ జరగనుంది. వీరిలో 26 మందిని విజయనగరం, 25 మందిని శ్రీకాకుళం పంపించనున్నారు. ఆ రెండు జిల్లాల నుంచి 51 తహశీల్దార్లు జిల్లాకు రానున్నారు. వీరి జాబితాను వారం రోజుల క్రితమే జిల్లా అధికారులు సీసీఎల్ఏకు పంపించారు. వీరి కేటాయింపులకు సంబంధించిన ఉత్తర్వులు ఒకటి, రెండు రోజుల్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. తహశీల్దార్లు అందరూ సమ్మెలో ఉండడంతో బదిలీ ఉత్తర్వులు తీసుకొనే అవకాశం లేదు. సమ్మె ముగిసిన తర్వాత వీరు ఉత్తర్వులు తీసుకొని విధుల్లో చేరనున్నాయి. జిల్లాలో ముగ్గురు తహశీల్దార్లు భవాని, గౌతమికుమారి, పద్మలతలకు డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి లభించింది. -
‘లింకు’ తెగిందా లేదా..?
‘ఆధార్’పై గందరగోళం గ్యాస్‌కు నగదు బదిలీ ఉన్నట్టా లేనట్టా? రద్దు ఉత్తర్వులు అందలేదంటున్న అధికారులు వినియోగదారుల్లో అయోమయం విశాఖ రూరల్, న్యూస్‌లైన్ : గ్యాస్‌తో ఆధార్ అనుసంధానం చేసుకోవాలా? వద్దా? నగదు బదిలీ పథకం అమలు చేస్తున్నారా? తాత్కాలికంగా నిలిపివేశారా? లేదా గడువు పొడిగించారా? ఇలా అనేక సందేహాలు ప్రస్తుతం అందరి మెదళ్లను తొలిచేస్తున్నాయి. కేంద్ర ప్రకటన తరువాత ఆధార్ వ్యవహారం మరింత గందరగోళాన్ని సృష్టిస్తోంది. నగదు బదిలీ పథకానికి వివరాలను అనుసంధానం చేసుకోవాలో? లేదో తెలియని పరిస్థితి నెలకొంది. గ్యాస్ సబ్సిడీని వినియోగదారుల ఖాతాలోకి నేరుగా జమ చేసే విధానాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇందుకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులు మాత్రం అధికారులకు అందలేదు. చమురు సంస్థలు కూడా ఆధార్‌పై స్పష్టత ఇవ్వడం లేదు. కేవలం ఒక నెల గడువు పెంచినట్లు సూత్రపాయంగా సమాచారమొచ్చినట్లు చెప్పుకొస్తున్నాయి. దానికి కూడా ఎటువంటి ఉత్తర్వులు రాలేదని పేర్కొంటున్నాయి. అధికారులు మాత్రం నగదు బదిలీకి అనుసంధాన ప్రక్రియను కొనసాగిస్తున్నారు. జిల్లాలో 8.3 లక్షల మంది గ్యాస్ వినియోగదారులు ఉంటే.. గ్యాస్‌తో కేవలం ఆధార్‌ను 43 శాతం మంది అనుసంధానం చేసుకోగా, గ్యాస్, ఆధార్, బ్యాంకు ఖాతాలతో 29 శాతం మంది అనుసంధానించుకున్నారు. నగదు బదిలీని నిలిపివేస్తున్నప్పటికీ ఇప్పటి వరకు అధికారికంగా ఉత్తర్వులు రాలేదని జేసీ ప్రవీణ్‌కుమార్ న్యూస్‌లైన్‌కు తెలిపారు. ఒకవేళ నగదు బదిలీ పథకం అమలులో ఉంటే ఈ నెల 1వ తేదీ నుంచి అనుసంధానం చేసుకోని వినియోగదారులు నాన్ సబ్సిడీ సిలిండర్‌ను కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. -
రెండోసారీ
డీఆర్సీ మళ్లీ వాయిదా అమాత్యుల అపహాస్యం ఇక నిర్వహణ డౌటే! విశాఖ రూరల్, న్యూస్‌లైన్: జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశాన్ని(డీఆర్సీ) అమాత్యులు అపహాస్యం చేస్తున్నారు. జిల్లా అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన వేదిక నిర్వహణను పిల్ల ల ఆటగా మార్చేశారు. ఇష్టానుసారంగా సమావేశం తేదీని ఖరారు చేయడం.. అధికారులను పరుగులు పెట్టించడం. చివరి నిమిషంలో వాయిదా వేయడం పరిపాటిగా మారిపోయింది. శనివారం నిర్వహించాల్సిన డీఆర్సీ మళ్లీ వాయిదా పడింది. కేవలం రాజకీయ కారణాలు, అగ్రనేతల సేవలో తరలించడానికి సమావేశాన్ని రెండోసారి రద్దు చేశారు. ఈ నెల మూడో వారంలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉండడంతో ఇక డీఆర్సీ జరిగే అవకాశం లేనట్లు తెలుస్తోంది. గతేడాది మార్చి తరువాత ఇప్పటి వరకు డీఆర్సీ నిర్వహించలేదు. నిన్నమొన్నటి వరకు జిల్లాకు ఇన్చార్జి మంత్రి లేకపోవడంతో ఈ సమావేశానికి అవకాశం లేకుండా పోయింది. రెండు నెలల క్రితం రాష్ట్ర సహకారశాఖ మంత్రి కాసు వెంకట కృష్ణారెడ్డి ఇన్చార్జి మంత్రిగా నియమితులయ్యారు. అయినప్పటికీ ఇప్పటి వరకు డీఆర్సీపై స్పష్టత లేకుండా పోయింది. వాస్తవానికి జనవరి 19న ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు జిల్లా మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. ఆ మేరకు జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అజెండాను కూడా సిద్ధం చేశారు. చివరి నిమిషంలో వాయిదా వేశారు. ఇక సమీక్ష సమావేశం ఉండదని అధికారులు భావించారు. ఇంతలో శనివారం(ఫిబ్రవరి ఒకటిన) నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని మరోసారి ఇన్చార్జి మంత్రి నుంచి అయిదు రోజుల క్రితం అధికారులకు సమాచారమొచ్చింది. సమయం తక్కువగా ఉండడంతో అధికారులు ఉరుకులూ పరుగులు పెట్టారు. ఆగమేఘాలపై అజెండాను సిద్ధం చేశారు. సమావేశానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మధ్యాహ్నం భోజనాలకు కూడా ఆర్డర్ ఇచ్చేశారు. అయితే మళ్లీ అమాత్యులు సమావేశాన్ని వాయిదా వేశారు. దీంతో అధికారుల శ్రమ, డబ్బు వృథా అయింది. ఇక నిర్వహణ డౌటే! : ప్రస్తుత పరిస్థితుల్లో డీఆర్సీ ఇప్పట్లో జరిగే అవకాశాలు కనిపించడం లేదు. ఫిబ్రవరి మూడో వారంలో ఎన్నికల నోటిఫికేషన్ వస్తే ఇక నిర్వహించే పరిస్థితి ఉండదు. త్వరలో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఆ సమయంలో జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశం నిర్వహించే సంప్రదాయం లేదు. ఈ పరిస్థితుల దృష్ట్యా ఇక డీఆర్సీకి అవకాశం లేనట్టే అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒక వేళ పెట్టాలంటే ఈ వారంలోనే నిర్వహించాల్సి ఉంటుంది. లేకుంటే ఈ ప్రభుత్వ హయాంలో జరిగే అవకాశాలు లేనట్టే! -
ఎన్నాళ్లకెన్నాళ్లకు..
ఏడాది తరువాత ఒకటిన డీఆర్సీ అధికారులను పరుగులు పెట్టిస్తున్న మంత్రులు ఆగమేఘాలమీద 15 అంశాలతో అజెండా రూపకల్పన విశాఖ రూరల్, న్యూస్‌లైన్: అమాత్యులకు ఏడాది కాలానికి జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశం(డీఆర్సీ) గుర్తుకొచ్చింది. అనేక సమస్యలు జిల్లాను పట్టిపీడిస్తుంటే.. వాటిపై చర్చించేందుకు ఇప్పటికి వారికి తీరిక కుదిరింది. ఇప్పుడు కూడా ఎవరికి వారు తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించుకోడానికే ప్రయత్నిస్తున్నారు తప్పా.. జిల్లా అభివృద్ధి, ప్రజా సంక్షేమంపై ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నట్టు కనిపించడం లేదు. డీఆర్సీ నిర్వహణపై ఎవరికివారే ప్రకటనలు చేస్తూ అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. సుమారు 11 నెలల తరువాత డీఆర్సీని ఫిబ్రవరి ఒకటిన జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర సహకార శాఖ మంత్రి కాసు వెంకట కృష్ణారెడ్డి అధ్యక్షతన ఉదయం 10 గంటలకు సమావేశం ప్రారంభమవుతుంది. 11 నెలల తరువాత సమీక్ష తుపాన్లు, వరదలు జిల్లాను ముంచెత్తాయి. పంటలు నీట మునగడంతో వేలాది మంది రైతులు పెద్ద ఎత్తున నష్టపోయారు. ఈ పరిస్థితుల్లో కీలకమైన డీఆర్సీని నిర్వహించి, సమస్యలపై చర్చించి బాధితులను ఆదుకోవాల్సిన మంత్రులు రాజకీయాలు, పరస్పర ఆరోపణల్లో బిజీ అయిపోయారు. వాస్తవానికి ప్రతీ మూడు నెలలకోసారి డీఆర్సీ నిర్వహించాల్సి ఉంది. గతేడాది మార్చి 3న జరిగింది. మళ్లీ ఇప్పుడు ఈ సమీక్షను ఏర్పాటు చేస్తున్నారు. అధికారులు ఉరుకులూ పరుగులు... సాధారణంగా ఎప్పుడు డీఆర్సీ నిర్వహించినా.. కనీసం మూడు వారాలు ముందుగా జిల్లా ఇన్చార్జిమంత్రి నుంచి జిల్లా అధికారులకు సమాచారం ఉంటుంది. ఆమేరకు జిల్లా కలెక్టర్ అన్ని శాఖలతో సమావేశం నిర్వహించి అజెండా రూపొందిస్తారు. కానీ ఈసారి కేవలం 10 రోజుల వ్యవధిలోనే డీఆర్సీకి ఏర్పాట్లు చేయాలని అమాత్యులు అధికారులను ఆదేశించారు. తొలుత ఈ నెల 19న ఈ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ఇంతలో అసెంబ్లీ సమావేశాలు గుర్తుకొచ్చి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. మళ్లీ వచ్చేనెల ఒకటిన డీఆర్సీ ఉంటుం దని అయిదు రోజుల క్రితం సమాచారమిచ్చారు. దీంతో అజెండా తయారీలో అధికారులు నిమగ్నమయ్యారు. -
ఇదేమి సేవ
రిజిస్ట్రేషన్లు మీ-సేవకు బదలాయింపు జీవనోపాధి కోల్పోతామంటూ లేఖరుల సమ్మె మందగించిన రిజిస్ట్రేషన్లు వారం రోజుల్లో రూ.10 కోట్లు ఆదాయానికి గండి రేపటి నుంచి మరిన్ని కార్యకలాపాలు బదిలీ నిరవధిక సమ్మెబాటలో డాక్యుమెంట్ రైటర్లు విశాఖ రూరల్, న్యూస్‌లైన్: సేవల విస్తరణలో భాగంగా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ చేపట్టిన చర్యలు మరిన్ని ఇబ్బందులకు గురి చేసేలా ఉన్నాయి. రిజిస్ట్రేషన్ సేవలను ఒక్కొక్కటిగా మీ-సేవకు బదలాయించడంపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ‘మీ-సేవ’ ద్వారా ప్రభుత్వ పనులను అందజేయాలన్న యోచన మంచిదే అయినప్పటికీ.. సాంకేతికపరమైన సమస్యలతో పాటు పనుల్లో జాప్యం చోటుచేసుకుంటోంది. దీంతో అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రధానంగా డాక్యుమెంట్ రైటర్లు జీవనోపాధిని కోల్పోయే ప్రమాదం దాపురించింది. వారం రోజులుగా వారు సమ్మె చేస్తున్నారు. ఫలితంగా జిల్లా స్టాంపులు, రిజిస్ట్రేషన్లలో కార్యకలాపాలు మందగించాయి. జిల్లాలో 19 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. ఆస్తుల కొనుగోలుపై ఆరు శాతం రిజిస్ట్రేషన్ ఫీజు ఉంటుంది. అలాగే ఇతరత్రా లావాదేవీలను కలుపుకొని అర్బన్‌లోని 8 కార్యాలయాల నుంచి రూ.కోటి, రూరల్‌లో ఉన్న 11 కార్యాలయాల నుంచి రూ.50 లక్షలు వరకు ఆదాయం సమకూరుతోంది. వారం రోజుల నుంచి డాక్యుమెంట్ రైటర్లు సమ్మెతో దాదాపు రూ.10 కోట్లు మేర ఆదాయం ప్రభుత్వానికి రాకుండా పోయింది. సోమవారం నుంచి చెక్‌లిస్ట్ సేవలను కూడా మీ-సేవకు బదిలీ చేస్తున్నారు. దీంతో ఆ రోజు నుంచి డాక్యుమెంట్ రైటర్లు నిరధిక సమ్మెకు దిగితే జిల్లాలో పూర్తిగా భూముల క్రయవిక్రయాలు నిలిచిపోనున్నాయి. ఫలితంగా రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం కూడా స్తంభించనుంది. కొత్త తలనొప్పులు ఈసీలు, సీసీలతో పాటు సొసైటీ, ఫర్మ్‌లను ఇప్పటికే మీ-సేవకు బదలాయించారు. ఈసీలు, సీసీలకు సంబంధించిన సమాచారం ఆన్లైన్లో పూర్తిగా పొందుపరచకపోవడం వల్ల ఆస్తుల క్రయ విక్రయదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిన్నమొన్నటి వరకు ఈసీ కావాలంటే సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకుంటే సదరు వ్యక్తి ఆస్తికి సంబంధించిన వివరాలతో ఈసీ ఇచ్చేవారు. దరఖాస్తులో ఎటువంటి లోటుపాట్లు ఉన్నా.. సక్రమంగా లేకపోతే, కార్యాలయంలో సిబ్బంది సూచనల మేరకు వెంటనే వాటిని సరిదిద్దుకునే అవకాశముండేది. మీ-సేవ ద్వారా ఈసీకి దరఖాస్తు చేసుకోవాల్సి వస్తుండడంతో అవి సక్రమంగా ఉన్నా లేకపోయినా మీ-సేవ సిబ్బం దికి ఆ విషయం తెలియకపోవడంతో వాటిని ఆన్లైన్లో పొందుపరుస్తున్నారు. అటువంటి వాటిని సబ్‌రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో సిబ్బంది చూసి తిరస్కరిస్తున్నారు. మళ్లీ దరఖాస్తు చేసుకోవడం, ఈసీ రావడానికి సమయం పడుతోంది. గతంలో మాదిరిగా కాకుండా ఈసీ కోసం దరఖాస్తు చేసుకుంటే సదరు వ్యక్తికి సంబంధించిన వివరాలతో పాటు ఆ చుట్టుపక్కల ఉన్న ఇళ్లకు సంబంధించిన వివరాలను కూడా ఇస్తున్నారు. దీంతో గందోరగోళ పరిస్థితి ఏర్పడింది. ఈ విషయంపై రిజిస్ట్రేషన్ శాఖ సిబ్బంది కూడా ఉన్నతాధికారులకు పరిస్థితిని వివరించడంతో ఈసీ కోసం మీ-సేవలోనైనా అలాగే సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనైనా దరఖాస్తు చేసుకొనే వెసలు కలిగించారు. అయితే ఎక్కడ ఎక్కువగా దరఖాస్తులు వస్తే అక్కడ నుంచే కార్యకలాపాలను కొనసాగించాలని నిర్ణయించనున్నారు.