ఇదేమి సేవ
- రిజిస్ట్రేషన్లు మీ-సేవకు బదలాయింపు
- జీవనోపాధి కోల్పోతామంటూ లేఖరుల సమ్మె
- మందగించిన రిజిస్ట్రేషన్లు
- వారం రోజుల్లో రూ.10 కోట్లు ఆదాయానికి గండి
- రేపటి నుంచి మరిన్ని కార్యకలాపాలు బదిలీ
- నిరవధిక సమ్మెబాటలో డాక్యుమెంట్ రైటర్లు
విశాఖ రూరల్, న్యూస్‌లైన్: సేవల విస్తరణలో భాగంగా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ చేపట్టిన చర్యలు మరిన్ని ఇబ్బందులకు గురి చేసేలా ఉన్నాయి. రిజిస్ట్రేషన్ సేవలను ఒక్కొక్కటిగా మీ-సేవకు బదలాయించడంపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ‘మీ-సేవ’ ద్వారా ప్రభుత్వ పనులను అందజేయాలన్న యోచన మంచిదే అయినప్పటికీ.. సాంకేతికపరమైన సమస్యలతో పాటు పనుల్లో జాప్యం చోటుచేసుకుంటోంది. దీంతో అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రధానంగా డాక్యుమెంట్ రైటర్లు జీవనోపాధిని కోల్పోయే ప్రమాదం దాపురించింది. వారం రోజులుగా వారు సమ్మె చేస్తున్నారు.
ఫలితంగా జిల్లా స్టాంపులు, రిజిస్ట్రేషన్లలో కార్యకలాపాలు మందగించాయి. జిల్లాలో 19 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. ఆస్తుల కొనుగోలుపై ఆరు శాతం రిజిస్ట్రేషన్ ఫీజు ఉంటుంది. అలాగే ఇతరత్రా లావాదేవీలను కలుపుకొని అర్బన్‌లోని 8 కార్యాలయాల నుంచి రూ.కోటి, రూరల్‌లో ఉన్న 11 కార్యాలయాల నుంచి రూ.50 లక్షలు వరకు ఆదాయం సమకూరుతోంది. వారం రోజుల నుంచి డాక్యుమెంట్ రైటర్లు సమ్మెతో దాదాపు రూ.10 కోట్లు మేర ఆదాయం ప్రభుత్వానికి రాకుండా పోయింది. సోమవారం నుంచి చెక్‌లిస్ట్ సేవలను కూడా మీ-సేవకు బదిలీ చేస్తున్నారు. దీంతో ఆ రోజు నుంచి డాక్యుమెంట్ రైటర్లు నిరధిక సమ్మెకు దిగితే జిల్లాలో పూర్తిగా భూముల క్రయవిక్రయాలు నిలిచిపోనున్నాయి. ఫలితంగా రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం కూడా స్తంభించనుంది.
కొత్త తలనొప్పులు
ఈసీలు, సీసీలతో పాటు సొసైటీ, ఫర్మ్‌లను ఇప్పటికే మీ-సేవకు బదలాయించారు.
ఈసీలు, సీసీలకు సంబంధించిన సమాచారం ఆన్‌లైన్‌లో పూర్తిగా పొందుపరచకపోవడం వల్ల ఆస్తుల క్రయ విక్రయదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
నిన్నమొన్నటి వరకు ఈసీ కావాలంటే సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకుంటే సదరు వ్యక్తి ఆస్తికి సంబంధించిన వివరాలతో ఈసీ ఇచ్చేవారు.
దరఖాస్తులో ఎటువంటి లోటుపాట్లు ఉన్నా.. సక్రమంగా లేకపోతే, కార్యాలయంలో సిబ్బంది సూచనల మేరకు వెంటనే వాటిని సరిదిద్దుకునే అవకాశముండేది.
మీ-సేవ ద్వారా ఈసీకి దరఖాస్తు చేసుకోవాల్సి వస్తుండడంతో అవి సక్రమంగా ఉన్నా లేకపోయినా మీ-సేవ సిబ్బం దికి ఆ విషయం తెలియకపోవడంతో వాటిని ఆన్‌లైన్‌లో పొందుపరుస్తున్నారు. అటువంటి వాటిని సబ్‌రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో సిబ్బంది చూసి తిరస్కరిస్తున్నారు. మళ్లీ దరఖాస్తు చేసుకోవడం, ఈసీ రావడానికి సమయం పడుతోంది.
గతంలో మాదిరిగా కాకుండా ఈసీ కోసం దరఖాస్తు చేసుకుంటే సదరు వ్యక్తికి సంబంధించిన వివరాలతో పాటు ఆ చుట్టుపక్కల ఉన్న ఇళ్లకు సంబంధించిన వివరాలను కూడా ఇస్తున్నారు. దీంతో గందోరగోళ పరిస్థితి ఏర్పడింది.
ఈ విషయంపై రిజిస్ట్రేషన్ శాఖ సిబ్బంది కూడా ఉన్నతాధికారులకు పరిస్థితిని వివరించడంతో ఈసీ కోసం మీ-సేవలోనైనా అలాగే సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనైనా దరఖాస్తు చేసుకొనే వెసలు కలిగించారు. అయితే ఎక్కడ ఎక్కువగా దరఖాస్తులు వస్తే అక్కడ నుంచే కార్యకలాపాలను కొనసాగించాలని నిర్ణయించనున్నారు.