రెండోసారీ | DRC postponed again | Sakshi
Sakshi News home page

రెండోసారీ

Published Sat, Feb 1 2014 12:53 AM | Last Updated on Sat, Sep 2 2017 3:13 AM

DRC postponed again

  •     డీఆర్సీ మళ్లీ వాయిదా
  •      అమాత్యుల అపహాస్యం
  •      ఇక నిర్వహణ డౌటే!
  •  విశాఖ రూరల్, న్యూస్‌లైన్: జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశాన్ని(డీఆర్సీ) అమాత్యులు అపహాస్యం చేస్తున్నారు. జిల్లా అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన వేదిక నిర్వహణను పిల్ల ల ఆటగా మార్చేశారు. ఇష్టానుసారంగా సమావేశం తేదీని ఖరారు చేయడం.. అధికారులను పరుగులు పెట్టించడం. చివరి నిమిషంలో వాయిదా వేయడం పరిపాటిగా మారిపోయింది. శనివారం నిర్వహించాల్సిన డీఆర్సీ మళ్లీ వాయిదా పడింది. కేవలం రాజకీయ కారణాలు, అగ్రనేతల సేవలో తరలించడానికి సమావేశాన్ని రెండోసారి రద్దు చేశారు.

    ఈ నెల మూడో వారంలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉండడంతో ఇక డీఆర్సీ జరిగే అవకాశం లేనట్లు తెలుస్తోంది. గతేడాది మార్చి తరువాత ఇప్పటి వరకు డీఆర్సీ నిర్వహించలేదు. నిన్నమొన్నటి వరకు జిల్లాకు ఇన్‌చార్జి మంత్రి లేకపోవడంతో ఈ సమావేశానికి అవకాశం లేకుండా పోయింది. రెండు నెలల క్రితం రాష్ట్ర సహకారశాఖ మంత్రి కాసు వెంకట కృష్ణారెడ్డి ఇన్‌చార్జి మంత్రిగా నియమితులయ్యారు. అయినప్పటికీ ఇప్పటి వరకు డీఆర్సీపై స్పష్టత లేకుండా పోయింది. వాస్తవానికి జనవరి 19న ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు జిల్లా మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. ఆ మేరకు జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

    అజెండాను కూడా సిద్ధం చేశారు. చివరి నిమిషంలో వాయిదా వేశారు. ఇక సమీక్ష సమావేశం ఉండదని అధికారులు భావించారు. ఇంతలో శనివారం(ఫిబ్రవరి ఒకటిన) నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని మరోసారి ఇన్‌చార్జి మంత్రి నుంచి అయిదు రోజుల క్రితం అధికారులకు సమాచారమొచ్చింది. సమయం తక్కువగా ఉండడంతో అధికారులు ఉరుకులూ పరుగులు పెట్టారు. ఆగమేఘాలపై అజెండాను సిద్ధం చేశారు. సమావేశానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మధ్యాహ్నం భోజనాలకు కూడా ఆర్డర్ ఇచ్చేశారు. అయితే మళ్లీ అమాత్యులు సమావేశాన్ని వాయిదా వేశారు. దీంతో అధికారుల శ్రమ, డబ్బు వృథా అయింది.
     
    ఇక నిర్వహణ డౌటే! : ప్రస్తుత పరిస్థితుల్లో డీఆర్సీ ఇప్పట్లో జరిగే అవకాశాలు కనిపించడం లేదు. ఫిబ్రవరి మూడో వారంలో ఎన్నికల నోటిఫికేషన్ వస్తే ఇక నిర్వహించే పరిస్థితి ఉండదు. త్వరలో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఆ సమయంలో జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశం నిర్వహించే సంప్రదాయం లేదు. ఈ పరిస్థితుల దృష్ట్యా ఇక డీఆర్సీకి అవకాశం లేనట్టే అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒక వేళ పెట్టాలంటే ఈ వారంలోనే నిర్వహించాల్సి ఉంటుంది. లేకుంటే ఈ ప్రభుత్వ హయాంలో జరిగే అవకాశాలు లేనట్టే!
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement