పార్లమెంట్ సమావేశాలకు నిమిషానికి రూ.2.50 లక్షల ఖర్చు
ఉభయ సభల్లో నిర్మాణాత్మక చర్చల ఊసే లేదు
గౌతమ్ అదానీ, జార్జి సోరోస్ వ్యవహారంపై నిత్యం రగడ
ప్రజా సమస్యలను పట్టించుకోని చట్టసభ సభ్యులు
ప్రజా సమస్యలపై నిర్మాణాత్మక చర్చలకు, ప్రభుత్వ విధానాల రూపకల్పనకు, చట్టాల తయారీకి వేదిక కావాల్సిన చట్టసభలు నిష్ప్రయోజనంగా మారుతుండడం ప్రజాస్వామ్యవాదులను ఆవేదనకు గురి చేస్తోంది. పన్ను చెల్లింపుదార్ల సొమ్ముతో నడిచే పార్లమెంట్‌లో వారి బాగోగులపై మాట్లాడేవారే కనిపించకుండాపోవడం విస్మయం కలిగిస్తోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య వాగ్వాదాలు, నినాదాలు, నిరసనలు తప్ప జనం ఎదుర్కొంటున్న ఇబ్బందుల, వారి కష్టాలకు చట్టసభల్లో స్థానం దక్కడం లేదు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో పరిస్థితి మరింత దిగజారడం గమనార్హం.
ఈ సమావేశాలు నవంబర్ 25న ప్రారంభమయ్యాయి. ఈనెల 20వ తేదీన ముగియనున్నాయి. అంటే మరో 9 రోజుల సమయమే మిగిలింది. మధ్యలో రెండు రోజులు సెలవులు ఉన్నాయి. ఇప్పటిదాకా పార్లమెంట్‌లో సరైన చర్చే జరగలేదు. గౌతమ్ అదానీ, జార్జి సోరోస్ వ్యవహారంపై ఇరుపక్షాలు గొడవలు పడడంతోనే సమయమంతా వృథాగా గడిచిపోయింది. దేశంలో నానాటికీ పెరుగుతున్న ధరలు, నిరుద్యోగం, వాతావరణ కాలుష్యంపై పార్లమెంట్‌లో చర్చ జరుగుతుందని, ప్రభుత్వం నుంచి ఏదైనా పరిష్కార మార్గం లభిస్తుందని వెయ్యి కళ్లతో ఎదురు చూసిన ప్రజలకు నిరాశే మిగులుతోంది.
సొమ్ము వెచ్చిస్తున్నా ఫలితం సున్నా
ప్రజలు కట్టే పన్నుల సొమ్ముతోనే పార్లమెంట్ కార్యకలాపాలు జరుగుతాయి. ఎంపీల వ్యవహార శైలికి అదే ప్రజలు బాధితులుగా మారుతున్నారు. పేదల సమస్యలు ఎప్పటికీ చర్చకు రాకుండాపోతున్నాయి. ఒక్క నిమిషం పార్లమెంట్ సమావేశాలు జరగాలంటే రూ.2.50 లక్షలు ఖర్చవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇంత సొమ్ము వెచ్చిస్తున్నా ఆశించిన ఫలితం మాత్రం సున్నా.
చర్చించాల్సిన బిల్లులు, తీసుకురావాల్సిన చట్టాలు ఎన్నో ఉన్నప్పటికీ ఎంపీలు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తూ అదానీ, సోరోస్ వివాదంతో కాలం గడిపేస్తుండడం గమనార్హం. ప్రజలను ప్రజాప్రతినిధులే శిక్షిస్తున్నారని, అందుకు మరొకరు అవసరం లేదని రాజకీయ వ్యాఖ్యాత కమలేష్ సింగ్ ఆక్షేపించారు. ఎంపీల వల్ల విలువైన ప్రజాధనం, సమయం వృథా అవుతున్నాయని విమర్శించారు. పార్లమెంట్‌లో అనవసర విషయాలపై సమయం వెచ్చిస్తూ ముఖ్యమైన అంశాలను పక్కనపెడుతున్నారని తప్పుపట్టారు. కొన్నిసార్లు ఎలాంటి చర్చ జరగకుండానే బిల్లులు చట్టాలుగా మారిపోతున్నాయని, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది మంచి పరిణామం కాదని అన్నారు.
ఇదేనా జవాబుదారీతనం?
ప్రజలకు ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన వేదిక పార్లమెంట్. ప్రభుత్వం జవాబుదారీగా ఉండాలి. పార్లమెంట్ కార్యకలాపాలు జరగపోవడంతో ప్రజా సమస్యలపై సమాధానం చెప్పకుండా తప్పుకొనే అవకాశం పాలకులకు లభిస్తోందని, జవాబుదారీతనం ఎక్కడా కనిపించడం లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కాంగ్రెస్, బీజేపీ మధ్య వివాదంతో ఇతర పారీ్టల సభ్యులకు మాట్లాడే వెలుసుబాటు దక్కడం లేదు. కొత్తగా ఎన్నికైన సభ్యులు పార్లమెంట్‌లో మాట్లాడాలని ఆరాటపడుతున్నప్పటికీ వారిని పట్టించుకొనే నాథుడే ఉండడం లేదు.
లోక్‌సభ, రాజ్యసభలో అదానీ అంశాన్ని కాంగ్రెస్ లేవనెత్తుతుండగా, దాని పోటీగా బీజేపీ ఎంపీలు జార్జి సోరోస్‌ను ప్రస్తావిస్తున్నారు. మరోవైపు అదానీ, సోరోస్ కాకుండా దేశ సమస్యలపై చర్చ జరగాలని కోరుకుంటున్నామని సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ డింపుల్ యాదవ్ చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ ఇప్పటికైనా పట్టువీడాలని సూచించారు. పార్లమెంట్‌ను కాంగ్రెస్, బీజేపీలు హైజాక్ చేస్తున్నాయని తృణమూల్ కాంగ్రెస్ సభ్యుడు కల్యాణ్ బెనర్జీ మండిపడ్డారు. ప్రాంతీయ పారీ్టలు ఉన్నాయన్న సంగతే అవి మర్చిపోతున్నాయని ధ్వజమెత్తారు.
బూడిదలో పోసిన పన్నీరు
పార్లమెంట్ సమావేశాల్లో ఒక నిమిషం వృథా అయ్యిందంటే రూ.2.50 లక్షలు బూడిదలో పోసిన పన్నీరు అయినట్లేనని 2012లో అప్పటి పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి పవన్ బన్సల్ చెప్పారు. 2021లో పార్లమెంట్ సమావేశాల్లో ప్రతిష్టంభన కారణంగా రూ.133 కోట్ల ప్రజాధనం వృథా అయినట్లు అప్పట్లో నిపుణులు లెక్కగట్టారు. మరోవైపు పార్లమెంట్ భేటీలు నానాటికీ కుదించుకుపోతున్నాయి. 1952 నుంచి 1957 వరకు కొనసాగిన తొలి లోక్‌సభ కాలంలో ప్రతిఏటా సగటున 135 రోజుల చొప్పున పార్లమెంట్ సమావేశాలు జరిగాయి. 2019 నుంచి 2024 దాకా మనుగడలో ఉన్న 17వ లోక్‌సభ కాలంలో సగటున ఏటా 55 రోజులపాటే పార్లమెంట్ సమావేశాలు జరిగాయి.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment