సంస్థతో సోనియా బంధంపై చర్చ
సభల్లో పట్టుబట్టిన బీజేపీ
ఆందోళనలతో అట్టుడికిపోయిన రాజ్యసభ
ఉభయ సభలు నేటికి వాయిదా
న్యూఢిల్లీ: దేశ వ్యతిరేక కార్యలాపాల ఆరోపణలు ఎదుర్కొంటున్న జార్జ్ సోరోస్ ఫౌండేషన్‌తో కాంగ్రెస్ అగ్ర నేత సోనియాగాంధీ సంబంధాల వ్యవహారం సోమవారం పార్లమెంటును కుదిపేసింది. దీనిపై ప్రభుత్వ, ప్రతిపక్షాల ఆందోళనలు, పరస్పర ఆరోపణ, విమర్శలతో ఉభయ సభలూ అట్టుడికాయి. సోరోస్ ఫౌండేషన్ నిధులతో నడుస్తున్న ఫోరం ఆఫ్ డెమొక్రాటిక్ లీడర్స్ ఆసియా పసిఫిక్ (ఎఫ్‌డీఎల్–ఏపీ) అనే సంస్థకు సోనియా కో ప్రెసిడెంట్‌గా ఎందుకున్నారో చెప్పాలని బీజేపీ సభ్యులు పట్టుబట్టారు. వారి ఆరోపణలన్నింటినీ కాంగ్రెస్ సభ్యులు తోసిపుచ్చారు.
అదానీ అంశంపై బదులివ్వలేకే ఉద్దేశపూర్వకంగా దీన్ని తెరపైకి తెచ్చారని మండిపడ్డాయి. ఇరు పక్షాల ఆందోళనల నేపథ్యంలో ఉభయ సభలూ కార్యకలాపాలేవీ చేపట్టకుండానే మంగళవారానికి వాయిదా పడ్డాయి. రాజ్యసభ కార్యకలాపాలు మొదలవగానే సోరోస్ అంశంపై చర్చ జరగాలంటూ సభ నాయకుడు జేపీ నడ్డా పట్టుబట్టారు. ఇది దేశ భద్రతకు సంబంధించిన అతి ముఖ్యమైన అంశమని ఆయనన్నారు. నడ్డాకు మద్దతుగా అధికార పక్ష సభ్యులంతా లేచి నిలబడి కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా బిగ్గరగా నినాదాలు చేశారు.
దాంతో సభ కాసేపు వాయిదా పడింది. తర్వాత కూడా ఈ అంశంపైనే దుమారం సాగింది. జమ్మూ కశీ్మర్‌ను భారత్‌కు సంబంధం లేని ప్రత్యేక ప్రాంతంగా పరిగణించే ఎఫ్‌డీఎల్–ఏపీ సంస్థతో జార్జ్ సోరోస్ లింకులు ఆందోళన కలిగించే అంశమని నడ్డా అన్నారు. ఇలాంటి వాటి చేతుల్లో కాంగ్రెస్ పావుగా మారిందని ఆరోపించారు. ఎన్డీఏ సభ్యులంతా ఆయనతో గొంతు కలిపారు. తమ డిమాండ్లను పట్టించుకోని చైర్మన్, అధికార పక్షం లేవనెత్తగానే ఈ అంశాన్ని మాత్రం చర్చకు ఎలా అనుమతిస్తారని జైరాం రమేశ్, ప్రమోద్ తివారీ (కాంగ్రెస్) అభ్యంతరం వెలిబుచ్చారు.
సభలో లేని సభ్యురాలి ప్రతిష్టకు ఇలా భంగం కలిగించడం సరికాదని విపక్ష నేత మల్లికార్జున ఖర్గే ఆక్షేపించారు. ‘‘దేశ ప్రతిష్టకు భంగం కలిగించజూసే శక్తులతో పొంచి ఉన్న ప్రమాదాన్ని నిర్లక్ష్యం చేయజాలం. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు దన్నుగా నిలుస్తోందని అభియోగాలున్న సంస్థకు ఈ సభలోని సభ్యురాలే కో ప్రెసిడెంట్ అన్నది మర్చిపోరాదు’’ అని చైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖడ్ బదులిచ్చారు. ఆయన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. చైర్మన్ అధికార పక్షం పట్ల పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. లోక్‌సభలోనూ ఇవే దృశ్యాలు కని్పంచాయి. అనంతరం పార్లమెంటు బయట కూడా సోరోస్ అంశంపై కేంద్ర మంత్రి కిరెణ్ రిజిజుతో పాటు బీజేపీ నేతలు సోనియాపై విమర్శలు గుప్పించారు. వాటిని కాంగ్రెస్ నేతలు ఖండించారు.
ధన్‌ఖడ్‌పై విపక్షాల ‘అవిశ్వాసం’!
రాజ్యసభ చైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖడ్‌తో విపక్షాల అభిప్రాయ బేధాలు మరోసారి తెరపైకి వచ్చాయి. ఆయన్ను ఉపరాష్ట్రపతి పదవి నుంచి తొలగించే దిశగా అవి పావులు కదుపుతున్నాయి. ఈ మేరకు రాజ్యసభలో అతి త్వరలో తీర్మానం ప్రవేశపెట్టనున్నట్టు ప్రతిపక్షాలు చెబుతున్నాయి. ‘‘గత ఆగస్టులోనే విపక్ష ఇండియా కూటమి పక్షాలం ఈ దిశగా ప్రయత్నాలు చేశాం. కానీ ధన్‌ఖడ్‌కు మరో అవకాశమివ్వాలనే ఉద్దేశంతో ఊరుకున్నాం.
కానీ సోమవారం సభలో ఆయన ప్రవర్తించిన తీరు చూశాక అవిశ్వాస తీర్మానం తప్ప మరో దారి లేదని తేలిపోయింది’’ అని విపక్ష నేతలు కొందరు వెల్లడించారు. ‘‘ధన్‌ఖడ్ ప్రవర్తన ఎంతమాత్మూ ఆమోదయోగ్యం కాదు. బీజేపీకి ఆ పార్టీ అధికార ప్రతినిధి కంటే కూడా విశ్వాసపాత్రునిగా ఆయన వ్యవహరిస్తున్నారు’’ అంటూ మండిపడ్డారు. కాంగ్రెస్‌తో పాటు సమాజ్‌వాదీ, తృణమూల్ తదితర పారీ్టలు ఈ విషయంలో కలిసొస్తున్నట్టు సమాచారం. ఆరి్టకల్ 67(బి) ప్రకారం తీర్మానాన్ని రాజ్యసభ సాధారణ మెజారిటీతో ఆమోదించాక లోక్‌సభ ఆమోదం కూడా పొందితే ఉపరాష్ట్రపతిని తొలగించవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment