ఉభయ సభల్లో అధికార,విపక్షాల మధ్య రగడ
జార్జి సోరోస్–కాంగ్రెస్ బంధంపై చర్చించాలని బీజేపీ పట్టు
రాజ్యసభ చైర్మన్ ధన్‌ఖడ్‌పై నోటీసు ఇవ్వడంపై ఆగ్రహం
అదానీ అంశంపై చర్చ చేపట్టాలని కాంగ్రెస్ డిమాండ్
న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సజావుగా సాగే పరిస్థితి కనిపించడం లేదు. అధికార, విపక్షాల ధోరణితో ఉభయ సభల్లో వాయిదాల పర్వం కొనసాగుతూనే ఉంది. ప్రజా సమస్యలపై చర్చ జరగకుండా సభలు వాయిదా పడుతున్నాయి. బుధవారం సైతం ఇదే పరిస్థితి పునరావృతమైంది. లోక్‌సభ పలుమార్లు వాయిదా పడింది. తొలుత డిజాస్టర్ మేనేజ్‌మెంట్ చట్ట సవరణపై జరిగిన చర్చలో తృణమూల్ కాంగ్రెస్ సభ్యుడు కల్యాణ్ బెనర్జీ మాట్లాడారు.
కోవిడ్ విపత్తు సమయంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సహకరించలేదని ఆరోపించారు. బెనర్జీ వ్యాఖ్యలను కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తప్పుపట్టారు. ఆయనపై బెనర్జీ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు స్పీకర్ చెప్పారు. ఈ సమయంలో అధికార, విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం జరగడంతో స్పీకర్ సభను వాయిదా వేశారు.
సభ పునఃప్రారంభమైన తర్వాత అధికార, విపక్షాల మధ్య అరుపులు కేకలు చోటుచేసుకోవడంతో సభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. పునఃప్రారంభమైన తర్వాత జార్జిసోరోస్–కాంగ్రెస్ బంధంపై రగడ జరగడంతో సభ సాయంత్రం 5 గంటల వరకు వాయిదాపడింది.
సభ ప్రారంభమైనా గొడవ సద్దుమణగలేదు. దీంతో సభను గురువారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ చెప్పారు. మణిపూర్‌లో హింసాకాండ యథేచ్ఛగా కొనసాగుతోందని, మానవతా సంక్షోభం నెలకొందని లోక్‌సభలో కాంగ్రెస్ సభ్యుడు గౌరవ్ గొగోయ్ జీరో అవర్‌లో పేర్కొన్నారు. మణిపూర్ అంశంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.
రైల్వే సవరణ బిల్లుకు ఆమోదం
రైల్వే చట్టాలను సవరిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైల్వే సవరణ బిల్లు–2024ను లోక్‌సభలో ఆమోదించారు. ఈ బిల్లుపై జరిగిన చర్చకు రైల్వే మంత్రి వైష్ణవ్ సమాధానమిచ్చారు. ఈ బిల్లుతో రైల్వే శాఖను ప్రైవేటీకరిస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు.
రాజ్యసభలో నిరసనలు, నినాదాలు
ధన్‌ఖడ్‌పై విపక్షాలు అవిశ్వాస తీర్మాన నోటీసు ఇవ్వడంతోపాటు సోరోస్ వ్యవహారంపై పార్లమెంట్ ఎగువ సభలో బుధవారం దుమారం రేగింది. ఉదయం సభ ప్రారంభం కాగానే ప్రతిపక్ష సభ్యులు నినాదాలు ప్రారంభించారు. చైర్మన్ ధన్‌ఖడ్‌పై తాము ఇచ్చిన అవిశ్వాస తీర్మాన నోటీసుపై చర్చించాలని పట్టుబట్టారు. దాంతో ధన్‌ఖడ్ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు.
సభ పునఃప్రారంభమైన తర్వాత కేంద్ర మంత్రి నడ్డా మాట్లాడారు. దేశాన్ని అస్థిరపర్చడానికి కాంగ్రెస్ పార్టీ జార్జి సోరోస్‌తో చేతులు కలిపిందని ఆరోపించారు. సోరోస్‌తో కాంగ్రెస్ పెద్దల సంబంధాలపై ప్రజలు ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. విపక్షాలు చర్చకు ముందుకు రావాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నాయకులు విదేశీ శక్తుల చేతుల్లో పావులుగా మారారని ధ్వజమెత్తారు.
రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న ధన్‌ఖడ్‌పై రాజకీయ విమర్శలు చేయడం ఏమిటని ప్రతిపక్షాలపై నడ్డా ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ప్రతిపక్ష సభ్యులు తమ స్థానాల్లో నిల్చొని నడ్డాకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అధికార పక్ష ఎంపీలు కాంగ్రెస్ తీరుపై మండిపడుతూ నినాదాలు చేశారు. తీవ్ర గందరగోళం నెలకొనడంతో సభను గురువారానికి వాయిదా వేస్తున్నట్లు ధన్‌ఖడ్ ప్రకటించారు.
వినూత్న నిరసన
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సజావుగా సాగకపోవడం, తాము లేవనెత్తిన అంశాలపై ప్రభుత్వం చర్చించకపోవడంపై విపక్ష ఎంపీలు వినూత్న రీతిలో నిరసన వ్యక్తంచేశారు. బుధవారం పార్లమెంట్ ప్రాంగణంలో బీజేపీ ఎంపీలకు జాతీయ జెండాలు, గులాబీలు అందజేసి స్వాగతం పలికారు. తమ డిమాండ్లపై దృష్టి పెట్టాలని, కీలకమైన అంశాలపై పార్లమెంట్ ఉభయ సభల్లో చర్చ జరిగేలా సహకరించాలని అధికార పక్ష సభ్యులకు విజ్ఞప్తి చేశారు.
లోక్‌సభలో విపక్షనేత అయిన రాహుల్ గాంధీ పార్లమెంట్ ప్రాంగణంలో అటుగా వస్తున్న రక్షణ శాఖమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు కార్డు రూపంలోని జాతీయ జెండాను స్వయంగా అందజేశారు.
రాహుల్, ప్రియాంకా గాం«దీతోపాటు డీఎంకే, జేఎంఎం, సీపీఐ, సీపీఎం తదితర పార్టీల ఎంపీలు పార్లమెంట్ మకరద్వారం మెట్ల వద్ద జెండాలు, గులాబీలు చేతబూని నిరసన తెలిపారు. ‘దేశాన్ని అమ్మేయకండి’ అని రాసి ఉన్న ప్లకార్డులు ప్రదర్శించారు. అదానీ గ్రూప్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చించాలని విపక్షాలు కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దీంతో ప్రతిపక్ష సభ్యులు నిత్యం పార్లమెంట్ ప్రాంగణంలో వినూత్న రీతుల్లో నిరసన వ్యక్తం చేస్తుండటం తెల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment