రాజ్యసభలో అధికార, విపక్షాల మధ్య వాగ్వాదాలు, నినాదాలు
పలుమార్లు వాయిదా పడిన ఎగువ సభ
లోక్‌సభలో డిజాస్టర్ మేనేజ్‌మెంట్(సవరణ) బిల్లుపై విపక్షాల అభ్యంతరం
న్యూఢిల్లీ: పార్లమెంట్ ఉభయ సభల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య రగడ యథాతథంగా కొనసాగింది. ప్రధానంగా రాజ్యసభలో గురువారం వాగ్వాదాలు, నిరసనలు, నినాదాలు చోటుచేసుకున్నాయి. దీంతో సభ పలుమార్లు వాయిదా పడింది. రాజ్యసభలో చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్‌పై ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మాన నోటీసు ఇవ్వడం పట్ల అధికార బీజేపీ సభ్యులు ఆగ్రహం వ్యక్తంచేశారు.
అమెరికా బిలియనీర్ జార్జి సోరోస్‌తో కాంగ్రెస్ పెద్దలకు సంబంధాలు ఉన్నాయని, దేశాన్ని అస్థిరపర్చడానికి కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ సభ్యుల ఆరోపణలపై కాంగ్రెస్ ఎంపీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తాము లేవనెత్తిన అంశాలపై సభలో వెంటనే చర్చ ప్రారంభించాలని కోరుతూ విపక్షాలు ఇచ్చిన ఆరు నోటీసులు చైర్మన్ ధన్‌ఖడ్ తిరస్కరించారు. సభలో కేంద్ర మంత్రి జె.పి.నడ్డా మాట్లాడారు.
ధన్‌ఖడ్ బీజేపీ ప్రతినిధిగా పని చేస్తున్నారంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన ఆరోపణలను ఖండించారు. చైర్మన్ ఇచ్చిన రూలింగ్‌ను విమర్శించడం సభా మర్యాదను ఉల్లంఘించడమే, సభాధ్యక్ష స్థానాన్ని అగౌరవపర్చడమే అవుతుందని అన్నారు. చైర్మన్‌ను చీర్‌లీడర్ అనడం ఏమిటని కాంగ్రెస్ నేతలపై ధ్వజమెత్తారు.
కాంగ్రెస్‌కు ప్రజాస్వామ్యం అంటే, పార్లమెంటరీ సంప్రదాయాలు అంటే గౌరవం లేదని ఆక్షేపించారు. జార్జి సోరోస్‌కు, సోనియా గాం«దీకి సంబంధాలు ఏమిటని నిలదీశారు. దీనిపై దేశ ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. మన దేశాన్ని ముక్కలు చేయడానికి సోరోస్ కోట్లాది డాలర్లు పెట్టుబడులు పెడుతున్నాడని నడ్డా ధ్వజమెత్తారు.
నడ్డాపై వ్యాఖ్యలపై సభలో మల్లికార్జున ఖర్గే స్పందిస్తుండగా, బీజేపీ సభ్యులు పెద్ద ఎత్తున నినదాలు చేశారు. తృణమూల్ కాంగ్రెస్ సభ్యుడు డెరెక్ ఓ బ్రెయిన్ మాట్లాడారు. బంగ్లాదేశ్‌లో మైనారీ్టలపై హింసాకాండపై ప్రధాని మోదీ స్పందించాలని, సభకు వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో బీజేపీ సభ్యులు నినాదాలు ప్రారంభించారు. సభ ఎంతకీ అదుపులోకి రాకపోవడంతో శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ ధన్‌ఖడ్ ప్రకటించారు.
ముఖం దాచుకోవడానికి ప్రయత్నిస్తున్నా: గడ్కరీ
దేశంలో రోజురోజుకూ రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయని కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. ప్రమాదాల నివారణపై ఆయన లోక్‌సభలో గురువారం సమాధానం ఇచ్చారు. ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడారు. విదేశాల్లో జరిగే సమావేశాలకు వెళ్లినప్పుడు మన దేశంలో రోడ్డు ప్రమాదాల ప్రస్తావన వస్తే తన ముఖాన్ని దాచుకునేందుకు ప్రయత్నిస్తున్నానని చెప్పారు. అయితే రోడ్డు ప్రమాదాలు తగ్గాలంటే ప్రజల్లో మార్పు రావాల్సిందేనని తేలి్చచెప్పారు. మరోవైపు డిజాస్టర్ మేనేజ్‌మెంట్(సవరణ) బిల్లు–2024ను లోక్‌సభలో విపక్ష సభ్యులు వ్యతిరేకించారు. వాతావరణ మార్పులను ఎలా ఎదుర్కొంటారో ఈ బిల్లులో ప్రస్తావించలేదని విమర్శించారు. ఈ బిల్లు గురువారం లోక్‌సభలో మూజువాణి ఓటుతో ఆమోదం పొందింది.
Comments
Please login to add a commentAdd a comment