సీనియర్ సభ్యులకు స్కూల్ హెడ్‌మాస్టర్‌లా క్లాసులు పీకుతున్నారు
ఆయన పక్షపాత ధోరణి వల్లే అవిశ్వాస నోటీస్ ఇచ్చాం
మీడియా సమావేశంలో విపక్ష నేతల విసుర్లు
న్యూఢిల్లీ: పార్లమెంట్ ఎగువ సభ నిర్వహణలో రాజ్యసభ చైర్మన్ హోదాలో హుందాగా వ్యవహరించాల్సిన జగదీప్ ధన్‌ఖడ్ పూర్తి పక్షపాత ధోరణిలో వ్యవహరిస్తున్నారని, ప్రభుత్వానికి అతిపెద్ద అధికారి ప్రతినిధిగా ప్రవర్తిస్తున్నారని విపక్షాలు ధ్వజమెత్తాయి. ధన్‌ఖడ్‌ను తొలగించాలంటూ అవిశ్వాస తీర్మానం నోటీసును మంగళవారం రాజ్యసభలో విపక్ష సభ్యులు అందజేయడం తెల్సిందే. దీనిపై బుధవారం ఢిల్లీలో కాంగ్రెస్ చీఫ్ ఖర్గే తోటి విపక్షాల ‘ఇండియా’ కూటమి ఎంపీలతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు.
‘‘ ధన్‌ఖడ్ ఒక ప్రభుత్వ అధికారి ప్రతినిధిలా ప్రవర్తిస్తున్నారు. సీనియర్ పార్లమెంటేరియన్లకూ పాఠశాల ప్రధానోధ్యాయునిలా ధన్‌ఖడ్ క్లాసులు పీకుతున్నారు. సభలో విపక్ష సభ్యులకు మాట్లాడే స్వేచ్ఛనివ్వట్లేదు. సభ సజావుగా సాగకుండా అడ్డు తగిలే అతిపెద్ద అవరోధం ధన్‌ఖడ్. ఆయన చూపే వివక్ష చూసి విసుగెత్తిపోయాం. ఆయన వైఖరి, ధోరణి సైతం విపక్షాలకు అనుకూలంగా లేదు. అందుకే ఆయనను తొలగించాలని నోటీస్ ఇచ్చాం.
రాజ్యసభ నియమ నిబంధనావళిని తుంగలో తొక్కి రాజకీయాలు ముందంజలోకి వచ్చాయి’’ అని ఖర్గే వ్యాఖ్యానించారు. ‘‘ రాజ్యాంగం, రాజ్యాంగబద్ధ సంప్రదాయాలకు తిలోదకాలిస్తూ ధన్‌ఖడ్ బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. తర్వాత మరేదో పదోన్నతి వస్తుందన్న ఆశతో పనిచేస్తున్న అతిపెద్ద అధికార ప్రతినిధిలా ఆయన వాలకం ఉంది. ఆయన తన వైఖరితో రాజ్యసభకు ఉన్న ప్రతిష్టను, పరువును దెబ్బతీస్తున్నారు. మాకు ఆయనపై ఎలాంటి వ్యక్తిగత కక్ష, కోపాలు లేవు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే మేం అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌కు పట్టుబడుతున్నాం’’ అని ఖర్గే అన్నారు.
ప్రజాస్వామ్యంపై దాడి: డీఎంకే
‘‘ ఛైర్మన్ ద్వారా బీజేపీ ప్రదర్శిస్తున్న ఈ వైఖరి స్పష్టంగా ప్రజాస్వామ్యంపై దాడే’’ అని డీఎంకే నేత తిరుచ్చి శివ వ్యాఖ్యానించారు. ‘‘ రాజ్యసభలో విపక్ష సభ్యుల గొంతుక వినిపించే అవకాశం చిక్కట్లేదు’’ అని తృణమూల్ కాంగ్రెస్ నేత నదీముల్ హక్ అన్నారు. ‘‘ చైర్మన్ రాజ్యసభను నడుపుతున్నట్లు లేదు ఒక సర్కస్‌ను నడుపుతున్నట్లు ఉంది. ఉన్న సమయమంతా ఆయన తన సొంత విషయాలు మాట్లాడటానికే సరిపోతోంది. ఉన్న కాస్తంత సమయాన్ని ఆయనే వృథాచేస్తారు’’ అని శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ అన్నారు. టీఎంసీ నేత సాగరికా ఘోష్, ఆర్జేడీ నేత మనోజ్ ఝా తదితరులు ఈ మీడియా సమావేశంలో మాట్లాడారు.
ఇదీ చదవండి: ధన్‌ఖఢ్‌పై అవిశ్వాసం
Comments
Please login to add a commentAdd a comment