సాక్షి,ఢిల్లీ: ఉపరాష్ట్రపతి,రాజ్యసభ చైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖడ్‌పై విపక్షాలు అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చాయి. అవిశ్వాస తీర్మానంపై దాదాపు 70 మంది ఎంపీలు సంతకాలు చేశారు. అవిశ్వాస తీర్మానానం అంశంలో కాంగ్రెస్ లీడ్ తీసుకుంటోంది. కాంగ్రెస్ సభ్యులతో చైర్మన్ రాజ్యసభలో వ్యవహరిస్తున్న తీరు వల్లే అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చినట్లు చెబుతున్నారు.
అధికార బీజేపీ సభ్యులకు చైర్మన్ కావాలనే కాంగ్రెస్-సోరోస్ లింకులపై నినాదాలు చేయడానికి అవకాశాలు ఇచ్చినట్లు కాంగ్రెస్ ఆరోపిస్తోంది. అయితే తీర్మానం ఆమోదం పొంది ఉపరాష్ట్రపతి దన్‌ఖడ్‌ను తొలగించాలంటే పార్లమెంట్ ఉభయసభల్లో అవిశ్వాస తీర్మానం మెజారిటీ ఓట్లతో నెగ్గాల్సి ఉంటుంది.
అధికార ఎన్డీఏతో పోలిస్తే ఇండియా కూటమికి పార్లమెంట్ ఉభయసభల్లోనూ మెజారిటీ లేకపోవడంతో ఈ తీర్మానం నెగ్గే అవకాశం లేదని తెలుస్తోంది. అయితే తమ తీర్మానంతో ఇండియా కూటమి సభ్యులంతా మళ్లీ ఒక్కటై రాజ్యసభ చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం అంశంలో విజయం సాధిస్తామని విపక్షాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.
కాగా, ప్రొసీజర్ ప్రకారం అవిశ్వాస తీర్మానం ముందు రాజ్యసభలో ప్రవేశపెట్టాలంటే 14 రోజుల ముందే నోటీసు ఇవ్వాలని రాజ్యాంగం చెబుతోంది. అయితే ఈ పార్లమెంట్ సెషన్ డిసెంబర్ 20తో ముగుస్తుండడంతో తీర్మానం అసలు సభలోకి వచ్చే అవకాశమే లేదని తెలుస్తోంది. కేవలం చైర్మన్ తీరును దేశ ప్రజల ముందు ఎండగట్టాలనే వ్యూహంతోనే ఇండియా కూటమి అవిశ్వాస తీర్మానం అంశాన్ని తెరపైకి తీసుకువచ్చిందన్న మరో వాదనా వినిపిస్తోంది.
ఒకవేళ రాజ్యసభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే.. తర్వాత ఏం జరుగుతుంది..?
చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం ఒకవేళ రాజ్యసభలో ప్రవేశ పెట్టారనే కాసేపు అనుకుందాం. ఇక్కడ తీర్మానం సింపుల్ మెజారిటీతో ఆమోదం పొందాలి. అప్పుడే తీర్మానం లోక్‌సభకు వెళుతుంది. అక్కడికీ వెళ్లిందనుకుందాం.. తీర్మానం.. అక్కడా సింపుల్ మెజారిటీతో ఆమోదం పొందాల్సి ఉంటుంది. ఇంత జరిగితేనే ధన్‌ఖడ్ పదవిని కోల్పోతారు.
నిజానికి నోటీసు ఇచ్చినప్పటి నుంచి తీర్మానం ప్రవేశపెట్టాలంటే 14 రోజుల టైమ్ రాజ్యాంగ నిబంధన. ఇక్కడ ఆ నిబంధనను ఇండియా కూటమి పాటించలేదు. సెషన్ మరో 10 రోజులుందనగా నోటీసు ఇచ్చింది. దీంతో తీర్మానం అసలు రాజ్యసభకే వెళ్లదని తెలుస్తోంది. ఒక వేళ వెళ్లినా ఏ సభలోనూ ఇండియా కూటమికి సింపుల్ మెజారిటీ లేదనే విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment