సోరోస్‌తో కాంగ్రెస్ పెద్దలకు సంబంధాలున్నాయి
దేశాన్ని అస్థిరపర్చడానికి కుట్రలు చేస్తున్నారు
రాజ్యసభలో కేంద్ర మంత్రి జె.పి.నడ్డా ఆగ్రహం
ఖండించిన కాంగ్రెస్ నేతలు
అదానీ అంశంపై చర్చించాలని డిమాండ్
న్యూఢిల్లీ: కాంగ్రెస్–జార్జి సోరోస్ బంధంతోపాటు అదానీ వ్యవహారంపై పార్లమెంట్ ఉభయ సభలు అట్టుడికిపోయాయి. మంగళవారం ఉదయం రాజ్యసభ ప్రారంభం కాగానే విపక్ష సభ్యులు అదానీ అంశాన్ని లేవనెత్తారు. దీనిపై వెంటనే చర్చ చేపట్టాలని డిమాండ్ చేస్తూ నినాదాలతో హోరెత్తించారు. పరిస్థితి ఎంతకీ అదుపులోకి రాకపోవడంతో సభ మధ్యాహ్నం 12 గంటలవరకు వాయిదా పడింది. సభ పునఃప్రారంభమైన తర్వాత కేంద్ర మంత్రి నడ్డా మాట్లాడారు. బిలియనీర్ ఇన్వెస్టర్ జార్జి సోరోస్‌కు, కాంగ్రెస్ పెద్దలకు మధ్య సంబంధాలున్నాయని ఆరోపించారు.
వారంతా చేతులు కలిపారని, ఇండియాను అస్థిరపర్చడానికి కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. నడ్డా ఆరోపణలపై కాంగ్రెస్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు ప్రారంభించారు. బీజేపీ సభ్యులు ప్రతిస్పందించారు. సోరోస్‌తో సంబంధాలపై కాంగ్రెస్ సమాధానం చెప్పాలని పట్టుబట్టారు. నడ్డా ఆరోపణలను కాంగ్రెస్ సభ్యుడు ప్రమోద్ తివారీ ఖండించారు. అదానీ పెద్ద ఎత్తున లంచాలు ఇచి్చనట్లు ఆరోపణలు వచ్చాయని, దీనిపై వెంటనే చర్చ ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఈ సమయంలో అధికార, విపక్షాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. నినాదాలు మిన్నంటాయి. దీంతో సభను మరుసటి రోజుకు వాయిదా వేస్తున్నట్లు రాజ్యసభ చైర్మన్ ప్రకటించారు.
లోక్‌సభలోనూ అదే దుమారం
సోరోస్‌తోపాటు భారతదేశ వ్యతిరేక శక్తులతో కాంగ్రెస్ నాయకులు సంబంధాలు కొనసాగిస్తున్నారని లోక్‌సభలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ కిరణ్ రిజిజు ఆరోపించం దుమారం రేపింది. మంగళవారం జీరో అవర్‌లో ఆయన మాట్లాడారు. తర్వాతవిపక్ష సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. సోరోస్‌తో కాంగ్రెస్‌కు సంబంధాలున్నాయంటూ రిజిజు చేసిన వ్యాఖ్యలను ఖండించారు. బీజేపీకి వ్యతిరేకంగా బిగ్గరగా నినాదాలు చేశారు. దాంతో సభాపతి స్థానంలో ఉన్న దిలీప్ సైకియా లోక్‌సభను మరుసటి రోజుకు వాయిదావేశారు. అంతకుముందు మర్చంట్ షిప్పింగ్ బిల్లు–2024ను కేంద్ర మంత్రి శర్భానంద సోనోవాల్ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. మర్చంట్ షిప్పింగ్ చట్టం–1958 స్థానంలో ఈ బిల్లును తీసుకొచ్చారు.
పార్లమెంట్ ప్రాంగణంలో నిరసన
అదానీ వ్యవహారంపై విపక్ష ఎంపీలు మంగళవారం పార్లమెంట్ ప్రాంగణంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా మోదీ, అదానీ ఫొటోలు ముద్రించి ఉన్న సంచులను ధరించారు. ఈ సంచులకు మరోవైపు ‘మోదీ అదానీ భాయి భాయి’ అని రాసి ఉంది. పార్లమెంట్ మకరద్వారం మెట్ల ముందు కాంగ్రెస్ సభ్యులు రాహుల్ గాంధీ, ప్రియాంకతోపాటు డీఎంకే, జేఎంఎం, సీపీఎం, సీపీఐ తదితర పార్టీలు నిరసన వ్యక్తంచేశారు. మోదీ, అదానీ బంధంపై పెద్ద ఎత్తున నినాదాలు కొనసాగించారు.
Comments
Please login to add a commentAdd a comment