బహిరంగ సభలో అభివాదం చేస్తున్న జేపీ నడ్డా. చిత్రంలో డీకే అరుణ, బండి సంజయ్, కిషన్‌రెడ్డి, లక్ష్మణ్, ఈటల రాజేందర్
కాంగ్రెస్ ఏడాది పాలనపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ధ్వజం
అలవికాని హామీలిచ్చి గద్దెనెక్కి ఒక్క హామీనీ నిలబెట్టుకోలేదని మండిపాటు
తెలంగాణకు బీజేపీయే ఉజ్వల భవిష్యత్తు అందించగలదని వ్యాఖ్య
హైదరాబాద్ సరూర్‌నగర్ స్టేడియంలో బహిరంగ సభలో ప్రసంగం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గారడీ ప్రభుత్వం కొనసాగుతోందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మండిపడ్డారు. ఆచరణ సాధ్యంకాని హామీ లిచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్.. ఏడాది నుంచి ప్రజల్ని వంచిస్తోందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ఏడాది పాలనంతా గత బీఆర్‌ఎస్ పాలనకు నకలుగా ఉందని ఎద్దేవా చేశారు. శనివారం హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ స్టేడియంలో ‘కాంగ్రెస్ ఏడాది పాలన–వైఫల్యాలపై బీజేపీ నిర్వహించిన బహిరంగ సభకు ముఖ్యఅతిథిగా హాజరైన జేపీ నడ్డా ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.
అన్నీ మోసపూరిత హామీలే...
‘తెలంగాణ, కర్ణాటక, హిమాచల్‌ప్రదేశ్ పరిస్థితు లను చూస్తే కాంగ్రెస్ వైఖరి స్పష్టమవుతుంది. పాత పెన్షన్ స్కీం జాడలేదు. 2 లక్షల ఉద్యోగాల ఊసులేదు. మహిళలకు ప్రతి నెలా ఇస్తామన్న రూ. 2,500 ఏ ఒక్కరికీ అందలేదు. ఆటోడ్రైవర్లకు రూ. 12 వేల హామీ ఏమైంది? రైతులకు ఎకరాకు రూ. 15 వేలు, కౌలు రైతులకు రూ. 12 వేలు, షాదీ ముబారక్ కింద రూ.లక్ష, తులం బంగారం, విద్యార్థులకు రూ.5 లక్షల క్రెడిట్ కార్డులు, స్కూటర్లు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు... ఇలా వందల సంఖ్యలో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా రేవంత్ ప్రభుత్వం అమలు చేయలేదు. దీనిపై ప్రశ్నించిన మాపై ఎదురుదాడి చేస్తున్నారు’ అని నడ్డా మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఆయనపైనే నమ్మకం లేదని.. అందుకే పూటకోమాట చెప్పి ప్రజల్ని ప్రసన్నం చేసుకొనే ప్రయత్నం చేస్తున్నారని వివర్శించారు. అప్పులు చేస్తూ మనుగడ సాగించే ప్రభుత్వాలు ఎక్కువకాలం ఉండవంటూ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
కాంగ్రెస్‌పై పోరాడతాం..
‘కాంగ్రెస్ ఏడాది పాలనను ప్రజల ముందే ఎండగట్టేందుకు ఇక్కడికి వచ్చా. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనకు, ఇప్పుడున్న కాంగ్రెస్ పాలనకు ఏమాత్రం తేడా లేదు. ఉద్యమాలు చేసి తెచ్చుకున్న తెలంగాణలో ప్రజలు ఇప్పటికీ మోసపోతూనే ఉన్నారు. మాయమాటలతో రైతులు, మహిళలు, యువకులు, కార్మికులను మోసగించిన కాంగ్రెస్‌పై పోరాడాలని నిర్ణయించాం’ అని నడ్డా పేర్కొన్నారు.
భవిష్యత్ అంతా బీజేపీదే...
ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి ఓట్ల శాతం భారీగా పెరిగిందని నడ్డా ఉద్ఘాటించారు. ‘దేశంలోని 19 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. మరో ఆరు రాష్ట్రాల్లో ఎన్డీయే ప్రభుత్వాలున్నాయి. ఒక్కసారి బీజేపీ అధికారంలోకి వస్తే అది శాశ్వతంగా ఉంటుంది. గత 30 ఏళ్లుగా గుజరాత్‌లో బీజేపీదే అధికారం. అక్కడి ప్రజల గుండెల్లో కేవలం కమలమే ఉంది. రాజస్తాన్‌లో ఆరుసార్లు, గోవా మూడుసార్లు, మధ్యప్రదేశ్‌లో మూడుసార్లు, యూపీలో రెండుసార్లు బీజేపీ అధికారం దక్కించుకుంది. మహారాష్ట్రలోనూ మూడోసారి విజయం సాధించింది. ఉత్తరాఖండ్‌లో రెండు, మణిపూర్‌లో మూడు, అస్సాంలో రెండు, హరియాణాలో మూడోసారి అధికారంలోకి వచ్చింది. ఇకపై దేశ భవిష్యత్ అంతా బీజేపీదే. వచ్చే ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణలోనూ బీజేపీ అధికారంలోకి వస్తుంది’ అని నడ్డా ధీమా వ్యక్తం చేశారు.
తెలంగాణకు ఎన్నో కేంద్ర ప్రాజెక్టులు..
మోదీ ప్రభుత్వంలో తెలంగాణకు ఎంతో అభివృద్ధి జరిగిందని. పన్నుల రూపంలో రూ. 1.60 లక్షల కోట్లు, గ్రాంట్ల ద్వారా రూ. 1.12 లక్షల కోట్లు, స్మార్ట్‌సిటీ ప్రాజెక్టు, టెక్స్‌టైల్, రైల్వేకు 20 రెట్ల బడ్జెట్ కేటాయింపులు, వందేభారత్ రైళ్లు, భారత్ మాలా ప్రాజెక్టు కింద హైదరాబాద్ ఇండోర్, సూరత్ చెన్నై, హైదరాబాద్–వైజాగ్ లాంటి జాతీయ రహదారులు, బీబీనగర్‌లోనూ ఎయిమ్స్ నిర్మాణం తదితర ఎన్నో ప్రాజెక్టులు ముందుకు సాగుతున్నాయన్నారు.
నిజమైన మార్పు బీజేపీతోనే సాధ్యం: కిషన్‌రెడ్డి
బీఆర్‌ఎస్ పాలనపై అసంతృప్తితో ఉన్న రాష్ట్ర ప్రజలకు కొత్త హామీలతో కాంగ్రెస్ పార్టీ వల వేసి ఓట్లు వేయించుకొని ఇప్పుడు వాటిని అమలు చేయకుండా మోసగిస్తోందని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. నిజమైన మార్పు కేవలం బీజేపీతోనే సాధ్యమన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో మరింత ఆర్థిక సంక్షేభం ఏర్పడిందని, ఇకపై ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీజేపీదే అధికారమని జోస్యం చెప్పారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌కు సరైన నాయకుడు లేడని.. ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. రేవంత్ పాలనలో భాగ్యనగర్ బంగ్లాదేశ్‌గా మారుతోందని ఆరోపించారు.
హామీలు నెరవేర్చకుండా సంబురాలా?: డీకే అరుణ, కొండా
రాష్ట్రంలో ఒక నియంత గద్దె దిగాడనుకుంటే మరో నియంత వచ్చాడని సీఎం రేవంత్‌ను ఉద్దేశించి మెదక్ ఎంపీ రఘునందన్‌రావు విమర్శించారు. ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చని ప్రభుత్వం.. ఏ ముఖంతో సంబురాలు చేసుకుంటోందని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ప్రశ్నించారు. మూసీ ప్రక్షాళన పేరుతో పేదల భూములను బడా కంపెనీలకు కట్టబెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ దుయ్యబట్టారు. ప్రపంచ నేతగా గుర్తింపు పొందిన ప్రధాని మోదీపై కాంగ్రెస్ అడ్డగోలు ఆరోపణలు చేస్తోందని.. విదేశీ శక్తులకు తొత్తుగా మారిందని బీజేపీ జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు కె. లక్ష్మణ్ మండిపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ దుష్టపాలనకు చరమగీతం పాడాలని బీజేపీ సీనియర్ నేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment