న్యూఢిల్లీ: అదానీపై హిండెన్‌బర్గ్ రిపోర్టు వ్యవహారం అధికార, ప్రతిపక్షాల నడుమ అగ్గిరాజేసింది. కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ బుధవారం లోక్‌సభలో ఈ అంశాన్ని మరోసారి లేవనెత్తారు. 2014లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే గౌతమ్ అదానీ ఆస్తులు విపరీతంగా పెరిగిపోయాయని ఆరోపించారు. ప్రపంచ సంపన్నుల జాబితాలో 609వ స్థానం నుంచి ఎకాఎకిన రెండో స్థానానికి చేరుకున్నారని, ఇదంతా బీజేపీ చలవేనని మండిపడ్డారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై బుధవారం జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు.
ఎలక్టోరల్ బాండ్ల రూపంలో అదానీ గత 20 ఏళ్లలో ఎంత సొమ్ము ఇచ్చాడో బీజేపీ చెప్పాలని డిమాండ్ చేశారు. వ్యాపారం, రాజకీయం కలిస్తే ఏం జరుగుతుందో బిజినెస్ స్కూళ్లలో ఒక కేసు స్టడీగా అధ్యయనం చేయాలన్నారు. అదానీ సంపద 2014 నుంచి 2022 దాకా 8 బిలియన్ డాలర్ల నుంచి 140 బిలియన్ డాలర్లకు ఎలా పెరిగిందంటూ జోడో యాత్రలో జనం తనను అడిగారని అన్నారు. అక్రమాలకు పాల్పడిన అదానీని ప్రధాని నరేంద్రమోదీ కాపాడుతున్నారని ఆరోపించారు. అదానీపై వచ్చిన ఆరోపణలపై ఎందుకు దర్యాప్తు జరిపించడం లేదని అన్నారు.
అదానీ షెల్ కంపెనీల గుట్టు తేల్చండి
హిండెన్‌బర్గ్ నివేదికను సభలో రాహుల్ గాంధీ ప్రస్తావించారు. అదానీకి విదేశాల్లో షెల్ కంపెనీలు ఉన్నట్లు ఈ నివేదికలో పేర్కొన్నారని వెల్లడించారు. ఈ కంపెనీల గుట్టుమట్లను ప్రభుత్వం వెలికితీయాలని, ఇది దేశ భద్రతకు సంబంధించిన వ్యవహారమని స్పష్టం చేశారు. అదానీకి మేలు చేయడానికి నిబంధనలను సైతం ప్రభుత్వం మార్చేసిందని దుయ్యబట్టారు. లాభాల్లో ఉన్న ఎయిర్‌పోర్టులను అదానీకి అక్రమంగా కట్టబెట్టిందని ఆరోపించారు. ఎల్‌ఐసీ సొమ్మును నిలకడ లేని అదానీ కంపెనీల్లో పెట్టుబడిగా పెట్టారని ఆక్షేపించారు. కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన అగ్నివీర్ పథకాన్ని రాహుల్ తప్పుపట్టారు. నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి కీలక అంశాలను రాష్ట్రపతి ప్రసంగంలో ప్రస్తావించకపోవడం దారుణమని రాహుల్ పేర్కొన్నారు.
ఆధారాలు చూపించండి: బీజేపీ
లోక్‌సభలో రాహుల్ గాంధీ ఆరోపణలపై కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆరోపణలు చేయడం కాదు, ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు.
రాహుల్ వ్యాఖ్యలు తొలగించాం..
లోక్‌సభలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన రాహుల్‌పై చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ డిమాండ్ చేశారు. రాహుల్ మంగళవారం సభలో చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించినట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment