
సాక్షి, ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి లోక్‌సభలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన ‘అదానీ వ్యాఖ్యలు’.. రాజకీయ దుమారం రేపుతున్నాయి. రాహుల్‌పై వరుసగా బీజేపీ నేతలు మండిపడుతున్నారు. తాజాగా సభా ఉల్లంఘనకుగానూ ఆయనపై సభా ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవాలంటూ బీజేపీ ఎంపీ ఒకరు.. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
మంగళవారం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా.. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే సమయంలో.. రాహుల్ గాంధీ విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే ఆ విధంగా మాట్లాడారని. ఆధారాల్లేకుండా ప్రధానిపై నేరారోపణ చేశారని లోక్‌సభ స్పీకర్‌కు లేఖ రాశారు బీజేపీ ఎంపీ నిశికాంత్ దుబే(జార్ఖండ్) పేర్కొన్నారు. అలా మాట్లాడటం సభానియమామళికి విరుద్ధమని, సభ ఔనత్యాన్ని దెబ్బ తీయడమే కాకుండా.. ప్రధాని గౌరవాన్ని భంగపరిచేలా రాహుల్ వ్యవహరించారంటూ పేర్కొన్నారు నిశికాంత్.
అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్ సంస్థ తన పరిశోధన నివేదికలో.. అదానీ గ్రూప్ స్టాక్ మ్యానిపులేషన్‌కు పాల్పడిందని, అకౌంటింగ్ మోసాలకు పాల్పడిందని తేల్చి చెప్పింది. ఈ వ్యవహారం సంచలనంగా మారగా.. అదానీ గ్రూప్ ఆ నివేదికను తోసిపుచ్చింది. మరోవైపు మంగళవారం రాహుల్ గాంధీ పార్లమెంట్‌లో ఈ నివేదిక ఆధారంగా ప్రధాని మోదీ, బిలియనీర్ గౌతమ్ అదానీలను లక్ష్యంగా చేసుకుని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
2014లో అదానీ 609వ ర్యాంక్‌లో ఉన్నాడు, ఏం మ్యాజిక్ జరిగిందో 2వ ర్యాంక్‌కి వచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ, గౌతమ్ అదానీల మధ్య స్నేహబంధం ఏంటసలు?. కేంద్ర ప్రభుత్వం అదానీ గ్రూప్‌కు అనుచితంగా లబ్ధి చేకూరుస్తోందని ఆరోపించారు. గౌతమ్ అదానీతో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ విమానంలో కూర్చున్న ఒక ఫొటోను రాహుల్ గాంధీ లోక్‌సభలో ప్రదర్శించారు. ఆ చిత్రాన్ని చూపిస్తూ రాహుల్ గాంధీ 'యే దేఖియే రిష్టా, యే రిష్టా హై (ఈ సంబంధం చూడండి, ఇది సంబంధం)' అన్నారు. నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే వీరిద్దరి మధ్య ఈ బంధం మొదలైందని రాహుల్ గాంధీ వాదించారు. ''భారతదేశ వ్యాపార రంగంలో ఒక వ్యక్తి ప్రధానితో భుజం, భుజం కలిపి పనిచేశారు, మద్దతు ఇచ్చారు. ఇది జోక్ కాదు. ఆయన (గౌతమ్ అదానీ) ప్రధానికి విధేయుడిగా ఉన్నారు'' అని రాహుల్ అన్నారు. మోదీకి వైబ్రెంట్ గుజరాత్ ఆలోచనలో గౌతమ్ అదానీ సాయపడ్డారని, దీంతో ఆయనకు ఈయన అండగా నిలిచారన్నారు రాహుల్. దాని ఫలితంగానే గౌతమ్ అదానీ వ్యాపారం అభివృద్ధి చెందిందని ఆరోపించారు.
ఇదిలా ఉంటే.. ప్రధాని మోదీపై రాహుల్ చేసిన కామెంట్లపై బీజేపీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. కాంగ్రెస్ హయాంలోనూ టాటా, బిర్లా, అంబానీల్లాంటి వ్యాపారులెందరికో అనుకూలంగా వ్యవహరించారని ఆరోపించారు. ఇక ఎంపీ నిశికాంత్ దుబే మాట్లాడుతూ.. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్(కాంగ్రెస్), పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీతోనూ అదానీ మంచి సంబంధాలు కలిగి ఉన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు.
బీజేపీ ప్రభుత్వాన్ని, ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అయితే, కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు రాహుల్ గాంధీ వ్యాఖ్యలను ఖండించారు. లాజిక్ లేకుండా ప్రధానిపై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఒకవేళ ఆరోపణలు వస్తే వాదనలతో పాటు ఆధారాలు కూడా సమర్పించాల్సి ఉంటుందని కౌంటర్ ఇచ్చారు మంత్రి. బీజేపీ ఎంపీలు రవిశంకర్‌తో పాటు స్మృతి ఇరానీ సైతం రాహుల్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
Comments
Please login to add a commentAdd a comment