waste of public money
-
ప్రజాధనమే హారతి కర్పూరం
ప్రజా సమస్యలపై నిర్మాణాత్మక చర్చలకు, ప్రభుత్వ విధానాల రూపకల్పనకు, చట్టాల తయారీకి వేదిక కావాల్సిన చట్టసభలు నిష్ప్రయోజనంగా మారుతుండడం ప్రజాస్వామ్యవాదులను ఆవేదనకు గురి చేస్తోంది. పన్ను చెల్లింపుదార్ల సొమ్ముతో నడిచే పార్లమెంట్లో వారి బాగోగులపై మాట్లాడేవారే కనిపించకుండాపోవడం విస్మయం కలిగిస్తోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య వాగ్వాదాలు, నినాదాలు, నిరసనలు తప్ప జనం ఎదుర్కొంటున్న ఇబ్బందుల, వారి కష్టాలకు చట్టసభల్లో స్థానం దక్కడం లేదు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో పరిస్థితి మరింత దిగజారడం గమనార్హం. ఈ సమావేశాలు నవంబర్ 25న ప్రారంభమయ్యాయి. ఈనెల 20వ తేదీన ముగియనున్నాయి. అంటే మరో 9 రోజుల సమయమే మిగిలింది. మధ్యలో రెండు రోజులు సెలవులు ఉన్నాయి. ఇప్పటిదాకా పార్లమెంట్లో సరైన చర్చే జరగలేదు. గౌతమ్ అదానీ, జార్జి సోరోస్ వ్యవహారంపై ఇరుపక్షాలు గొడవలు పడడంతోనే సమయమంతా వృథాగా గడిచిపోయింది. దేశంలో నానాటికీ పెరుగుతున్న ధరలు, నిరుద్యోగం, వాతావరణ కాలుష్యంపై పార్లమెంట్లో చర్చ జరుగుతుందని, ప్రభుత్వం నుంచి ఏదైనా పరిష్కార మార్గం లభిస్తుందని వెయ్యి కళ్లతో ఎదురు చూసిన ప్రజలకు నిరాశే మిగులుతోంది. సొమ్ము వెచ్చిస్తున్నా ఫలితం సున్నా ప్రజలు కట్టే పన్నుల సొమ్ముతోనే పార్లమెంట్ కార్యకలాపాలు జరుగుతాయి. ఎంపీల వ్యవహార శైలికి అదే ప్రజలు బాధితులుగా మారుతున్నారు. పేదల సమస్యలు ఎప్పటికీ చర్చకు రాకుండాపోతున్నాయి. ఒక్క నిమిషం పార్లమెంట్ సమావేశాలు జరగాలంటే రూ.2.50 లక్షలు ఖర్చవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇంత సొమ్ము వెచ్చిస్తున్నా ఆశించిన ఫలితం మాత్రం సున్నా. చర్చించాల్సిన బిల్లులు, తీసుకురావాల్సిన చట్టాలు ఎన్నో ఉన్నప్పటికీ ఎంపీలు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తూ అదానీ, సోరోస్ వివాదంతో కాలం గడిపేస్తుండడం గమనార్హం. ప్రజలను ప్రజాప్రతినిధులే శిక్షిస్తున్నారని, అందుకు మరొకరు అవసరం లేదని రాజకీయ వ్యాఖ్యాత కమలేష్ సింగ్ ఆక్షేపించారు. ఎంపీల వల్ల విలువైన ప్రజాధనం, సమయం వృథా అవుతున్నాయని విమర్శించారు. పార్లమెంట్లో అనవసర విషయాలపై సమయం వెచ్చిస్తూ ముఖ్యమైన అంశాలను పక్కనపెడుతున్నారని తప్పుపట్టారు. కొన్నిసార్లు ఎలాంటి చర్చ జరగకుండానే బిల్లులు చట్టాలుగా మారిపోతున్నాయని, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది మంచి పరిణామం కాదని అన్నారు. ఇదేనా జవాబుదారీతనం? ప్రజలకు ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన వేదిక పార్లమెంట్. ప్రభుత్వం జవాబుదారీగా ఉండాలి. పార్లమెంట్ కార్యకలాపాలు జరగపోవడంతో ప్రజా సమస్యలపై సమాధానం చెప్పకుండా తప్పుకొనే అవకాశం పాలకులకు లభిస్తోందని, జవాబుదారీతనం ఎక్కడా కనిపించడం లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కాంగ్రెస్, బీజేపీ మధ్య వివాదంతో ఇతర పారీ్టల సభ్యులకు మాట్లాడే వెలుసుబాటు దక్కడం లేదు. కొత్తగా ఎన్నికైన సభ్యులు పార్లమెంట్లో మాట్లాడాలని ఆరాటపడుతున్నప్పటికీ వారిని పట్టించుకొనే నాథుడే ఉండడం లేదు. లోక్‌సభ, రాజ్యసభలో అదానీ అంశాన్ని కాంగ్రెస్ లేవనెత్తుతుండగా, దాని పోటీగా బీజేపీ ఎంపీలు జార్జి సోరోస్‌ను ప్రస్తావిస్తున్నారు. మరోవైపు అదానీ, సోరోస్ కాకుండా దేశ సమస్యలపై చర్చ జరగాలని కోరుకుంటున్నామని సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ డింపుల్ యాదవ్ చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ ఇప్పటికైనా పట్టువీడాలని సూచించారు. పార్లమెంట్‌ను కాంగ్రెస్, బీజేపీలు హైజాక్ చేస్తున్నాయని తృణమూల్ కాంగ్రెస్ సభ్యుడు కల్యాణ్ బెనర్జీ మండిపడ్డారు. ప్రాంతీయ పారీ్టలు ఉన్నాయన్న సంగతే అవి మర్చిపోతున్నాయని ధ్వజమెత్తారు. బూడిదలో పోసిన పన్నీరు పార్లమెంట్ సమావేశాల్లో ఒక నిమిషం వృథా అయ్యిందంటే రూ.2.50 లక్షలు బూడిదలో పోసిన పన్నీరు అయినట్లేనని 2012లో అప్పటి పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి పవన్ బన్సల్ చెప్పారు. 2021లో పార్లమెంట్ సమావేశాల్లో ప్రతిష్టంభన కారణంగా రూ.133 కోట్ల ప్రజాధనం వృథా అయినట్లు అప్పట్లో నిపుణులు లెక్కగట్టారు. మరోవైపు పార్లమెంట్ భేటీలు నానాటికీ కుదించుకుపోతున్నాయి. 1952 నుంచి 1957 వరకు కొనసాగిన తొలి లోక్‌సభ కాలంలో ప్రతిఏటా సగటున 135 రోజుల చొప్పున పార్లమెంట్ సమావేశాలు జరిగాయి. 2019 నుంచి 2024 దాకా మనుగడలో ఉన్న 17వ లోక్‌సభ కాలంలో సగటున ఏటా 55 రోజులపాటే పార్లమెంట్ సమావేశాలు జరిగాయి.– సాక్షి, నేషనల్ డెస్క్ -
Mizoram Chief Minister Lalduhoma: ఎమ్మెల్యేలకు కొత్త కార్లు కొనబోము
ఐజ్వాల్: మిజోరం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని నూతన ముఖ్యమంత్రి లాల్దుహోమా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులకు కొత్త కార్లు కొనుగోలు చేయబోమని కరాఖండీగా చెప్పేశారు. కొత్త ప్రభుత్వం కొలువుతీరిన ప్రతిసారీ కొత్త కార్ల కొనుగోలుతో ప్రజాధనం వృథా అవుతుందని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇటీవల దిగిపోయిన మంత్రులు, ఓడిన ఎమ్మెల్యేలు వాడిన ప్రభుత్వ వాహనాలనే కొత్త మంత్రులు, శాసనసభ్యులు వాడుకోవాలని సూచించారు. -
బాబు దిగజారుడుతనానికి పరాకాష్ట
కాకినాడ : ప్రత్యేక హోదా కోసం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేపట్టిన దీక్ష సందర్భంగా వ్యవహరించిన తీరు ఆయన దిగజారుడు తనానికి పరాకాష్టగా నిలిచిందని కాకినాడ వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు విమర్శించారు. శుక్రవారం రాత్రి ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ప్రత్యేక హోదాపై చంద్రబాబుకు ఏ మాత్రం చిత్తశుద్ధిలేదని విమర్శించారు. పన్నుల రూపంలో ప్రజలు చెల్లించిన కోట్లాది రూపాయల నిధులను దుర్వినియోగం చేసి దీక్షల పేరుతో ఖర్చు చేశారని మండిపడ్డారు. విజయవాడలో చంద్రబాబు చేసిన దీక్షకు మజ్జిగ, నీళ్ల కోసం రూ.నాలుగు కోట్లు ఖర్చు చేశారని, ఇక ప్రజలను తరలించడం, ఇతర ఏర్పాట్ల కోసం చేసిన ఖర్చు అంతులేకుండా పోయిందని మండిపడ్డారు. దీక్షలు చేస్తే హోదాలు వస్తాయా? అంటూ గతంలో వైఎస్సార్సీపీ నేతలపై విమర్శలు చేసిన చంద్రబాబు ఎం దుకు దీక్ష చేస్తున్నారో ప్ర జలకు సమాధానం చెప్పాలని కన్నబాబు డిమాండ్ చేశారు. జపాన్ తరహాలో ఉద్యమించాలంటూ నాడు ప్రకటనలు చేసిన చంద్రబాబు ఇప్పుడు ఉద్యమబాట పట్టడం వెనుక ఆంతర్యాన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టే నిరసనలను ఆక్షేపిస్తూ ఆందోళనలు ఇక్కడి చేస్తే రావని, ఢిల్లీలో చేయాలంటూ ఉచిత సలహాలు ఇచ్చిన చంద్రబాబు తాను మాత్రం ఇక్కడే ఎందుకు దీక్ష చేశారని కన్నబాబు నిలదీశారు. తన ప్రచార ఆర్భాటం కోసం అధికార యంత్రాంగంతోపాటు అన్ని వ్యవస్థలను చంద్రబాబు నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు. ప్రత్యేక హోదా కోసం ఇతర పార్టీలు, ప్రజా సంఘాలు చేస్తున్న ఉద్యమాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు టీడీపీ అనేక జిమ్మిక్కులు చేస్తోందన్నారు. అనవసర వివాదాలను తెరపైకి తెచ్చి సమస్యను దాటవేసే ధోరణితో వ్యవహరిస్తున్నారన్నారు. ఇప్పటికైనా డ్రామాలు కట్టిపెట్టి కేంద్రంపై మరింత ఒత్తిడి పెంచేందుకు టీడీపీ ఎంపీలతో రాజీనామాలు చేయించాలని కన్నబాబు డిమాండ్ చేశారు. -
తూతూ మంత్రంగా.. తూముల నిర్మాణం
నాసిరకంగా నీరు–చెట్టు పనులు నిబంధనలు బేఖాతరు పట్టించుకోని అధికారులు ఉదయగిరి: భూగర్భజలాల పెంపు, పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా ప్రభుత్వం చేపట్టిన నీరు–చెట్టు చెరువు పనులు నాసిరకంగా సాగుతున్నాయి. తూతూమంత్రంగా పనులు చేసి కాంట్రాక్టర్లు జేబులు నింపుకుంటున్నారు. అధికారుల అండదండలతో అధికార పార్టీ నేతలు ఇష్టారాజ్యంగా పనులుచేస్తున్నారు. పనులు నిర్మాణ దశలో ఉండగానే దెబ్బతింటున్న ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. పనులు పర్యవేక్షించాల్సిన ఇంజినీరింగ్ అధికారులు మామూళ్ల మత్తులోపడి అంతా ఓకే చేసేస్తున్నారు. నీరు–చెట్టు పనుల్లో అవినీతిపై కలెక్టర్ సీరియస్‌గా ఉన్నప్పటికీ ఇరిగేషన్ అధికారులుు మాత్రం ఆమెను ఖాతరు చేయడం లేదు. ఆ శాఖ అధికారులను ఎన్నిసార్లు హెచ్చరించినా, సంజాయిషీ కోరినా డోంట్కేర్లా వ్యవహరిస్తున్నారు. జిల్లాలో రూ.249 కోట్లతో నీరు–చెట్టు పథకంలో భాగంగా చెరువుల అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. అలాగే ఉదయగిరి నియోజకవర్గంలోని సీతారామపురంలో 15 చెరువులు రూ.1.10 కోటి, ఉదయగిరిలో రూ.1.90 కోట్లు, వరికుంటపాడులో రూ.2.10 కోట్లు, వింజమూరు మండలంలో రూ.2.40 కోట్లు, కొండాపురంలో రూ.1.80 కోట్లు, కలిగిరిలో రూ.3.08 కోట్లు, దుత్తలూరులో రూ.1.10 కోట్లు, జలదంకిలో రూ.1.40 కోట్లతో పనులు జరుగుతున్నాయి. రూ.10 లక్షలలోపు పనులను నామినేషన్ పద్దతిలో తెలుగుతమ్ముళ్లకు అప్పగించారు. ఉదయగిరి నియోజకవర్గంలో జరుగుతున్న పనుల్లో డొల్లతనం స్పష్టంగా కనిపిస్తోంది. గతేడాది జరిగిన నీరు–చెట్టు పనుల్లో అధికారుల సాయంతో భారీఎత్తున అవినీతికి పాల్పడిన తెలుగుతమ్ముళ్లు ఈసారి కూడా అదేస్థాయిలో దోచుకునేందుకు పక్కా ప్రణాళిక రూపొందించుకొని ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం తూములు అభివృద్ధి చేసేందుకు ఈ నిధులు వెచ్చిస్తున్నారు. కొన్నిచోట్ల తూములకు మరమ్మతులు, పూర్తిస్థాయిలో తూముల పునర్నిర్మించడం లాంటి అవసరాలు లేకపోయినప్పటికీ కాంట్రాక్టు కోసం బాగున్న చెరువులకు కూడా నిధులు మంజూరుచేశారు. తెలుగుతమ్ముళ్లు ఈ పనులు చేజిక్కించుకొని అధిక మొత్తంలో స్వాహా చేస్తున్నారు. పనుల నాణ్యత అత్యంత నాసిరకంగా ఉంది. సిమెంటు, కంకర, ఇసుక సమపాళ్లలో లేదు. దీంతో బెడ్ వేసిన కొన్నిరోజుల్లోపే దెబ్బతింటోంది. గోడల నిర్మాణం కూడా అత్యంత నాసిరకంగా జరుగుతోంది. స్థానిక క్వారీల్లో లభించే వివిధ రకాల కంకర, నాసిరకం ఇసుకను ఉపయోగిస్తున్నారు. దీంతో తూముల మన్నిక ప్రశ్నార్థకంగా మారింది. కనిపించని క్యూరింగ్ చెరువుకు అత్యంత ప్రధానమైంది తూము. ఈ పనుల్లో ఎక్కడ రాజీపడినా నీరు లీకేజి అయ్యే ప్రమాదం పొంచివుంది. కొన్ని సందర్భాలలో తూము చుట్టుపక్కల నీరు లీకేజి అయి తెగిపోయే పరిస్థితి కూడా ఉంటుంది. ఇంత ప్రాధాన్యతగల తూము నిర్మాణం సంబంధిత ఇంజినీరు పర్యవేక్షణలో బలోపేతంగా చేయవలసివుంది.పైగా బెడ్డుపై కనీసం ఇరవై రోజులపాటు నీటితో క్యూరింగ్ చేయాల్సివుంది. కానీ వరికుంటపాడు మండలంలో జరిగే నీరు–చెట్టు చెరువు పనుల్లో ఆ పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. నీటితో ఎక్కడకూడా క్యూరింగ్ చేయడం లేదు. ఓ పనిమనిషిని నియమించి కట్టడాలపై నీరు విదిలిస్తున్నారు. దీంతో పని పూర్తికాకముందే కంకర, ఇసుక భాగాలు ఊడి కిందపడుతున్నాయి. ప్రస్తుతం మండలంలో జి.కొండారెడ్డిపల్లి, వరికుంటపాడు, తూర్పుబోయమడుగుల, తూర్పుపాళెం, తదితర చెరువుల్లో పనులు తుదిదశకు చేరుకున్నాయి. ఈ పనుల నాణ్యతపై స్థానికులు తీవ్ర అభ్యంతరాలున్నాయి. రామదేవులపాడు, గణేశ్వరపురం, తూర్పురొంపిదొడ్ల, టి.కొండారెడ్డిపల్లి, తిమ్మారెడ్డిపల్లి, కాంచెరువు, తోటలచెరువుపల్లి, తదితర చెరువు పనుల్లో నాణ్యత కనిపించడం లేదని ఆయకట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తూతూమంత్రంగా పనులుచేసి నిధులు కాజేసే ప్రయత్నంలో ఉన్నట్లుగా రైతులు ఆరోపిస్తున్నారు. ఇసుక, కంకర నాసిరకమే నిర్మాణ పటిష్ఠానికి ముఖ్యమైన ఇసుక, కంకరలో నాణ్యత లోపించింది. వివిధ రకాల సైజులతో ఉండే కంకర ఉపయోగిస్తున్నారు. పామూరు ప్రాంతంలోని సుద్ద కంకరను వినియోగిస్తున్నారు. ఇసుక కూడా నాసిరకంగా ఉంది. ఎర్రమట్టితో కూడిన ఇసుక వాడటంతో నిర్మాణ పటిష్ఠత ప్రశ్నార్ధకంగా మారింది. పత్తాలేని ఇంజినీరింగ్ అధికారులు చెరువు కాంక్రీటు పనులు జరుగుతున్నప్పుడు కచ్చితంగా ఇంజినీరింగ్ స్థాయి అధికారులు పనులు జరిగేచోట ఉండాలి. కానీ వారు కనిపించడం లేదు. ప్రారంభ సమయంలో వచ్చి కొద్దిసేపు ఉండి వెళ్లిపోతున్నారు. దీంతో పనులు అత్యంత బలహీనంగా సాగుతున్నాయి. వర్షమొచ్చి చెరువులో నీరు చేరితే లీకేజితో నీరంతా వృథాగాపోయే పరిస్థితి ఉంది. ఈ పరిస్థితి ఆయకట్టు రైతులకు ఎంతో ఇబ్బందిగా మారనుంది.మామూళ్ల మత్తులో పడిన అధికారులు పనులుఎలా జరిగినా పట్టించుకోవడం లేదు. పనులు పూర్తయిన తర్వాత ఎంబుక్‌లో మాత్రం అంతా బాగున్నట్లుగా నమోదుచేసి నిధులు డ్రా చేస్తున్నారు. ఈ పనుల నాణ్యతపై జిల్లా కలెక్టర్ యం.జానకి ఇరిగేషన్ అధికారులపై సీరియస్‌గా ఉన్నప్పటికీ వారేమీ పట్టించుకోవడం లేదు. పనుల నాణ్యత విషయమై ఇరిగేషన్ ఏఈ అనిల్‌ను ప్రశ్నించగా అంతా బాగానే జరుగుతుందని, ఎలాంటి నాణ్యత లోపం లేదని చెబుతున్నారు.