కురసాల కన్నబాబు
కాకినాడ : ప్రత్యేక హోదా కోసం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేపట్టిన దీక్ష సందర్భంగా వ్యవహరించిన తీరు ఆయన దిగజారుడు తనానికి పరాకాష్టగా నిలిచిందని కాకినాడ వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు విమర్శించారు. శుక్రవారం రాత్రి ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ప్రత్యేక హోదాపై చంద్రబాబుకు ఏ మాత్రం చిత్తశుద్ధిలేదని విమర్శించారు.
పన్నుల రూపంలో ప్రజలు చెల్లించిన కోట్లాది రూపాయల నిధులను దుర్వినియోగం చేసి దీక్షల పేరుతో ఖర్చు చేశారని మండిపడ్డారు. విజయవాడలో చంద్రబాబు చేసిన దీక్షకు మజ్జిగ, నీళ్ల కోసం రూ.నాలుగు కోట్లు ఖర్చు చేశారని, ఇక ప్రజలను తరలించడం, ఇతర ఏర్పాట్ల కోసం చేసిన ఖర్చు అంతులేకుండా పోయిందని మండిపడ్డారు. దీక్షలు చేస్తే హోదాలు వస్తాయా? అంటూ గతంలో వైఎస్సార్‌సీపీ నేతలపై విమర్శలు చేసిన చంద్రబాబు ఎం దుకు దీక్ష చేస్తున్నారో ప్ర జలకు సమాధానం చెప్పాలని కన్నబాబు డిమాండ్ చేశారు.
జపాన్ తరహాలో ఉద్యమించాలంటూ నాడు ప్రకటనలు చేసిన చంద్రబాబు ఇప్పుడు ఉద్యమబాట పట్టడం వెనుక ఆంతర్యాన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టే నిరసనలను ఆక్షేపిస్తూ ఆందోళనలు ఇక్కడి చేస్తే రావని, ఢిల్లీలో చేయాలంటూ ఉచిత సలహాలు ఇచ్చిన చంద్రబాబు తాను మాత్రం ఇక్కడే ఎందుకు దీక్ష చేశారని కన్నబాబు నిలదీశారు.
తన ప్రచార ఆర్భాటం కోసం అధికార యంత్రాంగంతోపాటు అన్ని వ్యవస్థలను చంద్రబాబు నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు. ప్రత్యేక హోదా కోసం ఇతర పార్టీలు, ప్రజా సంఘాలు చేస్తున్న ఉద్యమాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు టీడీపీ అనేక జిమ్మిక్కులు చేస్తోందన్నారు.
అనవసర వివాదాలను తెరపైకి తెచ్చి సమస్యను దాటవేసే ధోరణితో వ్యవహరిస్తున్నారన్నారు. ఇప్పటికైనా డ్రామాలు కట్టిపెట్టి కేంద్రంపై మరింత ఒత్తిడి పెంచేందుకు టీడీపీ ఎంపీలతో రాజీనామాలు చేయించాలని కన్నబాబు డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment