తూతూ మంత్రంగా.. తూముల నిర్మాణం | Money wastage in canals construction | Sakshi
Sakshi News home page

తూతూ మంత్రంగా.. తూముల నిర్మాణం

Published Thu, Jul 21 2016 1:11 AM | Last Updated on Sat, Oct 20 2018 5:39 PM

తూతూ మంత్రంగా.. తూముల నిర్మాణం - Sakshi

తూతూ మంత్రంగా.. తూముల నిర్మాణం

  •  నాసిరకంగా నీరు–చెట్టు పనులు
  • నిబంధనలు బేఖాతరు
  • పట్టించుకోని అధికారులు 
  •  
    ఉదయగిరి:
    భూగర్భజలాల పెంపు, పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా ప్రభుత్వం చేపట్టిన నీరు–చెట్టు చెరువు పనులు నాసిరకంగా సాగుతున్నాయి. తూతూమంత్రంగా పనులు చేసి కాంట్రాక్టర్లు జేబులు నింపుకుంటున్నారు. అధికారుల అండదండలతో అధికార పార్టీ నేతలు ఇష్టారాజ్యంగా పనులుచేస్తున్నారు. పనులు నిర్మాణ దశలో ఉండగానే దెబ్బతింటున్న ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. పనులు పర్యవేక్షించాల్సిన ఇంజినీరింగ్‌ అధికారులు మామూళ్ల మత్తులోపడి అంతా ఓకే చేసేస్తున్నారు. నీరు–చెట్టు పనుల్లో అవినీతిపై కలెక్టర్‌ సీరియస్‌గా ఉన్నప్పటికీ ఇరిగేషన్‌ అధికారులుు మాత్రం ఆమెను ఖాతరు చేయడం లేదు. ఆ శాఖ అధికారులను ఎన్నిసార్లు హెచ్చరించినా, సంజాయిషీ కోరినా డోంట్‌కేర్‌లా వ్యవహరిస్తున్నారు. 
    జిల్లాలో రూ.249 కోట్లతో నీరు–చెట్టు పథకంలో భాగంగా చెరువుల అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. అలాగే ఉదయగిరి నియోజకవర్గంలోని సీతారామపురంలో 15 చెరువులు రూ.1.10 కోటి, ఉదయగిరిలో రూ.1.90 కోట్లు, వరికుంటపాడులో రూ.2.10 కోట్లు, వింజమూరు మండలంలో రూ.2.40 కోట్లు, కొండాపురంలో రూ.1.80 కోట్లు, కలిగిరిలో రూ.3.08 కోట్లు, దుత్తలూరులో రూ.1.10 కోట్లు, జలదంకిలో రూ.1.40 కోట్లతో పనులు జరుగుతున్నాయి. రూ.10 లక్షలలోపు పనులను నామినేషన్‌ పద్దతిలో తెలుగుతమ్ముళ్లకు అప్పగించారు. ఉదయగిరి నియోజకవర్గంలో జరుగుతున్న పనుల్లో డొల్లతనం స్పష్టంగా కనిపిస్తోంది. గతేడాది జరిగిన నీరు–చెట్టు పనుల్లో అధికారుల సాయంతో భారీఎత్తున అవినీతికి పాల్పడిన తెలుగుతమ్ముళ్లు ఈసారి కూడా అదేస్థాయిలో దోచుకునేందుకు పక్కా ప్రణాళిక రూపొందించుకొని ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం తూములు అభివృద్ధి చేసేందుకు ఈ నిధులు వెచ్చిస్తున్నారు. కొన్నిచోట్ల తూములకు మరమ్మతులు, పూర్తిస్థాయిలో తూముల పునర్నిర్మించడం లాంటి అవసరాలు లేకపోయినప్పటికీ కాంట్రాక్టు కోసం బాగున్న చెరువులకు కూడా నిధులు మంజూరుచేశారు. తెలుగుతమ్ముళ్లు ఈ పనులు చేజిక్కించుకొని అధిక మొత్తంలో స్వాహా చేస్తున్నారు. పనుల నాణ్యత అత్యంత నాసిరకంగా ఉంది. సిమెంటు, కంకర, ఇసుక సమపాళ్లలో లేదు. దీంతో బెడ్‌ వేసిన కొన్నిరోజుల్లోపే దెబ్బతింటోంది. గోడల నిర్మాణం కూడా అత్యంత నాసిరకంగా జరుగుతోంది. స్థానిక క్వారీల్లో లభించే వివిధ రకాల కంకర, నాసిరకం ఇసుకను ఉపయోగిస్తున్నారు. దీంతో తూముల మన్నిక ప్రశ్నార్థకంగా మారింది. 
    కనిపించని క్యూరింగ్‌
    చెరువుకు అత్యంత ప్రధానమైంది తూము. ఈ పనుల్లో ఎక్కడ రాజీపడినా నీరు లీకేజి అయ్యే ప్రమాదం పొంచివుంది. కొన్ని సందర్భాలలో తూము చుట్టుపక్కల నీరు లీకేజి అయి తెగిపోయే పరిస్థితి కూడా ఉంటుంది. ఇంత ప్రాధాన్యతగల తూము నిర్మాణం సంబంధిత ఇంజినీరు పర్యవేక్షణలో బలోపేతంగా చేయవలసివుంది.పైగా బెడ్డుపై కనీసం ఇరవై రోజులపాటు నీటితో క్యూరింగ్‌ చేయాల్సివుంది. కానీ వరికుంటపాడు మండలంలో జరిగే నీరు–చెట్టు చెరువు పనుల్లో ఆ పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. నీటితో ఎక్కడకూడా క్యూరింగ్‌ చేయడం లేదు. ఓ పనిమనిషిని నియమించి కట్టడాలపై నీరు విదిలిస్తున్నారు. దీంతో పని పూర్తికాకముందే కంకర, ఇసుక భాగాలు ఊడి కిందపడుతున్నాయి. ప్రస్తుతం మండలంలో జి.కొండారెడ్డిపల్లి, వరికుంటపాడు, తూర్పుబోయమడుగుల, తూర్పుపాళెం, తదితర చెరువుల్లో పనులు తుదిదశకు చేరుకున్నాయి. ఈ పనుల నాణ్యతపై స్థానికులు తీవ్ర అభ్యంతరాలున్నాయి. రామదేవులపాడు, గణేశ్వరపురం, తూర్పురొంపిదొడ్ల, టి.కొండారెడ్డిపల్లి, తిమ్మారెడ్డిపల్లి, కాంచెరువు, తోటలచెరువుపల్లి, తదితర చెరువు పనుల్లో నాణ్యత కనిపించడం లేదని ఆయకట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తూతూమంత్రంగా పనులుచేసి నిధులు కాజేసే ప్రయత్నంలో ఉన్నట్లుగా రైతులు ఆరోపిస్తున్నారు. 
    ఇసుక, కంకర నాసిరకమే
    నిర్మాణ పటిష్ఠానికి ముఖ్యమైన ఇసుక, కంకరలో నాణ్యత లోపించింది. వివిధ రకాల సైజులతో ఉండే కంకర ఉపయోగిస్తున్నారు. పామూరు ప్రాంతంలోని సుద్ద కంకరను వినియోగిస్తున్నారు. ఇసుక కూడా నాసిరకంగా ఉంది. ఎర్రమట్టితో కూడిన ఇసుక వాడటంతో నిర్మాణ పటిష్ఠత ప్రశ్నార్ధకంగా మారింది. 
    పత్తాలేని ఇంజినీరింగ్‌ అధికారులు
    చెరువు కాంక్రీటు పనులు జరుగుతున్నప్పుడు కచ్చితంగా ఇంజినీరింగ్‌ స్థాయి అధికారులు పనులు జరిగేచోట ఉండాలి. కానీ వారు కనిపించడం లేదు. ప్రారంభ సమయంలో వచ్చి కొద్దిసేపు ఉండి వెళ్లిపోతున్నారు. దీంతో పనులు అత్యంత బలహీనంగా సాగుతున్నాయి. వర్షమొచ్చి చెరువులో నీరు చేరితే లీకేజితో నీరంతా వృథాగాపోయే పరిస్థితి ఉంది. ఈ పరిస్థితి ఆయకట్టు రైతులకు ఎంతో ఇబ్బందిగా మారనుంది.మామూళ్ల మత్తులో పడిన అధికారులు పనులుఎలా జరిగినా పట్టించుకోవడం లేదు. పనులు పూర్తయిన తర్వాత ఎంబుక్‌లో మాత్రం అంతా బాగున్నట్లుగా నమోదుచేసి నిధులు డ్రా చేస్తున్నారు. ఈ పనుల నాణ్యతపై జిల్లా కలెక్టర్‌ యం.జానకి ఇరిగేషన్‌ అధికారులపై సీరియస్‌గా ఉన్నప్పటికీ వారేమీ పట్టించుకోవడం లేదు. పనుల నాణ్యత విషయమై ఇరిగేషన్‌ ఏఈ అనిల్‌ను ప్రశ్నించగా అంతా బాగానే జరుగుతుందని, ఎలాంటి నాణ్యత లోపం లేదని చెబుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement