సాక్షి ప్రతినిధి, విజయనగరం: గత టీడీపీ ప్రభుత్వ హయాంలో నీరు–చెట్టు పథకం పనులు చేసేందుకు జన్మభూమి కమిటీల సభ్యులు, నీటిసంఘం అధ్యక్ష, కార్యదర్శులు, టీడీపీ సర్పంచ్‌లు కాంట్రాక్టర్లుగా, కాంట్రాక్టర్లకు బినామీలుగా అవతామరమెత్తారు. పెద్దల అండదండలతో ప్రజాధనాన్ని కైంకర్యం చేశారు. పథకం లక్ష్యాన్ని పక్కనపెట్టేశారు. ఫలితం.. చెరువులు బాగుపడలేదు. చెక్‌డ్యామ్‌లు చెదిరిపోతున్నాయి. కాలువలు పూడుకుపోయాయి. చెరువుగట్లు పటిష్టం కావడం మాటెలా ఉన్నా ఉన్న గట్లే పాడైపోయాయి. దీనికి బొబ్బిలి నియోజకవర్గంలో జరిగిన పనులే ఓ నిదర్శనం.
►బొబ్బిలి మండలంలోని ఓ పంచాయతీ పరిధి లోని చెరువు పనులను బీజేపీ నాయకుడి సోదరుడికి అప్పగించారు. మరో పంచాయతీ పరిధిలో రూ.50 లక్షల పనులను 10 శాతం కమీషన్‌కు అమ్మేసి పట్టణంలోని ఓ టీడీపీ నాయకుడి అక్రమ నిర్మాణాలకు గ్రావెల్ తరలించారు. బొబ్బిలి పట్టణంలో మల్లమ్మపేటకు చెందిన ఓ టీడీపీ నాయకుడు రామన్నదొరవలస వద్ద 30 ట్రాక్టర్లతో గ్రావెల్ తవ్వేసి గ్రోత్‌సెంటర్‌కు అమ్మేశాడు.
అప్పటి ఓ టీడీపీ కౌన్సిలర్ మేనల్లుడు నేరుగా అధికారుల పేరుచెప్పి నీరు–చెట్టు పనులు చేయకపోయినా ఆ పేరుతో చెరువులో గ్రా వెల్ తవ్వేçస్తూ అక్రమార్జన చేశాడు. సీతయ్యపేటలో నీరు–చెట్టు కింద రూ.9 లక్షల వ్యయంతో నిర్మించిన చెక్‌డ్యామ్‌ను అప్పటి గనుల శాఖ మంత్రి సుజయ్ కృష్ణారంగారావు స్వయంగా ప్రారంభించారు. ఆ చెక్‌డ్యామ్ ఎంత నాణ్యతలోపాలతో నిర్మించారో ఇప్పుడు చూస్తే అర్థమవుతుంది. గతంలో ఉపాధి హామీ నిధులతో చేపట్టిన పిరిడి సీతారామసాగరం, అలజంగి దాలెందర చెరువు పనులను మళ్లీ నీరు– చెట్టుకింద చేసి నిధులు దోచుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
రూ.3 కోట్లు హాంఫట్...
2014–15 సంవత్సరంలో మంజూరైన ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులతో రామభద్రపురం మండలంలో దాదాపు రూ.6 కోట్లతో చెక్‌డ్యాంలు, మదుములు, చప్టాలు ఇలా 102 నిర్మాణ పనులు చేశారు. వాటిలో సుమారుగా రూ.3 కోట్లకు పైబడి అక్రమాలు జరి గినట్లు సోషల్ ఆడిట్‌లో వెలుగుచూసింది. రెండు నెలల పాటు పరిశీలించిన విజిలెన్స్ అధికారులు ఆ అక్రమాలను నిర్ధారించారు. రావివలస పంచాయతీ మినహా దాదాపు అన్నిచోట్లా అక్రమాలు చోటుచేసుకున్నాయి.
తెర్లాంలో నాణ్యత డొల్ల...
తెర్లాం మండలంలో నీరు–చెట్టు పనుల ఫలితంగా చెరువు గట్లు దెబ్బతిన్నాయి. నందిగాం చౌదరిచెరువులో పనులు పూర్తిస్థాయిలో చేయలేదు. పనులు జరగకముందు రెండు నాటు బళ్లు గట్టుపై నుంచి వెళ్లిపోయేవి. తీరా పనిచేసిన తరువాత ఒక్క నాటుబండి కూడా వెళ్లడం కష్టంగా ఉందని రైతులు అంటున్నారు. చెరువులోనుంచి తీసిన మట్టిని సైతం అమ్మేశారంటే దోపిడీని ఊహించవచ్చు.
తెర్లాం మండలంలో పలు పనులను అప్పటి ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడి బంధువులకు అప్పగించారని తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. 2015–16 ఆర్థిక సంవత్సరంలో నందిగాం, కుసుమూరు, తెర్లాం గ్రామా ల్లోని చౌదరి చెరువు, గురివినాయుడు చెరువు, గుర్రమ్మ చెరువుల అభివృద్ధికి రూ.35 లక్షల చొప్పున అభివృద్ధి పనులకు నిధులు మంజూరయ్యాయి. పనులు అంతంతమాత్రంగానే చేసి బిల్లులు పూర్తిస్థాయిలో చేసుకోవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment