District Development Review
-
అభివృద్ధి పథంలో ఆకాంక్ష జిల్లాలు
న్యూఢిల్లీ: ప్రజల జీవన విధానం మరింత సౌకర్యంగా ఉండడం కోసం కేంద్ర ప్రభుత్వ పథకాల అమలును నిర్దేశించిన కాల వ్యవధిలోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదేశించారు. ప్రజలకి నూటికి నూరు శాతం సేవలు అందించడం, సదుపాయాలను కల్పించడమే మన ముందు లక్ష్యమని అన్నారు. దేశవ్యాప్తంగా జిల్లా కలెక్టర్లతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఈ డిజిటల్ సమావేశానికి కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా హాజరయ్యారు. కేంద్ర పథకాల అమలు సరిగా జరగాలంటే జిల్లా స్థాయిలో ప్రజలకి, అధికారులకి మధ్య ప్రత్యక్షంగా భావోద్వేగ బంధం ఏర్పాటు కావాలని ప్రధాని చెప్పారు. ఆశావహ జిల్లాల్లో కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాల సమష్టి కృషితో సత్ఫలితాలు వస్తున్నాయని అన్నారు. అభివృద్ధి పథంలో దూసుకువెళుతున్న ఆకాంక్ష జిల్లాలు దేశాభివృద్ధికి కూడా తోడ్పడుతున్నాయని వెల్లడించారు. ‘‘దేశాభివృద్ధికి గల ఆటంకాలను ఆకాంక్ష జిల్లాలు తొలగిస్తున్నాయి. మీ అందరి కృషితో ఆ జిల్లాలు పురోగతి సాధిస్తున్నాయి’’ అని కలెక్టర్లను ప్రశంసించారు. వనరుల్ని అత్యధికంగా వినియోగించుకుంటూ ప్రభుత్వ పథకాల అమలులో ఉన్న అవరోధాలను అధిగమించడం వల్ల ఈ జిల్లాలు తమని తాము నిరూపించుకునే స్థాయికి ఎదిగాయన్నారు. రెండేళ్లలో మరో 142 జిల్లాల అభివృద్ధి వెనుకబడిన జిల్లాలను వేగంగా అభివృద్ధి చేసే లక్ష్యంతో 2018 జనవరిలో ఆకాంక్ష జిల్లాల కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ 112 జిల్లాలను ఎంపిక చేసి అభివృద్ధి బాట పట్టించారు. ఇప్పుడు కొన్ని రంగాల్లో వెనుకబడిన మరో 142 జిల్లాలను ఎంపిక చేశామని, ఆ జిల్లాల్లో కూడా అభివృద్ధికి అందరూ కలసికట్టుగా కృషి చెయ్యాలని ప్రధాని కలెక్టర్లకు పిలుపునిచ్చారు. జిల్లాల్లో అన్ని గ్రామాలకు రోడ్డు సదుపాయం, అర్హులైన లబ్ధిదారులకి ఆయుష్మాన్ భారత్ కార్డులు, ప్రతీ ఒక్కరికీ బ్యాంకు అకౌంట్, ప్రతీ కుటుంబానికి ఉజ్వల గ్యాస్ కనెక్షన్, ఇన్సూరెన్స్, పెన్షన్ ఇవన్నీ నిర్దేశిత కాలవ్యవధిలోగా పూర్తి చేయాలని చెప్పారు. రెండేళ్లలో ఈ 142 జిల్లాలను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. దేశంలో డిజిటల్ విప్లవం చాలా నిశ్శబ్దంగా జరిగిపోతోందని, పల్లె పల్లెలోనూ డిజిటల్ సదుపాయాల కల్పన జరిగేలా అన్ని చర్యలు చేపట్టాలని కలెక్టర్లని ఆదేశించారు. -
రెండోసారీ
డీఆర్సీ మళ్లీ వాయిదా అమాత్యుల అపహాస్యం ఇక నిర్వహణ డౌటే! విశాఖ రూరల్, న్యూస్‌లైన్: జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశాన్ని(డీఆర్సీ) అమాత్యులు అపహాస్యం చేస్తున్నారు. జిల్లా అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన వేదిక నిర్వహణను పిల్ల ల ఆటగా మార్చేశారు. ఇష్టానుసారంగా సమావేశం తేదీని ఖరారు చేయడం.. అధికారులను పరుగులు పెట్టించడం. చివరి నిమిషంలో వాయిదా వేయడం పరిపాటిగా మారిపోయింది. శనివారం నిర్వహించాల్సిన డీఆర్సీ మళ్లీ వాయిదా పడింది. కేవలం రాజకీయ కారణాలు, అగ్రనేతల సేవలో తరలించడానికి సమావేశాన్ని రెండోసారి రద్దు చేశారు. ఈ నెల మూడో వారంలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉండడంతో ఇక డీఆర్సీ జరిగే అవకాశం లేనట్లు తెలుస్తోంది. గతేడాది మార్చి తరువాత ఇప్పటి వరకు డీఆర్సీ నిర్వహించలేదు. నిన్నమొన్నటి వరకు జిల్లాకు ఇన్చార్జి మంత్రి లేకపోవడంతో ఈ సమావేశానికి అవకాశం లేకుండా పోయింది. రెండు నెలల క్రితం రాష్ట్ర సహకారశాఖ మంత్రి కాసు వెంకట కృష్ణారెడ్డి ఇన్చార్జి మంత్రిగా నియమితులయ్యారు. అయినప్పటికీ ఇప్పటి వరకు డీఆర్సీపై స్పష్టత లేకుండా పోయింది. వాస్తవానికి జనవరి 19న ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు జిల్లా మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. ఆ మేరకు జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అజెండాను కూడా సిద్ధం చేశారు. చివరి నిమిషంలో వాయిదా వేశారు. ఇక సమీక్ష సమావేశం ఉండదని అధికారులు భావించారు. ఇంతలో శనివారం(ఫిబ్రవరి ఒకటిన) నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని మరోసారి ఇన్చార్జి మంత్రి నుంచి అయిదు రోజుల క్రితం అధికారులకు సమాచారమొచ్చింది. సమయం తక్కువగా ఉండడంతో అధికారులు ఉరుకులూ పరుగులు పెట్టారు. ఆగమేఘాలపై అజెండాను సిద్ధం చేశారు. సమావేశానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మధ్యాహ్నం భోజనాలకు కూడా ఆర్డర్ ఇచ్చేశారు. అయితే మళ్లీ అమాత్యులు సమావేశాన్ని వాయిదా వేశారు. దీంతో అధికారుల శ్రమ, డబ్బు వృథా అయింది. ఇక నిర్వహణ డౌటే! : ప్రస్తుత పరిస్థితుల్లో డీఆర్సీ ఇప్పట్లో జరిగే అవకాశాలు కనిపించడం లేదు. ఫిబ్రవరి మూడో వారంలో ఎన్నికల నోటిఫికేషన్ వస్తే ఇక నిర్వహించే పరిస్థితి ఉండదు. త్వరలో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఆ సమయంలో జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశం నిర్వహించే సంప్రదాయం లేదు. ఈ పరిస్థితుల దృష్ట్యా ఇక డీఆర్సీకి అవకాశం లేనట్టే అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒక వేళ పెట్టాలంటే ఈ వారంలోనే నిర్వహించాల్సి ఉంటుంది. లేకుంటే ఈ ప్రభుత్వ హయాంలో జరిగే అవకాశాలు లేనట్టే!