న్యూఢిల్లీ: ప్రజల జీవన విధానం మరింత సౌకర్యంగా ఉండడం కోసం కేంద్ర ప్రభుత్వ పథకాల అమలును నిర్దేశించిన కాల వ్యవధిలోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదేశించారు. ప్రజలకి నూటికి నూరు శాతం సేవలు అందించడం, సదుపాయాలను కల్పించడమే మన ముందు లక్ష్యమని అన్నారు.
దేశవ్యాప్తంగా జిల్లా కలెక్టర్లతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఈ డిజిటల్ సమావేశానికి కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా హాజరయ్యారు. కేంద్ర పథకాల అమలు సరిగా జరగాలంటే జిల్లా స్థాయిలో ప్రజలకి, అధికారులకి మధ్య ప్రత్యక్షంగా భావోద్వేగ బంధం ఏర్పాటు కావాలని ప్రధాని చెప్పారు. ఆశావహ జిల్లాల్లో కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాల సమష్టి కృషితో సత్ఫలితాలు వస్తున్నాయని అన్నారు.
అభివృద్ధి పథంలో దూసుకువెళుతున్న ఆకాంక్ష జిల్లాలు దేశాభివృద్ధికి కూడా తోడ్పడుతున్నాయని వెల్లడించారు. ‘‘దేశాభివృద్ధికి గల ఆటంకాలను ఆకాంక్ష జిల్లాలు తొలగిస్తున్నాయి. మీ అందరి కృషితో ఆ జిల్లాలు పురోగతి సాధిస్తున్నాయి’’ అని కలెక్టర్లను ప్రశంసించారు. వనరుల్ని అత్యధికంగా వినియోగించుకుంటూ ప్రభుత్వ పథకాల అమలులో ఉన్న అవరోధాలను అధిగమించడం వల్ల ఈ జిల్లాలు తమని తాము నిరూపించుకునే స్థాయికి ఎదిగాయన్నారు.
రెండేళ్లలో మరో 142 జిల్లాల అభివృద్ధి
వెనుకబడిన జిల్లాలను వేగంగా అభివృద్ధి చేసే లక్ష్యంతో 2018 జనవరిలో ఆకాంక్ష జిల్లాల కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ 112 జిల్లాలను ఎంపిక చేసి అభివృద్ధి బాట పట్టించారు. ఇప్పుడు కొన్ని రంగాల్లో వెనుకబడిన మరో 142 జిల్లాలను ఎంపిక చేశామని, ఆ జిల్లాల్లో కూడా అభివృద్ధికి అందరూ కలసికట్టుగా కృషి చెయ్యాలని ప్రధాని కలెక్టర్లకు పిలుపునిచ్చారు.
జిల్లాల్లో అన్ని గ్రామాలకు రోడ్డు సదుపాయం, అర్హులైన లబ్ధిదారులకి ఆయుష్మాన్ భారత్ కార్డులు, ప్రతీ ఒక్కరికీ బ్యాంకు అకౌంట్, ప్రతీ కుటుంబానికి ఉజ్వల గ్యాస్ కనెక్షన్, ఇన్సూరెన్స్, పెన్షన్ ఇవన్నీ నిర్దేశిత కాలవ్యవధిలోగా పూర్తి చేయాలని చెప్పారు. రెండేళ్లలో ఈ 142 జిల్లాలను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. దేశంలో డిజిటల్ విప్లవం చాలా నిశ్శబ్దంగా జరిగిపోతోందని, పల్లె పల్లెలోనూ డిజిటల్ సదుపాయాల కల్పన జరిగేలా అన్ని చర్యలు చేపట్టాలని కలెక్టర్లని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment