
న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా చిన్న, మధ్యతరహా సంస్థ(ఎస్‌ఎంఈ)ల పబ్లిక్ ఇష్యూలకు నిబంధనలను కఠినతరం చేసింది. వీటిలో భాగంగా లాభదాయకత అంశాన్ని ప్రవేశపెట్టింది. ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్‌ఎస్) పరిమితిని 20 శాతానికి పరిమితం చేసింది. ఇన్వెస్టర్లకు రక్షణ కల్పిస్తూనే పటిష్ట పనితీరు సాధిస్తున్న ఎస్‌ఎంఈల నిధుల సమీకరణకు అండగా నిలిచే లక్ష్యంతో సంస్కరణలకు సెబీ తెరతీసింది.
గత క్యాలెండర్ ఏడాదిలో ఎస్‌ఎంఈ ఐపీఓలు, ఇన్వెస్టర్ల పార్టిసిపేషన్ భారీగా పెరిగిన నేపథ్యంలో సెబీ తాజా చర్యలకు ప్రాధాన్యత ఏర్పడింది. లాభదాయకత అంశానికివస్తే పబ్లిక్ ఇష్యూ ప్రణాళికల్లో ఉన్న ఎస్‌ఎంఈ గత మూడేళ్లలో కనీసం రెండేళ్ల పాటు రూ. కోటి చొప్పున నిర్వహణ లాభం(ఇబిటా) ఆర్జించి ఉండాలి. మొత్తం ఇష్యూ పరిమాణంలో 20 శాతానికి మించి వాటాదారులు షేర్లను విక్రయించేందుకు అనుమతించరు. ఇదేవిధంగా వాటాదారుల హోల్డింగ్స్‌లో 50 శాతానికి మించి ఆఫర్
చేసేందుకు వీలుండదు.
నిధుల వినియోగమిలా
సంస్థాగతేతర ఇన్వెస్టర్లకు షేర్ల కేటాయింపులో మెయిన్ బోర్డ్ ఐపీఓ నిబంధనలే ఎస్‌ఎంఈలకూ వర్తించనున్నాయి. కనీస దరఖాస్తు పరిమాణాన్ని రెండు లాట్లకు సెబీ కుదించింది. తద్వారా అనవసర స్పెక్యులేషన్‌కు చెక్ పెట్టనుంది. సాధారణ కార్పొరేట్ అవసరాలకు ఐపీఓ నిధుల్లో 15 శాతం లేదా రూ. 10 కోట్లవరకూ(ఏది తక్కువైతే) మాత్రమే కేటాయించేందుకు అనుమతిస్తారు. ప్రమోటర్లు, ప్రమోటర్ గ్రూప్ సంస్థలు, సంబంధిత పార్టీల నుంచి తీసుకున్న రుణ చెల్లింపులకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఐపీఓ నిధులు వెచ్చించేందుకు అనుమతి ఉండదు. ప్రమోటర్ల కనీస వాటాకుపైన గల ప్రమోటర్ హోల్డింగ్‌కు దశలవారీ లాకిన్ గడువు వర్తిస్తుంది. అధికంగా ఉన్న ప్రమోటర్ వాటాలో ఏడాది తరువాత 50 శాతం, రెండేళ్ల తదుపరి మిగిలిన 50 శాతానికి గడువు ముగుస్తుంది.
పబ్లిక్‌కు అందుబాటు
ఎస్‌ఎంఈలు సెబీకి దాఖలు చేసిన ఐపీఓ ప్రాస్పెక్టస్(డీఆర్‌హెచ్‌పీ)ను 21 రోజులపాటు పబ్లిక్‌కు అందుబాటులో ఉంచాలి. వార్తా పత్రికల్లో ప్రకటనల ద్వారా తెలియజేయాలి. సులభంగా తెలుసుకునేందుకు క్యూఆర్ కోడ్‌ను సైతం వినియోగించాలి. ఎస్‌ఎంఈ ఎక్సే్ఛంజ్, కంపెనీ వెబ్‌సైట్, మర్చంట్ బ్యాంకర్.. సంబంధిత డీఆర్‌హెచ్‌పీపై పబ్లిక్ స్పందనకు వీలు కల్పించాలి. ఎస్‌ఎంఈలు ఐపీఓ తదుపరి మెయిన్ బోర్డులోకి చేరకుండానే నిధుల సమీకరణ చేపట్టాలంటే సెబీ(ఎల్‌వోడీఆర్) నిబంధనలు పాటించవలసి ఉంటుంది. చెల్లించిన మూలధనం రూ. 25 కోట్లకు మించవలసి ఉంటుంది. రైట్స్, ప్రిఫరెన్షియల్ కేటాయింపులు, బోనస్ షేర్ల జారీ తదితరాలు ఈ విభాగంలోకి వస్తాయి. గత రెండేళ్లలో ఎస్‌ఎంఈ ఐపీఓలు భారీగా ఎగసిన నేపథ్యంలో సెబీ నిబంధనలు మరింత కఠినతరం చేసేందుకు ఉపక్రమించింది. 2024లో ఐపీఓల ద్వారా 240 చిన్న, మధ్యతరహా సంస్థలు రూ. 8,700 కోట్లు సమీకరించాయి. అంతక్రితం 2023లో సమకూర్చుకున్న రూ. 4,686 కోట్లతో పోలిస్తే ఇవి రెట్టింపుకావడం ప్రస్తావించదగ్గ అంశం!!
Comments
Please login to add a commentAdd a comment